Tuesday, September 10, 2024
Homeఓపన్ పేజ్Dr Karnati Lingaiah: సాహితీ వినీలాకాశంలో ధృవతార

Dr Karnati Lingaiah: సాహితీ వినీలాకాశంలో ధృవతార

ప్రపంచంలో జరిగే సంఘటనలపై స్పందించి వాటిని వెలుగులోకి తీసుకురావడానికి కవులు ముందంజలో ఉంటారు. కవులు అన్నిటినీ కవిత్వరీకరించి వెలుగులోకి తీసుకవచ్చి సమాజహితానికి దోహదకారి అవుతారు. అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలకు ఎదుగుతూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచిన అధ్యా పక కవులు ఎందరో ఉన్నారు. ఆ కోవకే చెందిన అధ్యాప కులు, కవి, రచయిత డాక్టర్‌ కర్నాటి లింగయ్య గారు సాహిత్యం మరియు విద్యారంగంలో ముందంజలో ఉన్నారు. లింగయ్య గారు తెలుగు సాహితీ రంగానికి సుపరిచితులు. టైపిస్టుగా జీవితాన్ని ఆరంభించి స్వయం కృషితో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ, ఎం.ఫిల్‌, పి.హెచ్‌.డి. డిగ్రీలు పొందిన విద్యావేత్త. కవిగా, వక్తగా తెలుగు, ఆంగ్ల భాషల్లో పండితునిగా ప్రశంసలందుకున్న కర్నాటి లిం గయ్య గారు తెలుగు సాహిత్యంలో సుమారు 30 కవితా సంపుటాలు ప్రచురించారు.
వృత్తి రీత్యా అర్థశాస్త్ర ఉపాన్యాసకులైన ప్రవృత్తి చేత రచయితగా, కవిగా 1976 నుంచి నేటి వరకు తన రచనా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న కర్నాటి లింగయ్య గారు నేటి నవతరానికి ఎంతో మార్గదర్శకులు అని అనడంలో ఎలాం టి సందేహం లేదు. 1976లో ప్రపథమంగా ‘విరిసిన మొగ్గలు’ అనే కవితా సంపుటితో కవిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు . మరో వసంతం, మంచి కోసం, తెలుగు తల్లి- వెలుగు పందిరి, మనోరథం, జీవన సత్యం, స్నేహ దీప్తి అనే కవితా సంపుటిలను వెలువరించారు. అభినందన మాలిక, మా ఊరు అనే వచన కవితా సంపుటిని వెలు వరించారు. ‘అభినందన మాలిక’ వచన కవితా సంపుటి లో కవితలన్నీ సమకాలీన అంశాలను స్పృశిస్తూ, తనదైన ప్రత్యేకమైన శైలిలో రూపొందించబడ్డాయి. ఇందులోని 80 కవితలు సామాజిక అంశాలను స్పృశిస్తూ, వ్యక్తిత్వ వికా సానికి దోహదపడేవిగా ఉన్నాయి. ప్రజాకవి చాయలు వీరి కవితల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చాలా వరకు పదిమందిలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పుకునేవిగా, నచ్చేవి, మెచ్చేవిగా ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ‘మదర్‌’ కవితా సంపుటిలో తెలుగు కవితలు ఆంగ్లంలోకి తర్జుమా 2018 సంవత్సరంలో చేశారు. జన్మభూమి గీతాలు, ఓ కొనిజేటి మీకు మీరే సాటి ,శ్రీకృష్ణ దివ్య లీలలు, శ్రీ పార్వతి వల్లభా! శివ! మాంపాహి… సదా, పరమానందదాయక శ్రీ రంగనాథా, తెలంగాణ తేజాలు ,మన తెలంగాణ వంటి గేయ సంపుటిలు రాశారు. మీరు భక్తితో పాటు దేశభక్తిని నింపుకున్న వీరులు. కోనసీమ తుపాను గురించి 1997 లో వ్రాసారు. శ్రీ రంగనాథ శత కాన్ని, శ్రీ లక్ష్మీనరసింహ వచనాలను రాశారు. నానీల ప్రక్రియలో నానీల పుష్పాలు 2017 లో చక్కగా రాశారు. ‘పంచితే /తరిగేది కాదు/పంచుతుంటే పెరిగేది/ మంచి తనం… అని మనస్సుకు హత్తుకునే కవితతో ప్రారం భించారు.
భయమే/నిజమైన మరణం/ధైర్యం/ముందుకు పడే చరణం అంటూ వాస్తవ సత్యాన్ని మనకు చక్కగా తెలియ జేశారు. ‘నాన్న ఆఫీసుకు ఎన్నో సెలవులు, అమ్మకు ఏవీ విశ్రాంతి క్షణాలు’ అంటూ మాతృమూర్తి అవిశ్రాంత ప్రేమ తత్వాన్ని తెలియజేశారు. ‘పాటించే తీరాలి/ధర్మం/ దానివల్ల ఒనగూడేదే /అసలైన బలం అంటూ యువతరా నికి మార్గ దర్శనం చేశారు. ‘నిన్ను నువ్వు/తెలుసుకో నాయనా/ఎక్కడ?/మౌనంలో లేదా ధ్యానంలో.. అంటూ వేదాంత బోధ ఆధ్యాత్మిక చింతనను ఈ చిన్న నాని ద్వారా తెలియజేశారు. ‘గుండె బరువైనా సరే/బాధల్ని పంచకు/ పంచవలసింది ఆనందాన్ని.. అంటూ జీవిత సత్యాన్ని ప్రతిపాదించారు. ‘వల్లిస్తా వెందుకు /మహాత్ముల వచనాలు /ఒక్కటైనా/ఆచరించు చాలు… అంటూ మహాత్ముల వచ నాలు ఎన్ని వల్లించినా లాభం లేదు వాటిలో ఒక్కటైనా ఆచరించకుంటే అదంతా వృథా అని లింగయ్య గారు చాలా చక్కగా తెలియజేశారు. ‘నిత్య పారాయణ శ్లోక ములు’ అనే సంకలనాన్ని కూడా వివరించారు. గేయ, వచన కావ్య సంపుటాలు, శతక ప్రక్రియలు, వ్యాస ప్రక్రి య, నానీల ప్రక్రియ ఇలా అన్ని ప్రక్రియలో తనదంటూ ప్రత్యేకతను చాటుకుంటూ వారు రచనా వ్యాసాంగాన్ని కొనసాగించారు. డాక్టర్‌ కర్నాటి లింగయ్య గారు తన అసమాన ప్రతిభతో వృత్తితో పాటు ప్రవృత్తిలో కూడా చాలా రాణించారు. అధ్యాపకునిగా, సాహితీకారునిగా, సామా జిక సేవా కార్యకర్తగా, ఆధ్యాత్మిక వాదిగా విభిన్న కోణాల లో రాణిస్తూ అందరి మన్ననలు పొంది తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు.
చిన్నప్పటినుంచి చదువులో మేటిగా రాణిస్తూ అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభను పొంది విద్యార్థులకు ఆదర్శం గా నిలిచారు సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థపై పరి శోధన చేసి ఆ విషయంలో రైతులపై ప్రభుత్వాన్ని, రైతు సంఘాలని, వ్యవసాయక విషయాలపై పరిశోధన చేసే సైంటిస్టులను కూడా ఆలోచింపజేశారు. 1987లో ‘తెలం గాణలో గిరిజన ప్రాంతాలపై పారిశ్రామికీకరణ’ అనే అం శంపై పిహెచ్‌.డి పట్టాను పొంది తన జీవిత లక్ష్యం నెరవేర్చుకున్నారు. తొలి దశలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో (1966 -69) నల్గొండ జిల్లా ఉద్యోగ సంఘా నికి సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ ఉద్యమంలో వీరు జైలుకు కూడా వెళ్లారు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వారిలో వీరు ఒకరు. శ్రీ కర్నాటి లింగయ్య గారి 75వ జన్మదిన సందర్భంగా ఆచార్య కసిరెడ్డి గారు ఈ వజ్రోత్సవము కానుకగా శ్రీ కర్నాటి లింగయ్య శతకాన్ని రచించారు. ఈ శతకానికి ‘గురువు కర్నాటి లింగయ్య కోవిదుండు’ అని నామకరణం కావించారు. కర్నాటి లింగయ్య గారి జీవితాన్ని, సాహి త్యాన్ని అధ్యయనం చేసి కసిరెడ్డి గారు తేటగీతి పద్యాలతో ఈ కావ్యాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇందు లోనే మచ్చుకు కొన్ని పద్యాలు…
అర్ధశాస్త్రము చదివి తా నార్యుడయ్యె
కావ్యశాస్త్రాలు చదివి తా కవియునయ్యె
శాంతి బోధించి గాంధిలా సాధువయ్యె
గురువు కర్నాటి లింగయ్య కోవిదుండు..!
అర్థశాస్త్రాన్ని చదివి ఆచార్యుడుగా, కావ్య శాస్త్రాలు చదివి కవిగా మారి శాంతిని బోధించి గాంధీలా సాధు వుగా మారెను లింగయ్య గారు అని ఈ చక్కటి పద్యం ద్వారా తెలిపారు.
ఆంగ్లభాషలో శాస్త్రాలనన్ని చదివి
ఆంగ్లమున గ్రంథ రాజములచ్చువేసి
మాతృభాషను వదలని మాన్యుడితడు
గురువు కర్నాటి లింగయ్య కోవిదుండు.!
ఆంగ్ల భాషను నేర్చుకుని ఆంగ్ల పుస్తకాలను అచ్చు వేసినా తెలుగు భాష మీద మమకారం వదలకుండా సాహి తీ సేద్యం చేసిన కర్నాటి లింగయ్య గారు అందరికీ ఆదర్శ ప్రాయం అని తెలిపారు.
అపరచాణక్యుడను పేరు అర్థశాస్త్ర
కోవిదులునైన జ్ఞానికే గురుతు బిరుదు
ఆ మనీషకు అర్హుడు అక్షరుండు
గురువు కర్నాటి లింగయ్య కోవిదుండు.
కర్నాటి లింగయ్య గారు అపర చాణిక్యుడు అనే బిరుదును పొందారు అను విషయాన్ని ఈ పద్యం ద్వారా చక్కగా కసిరెడ్డి గారు తెలిపారు.
ధనము ఉన్నంత మాత్రాన ధరణి నెవరు ఘనులు కాబోరు హృదయమ్ము మనసు వలయు
అట్టి హృదయమ్ము కలిగిన ఆప్తుడితడు
గురువు కర్నాటి లింగయ్య కోవిదుండు.!
ధనము ఉన్నంత మాత్రాన పుడమిపైన ఎవ్వరు గొప్ప వాళ్లు కారు మంచి మనసు ఉండాలి అలాంటి గొప్ప హృద యం కలిగిన కర్నాటి లింగయ్య గారు అందరికీ ఆదర్శ ప్రాయలు అనే విషయాన్ని ఆచార్య కసిరెడ్డి గారు తన అద్భుతమైన పద్యాల ద్వారా తెలిపారు ఇలాంటి పద్యాలు ఈ కావ్యంలో చాలా ఉన్నాయి. కర్నాటి లింగయ్య గారి 30వ వచన కవితా సంపుటి ‘హరివిల్లు’. ఈ కవితా సంపు టిలో హరివిల్లులో ఏడు రంగులు ఎలాగైతే ఉంటాయో అలాగే ఏడు విషయాలపైన ప్రముఖంగా ఈ కవితా సంపు టిలో తెలియచెప్పారు. విలువైన అక్షరసారం హరివిల్లు/ సాహితీ వనంలో విరిసిన హరివిల్లు/ సకల వర్ణ శోభితం హరివిల్లు /కవితల చిరుజల్లు కర్నాటి హరివిల్లు.. ఇంత చక్కటి కవితా సంపుటిలో మహాత్మా గాంధీ గురించి ఎక్కువగా కవితలు రాశారు. హరివిల్లులో ఏడురంగులు ఉంటాయి. సూర్యుడి రథానికి సప్తశ్వాలుంటాయంటారు. అదేమో కానీ సూర్యకిరణాల్లో కూడా ఏడురంగులుంటా యని భౌతికశాస్త్రజ్ఞులు చెబుతారు. శ్వేత వర్ణంలోనే సప్తవర్ణ సంకీర్ణం ఇమిడి ఉంటుంది. అలాగే హరివిల్లులో కూడా స్థూలంగా ఏడు విషయాలకు సంబంధించిన కవితలు న్నాయి. దేశభక్తులు,నాయకులు, కళాకారులు, శాస్త్రజ్ఞులు, వీరులు మొదలైన వారిని గుర్తించిన వాక్చిత్రాలు ఒకటి, భారతీయ పండుగలు దేవుళ్లపై రాసిన కవితలు, రెండు ప్రకృతివర్ణన కవితలు మూడు, ప్రబోధాత్మక, నీతిభోధక, భక్తిభోధక, కవితలు నాలుగు, కొత్తగా ’కరోనా’ పై కవితలు ఐదు, ప్రభుత్వం చేస్తున్న ప్రగతిపై ప్రశంసాత్మక కవితలు ఆరు, కుటుంబ సభ్యులైన మనుమలు, మనుమరాళ్లు, పుత్రికాపుత్రులు మొదలైన వారి జన్మదిన, ఇతర సందర్భా లలో రాసిన కవితలు ఏడు. ఇలా స్థూలంగా ఏడు విభా గాలు చేయవచ్చును. హరివిల్లు నూరు కవితల సంపుటి. వ్యక్తుల మీద రాసినవే ఎక్కువ. దాదాపు మూడోవంతు ఉన్నాయి. హరివిల్లు సంపుటిలో మొదటి కవిత బాపూజీ! నీ జన్మదినం మాకు సుదినం మహాత్ముని కొనియాడారు ఇందులో వరుసగా కవితలు
ఉక్కుమనిషి పటేల్‌, అమరజీవి పొట్టి శ్రీరాములు, కలాం! నీకు సలాం! మానవతా మూర్తి మదర్‌ థెరీసా, బాలల తాత మన బాపుజీ, శాంతిదూత మన నెహ్రూ, స్వాతంత్య్ర దినోత్సవ వేళ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పర్యవసానం, స్వచ్ఛ తెలంగాణ,తన శ్రమయే తనకు రక్ష, శ్రామిక శక్తికి జోహార్‌, వర్ష బీభత్సం, మహాత్మా జ్యోతీరావ్‌ పూలే, ప్రకాశం పంతులు, గాన గంధర్వుడు, దాశరధి రంగాచార్య మొదలగు కవితలు ఈ సంపుటిలో చాలా హృద్యంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులోని చివరి కవిత ‘సత్యనాదెండ్ల జ్ఞాన సంపన్నుడు’ ఈ కవితలో నాదెండ్ల గారి ప్రస్థానాన్ని గురించి చక్కగా తెలియజేశారు
ప్రభావతమ్మ యుగంధర్ల
తనయుడు సత్య నాదెండ్ల,
చదువే ఆయుధంగా చేసుకొని
మైక్రోసాఫ్ట్‌ సి.ఇ.ఓ.గా, ఛైర్మన్‌గ
ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన ఆణిముత్యం అసా ధ్యాన్ని సుసాధ్యం చేసిన మేధావి
పట్టు వదలని విక్రమార్కుడితడు,
మాటతప్పని మహోన్నతుడు
భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయుడు… నాదెండ్ల ప్రస్థానాన్ని మొత్తం ఒక చిన్ని కవితతో అందరికీ చక్కగా తెలియచెప్పారు. ఇలాంటి కవితలతో సాహితీ లోకాన్ని పునీతం చేసిన కర్నాటి లింగయ్య గారు అభినందనీ యులు. మాజీ ప్రధాని పి.వి. శతజయంతి ఉత్సవాలు జరు గుతున్న వేళ డా. లింగయ్యగారికి పి.వి.పై గల అభిమానం, అనుబంధాలతో వంద కవితలతో ‘నవభారత నిర్మాత పివి… దేశానికే ఠీవి!’ అనే ఈ పుస్తకాన్ని వెలువరిం చడం తెలుగువారు గర్వించదగ్గ విషయం.మాజీ ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి మన పి.వి. నరసింహ రావు గారు రాజకీయ నాయకుడిగా కంటే బహుభాషా వేత్తగా, ఒక సంపాదకుడిగా, ఒక కవిగా ఒక సృజనాత్మక రచయితగా, సద్విమర్శకుడిగా, కథకుడుగా, నవలా రచయితగా అనువాదకుడుగా, మహామేధావిగా, మహా విజ్ఞానిగా, ఉత్తమ వక్తగా, ఆచార్యుడుగా ప్రబోధకుడుగా, చరిత్ర నిర్మాతగా, సంస్కర్తగా, చరిత్రకారుడుగా, కళా ప్రియుడుగా అసంఖ్యాకులకు ప్రపంచమంతట ఎక్కువ గౌరవనీయుడు. ఒక రచయితగా పి.వి.ని ఎన్నడూ, ఎవ రూ మరచిపోలేరు ఆయన చిరస్మరణీయుడయిన స్రష్ట, ద్రష్ట. అలాంటి పివి నరసింహారావు గురించి ‘నవభారత నిర్మాత పి.వి …దేశానికే ఠీవి’ అను చక్కటి పుస్తకాన్ని భరత జాతికి అందించారు. పివి నరసింహారావు గారికి కర్నాటి లింగయ్య గారు చేసిన అక్షర నీరాజనాలు కొన్ని….
పీవి సీతారామారావు రుక్మాబాయమ్మ
పుణ్య దంపతుల తనయుడై జన్మించాడు.
రంగారావు రత్నాబాయి దత్త పుత్రుడయ్యాడు
ఇదియే కర్నాటి మాట మేటి బాట!
గణితం అంటే అమితంగా ఇష్టపడేవాడు చదువులోనే కాదు ఆటల్లోనూ ముందుండేవాడు
టెన్నిస్‌ ఆటను గొప్పగా ఆడేవాడు
ఇదియే కర్నాటి మాట మేటి బాట !
సంగీతం, కళలంటే ప్రాణం
భజనలు, కీర్తనలు శ్రావ్యంగా పాడినాడు
భక్తి భావనలను అందరికి పంచినాడు.
ఇదియే కర్నాటి మాట మేటి బాట !
పెర్గుస్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసి
నాగపూర్లో న్యాయశాస్త్రం చదివి
న్యాయాధిపతి మోతీలాల్‌ గారితో నడిచాడు ఇదియే కర్నాటి మాట మేటి బాట !
అంటూ చక్కటి వచన కవితలతో పివి గారికి అక్షర సుమాలు అందించారు.
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి వృత్తాంతం సరళ గ్రాంథిక వ్యావహారిక మిశ్ర శైలిలో వస్తున్న కథనం ఇది. వృత్తాంతమంటే జన వ్యవహారంలో సమాచారమనే అర్థ మున్నది. ఈ అర్థంతోపాటు కథ అనే అర్థం కూడా నిఘం టువులో ఉన్నది. ఏదైతేనేమి ఇదొక పురాగాథ; ఇదొక ఐతిహ్యం. అంటే ఇతిహాసం (చారిత్రక కథ), ఇదొక సాం ఘిక కథ.బ్రహ్మ, శివుడు, పార్వతి, కశ్యపుడు, శౌనకుడు, ఆదిశేషువు, వాసుకి, దాక్షాయణి,హిమవంతుడు… ఈ పాత్రలతో కథ నడిచిన కారణంగా ఇది పురాగాథ. విష్ణు వర్ధన మహారాజు, మంత్రులు, సైనికులు ఉన్న కారణంగా ఇది చారిత్రకం.కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ, వాసవీ కన్యక, గురువులు, వైశ్యబంధువులు ఉన్న కారణంగా ఇది సాంఘికం.
ఇటువంటి పరమ పవిత్రమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వృత్తాంతము చాలా చక్కగా కర్నాటి

- Advertisement -

లింగయ్య గారు వ్రాసి భవిష్యత్తు తరాలకు అందించారని చెప్పవచ్చును.
తెలుగు సాహిత్యానికి ఆకర్షితులై తెలుగులో 30 రచనలు చేసిన కవితా కాంతి కిరణం కర్నాటి లింగయ్య గారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం, మంగళపల్లి గ్రామ శివారు తోకబావి గూడెం అలియాస్‌ నరసింహ పురం గ్రామానికి చెందిన కర్నాటి వెంకమ్మ, చెన్నయ్య దంపతులకు జన్మించిన లింగయ్య గారు అంచలంచెలుగా ఎదుగుతూ సామాజిక, సాహిత్య, విద్యారంగాలలో విభిన్న పాత్రలను పోషించి, రాణిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలిచారు.
వీరి కవితా ప్రక్రియలు ప్రతి మనిషికి మనసుకు హాయి అని గొలుపే చైతన్య స్పందనల మరియు బావ పరంపరల విజయ హారతులు. తనలోని విజ్ఞానాన్ని, సాహి త్యాన్ని వినయంగానే సమాజ శ్రేయస్సుకు అందించిన కర్నాటి లింగయ్య గారు నిరాడంబర వ్యక్తిత్వం గల మహో న్నత మనిషి. సాహిత్య సృష్టిలో వెనుకడుగు వేయకుండా నిత్యం నూతన కావ్యాలు రాస్తూ అందర్నీ అలరిస్తున్న కర్నాటి లింగయ్య గారి కలం నుంచి భవిష్యత్తులో మరిన్ని మంచి కావ్యాలు రావాలని కోరుకుంటున్నాను.
బండారు సునీత
9440671530

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News