Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Elections-Manifestos: వచ్చేసింది మానిఫెస్టో ఫెస్టివల్‌

Elections-Manifestos: వచ్చేసింది మానిఫెస్టో ఫెస్టివల్‌

ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ప్రారంభమయ్యింది. హామీల వరదలు ప్రజలను తాకుతున్నాయి. అన్నీ పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. అసలు మేనిఫెస్టో అంటే ఏమిటి..? సుప్రీంకోర్టు మేనిఫెస్టోల విషయంలో ఇచ్చిన మార్గదర్శకాలు ఏమిటి..? మొదలైన వాటికోసం పరిశీలిద్దాం.
మేనిఫెస్టో అంటే?
ఎన్నికల మేనిఫెస్టోలు రాజకీయ పార్టీ ప్రాధాన్యతలను అర్థం చేసుకునేందుకు సంకేత సాధనాలుగా పనిచేస్తాయి. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ మానిఫెస్టోను రాజకీయ పార్టీ వంటి సమూహం విధానం మరియు లక్ష్యాల యొక్క బహిరంగ ప్రకటనగా నిర్వచిస్తుంది. మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీ యొక్క భావజాలం, ఉద్దేశాలు, అభిప్రాయాలు, విధానాలు మరియు కార్యక్రమాల ప్రకటనతో కూడిన ప్రచురించబడిన పత్రం అని చెప్పొచ్చు. ఎన్నికల మేనిఫెస్టోలు సాధారణంగా రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడతాయి. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలలోని సిద్ధాంతాలు, విధానాలు, కార్యక్రమాలను పోల్చడం ద్వారా ఓటర్లు తమ అంచనాలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారు.
ఇతర దేశాలలో మేనిఫెస్టోల పరిస్థితి
భూటాన్‌లో జాతీయ అసెంబ్లీ ఎన్నికల ప్రాథమిక రౌండ్‌కు ముందు రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టో కాపీని ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తాయి. ఎన్నికల సంఘం ఆమోదంతోనే ప్రజలకు మేనిఫెస్టోలు జారీ చేయబడతాయి. వీటిలో ఎక్కువగా పాలసీలు, అభివృద్ధి ప్రణాళికలు మరియు కార్యక్రమాలను గురించి ఉంటాయి. ఎన్నికల కమిషన్‌ ఎన్నికల మేనిఫెస్టోలను క్షుణ్ణంగా పరిశీలించి దేశ భద్రత మరియు స్థిరత్వాన్ని అణగదొక్కే అవకాశం ఉన్న సమస్యలను ఫిల్టర్‌ చేస్తుంది. మెక్సికోలో ఫెడరల్‌ ఎన్నికలకు అభ్యర్థులను నామినేట్‌ చేయడానికి అర్హత పొందాలంటే ఫెడరల్‌ ఎలక్టోరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ మరియు ధ్రువీకరణ కోసం పార్టీ తప్పనిసరిగా ఎన్నికల వేదికను సమర్పించాలి. ఇందులో తప్పనిసరిగా రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక సమస్యలపై పార్టీలు సమర్థించే సూత్రాలు, ప్రతిపాదనలను కలిగి ఉంటాయి. భూటాన్‌ మరియు మెక్సికోలో, ఎలక్టోరల్‌ అథారిటీలకు మ్యానిఫెస్టోలను పరిశీలించడానికి మరియు నిర్దిష్ట రకాల కంటెంట్‌ను తీసివేయడానికి అధికారం ఉంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎన్నికల అథారిటీ ప్రచార సామాగ్రి కోసం మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఇది మ్యానిఫెస్టోలకు కూడా వర్తిస్తుంది. యునైటెడ్‌ స్టేట్స్‌, స్వీడన్‌, కెనడా, నెద ర్లాండ్స్‌ ఆస్ట్రియా వంటి ప్రధాన ప్రజాస్వామ్య దేశాలలో మ్యానిఫెస్టోలకు సంబంధించి ఎలక్టోరల్‌ అథారిటీలకు ఎటువంటి పాత్ర లేదు. యునైటెడ్‌ స్టేట్స్‌లో రాజకీయ పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల స్వభావం విధాన ఆధారితమైనది, సాధారణంగా ఆర్థిక విధానం, విదేశాంగ విధానం, ఆరోగ్య సంరక్షణ, పాలనా సంస్కరణలు, పర్యావరణ సంబంధిత అంశాలు, జనాభా యొక్క పెద్ద సమూహాలకి ప్రయోజనం కలిగించే ప్రణాళికలు మరియు విధానాలను వివరిస్తాయి. అనేక పశ్చిమ యూరోపియన్‌ దేశాలలో, మేనిఫెస్టోలు మరింత నిర్దిష్టమైన విధాన ఎంపికలను అలాగే వాటి బడ్జెట్‌ చిక్కులను ప్రస్తావిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు, పార్టీలు తమ మేనిఫెస్టోలకు ఆర్థిక పేరాగ్రాఫ్‌లను కూడా జోడిస్తాయి, వీటిని కోర్ట్‌ ఆఫ్‌ ఆడిట్‌కు సమర్పించవచ్చు. యునైటెడ్‌ స్టేట్స్‌లో సాధారణంగా రాజకీయ పార్టీ ప్లాట్‌ ఫారమ్‌ల గురించి ఎలాంటి నిబంధనలను కలిగి ఉండవు. అయితే యునైటెడ్‌ కింగ్‌డమ్‌, నెదర్లాండ్స్‌ దేశాలలో అప్రియమైన ప్రచార అంశాలకు వర్తించే చట్టపరమైన నిబంధనలు మ్యానిఫెస్టోల కంటెంట్‌కు కూడా వర్తిస్తాయి.
సుప్రీంకోర్టు ఆదేశాలు
మనదేశంలో 1952 సంవత్సరం నుంచి ఎన్నికలు జరుగుతున్నా కానీ ప్రధాన రాజకీయ పార్టీలు తప్పా అన్నీ రాజకీయపార్టీలు తప్పనిసరిగా మ్యానిఫెస్టోలను విడుదల చేసేవి కావు. ఇటీవలి సంవత్సరాలలో అనేక జాతీయ, రాష్ట్ర పార్టీలు ప్రతీ సార్వత్రిక ఎన్నికలకు తమ మేనిఫెస్టోలను ప్రచురిస్తున్నాయి. అన్ని రాజకయ పార్టీలు లేదా వ్యక్తుల మేనిఫెస్టోలలో ఇంచుమించుగా ప్రజలకు సమగ్ర సామాజిక భద్రత కల్పించడం, నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయ రుణాల మాఫీ, వృద్ధులకు, వితంతువులకు, మరియు నిస్సహాయ రైతులకు పెన్షన్‌ పథకం, రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడం, పేదలకు వైద్య సంరక్షణతో పాటుగా దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలుకు, సమాజంలోని బలహీన వర్గాలుకు, మహిళలకు, వికలాంగులకు మొదలైన వారికి ప్రత్యేక పథకాలు కల్పించడం వంటి వివిధ అంశాలను కలిగి ఉంటున్నాయి. యస్‌.సుబ్రమణ్యం బాలాజీ వెర్సెస్‌ తమిళనాడు ప్రభుత్వం కేసులో 5 జూలై 2013న గౌరవ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సంప్రదించి ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలకు మార్గదర్శకాలను రూపొందించాలని తన తీర్పులో ఆదేశించింది. మార్గదర్శకాలను రూపొందించడానికి మార్గదర్శక సూత్రాలను తెలిపింది. ‘ఎన్నికల మ్యానిఫెస్టోలోని వాగ్దానాలను ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123 ప్రకారం అవినీతి ఆచరణగా భావించలేమని చట్టంలో స్పష్టంగా ఉన్నా ఏ రకమైన ఉచితాల పంపిణీ అయినా నిస్సందేహంగా ప్రజలందరినీ ప్రభావితం చేస్తుందనే వాస్తవాన్ని తోసిపుచ్చలేమని, ఇది స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నికల మూలాన్ని పెద్ద స్థాయిలో కదిలిస్తుందని, ఎన్నికల ప్రక్రియ యొక్క స్వచ్ఛత దెబ్బతినకుండా చూసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి లభించిన అధికారాల ద్వారా గతంలో మోడల్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆదేశాలు జారీచేసిందని, రాజకీయ పార్టీలు ఎన్నికల తేదీని ప్రకటించకముందే తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారనే వాస్తవాన్ని గౌరవ సుప్రీంకోర్టు గుర్తించిందని, ఎన్నికల ప్రకటనకు ముందు చేసే ఏ చర్యనైనా నియంత్రించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉన్న ప్పటికీ ఎన్నికల మేనిఫెస్టో యొక్క ఉద్దేశ్యం నేరుగా ఎన్ని కల ప్రక్రియతో ముడిపడి ఉన్నందున ఈ విషయంలో మిన హాయింపు ఇవ్వవచ్చని ‘ సుప్రీంకోర్టు తెలిపింది.
ఎన్నికల సంఘం సూచనలు
గౌరవ సుప్రీం కోర్టు యొక్క ఆదేశాలను స్వీకరించిన తరువాత ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వ హించి వారి వైరుధ్య అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న పిదప స్వేచ్ఛాయుత మరియు నిష్పక్షపాత ఎన్నికల ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంటు లేదా రాష్ట్రానికి ఏదైనా ఎన్నికల కోసం ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేసేటప్పుడు పాటించవలసిన నియమాలను ప్రవర్తనా నియమావళిలో 8 వ భాగంలో మేనిఫెస్టోను చేర్చుతూ 2015 ఏప్రిల్‌ 24న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల్లో… ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదర్శాలు మరియు సూత్రాలకు విరుద్ధంగా ఏవీ ఉండకూడదని, మరియు మోడల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఇతర నిబంధనల స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలని, రాజ్యాంగంలో పొందుపరచబడిన రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు పౌరుల కోసం వివిధ సంక్షేమ చర్యలను రూపొందించాలని రాష్ట్రాన్ని ఆదేశిస్తున్నాయి కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలలో అటువంటి సంక్షేమ చర్యల వాగ్దానానికి ఎటువంటి అభ్యంతరం ఉండదని, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియ యొక్క స్వచ్ఛతకు భంగం కలిగించే లేదా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓటర్లపై అనవసరమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్న వాగ్దానాలు చేయడం మానుకోవాలని, మ్యానిఫెస్టోలు వాగ్దానాల హేతుబద్ధతను కలిగి ఉండాలని, నెరవేర్చడానికి సాధ్యమయ్యే హామీలపైనే ఓటర్ల విశ్వాసాన్ని కోరాలని, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 126 ప్రకారం నిర్దేశించినట్లు నిషేధిత కాలంలో మేనిఫెస్టో విడుదల చేయకూడదని, ఒకేవిడత ఎన్నికల విషయంలో పోలింగ్‌కు ముందు అమలుచేసే నిషేధాజ్ఞల కాలవ్యవధిలో మేనిఫెస్టోలు ప్రకటించరాదని, ఒకటికంటే ఎక్కువ విడతల్లో ఎన్నికలు జరిగితే ప్రతి విడత పోలింగ్‌కు ముందు ప్రకటించే నిషేధాజ్ఞల వ్యవధిలో మేనిఫెస్టోలు విడుదల చెయ్యకూడదని, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన మూడు రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి రాజకీయ పార్టీలు అభ్యర్థులు తప్పనిసరిగా ఆంగ్ల, హిందీ భాషల్లో మూడు ప్రతులు సమర్పించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని 8వ భాగంలో పేర్కొన్న విధి విధానాలకు అనుగుణంగానే మేనిఫెస్టోలో హామీలు, కార్యక్రమాలు, విధానాలు పొందుపర్చినట్టు డిక్లరేషన్‌ సైతం మేనిఫెస్టోతో పాటు ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎన్నికల కమీషన్‌ తెలిపింది. ఇంకా రాజకీయపార్టీల ఎన్నికల మేనిఫెస్టోలను భవిష్యత్‌ అవసరాల కోసం ఎన్ని కల సంఘం భద్రపరుస్తుందని 2016 డిసెంబర్‌ 27న ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వులలో తెలిపింది.
జనక మోహన రావు దుంగ

  • 8247045230
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News