Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Education department: విద్యా వ్యవస్థలో లోపాలు అపారం

Education department: విద్యా వ్యవస్థలో లోపాలు అపారం

లోపాయమాయమైన విద్యా వ్యవస్థ

పాఠశాల విద్యార్థులకు క్రమంగా విద్యాబోధనే ఒక పెద్ద సమస్యగా మారుతోంది. చాలా కాలం క్రితమే లోపభూయిష్టంగా మారిని విద్యాబోధన ఫలితాలు ఇప్పుడిప్పుడే అనుభవానికి వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ప్రథమ్ అనే సామాజిక సేవా సంస్థ ఇటీవల తన వార్షిక విద్యా వికాస నివేదికను విడుదల చేసినప్పుడు, అందులోని వివరాలు నిర్ఘాంతపరచేవిగా ఉన్నాయి. దేశంలో 14-18 ఏళ్ల మధ్య విద్యార్థులకు గణిత శాస్త్రపరంగా ప్రాథమిక అవగాహన కూడా లేదని, 3, 4 తరగతుల్లో బోధించాల్సిన గణితం పట్ల వారికి ఇప్పటికీ అవగాహన లేదని అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 28 జిల్లాలను ఎంపిక చేసి ఇంటింటికీ వెళ్లి, సుమారు 35 వేల మందిని ప్రశ్నించడం జరిగింది. ప్రాథమిక గణిత శాస్త్రంలో వారికున్న పరిజ్ఞానాన్ని పరీక్షించినప్పుడు వారికి గణిత శాస్త్రంలో సరైన పునాదులే లేవని అర్థమైంది. అంతకన్నా విచిత్రమైన విషయమేమిటంటే, 25 శాతం మందికి మాతృభాషలో రెండవ తరగతి పాఠ్య పుస్తకం చదవడం కూడా రాదని తెలిసింది. బాలికల కంటే బాలురే గణిత శాస్త్రంలోనూ, ఇంగ్లీషులోనూ, చదవడంలోనూ కొద్దిగా మెరుగ్గా కనిపిస్తున్నారని కూడా సర్వే వెల్లడించింది.

- Advertisement -

ఇక 86.60 శాతం మంది 14-18 ఏళ్ల విద్యార్థులు తమ వయసుకు తగ్గట్టుగా విద్యలో పరిణతి చెందడం లేదు. వయసుకు తగ్గ, తరగతికి తగ్గ విద్యాబోధన కూడా జరగడం లేదు. అంతేకాక, 14 ఏళ్ల వయసు వారిలో 3.9 శాతం మంది పాఠశాలలకు వెళ్లడం లేదు. పైగా 18 ఏళ్ల వారిలో కూడా దాదాపు 32.60 శాతం మంది కాలేజీల మొహం చూడడం లేదు. బాలురలో అత్యధిక శాతం మంది విద్యార్థులు హ్యుమానిటీస్ లో చేరుతుండగా, బాలికల్లో 28 శాతం మంది సైన్స్ సబ్జెక్టుల పట్ల అభిమానం కనబరుస్తున్నారు. ఇక వృత్తి నైపుణ్యాలను నేర్పే ఒకేషనల్ కోర్సులకు వెళ్లే వారి సంఖ్య 6 శాతం కూడా ఉండడం లేదు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేవారిలో దాదాపు 28 శాతం మంది మగపిల్లలు ట్యూషన్లకు వెళ్లడం జరుగుతోంది. ట్యూషన్లకు వెళ్లే బాలికల సంఖ్య 25 శాతం వరకూ ఉంటోంది.

ఇక ఇందులో 90 శాతం మంది విద్యార్థుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అయితే, ఫోన్లు ఉపయోగించే విషయంలో వీరెవరికీ సరైన అవగాహన లేదు. వారు ఎటువంటి జాగ్రత్తలనూ పాటించడం లేదు. ఈ సర్వేలో అన్నిటికన్నా ప్రధాన విషయం మీద మాత్రం నిపుణుల ఆసక్తి పెరుగుతోంది. 18 ఏళ్ల వయసు వచ్చినా అత్యధిక శాతం విద్యార్థుల్లో చదవడం చేతకాకపోవడం, గణిత శాస్త్రంలో కనీస అవగాహన లేకపోవడం వారికి ఆందోళన కలిగిస్తోంది. విద్యావ్యవస్థలోని లోపాలకు, లొసుగులకు ఇది అద్దం పడుతున్నట్టు వారు భావిస్తున్నారు. జాతీయ విద్యా విధానం (2020) ప్రకారం, 2025 నాటికి దేశంలో సంపూర్ణ అక్షరాస్యతతో పాటు, విద్యావంతుల సంఖ్య పెరగాల్సి ఉంది. ఆ లక్ష్యంతో దేశంలో ప్రభుత్వం సర్వత్రా విద్యాసంస్థలను పెంచడం, నిపుణ్ వంటి శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. అయితే, ప్రథమ్ వంటి సర్వే సంస్థల అధ్యయనంలో ఇందుకు భిన్నమైన ఫలితాలు వెలువడుతున్నాయి. అక్షరాస్యతను, విద్యా సంస్థలను పెంచడం ప్రశంసనీయమైన విషయమే కానీ, సాధారణ చదువులు పూర్తయిన తర్వాత కనీస అవగాహన లేని విద్యార్థులు తయారు కావడం ఎవరికైనా తప్పకుండా ఆందోళన కలిగిస్తుంది. ఉన్నత విద్యల్లో, ఉన్నత స్థాయి శిక్షణల్లో వారికి తగినంత ప్రతిభా పాటవాలు
కలగడం లేదు. వారు ఉన్నత స్థాయి విద్యను అర్థం చేసుకునే స్థితిలో కూడా ఉండడం లేదు. విద్యా హక్కు చట్టం పేరుతో 2009లో తీసుకు వచ్చిన చట్టంతో విద్యార్థులకు కొద్దిపాటి విద్య అబ్బితే అబ్బవచ్చు కానీ, ఉన్నత స్థాయి విద్యకు తగ్గట్టుగా వీరిని తీర్చిదిద్దనంత కాలం సంపూర్ణ విద్య వీరికి అందివచ్చినట్టుగా భావించలేం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News