విచ్ఛిన్నకర ప్రచారాలకు పాల్పడవద్దంటూ ఎన్నికల కమిషన్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు నోటీసులు జారీ చేయడం ప్రశంసనీయ విషయమే కానీ, ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషన్ అసమర్థంగా, పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ ఈ మధ్య కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ సంస్థ ఈ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించడం మెచ్చుకోదగ్గ విషయంగానే కనిపిస్తోంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఇ.సి.ఐ) సభ్యుల నియామకం విషయంలో కూడా ఎన్నికల కమిషన్ పక్షపాతంగానే వ్యవహరించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. సమాజాన్ని విభజించే విధంగా ప్రకటనలు, ప్రసంగాలు, ప్రచారాలు చేయవద్దంటూ తమ ప్రధాన ప్రచార సారథులను ఆదేశించాలని ఎన్నికల కమిషన్ బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డాకు నోటీసు జారీ చేసింది. రాజస్థాన్‌లోని బాన్స్ వాడాలో మే 13న బీజేపీ ప్రధాన ప్రచార సారథి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని ఎన్నికల కమిషన్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇక్కడ జరిగిన ప్రచార సభలో మోదీ ఎక్కువ సంతానం కలిగినవారు, చొరబాటు దార్లంటూ ఒక వర్గాన్ని ఉద్దేశించిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది.
వివిధ కులాలు, మతాల మధ్య విభేదాలు, టెన్షన్లు చోటు చేసుకునే విధంగా ఎటువంటి ప్రకటనలూ, ప్రచారాలూ చేయవద్దని తమ ప్రధాన ప్రచార సారథులకు సూచించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కూడా ఎన్నికల కమిషన్ ఒక లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీపై తామ్లుక్ నియోజకవర్గ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి అభిజిత్ గంగో పాధ్యాయ చేసిన వ్యాఖ్యలను కలకత్తా హైకోర్టు తీవ్రస్థాయి వ్యాఖ్యలుగా పరిగణించి మంద లించడంతో ఎలక్షన్ కమిషన్ ఈ రెండు పార్టీలకు ప్రత్యేకంగా లేఖలు రాయాల్సిన అవసరం వచ్చింది. ఆ బీజేపీ అభ్యర్థి 24 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా హైకోర్టు నిషేధిం చడం జరిగింది. గతంలో ఇటువంటి ఆరోపణలపై ఎన్నికల కమిషన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి, భారత రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ మంత్రి కొండా సురేఖ, బీజేపీ నాయకులు శోభా కరండ్లజే, దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయ కులు సుప్రియా శ్రీనతే, రణ్ దీప్ సూర్జేవాలాల విషయంలో చర్యలు తీసుకోవడం జరిగింది.
అయితే, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ తదితరులపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ ఇంకా స్పందించ లేదు. మొత్తం మీద ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందనే విమర్శలకు అంతుండడం లేదు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు, విమర్శలతో పాటు చర్చలు, వివాదాలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఏవి విచ్ఛిన్నకర ప్రకటనలు, ఏవి చర్చనీయాంశాలు అన్న విషయంలో ఎన్నికల కమిషన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధికార దుర్వినియోగాన్ని, సామాజిక విచ్ఛిన్నతకు దారితీసే అంశాలను ఎన్నికల కమిషన్ తప్పకుండా అడ్డుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు న్యాయబద్ధంగా, స్వేచ్ఛగా, సజావుగా జరిగ డానికి ఎన్నికల కమిషన్ పనితీరే కీలకం. దేశంలోని పార్టీలన్నిపట్లా ఎన్నికల కమిషన్ సమ దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుంది. కనీసం ఎన్నికల సమయంలోనైనా ఎన్నికల కమిషన్ ఇటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ECI: ఎన్నికల కమిషన్ పనితీరులో మార్పు
నోరు పారేసుకునే నేతలకు..