స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో ఎన్నికల ఖర్చు చాలా తక్కువగా ఉండేది. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నవారు ఎక్కువగా ఎన్నికల బరిలో దిగడం దీనికి ఒక కారణం కావచ్చు. సమరయోధులుగా వారికి ఉన్న పేరును చూసి ప్రజలు ఓట్లేశారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు అప్పట్లో ఉండేవి కావు. అయితే ఇదంతా గతం. కాలం గడిచేకొద్దీ ఎన్నికల రూపు రేఖలు మారిపోయాయి. ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టడం అనేది ఒక ప్రధాన అంశంగా మారింది. డబ్బులు ఖర్చు పెట్టలేని వ్యక్తి ఎన్నికల్లో పోటీకి పనికిరాడన్న అభిప్రాయం రాజకీయ పార్టీల్లో నెలకొంది. ఎన్నికలంటేనే డబ్బు సంచులతో పని అనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో బలంగా నాటుకుంది. ఒక్క వామపక్షాలను మినహాయిస్తే అన్ని పార్టీల అభ్యర్థులు ఎక్కడ్నుంచి పోటీ చేసినా విచ్చల విడిగా సొమ్ములు వెదజల్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
1962 వరకు కనిపించని డబ్బు ప్రస్తావన
మనదేశంలో 1962 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డబ్బు ప్రస్తావనే రాలేదు. అప్పటివరకు ఎన్నికల్లో డబ్బు ఒక అంశమే కాదు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ రాజకీయాల్లో విలువల పతనం మొదలైంది. దీంతోపాటు రాజకీయాల్లో ధనప్రవాహం పెరిగింది. సామాన్య ప్రజల నుంచి ఎదిగి రావాల్సిన నాయకులు లిక్కర్ మాఫియా, ల్యాండ మాఫియా, శ్యాండ్ మాఫియా నుంచి రావడం మొదలైంది. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే నాయకుల స్థానంలో అవినీతితో సొమ్ములు పోగేసుకున్న నియో రిచ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మొదలైంది. ఇలా అవినీతితో వందలు, వేల కోట్ల రూపాయలు కూడబెట్టిన వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపడం దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఎక్కువైంది. పార్టీ టికెట్ కోసం ఆయా పార్టీల అధినేతలకు భారీగా సొమ్ములు అందచేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం యాభై నుంచి వంద కోట్లు ఖర్చు పెడుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ప్రతి రోజూ వందల మందితో అభ్యర్థులు ర్యాలీలు ఏర్పాటు చేస్తున్నారు. అలా ఇలా కాదు…. భారీ ర్యాలీలు. ర్యాలీ ఎంత భారీగా ఉంటే పొలిటికల్ సర్కిల్స్‌లో అంత క్రేజ్. ర్యాలీల్లో పాల్గొన్న వారికి బిర్యానీ పొట్లాలు, లిక్కర్ బాటిల్స్, బేటా కింద సొమ్ములు అందచేయడం సర్వసాధారణమైంది. దీంతో పాటు పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ గల్లీ నాయకులను పట్టుకుని హోల్ సేల్‌గా అందరి ఓట్లు వేయించాలని కోరుతూ భారీ ఎత్తున డబ్బులు అందచేసే ప్రక్రియ మొదలైంది.
తనిఖీల్లో పెద్ద ఎత్తున బయటపడుతున్న నోట్ల కట్టలు!
ఎన్నికల ప్రచార సమయంలో వాహనాల తనిఖీల్లో పెద్దఎత్తున నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. కోట్ల రూపాయల నగదు అలాగే లిక్కర్ బయటపడుతోంది. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా జరుగుతున్నదే. అయితే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన సొమ్ములు పంపిణీ చాలా ఎక్కువగా జరుగుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బరిలో ఉన్న అభ్యర్థి ఎవరైనా సరే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. టికెట్లు ఇచ్చేటప్పుడు రాజకీయ పార్టీల వైఖరి కూడా మారింది. గతంలో క్యాండిడేట్ కు ప్రజల్లో ఉన్న పరపతి, వ్యక్తిగత ఇమేజ్, సమస్యల పరిష్కారంలో సామర్థ్యం…ఇదే టికెట్లు ఇవ్వడానికి ప్రామాణికంగా ఉండేవి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టగలిగేవాళ్లకే రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. సహజంగా టికెట్ ఆశించే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. దీంతో టికెట్ ఆశించేవాళ్లను విడివిడిగా పిలిపించి, ఎంత ఖర్చు పెట్టగలవు అని సూటిగా ప్రశ్నించే దుర్మార్గమైన సంప్రదాయం రాజకీయాల్లో మొదలైంది. వందల కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఆ తరువాత అదే రేంజ్ లో అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి పనికీ ఓ రేటు పెట్టి సొమ్మలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపునకు అయిన ఖర్చును రాబట్టుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా అవసరమైన సొమ్ములను సంపాదించుకోవడంలో రాజకీయ నేతలు బిజీ అయిపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల అఫిడవిట్‌లో కనిపించని అసలు ఖర్చు
వాస్తవానికి ఎన్నికల ఖర్చుకు సంబంధించి కఠినమైన చట్టాలే ఉన్నాయి. ఎన్నికల ఖర్చు ఎంతయింది అనే విషయాన్ని అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. అయితే అఫిడవిట్ లో రాజకీయ నేతలెవరూ అసలు ఖర్చు చూపించడం లేదు. తూతూమంత్రంగా అంకెలు వేసి మమ అనిపిస్తున్నారు. దీంతో చట్టాన్ని కూడా రాజకీయ నేతలు ఉల్లంఘించినట్లవుతోంది. ఎన్నికల ఖర్చుపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘాను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ఖర్చు కింద నేతలు పెట్టే ఖర్చును కూడా సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలి. అప్పుడే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టడం పూర్తిగా కాకపోయినా కొంత మేరకైనా సాధ్యమవుతుంది.
ఎస్, అబ్దుల్ ఖాలిక్
సీనియర్ జర్నలిస్ట్
63001 74320