Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Emerging New politics: సరికొత్త రాజకీయ సమీకరణం

Emerging New politics: సరికొత్త రాజకీయ సమీకరణం

దేశ రాజకీయాల్లో ప్రస్తుతం వ్యక్తిగత కక్షలు, ప్రతీకారాలే తప్ప ‘సైద్దాంతిక విభేదాలు’ ఉండడం లేదు. రాజకీయ పక్షాలు అనేసరికి వైరి పక్షాలుగానే మారిపోతున్నాయి. రాజకీయ అవసరాలకు మాత్రమే ‘మిత పక్షాలు.’ పొత్తులు లేని పక్షంలో ప్రత్యర్థులుగానే కయ్యానికి కాలు దువ్వుతుంటాయి. అయితే, ఈ ధోరణి నుంచి బీజేపీ కొద్ది కొద్దిగా బయటపడుతున్నట్టు కనిపిస్తోంది. తమకు కేవలం ఉత్తర ప్రదేశ్‌లోనే కాక, జాతీయ స్థాయిలో కూడా బద్ధ శత్రువు, ప్రత్యర్థి పక్షమైన సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు ‘ములాయం సింగ్‌ యాదవ్‌కు పద్మ విభూషణ్‌’ అవార్డు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంది. ఉత్తర ప్రదేశ్‌ ప్రజల మనసులను చూరగొనడం కోసమో అయితే, బీజేపీకి ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎదురు లేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ ప్రజల అభీష్టానికి తగ్గట్టుగానే పరిపాలన సాగిస్తున్నారు. అందువల్ల ఈ రాష్ట్రంలో ములాయంకు పద్మ విభూషణ్‌ ఇవ్వడం ద్వారా అది కొత్తగా సాధించేదేమీ లేదు.
నిజానికి, ఇక్కడ అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావచ్చింది. ఓబీసీలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ బీజేపీ పట్ల అంత సానుకూలంగా కూడా ఏమీ లేరు. ఒకప్పుడు కర సేవకుల మీద కాల్పులు జరిపించిన వ్యక్తిగా ములాయం బీజేపీకి మొదటి నుంచీ బద్ద శత్రువు. ఆయనను బీజేపీ నాయకుల్లో చాలా మంది ఇప్పటికీ, ఎప్పటికీ క్షమించరు. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఇటీవల ఒక సందర్భంలో, నాకు, ములాయంకు మధ్య స్నేహ సంబంధాలు కొనసాగాయి. ఆయనను చాలా విషయాల్లో సంప్రదించాను. ఆయనతో అనేక విషయాలు చర్చిస్తూ ఉండేవాడిని. నేను ఆయన మాటకు విలువనిచ్చాను అంటూ ట్వీట్‌ చేశారు. మొత్తం మీద ములాయం సింగ్‌ యాదవ్‌కు సంబంధించి నంత వరకూ బీజేపీ వైఖరిలో ఎంతో తేడా వచ్చిందనిపిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాలని 1980లో బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నప్పుడు ఆ లక్ష్యం నెరవేరకుండా అడుగడుగునా అడ్డుపడింది ములాయమే.
ముస్లింలను బుజ్జగించడంలో దేశంలో ములాయం ను మించినవారు లేరంటే అతిశయోక్తి ఏమీ లేదు. బీజేపీ నాయకులు కొందరు ఆయనను ‘ముల్లా ములాయం’ అనే సంబోధించేవారు. 1990లో కరసేవ కుల మీద సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం కాల్పులు జరిపిన విషయాన్ని 2022 శాసనసభ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రస్తావించి ములాయంను దుయ్యబట్టింది. ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని రాజకీయ పక్షాల నాయకుల అభిప్రాయం ఏమిటంటే, రాష్ట్రంలో ఓబీసీల పట్ల బీజేపీ వైఖరి కొద్ది కొద్దిగా మారు తోంది. ఆ నేపథ్యంలోనే ములాయం పట్లా, ఆయన పార్టీ పట్లా ఈ పార్టీ సానుకూలంగా వ్యవహరిస్తోంది.

- Advertisement -

ఇక రామమందిర సమస్య పాతబడిపోయింది. దీని లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు కొత్త ప్రచారాంశాన్ని, రాజకీయంగా ఉపయోగపడే అంశాన్ని వెతుక్కోవాలి. అందుకని బీజేపీ ఓబీసీలను ఆకట్టుకునే పనిలో పడింది అని స్థానిక పత్రికలు వ్యాఖ్యానించాయి. సానుకూల వైఖరి గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో ములాయం తన నియోజకవర్గమైన మెయినప్పురి నుంచి ఒక ప్రకటన చేస్తూ, తనకు ఇక్కడ నుంచి పోటీ చేయడం ఇదే చివరిసారని చెప్పారు. అయితే, ఆయన పట్ల గౌరవ సూచకంగా బీజేపీ అక్కడ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. దాంతో ఆయన అత్యధిక మెజారిటీ అక్కడి నుంచి విజయం సాధించారు. అంతేకాదు, ములాయం ఆస్పత్రిలో చివరి దశలో ఉన్నప్పుడు కూడా మొదటగా అక్కడికి వెళ్లి ఆయనను పలకరించింది హెూం మంత్రి అమిత్‌ షా. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ మర్యాదలతో నిర్వహించడం కూడా జరిగింది. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ములాయం ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తామెంత సన్నిహితంగా మెలిగిందీ నరేంద్ర మోదీ అప్పట్లో ట్వీట్‌ చేశారు. గత ఏడాది అక్టోబర్లో ఆయన కాలధర్మం చెందినప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్‌ నాయకత్వం అఖిల భారత కార్యకారీ మండల్‌ సమావేశం జరిపి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. ములాయం సింగ్‌ మరణం తర్వాత మెయిన్‌పురిలో ఉప ఎన్నికలు అవసరమైనప్పుడు, ఎన్నికల పచార సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మొదటగా ములాయం సింగ్‌కు నివాళులు అర్పించారు. అంతేకాదు, ప్రచారంలో అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి ఒక్క మాట కూడా మాట్లాడ లేదు.
ఇటీవల లక్నోలో బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశం జరిగినప్పుడు కూడా ములాయం సింగ్‌కు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. రాష్ట్రంలోని యాదవులను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని ఓబీసీలలో ఎక్కువ శాతం మంది యాదవులే. వారంతా ఎక్కువగా సమాజ్వాదీ పార్టీకే మద్దతునిస్తున్నారు. అయినప్పటికీ బీజేపీ పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా యాదవ కులానికి చెందిన వారికి రాజ్యసభలో, శాసనమండలిలో సభ్యత్వం ఇస్తూ వస్తోంది. వారిలో కొంత మందికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. ములాయం సింగ్‌ కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌, సోదరుడు శివపాల్‌ సింగ్‌ యాదవ్ల మధ్య పొరపచ్చాలు ఉండడంతో దీనిని అవకాశంగా తీసుకుని లబ్ధి పొందాలని కూడా బీజేపీ ప్రయత్నించింది. కాగా, ఈ మధ్య శివపాల్‌ సింగ్‌, అఖిలేష్లు కలిసిపోయారు. మెయిన్‌పురి ఉప ఎన్నికల్లో కూడా ఓబీసీలు ఎక్కువగా అఖిలేశ్‌ వైపే ఉన్నట్టు తేలిపోయింది. పైగా యాదవేతరులు కూడా ఆయన వైపే మొగ్గు చూపడం కనిపించింది.
అడకత్తెరలో అఖిలేశ్‌
ఇది ఇలా ఉండగా, అఖిలేశ్‌ ఒక విధంగా అడకత్తెరలో చిక్కుకున్నట్టుగా బీజేపీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. అఖిలేశ్‌ తప్పనిసరిగా పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని, అది స్వీకరించని పక్షం లో యాదవులకు దూరం కావడం జరుగుతుందని బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. తన తండ్రి జీవించి ఉండగా ఏనాడూ బీజేపీ ప్రభుత్వం ఒక్క అవార్డు ఇచ్చిన పాపాన పోలేదని, యాదవుల మధ్య చీలికలు తీసుకు రావడానికే బీజేపీ ఈ ఎత్తులు వేస్తోందని అఖిలేశ్‌ వాదించా ల్సిన పరిస్థితి వస్తుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. కాగా, కొందరు యాదవ నాయకులు మాత్రం ములాయం సింగ్‌కు భారతరత్న పురస్కారమిస్తే తామంతా సంతోషించే వారమని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ములాయం సింగ్‌ అందించిన సేవలకు పద్మవిభూషణ్‌ సరైన గుర్తింపేనని శివపాల్‌ యాదవ్‌ అన్నారు. ఆయనకు బీజేపీ ప్రభుత్వం పద్మ విభూషణ్‌ అవార్డు ఇవ్వడంలో తమకెటువంటి రాజకీయాలు కనిపించడం లేదని కూడా ఆయన అన్నారు.
కాగా, ఉత్తర ప్రదేశ్‌ బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్‌ విలేఖరులతో మాట్లాడుతూ, ములాయం సింగ్కు అవార్డు ఇవ్వడాన్ని గట్టిగా సమర్థించారు. తమ దృష్టిలో రాజకీయాలు, వ్యక్తిగత స్నేహాలు వేరు వేరని, తాము ములాయంతో రాజకీయంగా విభేదించినప్పటికీ, ఆయన సేవలను విస్మరించలేము అని చంద్రమోహన్‌ వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ములాయం సింగ్‌ యాదవ్‌ లోక్‌సభలో మాట్లాడుతూ, పార్లమెంట్ను మోదీ నిర్వహిస్తున్న తీరు, పాలన సాగిస్తున్న తీరు నాకెంతో నచ్చింది. మోదీ సమర్థుడైన నాయకుడనడంలో సందేహం లేదు. ఆయనే మళ్లీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను అని అన్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. కర సేవకులపై కాల్పు లు జరిపిన సంఘటన జరిగినప్పుడు అఖిలేశ్‌ అధికారంలో లేరని, ఆయన రాజకీయాల్లో కూడా లేరని, అందువల్ల ఇప్పుడు కర సేవకులపై కాల్పుల విషయాన్ని ప్రస్తావించి ప్రయోజనం లేదని శివపాల్‌ సింగ్‌ పేర్కొన్నారు. మొత్తానికి ఇరు పార్టీల నాయకులు గతం గతః అనుకుంటున్నట్టు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News