Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్EV vehicles: వేగం పుంజుకోని విద్యుత్‌ వాహనాలు

EV vehicles: వేగం పుంజుకోని విద్యుత్‌ వాహనాలు

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల కన్నావిద్యుత్‌ వాహనాల మనుగడ ఎక్కువ

ఆటోమొబైల్‌ మార్కెట్లో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేకానేక ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ భారతదేశం విద్యుత్‌ వాహనాల విషయంలో మాత్రం వేగం పుంజుకోలేకపోతోంది. నిజానికి, విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి దారులు భారత్‌ మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఉన్నారు. కానీ, ఇతర మార్కెట్లతో సమానంగా ఇది ఊపందుకోలేకపోతోంది. ఎస్‌ అండ్‌ పి గ్లోబల్‌ రేటింగ్‌ ప్రకారం, గత 12 నెలల కాలంలో దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి కానీ, వీటి మొత్తం అమ్మకాలు ఇతర వాహనాలతో పోలిస్తే రెండు శాతం కూడా లేదు. దేశంలో పెద్ద ఎత్తున విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టాలని కొందరు ఉత్పత్తిదారులు ఎదురు చూస్తున్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఈ వాహనాల జాడ ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి, బ్యాటరీలు, చార్జర్ల ఉత్పత్తిలో భారత్‌ చాలావరకు వెనుకబడి ఉంది.
ఈ రంగానికి అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఎన్నో రాయితీలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, వెసులుబాట్లు, సౌకర్యాలు ప్రకటించింది. దేశంలో విద్యుత్‌ వాహనాల ప్రవేశాన్ని సుగమం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ, ఈ రంగం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. కేంద్రం ఇటీవల ఫేమ్‌ ఇండియా అనే పథకాన్ని ప్రకటించింది. ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్‌ ఈవీస్‌ అనే ఈ పథకం కింద పన్ను రాయితీలు కల్పించింది. ఉత్పత్తితో అనుసంధానం చేసిన ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. అనేక విధాలుగా ఈ పరిశ్రమకు బ్రహ్మరథం పట్టింది. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని బాగా తగ్గించి, ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని 2015లోనే ప్రవేశ పెట్టింది. ఇటువంటి వాహనాలు కొనుగోలు చేసినవారికి కూడా ప్రోత్సాహకాలు ప్రకటించింది.
కాగా, 2021లో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ఒక సమగ్ర విధానాన్ని రూపొందించింది. ఈ విధానం కింద బ్యాటరీలు, చార్జర్ల ఉత్పత్తిని చేపట్టడంతో పాటు విద్యుత్‌ వాహనాలను తమ అధీనంలోకి తీసుకోవడం ఈ విధానం లక్ష్యం. 2025 నాటికి మొత్తం వాహనాల అమ్మకాలలో విద్యుత్‌ వాహనాల అమ్మ కాలను 10 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. నిజానికి, వాహనాల అమ్మకాల్లో మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో ఉంది. నాలుగు చక్రాల వాహనాలకు, ద్విచక్ర వాహనాలకు సంబంధించినంత వరకూ మహారాష్ట్రలో దేశంలో అతి ఎక్కువగా 17 శాతం అమ్మకాలు జరుగుతున్నాయి. గత వారం తమిళనాడు ప్రభుత్వం విద్యుత్‌ వాహనాలకు అయ్యే విద్యుత్‌ చార్జీలను యూనిట్‌ కు 12 రూపాయల నుంచి ఆరు రూపాయలకు తగ్గించింది.
నగరాల్లో విద్యుత్‌ వాహనాలు ఎక్కువ ఏళ్ల పాటు తిరగడానికి వీలుంటుంది. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల కన్నావిద్యుత్‌ వాహనాల మనుగడ కాలం ఎక్కువగా ఉంటుంది. విచిత్రమేమిటంటే, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నప్పటికీ, తక్కువ వ్యయమయ్యే విద్యుత్‌ వాహనాలకు మళ్లడానికి వినియోగదారులు సంకోచించడం జరుగుతోంది. విద్యుత్‌ వాహనాలను కొనుగోలు చేయాలన్న పక్షంలో చాలినంత చార్జింగ్‌ పరికరాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించా లన్న పక్షంలో ఇందుకు అవసరమైన రవాణా వ్యవస్థలను కూడా మెరుగుపరచాల్సి ఉంటుంది. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల నుంచి విద్యుత్‌ వాహనాలకు మళ్లడానికి వాహన దార్లకు ఎదురవుతున్న సమస్యలను అధ్యయనం చేయడం చాలా మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News