Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Dr N Gopi poetry: డా. ఎన్. గోపి కవిత్వం - దళిత బహుజన...

Dr N Gopi poetry: డా. ఎన్. గోపి కవిత్వం – దళిత బహుజన దృక్పథం

“కవితా శక్తికి వివేకమే శరీరము, కల్పనయే వేషము, ఆవేశమే ప్రాణము, ఊహయే ఆత్మ, ఈ ఆత్మ అన్నిటిలో పరివ్యాప్తమై విభిన్నాంశములకు సురుచిరమైన స్ఫుటమైన ఏకత్వమును ప్రసాదించును.” ప్రఖ్యాత కవి, తత్వవేత్త కాల్ రిడ్జ్ నిర్వచించిన ఈ పంక్తులు డా. ఎన్.గోపి కవిత్వ సృజనకు అక్షరాలా వర్తిస్తుంది. వారి కవిత్వంలో వివేకవంతమైన ఆలోచన, సౌందర్యవంతమైన కల్పన, సందర్భోచిత ఆవేశము, రవి చూడని కవి కన్నుల ఊహ, ఆత్మ కథనాత్మకత మెండుగా ఉంటాయి. గోపి గారు కవిత్వం, విమర్శ, పరిశోధన, అనువాదాలు, యాత్రా చరిత్రలు, వ్యాఖ్యానాలు, పాఠ్య గ్రంథాలు, కాలరచనలు వంటి ప్రక్రియల్లో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, నిత్య చైతన్యశీలి, మానవ సంబంధాలంటే అమితంగా ఇష్టపడే గొప్ప మానవతా వాది.

కవి మూడు తరాల వారధిగా కనపడతాడు.’కాదేదీ కవితకనర్హం ‘ అన్నట్లు తన జీవితకాలంలో దర్శించిన, స్పృశించిన ప్రతి అంశాన్ని అపురూపంగా చూస్తాడు. కవితామయం చేస్తాడు. ఏ సందర్భాన్నీ, ఏ వస్తువునీ వదులుకోడు. ఎవరినీ హీనంగా చూడడు. లోకజ్ఞతతో, కవిజ్ఞతతో అందరినీ అన్ని సందర్భాలనూ గౌరవిస్తాడు పదాడంబరం కన్నా సరళతకు ప్రాధాన్యమిచ్చి సుకుమార భావజాలంతో చాలా చాలా స్తుతిమెత్తగా తడుముతున్న అనుభూతిని కలిగిస్తాడు. “సత్యము, సౌందర్యము, సత్త్వము అను మూడు లక్షణములపట్ల గాఢమైన అభినివేషము ప్రకటించు అభివ్యక్తి కవిత్వము. తన ఉద్దేశములకు భావన, కల్పన అను శక్తుల సహాయంతో తార్కాణములను సృష్టించుచు, ఏకత్వమును చాటించు వైవిధ్యముతో అలరారునట్లు భాషను సవరించుకొనేది కవిత్వము.” బ్రిటీష్ కవి లీహ్ హంట్ నిర్వచనము ప్రకారముగానే గోపి గారి కవిత్వంలో కవిత్వ సత్యము, కవిత్వ సౌందర్యం, కవిత్వ బలమూ కనబడుతుంది. గోపి గారి కవితా సమ్మోహన శక్తి ప్రభావానికి పాఠకులుగా తప్పకుండా లోనవుతాము. సరళమైన పదాలతో కవిత్వం కనబడుతూనే, మౌన హృదయాలను మాట్లాడిస్తుంది. హాయి, అనుభూతి, అనుభవం, ఆనందం, ఉదాత్తత, రసాస్వాదన, తాదాత్మ్యీకరణ వంటి బహువిధాలుగా స్పందింప చేస్తుంది. ఎంచుకున్న వస్తువును అపురూపంగా చూడటం కనబడుతుంది. జీవితానుభవంలోంచి వచ్చిన జ్ఞాపకాలున్నాయి. కవిగా ఆకాంక్షించిన కలల ప్రపంచాలున్నాయి. తాను పుట్టి పెరిగిన ప్రాంతపు మట్టి వాసన ఉంది. పల్లె నుంచి ప్రపంచమంతా విహరించి విస్తరించిన విషయ వైవిధ్య కదంబాలున్నాయి. దశాబ్దాల అనుభవేక నైవేద్య సమాహారాలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒకే వస్తువు చదువుతున్నట్లు అనిపించినప్పటికీ ఆ వస్తువులో ఇతర కోణాలు పొరలు పొరలుగా కనబడ తాయి.

గోపి కవిత్వంలో ఆనంద సందర్భాలు, విషాద ఘట్టాలు, మధుర జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, ధర్మాగ్రహాలు, అసంఖ్యాక భావనలు తొణికిసలాడుతాయి. వీరికి కవిత్వ దృష్టియే కాకుండా విమర్శక దృష్టి కూడా ఉన్నదని అందరికీ తెలుసు. కవిత్వానికి ఎంచుకున్న వస్తువు లోతు పాతులను అర్థం చేసుకుంటాడని తెలుసు. అందుకే కవిత్వ విలువలతో కూడిన సృజన మనకు అందించాడా అనిపిస్తుంది. తన చుట్టూరా ఉన్న భిన్న మనస్తత్త్వాలను, వైరుధ్య భావవాలను, సంఘర్షణలను ఆకర్షణీయమైన ప్రతీకలతో, అత్యంత నేర్పుతో రచించిన కవిత్వ ప్రత్యేకత కనబడుతుంది.

దళిత బహుజన కోణంలో కవిత్వాన్ని ఎందరో కవులు ఎన్నో విధాలుగా రాసినప్పటికీ గోపి సృజనలో కొత్తకోణాన్ని చూస్తాం. ప్రత్యేకించి దళిత బహుజన కవిత్వంలో తరచుగా వినబడే పడికట్టు పదాలు వీరి కవిత్వంలో కనపడవు. కానీ వీరి దృష్టి కోణాన్ని బట్టి, సృజన ఉందని స్పష్టమవుతుంది. ఆ సృజనలో తాను పుట్టి పెరిగిన భువనగిరి ప్రాంత ప్రభావం కనబడుతుంది. స్వయంగా బహుజన నేపథ్యం నుంచి వచ్చి ఎదిగినాడు. అయినా బహుజన స్పృహకే పరిమితం కాకుండా దళిత సంఘీభావ సృజనను భుజానేసుకున్నాడు. తన ప్రాంతంతో విడదీయరాని అనుబంధంతో తన చుట్టూరా కనిపించిన బహుజనుల జీవనశైలిని కవిత్వీకరించాడు.

“కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి” అన్నట్లు కష్టజీవుల గురించి, శ్రామిక కులాల గురించి, వారి జీవితాల గురించి, వారి కష్టాల గురించి, వారి కన్నీళ్ళ గురించి, వారి చెమట గురించి, వారి శ్రమజీవనం గురించి, వారి ఆవేదనల గురించి, వారి సంఘ జీవనం గురించి, వారి వృత్తి తాత్వికత గురించి, వారి పోరాటాల గురించి, వారి విజయాల గురించి ఇటీవలి కాలంలో బాగానే కవిత్వం వస్తున్నది.1995లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మొదటి దళిత వచన కవిత్వ సంకలనం ‘చిక్కనవుతున్న పాట’ వచ్చింది. 1996లో నీలగిరి సాహితి నల్లగొండ నుండి దళిత బహుజన కవిత్వం ‘బహువచనం’ వచ్చింది. ఈ సృజనలు రాక ముందే గోపి గారి దళిత బహుజన కవిత్వం వచ్చింది. 1976లో ‘తంగెడు పూలు’ మొదటి కవితా సంపుటితోనే దళిత బహుజన స్పృహ ప్రారంభమైనది.1981లో వచ్చిన ‘మైలురాయి’ లో దళిత బహుజన కవిత్వం ఎక్కువగానే వచ్చింది. ‘తంగెడు పూలు’ నుండి ‘మనిషిని కలిసినట్టుండాలి ‘ వరకూ అంటే గోపి గారి ఐదు దశబ్దాల కవిత్వ ప్రస్థానంలో దళిత బహుజన గొంతుక వినిపించిన కవిత్వంతో ఒక ప్రత్యేక కవిత్వ సంపుటి వేయ తగిన కవిత్వమున్నది.

దళిత బహుజన దృక్పథంతో రాసిన కవిత్వంలో దళిత దృక్పథం ఉన్నది. పాత చెప్పులున్నవి. ఆకలి ఉన్నది రొట్టె ఉన్నది. పేదరికమున్నది. గుడిసె హోటల్ ఉన్నది. వెట్టి ఉంది. శ్రమశక్తి ఉన్నది.శ్రమ స్ఫూర్తి ఉన్నది. శ్రామికతత్వం ఉన్నది. రక్తం చెమట శ్రమతత్వం ఉన్నది. మేస్త్రీ కొడుకు ఉన్నాడు. సాంఘిక జీవనమున్నది. బహుజన పేదరికమున్నది. పేదరికానికి ఇచ్చే భరోసా ఉన్నది. బహుజన వాదమున్నది. నేతన్నల వలస జీవితాల వెతలున్నాయి. చిరు వ్యాపారుల జీవనమున్నది. వడ్రంగి వృత్తి, యాదవ సంస్కృతి, కుమ్మరి వృత్తిని ప్రతిబింబించే మట్టి ధాతువులున్నాయి. రజకుల శ్రమ ఉన్నది. గీత కార్మికులున్నారు. ఉత్పత్తి కులాల అస్థిత్వమున్నది. డప్పు, బొంత, చిలుక్కొయ్య, దండెం, ఇంటి కప్పు, ఇతడిచెంబు, మోచి, పాత చెప్పులు, గొంగడి, ఆకలి, ఇస్త్రీ వంటి సబ్బండ కులాల పరికరాలున్నాయి. ఆ పరికరాల నాదాన్ని వినిపించే ఎన్నో ప్రతీకలున్నాయి. ‘సామాజిక ప్రయోజనం లేని ఎంత గొప్ప కవిత్వమైనా నిష్ప్రయోజనమే’ ఈ కవి స్వయంగా సంఘజీవి అని ఈతని కవిత్వమే చెబుతుంది. సౌందర్యం, ఆనందం, అనుభూతులు, ఊహలు, కలలు కవిత్వంలో ఉన్నప్పటికీ తన అసలు దృష్టి కోణమంతా సంఘ జీవన విధానం, సామాజిక చైతన్యం, సామాజిక సమస్యలు, వైరుధ్యాలు ప్రత్యక్షంగా చూసినవి, పరోక్షంగా గాంచినవి, క్షుణ్ణంగా అధ్యయనం చేసినవి అన్నీ సమస్యా పరిష్కార మార్గంలో కవిత్వమై పలకరిస్తాడు.

దళిత కవిత్వం:-“నా మాటల్లో

- Advertisement -

నీ భాషను నింపి
నా గొంతులో
తరాల నిశ్శబ్దం నింపావు
నా గొంతు కోశావు
ఇన్నాళ్లకు
గొంతెత్తి అరుద్దామంటే అడుగున
అట్టడుగున
నత్తి వెలుగులైనా లేని వత్తిలా….”(పెనుగులాట)

అనాదిగా పునాదిలేని జీవితాలుగా గడుపుతూ, ఊరికి దూరమై, ప్రధాన స్రవంతికి దూరమై అక్షరానికి నోచుకోని అజ్ఞానులుగా చీకట్లోనే మగ్గుతూ, అడుగడుగునా అవమానాలు భరిస్తూ, స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడలేని దళితుల అవస్థల గొంతుక వినిపించిన శక్తివంతమైన దళిత అస్థిత్వ కవిత్వమిది. ఉత్తమ పురుషలో సాగుతుంది. నా బింబానికి నీ నీడ, నా అడుగుల్లో నీ లయ, నా మూల్గుల్లో దూరి నన్ను నాకు కాకుండా చేసిన మహమ్మారి నువ్వే అంటాడు. భాషపై, బతుకుపై ఎప్పుడూ వెక్కిరింపులే అని, ఆ వెక్కిరింపులకు కన్నీళ్లు కూడా ఇంకిపోతాయంటాడు. హృదయం పగిలి ఈనెలుగా చిట్లుతోందంటాడు. నువ్వే అంటే పీడించే శత్రువు. నా అంటే పీడించబడే జీవితం. అందుకే నువ్వు అనే నిన్ను వదల్చుకొని మరల్చుకొని ఉక్కు పిండంలా ఉదయించాలని అనాదుల నుండే నా పెనుగులాట తప్పడం లేదంటాడు.1979లో రాసిన కవిత్వమిది. అంటే దళిత స్పృహ అంతగా విస్తరించని రోజుల్లో దళితుల తండ్లాటయే తన తండ్లాటగా కలమెత్తి బలంగా రాయడం, కవి అస్థిత్వ దృష్టి ఎట్లా ఉందో మనం అంచనా వేయవచ్చు.

“అతడు చెప్పులు కుడుతుంటే
ఆగిపోయిన నడకకు
ప్రాణం పోస్తున్నట్టుగా వుంది
తెగిన పక్షి రెక్కలను
మళ్ళీ అతికిస్తున్నట్టుగా ఉంది
కాళ్ళే చెప్పుల్ని నడిపిస్తున్నాయనే
అహంకారమిప్పుడు
అతని చేతిలో గిలగిలలాడుతుంది” (మోచి)

మోచి అంటే చెప్పులు కుట్టే వాడు అని నైఘంటికార్థం. చెప్పులు కుట్టే మనుషులని, వృత్తిని, కులాలని ఈ సమాజం చిన్నచూపు చూడటం సహజమైపోయింది. అట్లాంటి సహజ వాతావరణంలో ఆగిపోయిన నడకకు ప్రాణం పోస్తున్నట్టు, తెగిపోయిన పక్షి రెక్కలను మళ్ళీ అతికిస్తున్నట్టు మోచి తన పని తాను చేస్తుంటే ఆ సందర్భంలో దర్పం, అధికారం, అహంకారమంతా అవసరార్థమై ఈ కర్మజీవి ముందు వణుకుతుంది అంటాడు. తలొంచుకొని పనిచేసే ఈ కర్మజీవే జీవన గమనాలను మరమ్మతు చేస్తుంటాడు. కులవృత్తిలో బందీ అయినా, అందరికీ ఆప్తుడైనా అతని పనితనానికి ధీటుగా జేబులో పైసలు స్పందించవని కవి వ్యక్తం చేసిన ఆవేదన కనబడుతుంది. ఇంకా దళిత కవిత్వానికి ఆనవాళ్లుగా డప్పు, పాత చెప్పులు, మేస్త్రీ కొడుకు, గుడిసె హోటల్, అడ్డా కూలి, మెట్రో స్థంభాలు మొదలగు కవితలున్నాయి.

బహుజన కవిత్వం:-అవి పట్టుచీరలు నేసిన అద్భుత హస్తాలనీ

బట్టపై బంగారు శిల్పాలు నాటిన
కళా విజయకేతనాలని మనకు తెలుసు
లోకాన్ని జలతారు ముసుగుల్తో కప్పిన వాడికి
పిర్రల మీద దోతి చిరుగులెందుకున్నాయో కూడా మనకు తెలుసు
అన్నీ తెలిసినట్టున్న మనకు రాజయ్య గురించి ఏమీ తెలియదు.”(ఓ రాజయ్య కథ)

నేతన్నల వెతలకు నిదర్శనమిది. ఇట్లాంటి రాజయ్య నేత లాంటి వారు ఎందరున్నారో లెక్క చెప్పగలవి కాదంటాడు కవి. బతుకుతెరువు లేక దారులన్నీ మూసుకుపోయి, నేతన్నల జీవితాలలో చుట్టూరా చీకటి ఆవరించినప్పుడు, బతుకు మీద ఏవగింపు కలిగినప్పుడు పొట్టకూటి కోసం అనివార్యంగా బొంబాయి బాట పట్టాల్సి వచ్చేది. అట్లాంటి పరిస్థితుల్లో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందుల నుండి ఆర్థిక అవస్థలను, ఇతర అవస్థలనూ గుర్తుచేసిన కవిత్వమిది.

“ఒక కేకను
కొండలన్నీ పంచుకుంటాయి
రాళ్ళకు నోళ్ళు మొలిచి
వాటికే ఆశ్చర్యం కలుగుతుంది
లోయల్లో వెదురు వనాలు
నిశ్శబ్దాన్ని పాటలుగా మలుస్తాయి”(ప్రతిధ్వని)

మానవ సంబంధాలు చాలా చాలా ముఖ్యమని చాటే కవిత్వమిది. ధ్వనులు లేకుంటే ప్రతిధ్వనులు ఉండవని, పలకరింపులు లేకపోతే ఎదురయ్యేది శూన్యమే అంటాడు. ఆ శూన్యాన్ని, ఆ నిశ్శబ్దాన్ని తట్టుకోవడం అంత సులభం కాదంటాడు. అందుకే చీమల్లా, కాకి బలగంలా కలిసిమెలిసి ఉండే సంఘజీవనం నిలవాలంటాడు. లేదంటే ప్రతి జీవి ఓ ఒంటరి జీవిగా మిగిలిపోతాడని హెచ్చరిస్తున్నాడు.

దళిత, బహుజన వృత్తి పరమైన, అస్థిత్వ స్పృహ కవిత్వంతో పాటు సాంఘిక జీవనం, సబ్బండ నినాదం, పేదరికం, శ్రామిక శక్తులు, ఉత్పత్తి కులాల కోణంలోనూ కవిత్వం రాశాడు. బహుజన నేపథ్యం చూపే మౌనగర్భంలో, వడ్లపిట్ట, బండి చక్రం, మట్టి చిరునామా, ఇత్తడి చెంబు, తువ్వాల, గొంగడి, పల్లె పాఠాలు, బైపాస్, వాకిలి, బొంత, కుర్చీ, డిజర్టెడ్ విలేజ్, చిలుక్కొయ్య, దండం, ఇంటికప్పు, వడ్లగిర్ని వంటి శీర్షికలతో కవిత్వం ఉన్నది. అట్లాగే పల్లెల్లో మన పల్లెల్లో, సిమెంట్ నవ్వులు, కావలికార్, రక్తారోహణ, చిత్రదీపాలు, దిశ, మేస్త్రి కొడుకు, చేతులు, సెల్సియస్, ఎలాన్, అడ్డాకూలి, గుడిసె హోటల్, వడబోత, చలనశోభ, కాగితం, మెట్రో స్తంభాలు, ఆకలి మొదలగు కవితల్లో శ్రామిక శక్తి, పేదరికం ఆనవాళ్ళు కనిపిస్తవి.

సామాజిక ప్రయోజనం లేని ఎంత గొప్ప కవిత్వమైనా నిష్ప్రయోజనమే. గోపి కవిత్వంలో సామాజిక ప్రయోజనం మెండుగానే కనబడుతుంది. ఎందుకంటే తాను పుట్టి పెరిగిన పల్లె నేపథ్యం, సామాజిక నేపథ్యం కూడా ఒక కారణం అయి ఉంటుంది. దళిత, బహుజనుల దృక్పథం కలిగిన కవిగా, వారి స్వరం వినిపించిన శక్తివంతమైన గొంతుకగా గోపి కవిత్వమే చెబుతుంది. గోపిని సబ్బండ వర్ణాల ప్రతినిథిగా నిలబెడుతుంది.

డా. మండల స్వామి
9177607603

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News