Homeఎడిటోరియల్ / బహుళఔషధ భద్రత, నియంత్రణ- – ప్రజారోగ్య పరిరక్షణ

ఔషధ భద్రత, నియంత్రణ- – ప్రజారోగ్య పరిరక్షణ

ప్రస్తుత కాలంలో వైద్య రంగం ఎంత పురోగతి సాధించినప్పటికీ, మందుల విని యోగంలో పెరుగుతున్న నిర్లక్ష్యం ఒక గంభీ రమైన సామాజిక సమస్యగా మారుతోంది. ఒకప్పుడు వైద్యుడి సూచనతో మాత్రమే వా డే ఔషధాలు, ఇప్పుడు స్వేచ్ఛగా కొనుగోలు చేసి వినియోగించే పరిస్థితి ఏర్పడింది. ఈ మార్పు సౌలభ్యాన్ని పెంచినా, అదే సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులను కూడా సృష్టించింది. ముఖ్యంగా అలవాటుగా మారే ఔషధాల దుర్వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడం అత్యవసరంగా మారింది.

- Advertisement -

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళి కలో భాగంగా ఏప్రిల్‌ 6 నుంచి 11 వరకు నిర్వహిస్తున్న హెల్త్‍ వీక్‌లో, ఏప్రిల్‌ 11ను డ్రగ్‌ కంట్రోల్‌ రెగ్యులేటరీ స్ట్రెంగ్తెనింగ్‌ డే గా నిర్వహిస్తూ, మందుల భద్రత నియంత్రణ పై ప్రత్యేక దృష్టి పెట్టడం గమనార్హం. నిజానికి ఇది సాధారణ కార్యక్రమం కాదు, ప్రజా ఆరోగ్యంపై పెరుగుతున్న ఆందోళనలకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా దీనిని చూడా లి. ముఖ్యంగా మందుల సక్రమ వినియోగం, అలవాటుగా మారే ఔషధాల నియం త్రణ, లైసెన్సింగ్‌ వ్యవస్థ పర్యవేక్షణ, నకిలీ మందుల నివారణ, నాణ్యమైన ఔషధాల అందుబాటు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించడం ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తోంది.

మందుల భద్రత అంటే కేవలం నాణ్యత మాత్రమేకాదు. రోగికి సరైన ఔషధం, సరైన మోతాదులో, సరైన సమయంలో అందుబాటులో ఉండడం కూడా అవసరం. కానీ వాస్తవ పరిస్థితుల్ని గమనిస్తే, నకిలీ మందులు, గడువు ముగిసిన ఔషధాలు, నియంత్రణలో లేని విక్రయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో పరి స్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. అక్కడ వైద్యుల కొరత, ఫార్మసీ నియంత్రణ లోపం, అవగాహన లేకపోవడం కలిసి సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.

తెలంగాణలో ఇటీవల డ్రగ్స్‍ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (DCA) చేపడుతున్న చర్య లు ఒక స్థాయిలో సానుకూల సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అనధికారిక ఔషధ విక్ర యాలపై దాడులు, నకిలీ మందులపై తనిఖీలు, ఫార్మసీలకు కఠిన నిబంధనలు విధిం చడం వంటి చర్యలు అమలవుతున్నాయి.
అదేవిధంగా, నియంత్రణ పేరుతో చిన్న ఫార్మసీలపై అనవసర ఒత్తిడి పడకూడ దనే అంశం కూడా సమానంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతా ల్లో చిన్న మెడికల్‌ షాపులు ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలందించే ముఖ్యమైన వన రులు. నియమాలు తప్పనిసరి అయినప్పటికీ, వాటి అమలు బాధ్యతాయుతంగా, మార్గనిర్దేశకంగా ఉండాలి. భయాందోళనలు సృష్టించే విధంగా ఉండకూడదు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడం ఎంత అవసరమో, నిజాయితీగా పనిచేసే చిన్న వ్యాపారుల వెన్నుతట్టి ప్రోత్సహించడం కూడా అంతే ముఖ్యం. అయితే, ఈ చర్యలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయా? లేక ఒక ప్రత్యేక కార్యక్రమానికే పరిమితమవుతున్నాయా? అన్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో ప్రభుత్వ చర్యలు తాత్కాలికంగా ఉత్సాహాన్ని కలిగించినా, వ్యవస్థలో దీర్ఘకాలిక మార్పు తీసుకురావడంలో విఫలమవుతాయి. నియంత్రణ సంస్థల సిబ్బంది కొరత, సాంకేతిక వనరుల లోపం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పూర్తిస్థాయిలో పని చేయలేకపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఒకవేళ నియంత్రణలో ఉన్న లోపాలను సరిదిద్దకుండా కేవలం ప్రచార కార్యక్రమాలతో సరిపెట్టుకుంటే, ప్రజల నమ్మకం దెబ్బతింటుంది.

ముఖ్యంగా అలవాటుగా మారే మందుల విషయంలో పరిస్థితి మరింత సున్ని తంగా ఉంది. నిద్ర మాత్రలు, నొప్పి నివారణ మందులు, కొన్ని నరాల సంబంధిత ఔషధాలు, వైద్యుడి పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సినవి. కాని ఇప్పుడు ఆన్‌ లైన్‌ లో కూడా సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. యువతలో వీటి వినియోగం పెరు గుతూ ఉండటం ఒక ప్రమాదకర సంకేతం. ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు; ఇది కుటుంబ వ్యవస్థను, సామాజిక స్థిరత్వాన్ని కూడా ప్రభావితం చేసే అంశం.

————————————————————
ALSO READ:
ప్రజల నుంచి దూరమైన విప్లవవాదులు

కులమే పేదరికానికి మూలం

గద్దరే తెలంగాణ జాతిపిత: తెల్లాపూర్‌ డిక్లరేషన్‌

————————————————————

ఈ నేపథ్యంలో ప్రజల బాధ్యత కూడా కీలకం. ప్రతి సమస్యను ప్రభుత్వంపై మో పడం సులభం. కానీ అవగాహన లేకుండా మందులు వాడటం, ఫార్మసీల వద్ద నియ మాలను పట్టించుకోకపోవడం, తక్షణ ఉపశమనం కోసం తప్పుడు మార్గాలను ఎంచు కోవడం, ఇవి కూడా సమస్యను పెంచుతున్నాయి. ఆరోగ్యంపై చైతన్యం పెరగాలి. వై ద్యుడి సలహా లేకుండా మందులు వాడకూడదు అనే ప్రాథమిక నియమం పాటించాలి.

మరో ముఖ్యమైన కోణం ఏమిటంటే, ఆరోగ్య రంగంలో నైతికత. కొన్ని సందర్భాల్లో లాభాపేక్షతో నకిలీ లేదా నాణ్యత లేని ఔషధాలను మార్కెట్‌లోకి తెచ్చే ధోరణి కనిపిస్తోంది. ఇది కేవలం చట్ట విరుద్ధం మాత్రమే కాదు; నైతిక విలువలకు, మానవత్వానికి వ్యతిరేకం. ఒక మనిషి ఆరోగ్యంతో ఆటలాడటం అంటే పూర్తి మానవ సమాజంతో చెలగాటమాడటమే.

ఒక సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే, మందుల భద్రతపై ప్రజలకు విశ్వాసం కలగాలి. అది కేవలం మాటలతో కాదు, పారదర్శకమైన చర్యలతో, కఠినమైన అమ లుతో, నిరంతర పర్యవేక్షణతో వస్తుంది. నియంత్రణ బలంగా ఉంటేనే ప్రజల ఆరో గ్యం సురక్షితం అవుతుంది. లేదంటే, మందులు ఉపశమనం ఇవ్వాల్సిన చోటే, కొత్త సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

అయితే, ఈ సందర్భంలో మరొక కీలక అంశాన్ని మనం విస్మరించకూడదు. ఆరోగ్య వ్యవస్థలో నమ్మకం అనేది ఒక్కరోజులో ఏర్పడేది కాదు; అది నిరంతర చర్యల ఫలితం. డ్రగ్‌ నియంత్రణ వ్యవస్థను సాంకేతికంగా బలోపేతం చేయడం, డిజిటల్‌ ట్రాకింగ్‌ ద్వారా మందుల సరఫరాను పర్యవేక్షించడం, లైసెన్సింగ్‌ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టడం వంటి నిర్మాణాత్మక మార్పులు అవసరం. అదే సమయంలో, ఫార్మసిస్టులు, వైద్యులు, ప్రజల మధ్య ఒక బాధ్యతాయుత సహకార వాతావరణం ఏర్పడాలి. నియంత్రణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు; అది ఒక సమిష్టి కర్తవ్యం. ఈ దిశగా డ్రగ్‌ కంట్రోల్‌ రెగ్యులేటరీ స్ట్రెంతెనింగ్‌ డే ఒక ప్రారంభ సంకేతం మాత్రమే. దాన్ని నిరంతర సంస్క రణ ప్రక్రియగా మార్చగలిగితే ప్రజల ఆరోగ్య భద్రతకు నిజమైన అర్థం చేకూరుతుంది.

యండి. ఉస్మాన్‌ ఖాన్‌
ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‍
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News