రాష్ట్రంలో ఎన్నికల వేడితో రగిలిపోతున్న రాజకీయ పార్టీల నాయకులు అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచారంతో తెలంగాణ రాష్ట్రంల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎలాగైనా సరే ఈసారి జరిగే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని బిఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్ష పార్టీలు ముమ్మర ప్రచారంతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాయి.రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కొన్నాళ్లు వేచి చూస్తే తెలుస్తుంది. ఈసారి ఎన్నికల్లో ప్రజాకర్షణ పథకాలకు ప్రజలు ఓటు వేస్తారా? లేదా మద్యం,డబ్బుకు ప్రభావితం అవుతారా? లేదా నిజాయితీగల వ్యక్తులకు ఓటు వేస్తారా కొన్నాళ్లు వేచి చూస్తే తెలుస్తుంది. బహిరంగ సభలు నిర్వహిస్తూ అభివృద్ధి పథకాలను ప్రచారం చేస్తూ ఎన్నికల ప్రచారాలు మొదలుపెట్టింది బిఆర్ఎస్ పార్టీ.115 మందికి సిట్టింగ్లకే టికెట్లు ఇప్పటికే ప్రకటించారు కేసీఆర్. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచార హోరును కొనసాగిస్తున్నారు.
నేటి రాజకీయ వ్యవస్థలో వస్తున్న మార్పులను సగటు ఓటర్లు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. బడా వ్యాపారవేత్తలు మాఫియా గ్యాంగులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రత్యక్షంగా అందరికీ తెలిసినప్పటికీ రాజకీయ నాయకులు నేర చరిత్ర గల వ్యక్తులతో చేయి కలిపి అధికారమే పరమావధిగా రాజకీయ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో ధన బలం, కండబలం ప్రభావితం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చూపించే డబ్బుల ఆశకు ఓటర్లు ప్రలోపడతారు. ఒకవేళ ఓటర్లు మద్యం డబ్బుకు లొంగపోతే బెదిరింపులతో ఎలాగైనా సరే ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయించుకుంటారు. ఎదిరించ లేని ప్రశ్నించ లేని అమాయకులైన ప్రజలు తమ ఓటును అమ్ముకునే పరిస్థితి నేడు ఏర్పడింది. ఎన్నికలు జరిగినా అనంతరం తమ నాయకులు తమ తలరాతను మారుస్తారని ప్రజలు ఆశించినప్పటికీ ఆ దిశగా రాజకీయ నాయకులు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యరు. నాయకులు అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడి, కోట్లు సంపాదిస్తున్నారు. ఓటరు మాత్రం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తూ మౌనాన్ని పాటిస్తున్నారు. నేటి భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు క్యాన్సర్ సోనట్టు పరిస్థితి తయారైంది.
ఏ రాజకీయ పార్టీ లంచగొడితనాన్ని,అవినీతిని నిర్మూలిస్తామని ప్రజలకు వాగ్దానాలు చేయకపోవడం ఎంతో దురదృష్టకరం. దేశ జనాభాలో అధిక శాతం యువతరమే, నేటి యువతరం రేపటి విధాన నిర్మితలు, రాజకీయాల పట్ల ఓట్లను వినియోగించుకోవడం పట్ల నేటి యువతరం అంతగా ఆసక్తి కనబడటం లేదు రాజకీయాల పట్ల వ్యతిరేకత భావం పెరుగుతుంది ఎందుకంటే 90% రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అందుకే యువతరానికి రాజకీయాలంటే రోత పుడుతుంది. నిరాశ,నిస్పృహలతో రగిలిపోతున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని బట్టి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ రాజకీయాలను ప్రాంతీయ రాజకీయాలు శాసించే రీతిలో నేడు రాజకీయాలు నడుస్తున్నాయి. దీర్ఘకాలిక అభివృద్ధి పథకాలకు బదులు తాత్కాలిక జనాకర్షణ పథకాలకు ప్రాంతీయ పార్టీలు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో ప్రాంతీయ పార్టీలు ప్రజలకు చేరువ కావడం జరిగింది.
జాతీయ పార్టీలు ప్రజలకు కావలసిన జనాకర్షణ పథకాలను ప్రవేశ పెట్టినప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆ పథకాలను ప్రజలకు అందకుండా అడ్డుపడుతూ తమ పథకాలన్నీ ప్రజలకు చేరవేస్తూ ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఎన్నికలకు ముందు ఎన్నికల అనంతరం ప్రభుత్వ నిర్మాణంలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు శత్రువులుగా రంగంలో దిగితే ఎన్నికల అనంతరం మిత్రులుగా కలిసిపోతున్నారు చివరకు రాజకీయ పార్టీల దృష్టిలో ఓటర్లే శత్రువులనే భావన ఏర్పడుతుంది. ఓటర్లు ఎవరిని విశ్వసించాలో ఎవరిని విశ్వసించకూడదు తెలియని అయోమయంలో చిక్కుకొని పోయారు. రాజకీయాలలో దురదృష్టకర విషయం ఏమిటంటే వ్యక్తి ప్రాధాన్యతను బట్టి పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి తప్ప ప్రజల ప్రాధాన్యతను బట్టి జరగడం లేదు. ఒక రాజకీయ పార్టీలో అనేక సంవత్సరాలు ఉండి పార్టీని వదిలి రావడం అనేది ముసలి వయసులో విడాకులు తీసుకున్నట్లుగా ఉంటుందనే విషయాన్ని మన నాయకులు గ్రహించలేకపోవడం శోచనీయం. అందుకే సుప్రీంకోర్టు ఇటీవల తాము ఎన్నుకోబోయే అభ్యర్థుల పూర్వాపరాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని విషయాన్ని ప్రకటించింది. సాధారణంగా రాజకీయ పార్టీలు సిద్ధాంతపరంగా ఏర్పడితే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడం సులభం అవుతుంది. కానీ అది సిద్ధాంత ప్రాతిపదికగా విభజన జరగడం లేదు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తాము చేసిన అభివృద్ధిపైనే ఓట్లను కోరడం జరుగుతుంది. చివరికి ఓటర్లు నిరాశ చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటు వేయడం మాత్రమే అలవాటుగా ఏదైనా ఒక పార్టీకి ఓటు వేస్తారు.ఆ పార్టీ సిద్ధాంత సూత్రాలకే కట్టుబడి ఉంటారు. మరికొంత మంది ఏ రాజకీయ పార్టీ ఓటర్లు స్వచ్ఛమైన పారదర్శకతగల సమర్థవంతమైన ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఎందుకంటే అట్టి ప్రభుత్వం శాంతి, భద్రతలు కాపాడగలరని ప్రజల కనీస అవసరాలు తీర్చగలరని ఆర్థిక అభివృద్ధికి కృషి చేయగలరని భావిస్తాను.ఎన్నికైన ప్రతినిధులు సమర్థవంతులు కానట్లయితే వారిలో గుణగణాలు లోపించినట్లయితే అట్టివారిలో సమగ్రత లోపిస్తుంది.అలాంటి ప్రతినిధులు రాజ్యాంగ విలువలను రాజ్యాంగ స్ఫూర్తికి సమర్ధవంతంగా పనిచేయకుండా చూస్తారు.కుంభకోణాలకు అవినీతికి పాల్పడిన కూడా అదే పార్టీకి ఓటు వేసి గెలిపిస్తున్నారు.తప్ప ఎలాంటి మార్పును కోరుకోవడం లేదు. ఓటర్లు తమ ఓటును గోప్యంగా సాధ్యమైనంత వరకు తమకు నచ్చిన వారితో చర్చించుకోవచ్చు అలా చేయడం వల్ల తమ అభిప్రాయం ఇతరులకు తెలియజేసినట్లు అవుతుంది.తోటి వారితో బంధువులతో, స్నేహితులతో సంప్రదించడం మంచిది. ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే సిద్ధాంతానికి విలువకు ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఉండే అభ్యర్థులను ఎన్నుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎన్నికల్లో నిజాయితీగల, సమర్థవంతమైన అభ్యర్థులు లభించడం అంత తేలికైన విషయం కాదు.కాబట్టి ఓటర్లే వ్యక్తిగతంగా సమిష్టిగా నైనా,మీడియా సాయంతోనైనా సమర్థవంతులైన అభ్యర్థులను గుర్తించగలగాలి ఇది ఆచరణ సాధ్యం కాకపోయినా ప్రయత్నం చేయడంలో తప్పులేదు. ఎన్నికలలో ఓటు వేయడంతోనే తమ బాధ్యత అయిపోయింది అని భావించకూడదు. ప్రభుత్వంలో నిరంతరం భాగస్వామ్యం పంచుకొని ప్రజాస్వామ్యం విజయానికి సంక్షేమ పథకాలకు కృషి చేయాలి అప్పుడే రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయానికి లోబడి స్వచ్ఛమైన,పారదర్శకత ప్రభుత్వాన్ని అందించే అవకాశాలు ఉంటాయి ఓటర్లు స్వతంత్ర ఆలోచనతో ప్రజల పట్ల అంకితభావం గల బాధ్యతాయుత వ్యక్తులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్ పైనే ఉంది పౌరులకు ప్రేరణ కలిగించేది ఎన్నికలే? వచ్చే ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో నిజాయితీగా దేశ భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమర్ధవంతమైన నాయకులను ఎన్నుకొని చట్టసభలకు పంపించాల్సిన బాధ్యత పూర్తిగా ఓటరు దేవుళ్ళ పైన ఉంది.ఈసారి ప్రజలు ధనబలం,కండబలం,రౌడీయిజం,గుండాగిరి ప్రజాకర్షణ పథకాలకు లోను కాకుండా ఓటు వేస్తారా? లేదా అనేది కొద్దిరోజులు ఆగితే తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే పరిస్థితి లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు.