చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. ఆధిపత్య కులాల వాండ్లు కొంత కాలం వాస్తవాలు వెలుగులోకి రాకుండా చేయవ చ్చు. కానీ బహుజన సామాజిక వర్గాల నుంచి వచ్చిన వారు, విదేశీ స్కాలర్లు శోధించి కొత్త వెలుగులను ప్రసరిస్తున్నారు. అంబేడ్కర్ విషయంలోనూ అదే జరుగుతున్నది. భిన్న కోణాల్లో అనేక మంది కొత్తగా అంబేడ్కర్ జీవితం, పోరాటాలు, ప్రతిభ గురించి రికార్డు చేస్తున్నారు. ఇది 1960వ దశకంలో అమెరికన్ స్కాలర్ ఎలియనార్ జీలియట్ నుంచి ప్రారంభమై అనురాగ్ భాస్కర్ (2024) వరకు, ఇంకా కొనసాగుతున్నది. గత పదేండ్ల లో అంబేడ్కర్‌పై శతాధిక ప్రామాణిక పరిశోధక గ్రంథాలు వెలువడ్డాయి. పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ సైతం ఓ పుస్తకం రాసిండు. ఇప్పుడు 135వ జయంతి సందర్భంగా ప్రతి భ, సమర్ధతపై అంబేడ్కర్ ఆలోచనలను ఇక్కడ చర్చిద్దాం.
బ్రిటీష్ ప్రభుత్వం (సెక్రెటరీ- భారత ప్రభుత్వం) మిలిటరీ, సివిల్ వ్యవస్థలపై పెట్టే ఖర్చుపై, అనవసరమైన వ్యయాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా (లార్డ్) వెల్బీ (1832-1915) కమిషన్‌ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ముందు గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయ్ నౌరోజీ, దిశా వాచ్ఛా తదితర స్వాతంత్య్రోద్యమకారులు తమ వాదనలు విని పించారు. ఈ కమిషన్ 24 మే 1895 నాడు ఏర్పాటయింది. 1900లో నివేదిక సమర్పించింది. ఈ కమిషన్‌కు గోపాలకృష్ణ గోఖలే 1895లో ఇచ్చిన వినతి పత్రంలో బ్రిటీష్ పరిపాలనా కొలువుల్లో (సివిల్ సర్వీసెస్) భారతీయులకు అవకాశం కల్పిం చాలని కోరిండు. అప్పటి వరకు కలెక్టర్ తదితర ఉన్నత పదవు ల్లో బ్రిటీష్, యూరోపియన్‌లను మాత్రమే నియమించేవారు. ఈ డిమాండ్‌పై తర్వాతి కాలంలో అంబేడ్కర్ కూలంకషంగా విశ్లేషించాడు. “ఒకవైపు బ్రాహ్మణులు తమకు ఉన్నత కొలువు ల్లో భాగం కావాలని కోరు కుంటున్నారు. మరోవైపు అదే హక్కును అణగారిన వర్గాల వారికి దక్కకుండా చేస్తున్నారు. ఇదె క్కడి న్యాయం?” అని నిలదీశారు. ఆధిపత్యకులాల వారి ద్వం ద్వ వైఖరిని అంబేడ్కర్ నిరసించాడు.
నిజానికి బ్రిటీష్ పాలనలో భారతీయులకు సైతం భాగస్వా మ్యం కల్పించాలని 1890వ దశకం నుంచి డిమాండ్ ఉన్నది. దీనికి కొనసాగింపుగా ఇస్లింగ్‌టన్ కమిషన్ సిఫారసుల ఆధా రంగా 1915 నుంచి పరిమితంగానైనా ప్రభుత్వంలో భారతీ యులకు ఉన్నతోద్యోగాలు దక్కినాయి. బ్రిటీష్, ఇండియన్ల మధ్యన పదవుల పంపకాలు జరిగాయి. ఆ మేరకు నియామకా లు చేసిండ్రు. ఒకవైపు ప్రభుత్వంలో ఉద్యోగాలు అనుభవిస్తున్న బ్రాహ్మణ సామాజిక వర్గంవారు అదే సమయంలో రిజర్వే షన్లను వ్యతిరేకించారు. ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
బ్రాహ్మణులు అందరికన్నా ముందు విద్యావంతులు కావ డంతో బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగాల్లో, వృత్తుల్లో చేరిండ్రు. ఆ రం గంలో తమ గుత్తాధిపత్యాన్ని ఏర్పర్చుకున్నారు. అయితే ఇందు కు అవసరమైన విద్యావకాశాలు బ్రాహ్మణేతరులకు అందుబా టులో లేవు. లేవు అనేకంటే లేకుండా చేశారు అనేది వాస్తవం. ఉన్నత విద్య ఖరీదైన అంశంగా మార్చిండ్రు. అందులోకి అణగా రిన వర్గాలు రాకుండా చేసిండ్రు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సంపాదించుకున్న బ్రాహ్మణులు తర్వాతి కాలంలో వాటిల్లోకి బ్రాహ్మణేతరులు రాకుండా అడ్డుకున్నారనేది దీని సారాంశం. దీనికి ప్రతిభ, సమర్ధత అనే ముసుగుని తొడిగిండ్రు.
ప్రతిభ, సమర్ధత విషయంపై అంబేడ్కర్ బ్రాహ్మణుల వాద నను ఖండించాడు. సైమన్ కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో అంబే డ్కర్ వెనుకబడిన తరగతుల వారికి (బీసీలకు) ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరిండు. దీనికి ఆధిపత్యకులాల వాళ్లు ‘సమర్ధత’ లేని వారిని కొలువుల్లోకి తీసుకుంటే పాలన దెబ్బతింటుందని వాదించారు. ‘సమర్ధత’ ఒక్క బ్రాహ్మణుల సొత్తే అన్నట్టుగా వ్యవహరించారు. ఈ ‘ప్రతిభ’ వాదనకు అంబే డ్కర్ గట్టిగా జవాబిచ్చాడు. అంతేగాదు వెనుకబడిన తరగతుల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిండు. ఆఖరికి తన రాజీనామా లేఖలో సైతం బీసీల వెనుకబాటు విషయాన్ని ప్రస్తావించాడు.
అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతుల వారిని రాకుండా చేయడం నైతికంగా తప్పు. ఇది కూడా భారతీయు లను (బ్రిటీష్ వారు) ప్రజా ఉద్యోగాల్లోకి రాకుండా చేసిన దుర్మార్గం లాంటిదే. వెనుకబడిన తరగతుల వారిని ఉద్యోగాల్లో కి ప్రవేశం లేకుండా చేస్తున్న వారికి అంబేడ్కర్ అనేక ప్రశ్నలు సంధించాడు.
“ఇన్నేండ్లు వెనుకబడిన తరగతుల వారు తమకు జరుగు తున్న అన్యాయాన్ని ప్రశ్నించలేదు. మౌనంగా భరించారు. బహిష్క ృత బతుకును ఈడ్వడానికి సిద్ధపడ్డారు. ఈ వ్యవస్థ ఎంతటి యోగ్యులనైనా తక్కువవారమనే భావనలో ఉండేలా చేసింది. ఇందుకు బ్రాహ్మణ, వారి అనుబంధ కులాల ఆధిప త్యమే కారణమని వెనుకబడినతరగతుల వారు భావిస్తే తప్పేమి లేదు. ఒకవైపు వెనుకబడిన తరగతుల వారికి అన్యాయం చేస్తూ మరోవైపు బ్రిటీష్ వారిని ఉద్యోగావకాశాలు కల్పించడం లేదన డం వైచిత్రి. అంతేగాదు పాఠశాలల్లో చదువుకునే సమయంలోనే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సిన్హా, శాస్త్రి, రణడే, పరాంజపేల బాలురు ఉన్నత ఉద్యోగాల గురించి ఆలోచిస్తారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు (ఊహే) ఈ అవకాశం లేదు.” అని అనురాగ్ భాస్కర్ ‘ద ఫార్‌సైటెడ్ అంబేడ్కర్: ఐడి యాస్ దట్ షేప్‌డ్ ఇండియన్ కాన్స్‍టిట్యూషనల్ డిస్కోర్స్’ పేరిట 2024లో వెలువరించిన ప్రామాణిక పరిశోధక గ్రంథంలో అంబేడ్కర్ వ్యాఖ్యలను కోట్ చేసి చెప్పిండు.
1928లో అంబేడ్కర్ సైమన్ కమిషన్‌కు ఒక నివేదికను సమర్పిస్తూ సమాజంలోని వెనుకబడిన తరగతుల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిండు. దీన్ని బ్రాహ్మణులు, వారి అనుబంధ కులాలకు చెందిన వ్యక్తులు వ్యతిరేకించారు. ఇట్లా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు ఇచ్చినట్ల యితే పాలనలో ‘సమర్ధత’ కొరవడుతుందని ఆక్షేపించారు. అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారం ఈ ‘సమర్ధత’ సిద్ధాంతం వలసవాద కాలంలోనూ, అనంతరమూ ప్రచారములో ఉన్నది. నిజానికి బ్రాహ్మణకులాలు ఒకవైపు తమకు బ్రిటీష్ ప్రభు త్వంలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదే సమ యంలో బీసీలకు రిజర్వేషన్లు నిరాకరించడమంటే ఆధిపత్య భావన తప్ప మరొకటి కాదన్నాడు.
ఈ ‘సమర్ధత’ పేరుతోనే బ్రాహ్మణులు, ఆధిపత్యకులాల వారు అప్రకటిత రిజర్వేషన్ల ద్వారా అన్నీ తామే అనుభవిం చారు. సామాజిక, రాజకీయాల్లో గుత్తాధిపత్యాన్ని స్థిరీకరించు కున్నారు. బ్రాహ్మణులకు ఉద్యోగాలిస్తే వారు తమ సామాజిక వర్గం వారికే తోడ్పడతారు. సామాన్య ప్రజలను పట్టించుకోరు. బ్రాహ్మణులు, వారి అనుబంధ కులాల వారు చూపించే ఆశ్రిత పక్షపాతం వల్ల ‘సమర్ధత’ అనేది లెక్కలో లేకుండా పోతున్నది. అందుకే దేశంలో పాలన సజావుగా సాగాలంటే అన్ని వర్గాల వారిని పాలనలో భాగస్వాములని చేయాలి. ఇంకా చెప్పాలంటే కుల పక్షపాత వ్యవస్థను సరిదిద్దాలంటే ఉద్యోగాల్లో అన్ని వర్గాల వారి సమ ప్రాతినిధ్యం ఉండాలి అని అంబేడ్కర్ వాదించారు.
అట్లాగే ‘ప్రతిభ, సమర్ధత’ అనేది బ్రాహ్మణులు, వారి అనుబంధ కులాలు చేసే పసలేని వాదన. అధికార వ్యవస్థలోకి వెనుకబడిన తరగతుల వారు రాకుండా అడ్డుకునే ప్రయత్న మిది. భారతదేశంలో విద్యావ్యవస్థ అత్యంత అప్రజాస్వా మికంగా ఉన్నది. దానివల్ల అణగారిన వర్గాల వారికి అన్యాయం జరుగుతున్నది. ఇవి బీసీలను అడ్డు తొలగించు కునేందుకు వేసే ఎత్తుగడలు. ఈ వాదన బ్రిటీష్ వారు రాక పూర్వం నుంచే అమల్లో ఉన్నది. ‘సమర్ధత’ అనే కుల వారసత్వాన్ని కొనసాగిం చడానికి, దురభిమానంతో ఇతరుల గ్రామ బహిష్కరణకు వేసే ముసుగు. బ్రాహ్మణులు అధికారం చలాయించినంత కాలం వెనుకబడిన తరగతుల వారిని సేవక కులాలుగానే పరిగణి స్తారు. అట్లాగే ఆధిపత్య పీడక కులాలు రాజకీయ అధికారాన్ని బుద్ధిబలంతో సాధించుకోలేదు. నిజానికి బుద్ధిబలం ఏ ఒక్కరి సొత్తు కాదు. కులం మూలంగానే బ్రాహ్మణులు ఆధిపత్యాన్ని సాధించగలిగారు. ప్రాచీన కాలం నుంచి వారికి కులం ఒక తిరుగులేని ఆయుధంగా ఉపయోగపడుతున్నది. ఇదొక రకం రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ ద్వారా సామాజిక నిర్మితి మీద నియంత్రణ సాధించారు అన్నాడు.
పోటీ పరీక్షలు అంటే అందరికీ సమాన స్థాయి అవకా శాలుండాలి. అన్ని కులాలు, వర్గాల వారికి ఒకే విధమైన పరిస్థి తులు ఉండాలి. ఇందుకోసం ప్రజాస్వామ్యబద్ధమైన విద్యావ్య వస్థ ఉండాలి. అందరికీ సమాన సదుపాయాలుండాలి. ఈ పోటీల నుంచి యోగ్యులైన అధికారులు ఎంపికవుతారు. అట్లా కానట్లయితే ఎంత ఓపెన్ కాంపిటీషన్ అయినా అనేకమంది వెనుకబడిపోతారు. ఇప్పుడు ఇట్లాంటి సమాన అవకాశాలు, పరిస్థితులు లేనందున వెనుకబడిన తరగతుల వారు పోటీపడి మోసపోవడానికి సిద్ధంగా లేరు. నిజానికి విద్యావ్యవస్థనే అన్ని అసమానతలకు కారణం. ఇప్ప్పుడున్న సామాజిక అసమాన తలు సరిదిద్దాల్సిన బాధ్యత విద్యారంగానిదే అని విద్యా వ్యవస్థ మారితేనే అన్నీ మారుతాయని అంబేడ్కర్ అభిప్రాయం పడ్డారు. పాలకులు ఆ ఒక్కటి పక్కన పెట్టి దళిత బహుజనులను పక్కదారి పట్టిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్, గుజారాత్‌లలో వేల సంఖ్య లో ప్రభుత్వ పాఠాశాలలు మూసేశారు. అందులో చదువుకునే వారందరూ దళిత, బహుజన, ముస్లిం పేదలే. కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో రిసెర్చ్‍కు నిధులు కోత విధించింది. స్కాలర్షిప్పులు తగ్గించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు న్నరేండ్లయినా యూనివర్సిటీల్లో ఒక్క అధ్యాపక పోస్టు నింపలేదు. విశ్వవిద్యాలయాలు పడావు పడితే ప్రశ్నించేవారు పుట్టుకు రారు అని విద్యాశాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుంది. అది భ్రమ. ఇప్పటికైనా విద్యార్థులు మేలుకోవాలి. అంబేడ్కర్ స్ఫూర్తితో బోధించు, సమీకరించు, పోరాడు నినాదాన్ని అమల్లోకి తేవాలి.
కాలమ్ : సంచకారి
డా.సంగిశెట్టి శ్రీనివాస్
సామాజిక, రాజకీయ విశ్లేషకులు

