Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్Elections in North East: రంజుగా మారిన ఈశాన్య రాజకీయాలు

Elections in North East: రంజుగా మారిన ఈశాన్య రాజకీయాలు

ఈశాన్య రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా మొట్టమొదటిసారి చాలా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలతోపాటు నార్త్ ఈస్ట్ లోని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు చాలా చురుగ్గా మారాయి. ముఖ్యంగా తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాలపై గట్టి పట్టు బిగించే పనిలో బీజేపీతో తలపడుతోంది. ఓవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా రాగా, ఆప్ అనుసరించిన రోడ్ మ్యాప్ ఫాలో అవుతున్న తృణముల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఈశాన్యంలో ఖాతా తెరిచి, జాతీయ పార్టీ హోదా సంపాదించే పనిలో పడింది. ఈశాన్యంలో సత్తా చాటితేనైనా తనను ప్రధాని పదవికి సరైన అభ్యర్థిగా అన్ని పార్టీలు సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటాయని దీదీ తహతహలాడుతున్నారు. అంతేకాదు బీజేపీయేతర, కాంగ్రెస్సేతర పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఇదో సరైన అవకాశంగా దీదీ భావిస్తూ.. శ్రమిస్తున్నారు.

- Advertisement -

“నార్త్ ఈస్ట్ ఈజ్ ఎ గేట్వే టు సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ”.. అంటూ ఆసక్తికరమైన ఎన్నికల ప్రసంగాలు చేస్తున్న నరేంద్ర మోడీ ఎలాగైనా నార్త్ ఈస్ట్ పై పట్టు సాధించేందుకు గత 8 ఏళ్లుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా ఈశాన్యంపై బీజేపీ దృష్టిసారిస్తుండటం విశేషం. చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి ఈ రాష్ట్రాల్లోకి అక్రమంగా వలసలు వస్తుండటం, అక్రమంగా వీరంతా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, ఓటరు కార్డు సంపాదించుకుని స్థానికులుగా చలామణి అవుతున్నారు. అయితే ఇక్కడ కమలనాథులకు కలిసొస్తున్న అతిపెద్ద అంశం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పాతుకుపోయింది. దీంతో ఓటర్లకు చేరువయ్యేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ ను సంఘ్ పరివార్ బీజేపీకి కోసం సిద్ధం చేస్తోందన్నమాట. ఇక ప్రధాని హోదాలో పదేపదే నార్త్ ఈస్ట్ ‘సెవెన్ సిస్టర్స్’ ను తన ప్రసంగాల్లో ప్రస్తావించడంతోపాటు ఇక్కడికి వచ్చి పర్యటించటాన్ని మోడీ ఓ ఆనవాయితీగా పెట్టుకుని మిగతా ప్రాంతాలతో సమానంగా తాము ఈ ప్రాంతాలను చూస్తున్నట్టు చేతలతో చెబుతూ వచ్చారు. ఆర్గానిక్ ఫార్మింగ్, హాండీక్రాఫ్ట్స్ అంటూ మోడీ తన మాటల్లో తప్పకుండా ఈ రాష్ట్రాలను మెచ్చుకుంటూనే ఉంటారు. నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ (ఎన్ఈసీ) మీటింగ్ కు సైతం మోడీ హాజరవ్వటం విశేషం.

త్రిపుర, మేఘాలయా, నాగాల్యాండ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనుండటంతో మరోమారు అన్ని ప్రధాన పార్టీలు ఈశాన్యంపై తమ ప్రేమను ఒలకబోస్తున్నారు. త్రిపురలో పాగా వేసిన బీజేపీ 2018 ఎన్నికల్లో ఈశాన్యంపై తన పెత్తనాన్ని చాటుకుంది. ఇక్కడ మాణిక్ సర్కార్ ఆధ్వర్యంలో 20 ఏళ్లుగా సీపీఐ (ఎం) సర్కారు నడిచింది. కమ్యూనిస్టు కోటను బీజేపీ చిత్తుగా ఓటమిపాలు చేసి 35 స్థానాలతో తన సత్తా చాటుకుంది. కాకపోతే ఇక్కడ లెఫ్ట్, రైట్ పార్టీలకు మధ్య మిగిలిన ఓట్ షేర్ తేడా కేవలం 1.37శాతమే కనుక బీజేపీ ఈ విషయంపై కాస్త్ జాగ్రత్త ప్రదర్శిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ మూడవ స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. మరోవైపు త్రిపుర బీజేపీలో చెప్పలేనంత అసంతృప్తి సెగలున్నాయి. అందుకే 2018లో బిప్లబ్ దేబ్ సీఎం కుర్చీని అధిష్ఠించినా అసంతృప్తి ధాటికి సీఎంను మార్చింది బీజేపీ. బిప్లబ్ స్థానంలో మాణిక్ సాహాను సీఎం చేసింది. మళ్లీ అదే అసంతృప్తి రిపీట్ కావటంతో ఎటూ తోచని స్థితిలో బీజేపీ ప్రస్తుతం కొట్టుమిట్టాడుతోంది. ఇదంతా చాలదన్నట్టు ప్రభుత్వ వ్యతిరేకత త్రిపురలో చాలా ఉంది. కాబట్టి త్రిపుర బీజేపీకి ఇంటా బయట సమస్యలే సమస్యలన్నమాట.

స్థానిక ప్రాంతీయ పార్టీ అయిన ఇండీజినస్ ప్యూపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురతో బీజేపీ మంచి సంబంధాలు నెరుపుతోంది. అయితే ఐపీఎఫ్టీతో ఈ బంధాన్ని బీజేపీ కొనసాగిస్తుందా అన్న విషయంపై కమలనాథులు అధికారికంగా ఏ విషయం తేల్చటం లేదు. త్రిపుర బీజేపీ సంకీర్ణంలో ఐపీఎఫ్టీ కీలక పార్టీగా ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో ఈ సంకీర్ణం కొనసాగుతుందా అన్న సస్పెన్స్ ఇంకా వీడటం లేదు. త్రిపుర ప్రజల అలకను బీజేపీ ఎలా తీర్చుతుందన్నది కూడా ఆసక్తికరమే. ఎందుకంటే ఈ విషయంపైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయిమరి. ట్రైబల్స్ ఇక్కడ అధికార బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యే బుర్బా మోహన్ త్రిపురా తీప్రా మోథాలో చేరారు. ఇదంతా బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చింది. ట్రైబల్స్ మద్దతు లేకుండా త్రిపురలో అధికారంలోకి రావటం, అధికారం నిలుపుకోవటం అసాధ్యం. త్రిపురలో 2/3 వంతు ప్రజలు ట్రైబల్సే కావటంతో ఇప్పుడు ఈ తీప్రా మోథాను శాంతింపజేయటం అత్యవసరంగా మారింది. గతేడాది ఏప్రిల్ లో త్రిపురా ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ కౌన్సిల్ ఎన్నికల్లో తీప్రా మోథా విజయ దుందుభి మోగించిందికూడా. 28 మంది సభ్యులున్న ట్రైబల్ కౌన్సిల్ లో 20 స్థానాలు మోథావే కావటం విశేషం. ట్రైబల్స్ పార్టీ అయిన మోథా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి జతకడుతోంది. కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ పార్టీలు కూడా మోథాకు శృతి కలిపే అవకాశాలు లేకపోలేదు. దీంతో ట్రైబల్ ఓటర్స్ అంతా వీరిపక్షాన తరలివెళ్లే అవకాశం ఉండటం బీజేపీ గెలుపు అవకాశాలు ఘోరంగా దెబ్బతీసే సూచనలు కనిపిస్తున్నాయి.

మేఘాలయ రాష్ట్ర రాజకీయల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అతి పెద్ద పార్టీగా గత ఎన్నికల్లో ఆవిర్భవించింది. కానీ 60 మంది సభ్యులు గల మేఘాలయా అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం కేవలం 21 అంటే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కూడా గెలవ లేదు. దీంతో బీజేపీ ఇక్కడ కూటమిగా ఏర్పడింది. స్థానిక నేషనల్ ప్యూపుల్స్ పార్టీ (ఎన్పీపీ)తో జట్టు కట్టి కర్నాడ్ సంగ్మాను సీఎం చేస్తూ బీజేపీ సంకీర్ణం అధికారం చేపట్టింది. కానీ గత నెల్లో ఇరు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో అంటే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు సంగ్మా ప్రకటించేశారు. ఈలోగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసేసి సర్దుబాటు చర్యలు పరిగెత్తిస్తోంది. ఎన్పీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అప్పుడే బీజేపీలోకి జంప్ అయ్యారు కూడా. ఈ వలసలు ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది జస్ట్ రెండు స్థానాలు మాత్రమే. కానీ ఎలాగైనా సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయాలనే ఉబలాటంలో బీజేపీ ఉంది. హిమంతా బిస్వా శర్మ నార్త్ ఈస్ట్ డెమాక్రటిక్ అలయన్స్ (ఎన్ఈడీఏ) కన్వీనర్ గా వ్యవహరిస్తూ.. ఈశాన్య రాజకీయాలను ప్రభావితం చేస్తూ, శాసించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో 2015 నుంచి ఈశాన్య రాజకీయాలపై పట్టు పెరిగింది బీజేపీకి. 2015కు పూర్వం చాలా ఏళ్లు కాంగ్రెస్ లో ఉన్న హిమంతా బిశ్వా బీజేపీలో చేరడంతో ఈశాన్యంలో బీజేపీకి ఓ బలమైన ఊతం దొరికినట్టైంది. ఇక హిమంతా ఇక్కడ చక్రం తిప్పుతూ, సంకీర్ణాలనే అతుకుల బొంతులను ఎప్పటికప్పుడు రిపేర్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి మేఘాలయాకు పెద్ద ఎత్తున నిధులు అందాయి, ఎన్నికల నేపథ్యంలో మరిన్ని నిధులు ఈ రాష్ట్రానికే ప్రకటించే అవకాశం ఉంది. మేఘాలయ డెమాక్రటిక్ అలయన్స్ (ఎండీఏ) పేరుతో ఎన్పీపీ, బీజేపీ సర్కారు అధికారంలో ఉండగా తృణముల్ కాంగ్రెస్ నుంచి వీరికి గట్టి పోటీ ఎదురుకానుంది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టీఎంసీతో పాటు కాంగ్రెస్ కూడా బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్పటికే సన్నాహకాలు చేపట్టాయి.

మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. 40 స్థానాలున్న మిజోరంలో 26 స్థానాలు ఈ కూటమి చేతుల్లో ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కేవలం 5 సీట్లు గెలుపొందింది. కానీ మిజోరం కాంగ్రెస్ లోని నలుగురు కీలక వ్యక్తులు బీజేపీలో చేరిపోవటంతో ఇక్కడ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. మిజోరం అసెంబ్లీ స్పీకర్ బీజేపీలోకి ఫిరాయించారు. కాగా మొట్టమొదటిసారి ఇక్కడ బీజేపీ అకౌంట్ తెరిచి, ఓ స్థానం గెలిచింది. ఈసారి ఎలాగైనా ఇక్కడ గెలుపొందాలనే కసితో బీజేపీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. కానీ బీజేపీ, అధికార ఎంఎన్ఎఫ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నుంచి వలసలకు చెక్ పెట్టక తప్పని పరిస్థితుల్లో ఉంది. మిజో నేషనల్ ఫ్రంట్ ఎన్డీఏలో భాగస్వామి కాగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ వీరే అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాగాల్యాండ్ విషయానికి వస్తే నేషనలిస్ట్ డెమాక్రటిక్ ప్రొగ్రెస్సివ్ పార్టీ (ఎన్డీపీపీ) ఇక్కడ బీజేపీతో జత కట్టి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం హైలైట్. అంతేకాదు రాష్ట్రంలో అభివృద్ధి కూడా పరుగులు పెడుతుండటం మరో హైలైట్. వచ్చే ఏడాది ఎన్నికల్లోనూ వీరిద్దరూ కూటమిగానే బరిలోకి దిగుతూ బీజేపీ 20 స్థానాల్లో, ఎన్డీపీపీ 40 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. గత ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో సంఖ్యా బలాన్ని మరింత పెంచుకునే పనిలో కమలం పార్టీ నాగాల్యాండ్ లో కష్టపడుతోంది. ‘ఫ్రాంటియర్ నాగాల్యాండ్’ పేరుతో ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఏడు గిరిజన తెగలు ఇక్కడ పోరాడుతున్నాయి. దీంతో కేంద్రం వీరితోనూ చర్చలు జరుపుతూ, సానుకూలంగా స్పందిస్తూ ఎన్నికల ఫీట్లు చేస్తోంది.

ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన అంశాలంటే అభివృద్ధి, నిధులు, గిరిజన తెగల డిమాండ్లు. కొత్త రోడ్లు, టన్నెల్స్, బ్రిడ్జిలు నిర్మిస్తూ, పొరుగు దేశాల నుంచి భద్రతను కల్పిస్తూ, రైల్వేలు, విమాన ప్రయాణ సదుపాయాలను విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి చర్యలు చేపడుతోంది. పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలతోపాటు అస్సాం-మేఘాలయ, అస్సాం నాగాలాండ్, అస్సాం-మిజోరం సరిహద్దు వంటి సున్నితమైన సమస్యలు ఇక్కడ నిత్యం రావణకాష్టాన్ని రగిలిస్తూ ఈశాన్యంలో అశాంతిని సృష్టిస్తున్నాయి. ఇక్కడ తీవ్రవాదం కూడా పెద్దగా ప్రభావం చూపేది. కానీ కేంద్రం చేసిన తాజా ప్రకటన ప్రకారం గత 8 ఏళ్లుగా ఈ రాష్ట్రాల్లో తీవ్రవాదం 74శాతం తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. ఆఫ్సా వంటి చట్టాలను ఎత్తివేయాలంటూ గతంలో పెద్ద ఎత్తున హింస చెలరేగగా ప్రస్తుతం ఆఫ్సాను కేంద్రం జాగ్రత్తగా పరిశీలిస్తూ, అడుగులు వేస్తోంది. నాగా రెబెల్స్ 2015లో కేంద్రంతో చర్చలు సైతం జరిపారు. ఈశాన్యంలో అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది కానీ రాజకీయ సుస్థిరతతోనే ఏదైనా సాధ్యమవుతుందనే విశ్వాసంలో ఓటర్లు రావటంతో క్రమంగా పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి.

ఈశాన్య రాష్ట్రాలతోపాటు కర్నాటక, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు జరుగనున్నాయి. దీంతోపాటు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చే ఏడాది నిర్వహించే ఆలోచనలో కేంద్రం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 24 పార్లమెంట్ స్థానాలున్నాయి. వీటిలో బీజేపీ ఇప్పటికే 14 ఎంపీ స్థానాల్లో విజయం సాధించి, వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News