ఒకే మందు ఆడవాళ్లకి, మగవాళ్లకి ఒకేలా పనిచేస్తుందా? కొన్ని కొందరికి బాగా పనిచేస్తూ, మరికొందరికి సరిగా పనిచేయట్లేదా? అసలు ఎందుకిలా జరుగుతోంది? అసలు ఔషధాలకు సంబంధించి చేసే ప్రాథమిక పరిశోధనలోనే లింగవివక్ష కనిపిస్తోందట!! ఎలుకలపై పరిశోధనలు చేసేటప్పుడు శాస్త్రవేత్తలు చాలావరకూ మగ ఎలుకలనే తీసుకుంటున్నారు. అలాంటి మగ ఎలుకల మీద పరిశోధనలు చేసి, మార్కెట్‌లోకి తీసుకొచ్చిన మందులు మగవారిపై బాగానే పనిచేస్తున్నా… మహిళల విషయంలో మాత్రం ఎంతవరకు పని చేస్తున్నాయనేది మాత్రం కాస్త అనుమానమేనని శాస్త్రవేత్తలు ఇప్పుడు అంటున్నారు.
సుదీర్ఘకాలంగా శాస్త్రవేత్తలంతా కూడా మందులు ఆడవారికి, మగవారికి ఒకేలా పనిచేస్తాయనే భావించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఇప్పుడిప్పుడే ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా మందులు తయారుచేయాలన్న ఉద్దేశంతో ఔషధ పరీక్షల స్థాయి నుంచి ఆడ జంతువులను వినియోగించాలన్న సూచనలు క్రమంగా వస్తున్నాయి. ఆడ, మగ ఎలుకల్లో మెదడు పరిమాణం దగ్గర నుంచి అన్నింట్లోనూ అనేక రకాల వైవిధ్యాల ఉంటాయి. వాటి శరీర పరిమాణం, ఆకారం, నడీకణాలు పరస్పరం అనుసంధానం అయ్యే తీరు.. ఇవన్నీ మారుతాయి. అందుకే మందుల ప్రభావం కూడా రెండింటి మీద ఒకలా ఉండదు. అదే పరిస్థితి మనుషుల విషయంలోనూ వర్తిస్తుందది. ఉదాహరణకు మనుషుల్లో మగవారి కంటే ఆడవారికి కుంగుబాటు వచ్చే అవకాశాలు రెట్టింపు ఉంటాయి. యాంటీ డిప్రసెంట్ మందులకు ప్రతిస్పందించే తీరులో కూడా మగవారికి, ఆడవారికి తేడాలు ఉన్నట్లు గుర్తించారు. సెరొటోనిన్ రుప్టేక్ ఇన్హిబిటర్లు (ఎస్ఎస్ఆర్ఐలు) పురుషుల కంటే మహిళలకు బాగా పనిచేస్తే, ట్రైసైక్లిక్ యాంటీడిప్రసెంట్లు మాత్రం మగవారికి బాగా పనిచేస్తున్నాయి.
ఎలాంటి ప్రభావాలు ఉంటాయి?
ఔషధాలకు సంబంధించిన పరిశోధనలలో ఆడ జంతువులను వదిలేయడం వల్ల మహిళల ఆరోగ్యం విషయంలో చాలాకాలం నుంచే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల కొన్నిరకాల మందులు తీసుకున్నప్పుడు ఆడవారికి వికారం, తలనొప్పి, మూర్ఛ, గుండె సమస్యల్లాంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంటోంది. పురుషుల కంటే మహిళల్లో మందుల దుష్ప్రభావాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సగటున పురుషుల కంటే మహిళలు తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల ఇద్దరికీ ఒకే రకం డోసేజి కూడా ఇవ్వకూడదన్నది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. గుండె సమస్యలకు చికిత్సలో వాడే బీటా బ్లాకర్లను వాడినప్పుడు మహిళలకు ఆ మందులు పెద్దమొత్తంలో రక్తంలో ఉండిపోతున్నాయి. మగవారి కంటే ఆడవారిలో రక్తం తక్కువగా ఉంటుంది. అయినా ఒకే డోసులో బీటా బ్లాకర్లు ఇవ్వడం వల్ల అంత తక్కువ రక్తంలో ఎక్కువ మోతాదు మందులు కరగకపోవడంతో ఈ తరహా సమస్యలు వస్తున్నాయి.
పరిశోధనల్లో ఈ తేడాలు ఎందుకు?
మందుల మీద పరిశోధనలు చేసేటప్పుడు ఎలుకల హార్మోన్లు, ఇతరత్రా అన్నీ కొంతకాలం పాటు ఒకేలా ఉండాలని శాస్త్రవేత్తలు భావిస్తారు. అయితే ఆడ ఎలుకల విషయంలో రుతుక్రమం కారణంగా హార్మోన్లు విడుదలయ్యే తీరు మారుతుంది. దీనివల్ల మందుల ప్రభావాన్ని అంచనా వేసేటప్పుడు కొన్ని తేడాలు వస్తాయి. మగ ఎలుకల్లో సెక్స్ స్టెరాయిడ్ హార్మోన్లు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఆడ ఎలుకల్లో మాత్రం వాటిలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. దీనివల్ల మెదడు పనితీరు, ప్రవర్తనలోనూ మార్పులు ఉంటాయి.. మందులకు స్పందించే తీరు కూడా మారిపోతుంది. అయితే, ఎలుకల రుతుక్రమం మహా అయితే నాలుగైదు రోజులు మాత్రమే ఉంటుందని, అందువల్ల ఆ కాలాన్ని వదిలిపెట్టి మిగిలిన కాలమంతా పరిశోధనలకు వాటినీ ఉపయోగించాలని శాస్త్రవేత్తలు కొందరు డిమాండు చేస్తున్నారు.
కొన్ని రకాల మందులను గర్భంతో ఉన్న ఎలుకలు, లేదా మనుషులపై అసలు ప్రయోగించి చూడకుండానే మార్కెట్లలోకి విడుదల చేసేశారు. అలా ప్రయోగిస్తే ఏమవుతుందోనన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఉదాహరణకు మార్నింగ్ సిక్‌నెస్ తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగించే థాలిడొమైడ్ అనే మందును 1950లలో ఉత్పత్తి చేశారరు. కానీ దాన్ని ఇప్పటివరకు గర్భంతో ఉన్న జంతువుల మీద గానీ, మనుషుల మీద గానీ ప్రయోగించి చూడలేదు. గర్భంతో ఉన్నప్పుడు ఆ మందు తీసుకుంటే పుట్టబోయే పిల్లల ఎదుగుదల అసాధారణంగా ఉంటుందన్న విషయం ఇటీవలే తేలింది. ఈలోపు ఎంతమంది పిల్లలు చేతులు, కాళ్లు లేకుండా పుట్టారో లెక్క లేదు!
ఇప్పుడు పరిస్థితి ఏంటి?
పలు రకాల మందులు రుతుక్రమం సమయంలోను, గర్భధారణ సమయంలోను, గర్భనిరోధక మందులు వాడేటప్పుడు ఎలా పనిచేస్తాయన్న విషయంలో ఇప్పుడిప్పుడే పరిశోధనలు మొదలవుతున్నాయి. ఉదాహరణకు మూర్ఛవ్యాధి తగ్గించడానికి వాడే కొన్ని రకాల మందులు గర్భనిరోధక మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయని తేలింది. అలాగే, ఈ మందుల ప్రభావాన్ని కూడా గర్భనిరోధక మందులు తగ్గిస్తాయి. అమెరికాలో మహిళలపైనా ఔషధ ప్రయోగాలు చేయొచ్చని చట్టబద్ధంగా 1990లోనే నిర్ణయించారు. ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత గానీ వారిపై ప్రయోగాలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. తాజాగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) ఆధ్వర్యంలో, వాళ్ల నిధులతో చేసే ప్రయోగాల్లో కనీసం సగం మంది ఆడవారు ఉండాలని నిబంధన పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నిబంధనలు వస్తే తప్ప, అలాగే వాటిని కచ్చితంగా పాటిస్తే తప్ప మందుల విషయంలో ఈ లింగ వివక్ష అన్నది పూర్తిగా పోదు.