Prafulla Chandra Ray: సుప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు మరియు తొలి ఆధునిక భారతీయ రసాయన పరిశోధకులలో ఒకరైన ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే భారతదేశ “రసాయన శాస్త్ర పితామహుడిగా” ప్రఖ్యాతిగాంచారు. తన అద్భుతమైన ప్రతిభ కారణంగా, ఆయనకు 1882లో ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో ఫెలోషిప్ లభించింది. అక్కడ ఆయన బి.ఎస్. మరియు పిహెచ్.డి. పట్టాలు పొందారు. సేంద్రీయ రసాయన శాస్త్రం (ఆర్గానిక్ కెమిస్ట్రీ) బాగా ప్రాచుర్యంలో ఉన్న రోజుల్లో, ఆయన అసేంద్రీయ రసాయన శాస్త్రాన్ని (ఇనార్గానిక్ కెమిస్ట్రీ) అభ్యసించారు. సల్ఫేట్లు, నైట్రైట్‌ల వంటి ఖనిజ లవణాలలో నిపుణుడయ్యారు. భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన 1889లో కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలోని కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తాత్కాలిక పదవి చేపట్టారు. భారతీయుడు అన్న వివక్ష కారణంగా ఇంపీరియల్ ఎడ్యుకేషనల్ సర్వీస్‌లో ఆయనకు ఉద్యోగం దక్కలేదు. దీనిని ఆయన బహిరంగంగా తీవ్రంగా వ్యతిరేకించారు. జీవితాంతం కరడుగట్టిన జాతీయవాదిగా ఉన్నప్పటికీ, దురదృష్టవశాత్తు ఆయన భారత స్వాతంత్ర్యాన్ని కళ్ళారా చూడలేకపోయారు.
భారతీయ రసాయన శాస్త్రానికి రే సేవలు: రేను విశ్వవ్యాప్తంగా ఆధునిక భారతీయ రసాయన శాస్త్ర పితామహుడిగా కీర్తిస్తారు. ఆయన ప్రాథమిక పరిశోధన, భారతదేశపు మొట్టమొదటి రసాయన పరిశోధన పాఠశాల స్థాపన, మరియు స్వదేశీ ఔషధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఆయన 1896లో స్థిరమైన సమ్మేళనం అయిన మెర్క్యురస్ నైట్రైట్‌ను కనుగొనడం, స్వచ్ఛమైన అమ్మోనియం నైట్రైట్‌ను విజయవంతంగా సంశ్లేషించడం ద్వారా అది దానంతట అదే కుళ్ళిపోతుందనే దీర్ఘకాలంగా ఉన్న నమ్మకాన్ని సవాలు చేశారు. ఆయన ముఖ్యంగా సేంద్రీయ మరియు అసేంద్రీయ నైట్రైట్లు మరియు సల్ఫర్ రసాయన శాస్త్రంలో 150కి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఆయన ప్రెసిడెన్సీ కళాశాల మరియు కలకత్తా విశ్వవిద్యాలయంలో భారతదేశపు మొట్టమొదటి ఆధునిక ఇండియన్ కెమికల్ స్కూల్ స్థాపించి, నీల్ రతన్ ధర్, జ్ఞాన్ చంద్రఘోష్ లాంటి ఎందరో శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించారు. 27 సంవత్సరాల పదవీకాలంలో ప్రెసిడెన్సీ కాలేజీలో పరిమిత వనరులున్నప్పటికీ అతను పరిశోధనలను విస్తృతంగా ప్రోత్సహించాడు. జాతీయ శాస్త్రీయ వేదిక అవసరాన్ని గుర్తించి, 1924లో ఇండియన్ కెమికల్ సొసైటీని స్థాపించి, దాని వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందించారు. పారిశ్రామికవేత్తగా 1892లో ఆయన ఒక ఇంటిని అద్దెకు తీసుకొని కేవలం 700 రూపాయలతో బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌ను ప్రారంభించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి ఆధునిక, విజ్ఞాన శాస్త్ర ఆధారిత ఫార్మాస్యూటికల్ మరియు రసాయన తయారీ సంస్థగా ఎదిగింది. దీన్ని స్థాపించడం ద్వారా ఆయన విజ్ఞాన శాస్త్రాన్ని దేశ నిర్మాణంతో అనుసంధానించారు. సేంద్రీయ మరియు అకర్బన నైట్రేట్‌లపై ఆయన కృషికి రసాయనిక శాస్త్రరంగ గుర్తింపు దక్కడంతో ప్రజలు ఆయనను “నైట్రైట్‌ల మాస్టర్” అని “ఆచార్య ప్రఫుల్ల చంద్ర” అని సంబోధించేవారు.
విద్యాభ్యాసం మరియు జాతీయ భావాలు: రే 1861 ఆగస్టు 2న జెస్సోర్ జిల్లా (ప్రస్తుత బంగ్లాదేశ్) లోని ఒక చిన్న గ్రామమైన రారులి-కటిపారాలో జన్మించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో జిల్లాలైన కృష్ణానగర్ మరియు జెస్సోర్‌లలో దివాన్ (కలెక్టర్)గా అతని ముత్తాత మాణిక్‌లాల్ సంపద గడించారు. గ్రామంలో ప్రాథమిక విద్య తరువాత 1870లో కలకత్తాలోని హరే పాఠశాలలో చేరినప్పటికీ అనారోగ్యం కారణంగా 1874లో స్వగ్రామానికి తిరిగి వచ్చిన అతను జీవితాంతం దీర్ఘకాలిక అజీర్తి మరియు నిద్రలేమితో బాధపడ్డాడు. తండ్రి లైబ్రరీలో అతను ఇంగ్లీష్ మరియు బెంగాలీలోని చారిత్రక రచనలను చదవడంతో పాటు స్వయంగా లాటిన్ మరియు గ్రీకు నేర్చుకుని ఇంగ్లాండ్, రోమ్ మరియు స్పెయిన్ చరిత్రలను తెలుసుకున్నాడు. 1876లో కలకత్తాలో బ్రహ్మో సంస్కర్త కేశుబ్ చంద్రసేన్ స్థాపించిన ఆల్బర్ట్ స్కూల్‌లో చేరి, 1878లో ప్రవేశ పరీక్షలో ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణుడై మెట్రోపాలిటన్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్నత విద్యనభ్యసించాడు. బ్రహ్మ సమాజంతో గల అనుబంధం ఆయనలో “సేవ మరియు త్యాగ స్ఫూర్తిని” పాదుకొల్పగా జాతీయభావాలు గల సురేంద్రనాథ్ బెనర్జీ బోధనలు ఆయనను బాగా ప్రభావితం చేశాయి. సాంఘిక కార్యకర్తగా ఆయన కుల వ్యవస్థను వ్యతిరేకించారు. బెంగాల్ కెమికల్ వర్క్స్ (తరువాత బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్) బెంగాల్ ప్రాంతంతో పాటు భారతదేశ పునరుజ్జీవనోద్యమంలో ఒక మూలస్తంభంగా నిలిచింది. 1905లో స్వదేశీ ఉద్యమానికి ఆయన మద్దతునందించారు. ఆయన ప్రముఖ శాస్త్రవేత్త మరియు విద్యావేత్తగా మాత్రమే కాకుండా ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో సహాయపడిన దేశభక్తుడిగా ఎదిగారు. విదేశీ ఉత్పత్తులను ఉపయోగించడం “భారతదేశానికి వ్యతిరేకంగా చేసే రాజద్రోహ నేరం” అని ఆయన నినదించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను “శాస్త్రవేత్త వేషంలో విప్లవకారుడు” అని అభివర్ణించింది. ఆయన కర్మాగారాలు జాతీయవాదులకు సురక్షితమైన స్వర్గధామాలుగా ఉంటూ వారికి ఆహారం మరియు ఆశ్రయం కల్పించాయి.
ఎడిన్‌బరోలో (Edinburgh) విద్య: బెంగాలీ, ఇంగ్లీష్, లాటిన్, ఫ్రెంచ్ మరియు సంస్కృత భాషలలో ప్రావీణ్యం ఆధారంగా 21 ఏళ్ల వయసులో రే 1882లో “గిల్‌క్రిస్ట్ స్కాలర్‌షిప్” గెలుచుకుని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందారు. ప్రముఖ రసాయన శాస్త్రవేత్త అలెగ్జాండర్ క్రమ్ బ్రౌన్ మార్గదర్శకత్వంలో రాణించిన ఆయన భౌగోళిక శాస్త్రవేత్త హ్యూ రాబర్ట్ మిల్ ద్వారా ప్రశంసలు పొందారు. “తిరుగుబాటుకు ముందు మరియు తరువాత భారతదేశం” అనే అంశంపై విశ్వవిద్యాలయ వ్యాస పోటీలో పాల్గొని ఆయన జాతీయభావాలను ఆవిష్కరించాడు. బ్రిటిష్ రాజ్ విధానాలను ధైర్యంగా విమర్శించడంతో పాటు ప్రతిచర్యాత్మక వైఖరులు కొనసాగితే దాని పర్యవసానం ఎలా ఉండగలదో ఆయన వివరించాడు. ఆ వ్యాసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ మరియు భారతదేశంలో మాజీ లెఫ్టినెంట్-గవర్నర్ అయిన విలియం ముయిర్ రేను ప్రశంసించగా స్కాట్స్‌మన్ వార్తాపత్రిక దానిని హర్షించింది.
డాక్టోరల్ పరిశోధన: రే అకర్బన రసాయన శాస్త్రంలో డాక్టరల్ అధ్యయనాలలో భాగంగా డబుల్ సల్ఫేట్‌ల పరిశోధనలపై దృష్టి సారించారు. “కాపర్-మెగ్నీషియం గ్రూప్ యొక్క కంజుగేటెడ్ సల్ఫేట్లు: ఐసోమార్ఫస్ మిశ్రమాలు మరియు మాలిక్యులర్ కాంబినేషన్ల అధ్యయనం” అనే పరిశోధనా పత్రం రసాయన పరిశోధనలో ఆయన విశేష నైపుణ్యాన్ని గుర్తించడంతో ఎడిన్‌బరో విశ్వవిద్యాలయం 1887లో ఆయనకు డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ఇచ్చింది. వెన్వెంటనే ఆయన హోప్ ప్రైజ్ స్కాలర్‌షిప్‌ను గెలుచుకున్నాడు. 1888లో రాయల్ సొసైటీ ఆఫ్ ఎడిన్‌బరో ప్రొసీడింగ్స్‌లో కంజుగేటెడ్ సల్ఫేట్‌లపై అతని మొదటి పరిశోధన వ్యాసం ప్రచురితమైంది. భారతదేశానికి తిరిగి రాకముందే ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ కెమికల్ సొసైటీకి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవ్వడం ఆయనకు దక్కిన గౌరవానికి నిదర్శనం. బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త హెన్రీ హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్ అతనిని “మాస్టర్ ఆఫ్ నైట్రేట్స్” అని ప్రశంసించారు. రే విజయవంతంగా స్వచ్ఛమైన అమ్మోనియం నైట్రేట్‌ను తయారు చేశాడు. స్వచ్ఛమైన అమ్మోనియం నైట్రేట్ 60 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద విచ్ఛిన్నం కాకుండా ఉత్కృష్టంగా మారగలదని అతని ప్రయోగాలు చూపించాయి. ఈ అన్వేషణ సాధారణ శాస్త్రీయ నమ్మకాలను సవాలు చేసింది. నోబెల్ గ్రహీత విలియం రామ్సే ఈ విజయాన్ని ప్రశంసించాడు.
భావి భారత శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం: జతీంద్రనాథ్ సేన్ 1899లో రే యొక్క మొదటి పీహెచ్‌డీ విద్యార్థి. ఆయన భారతదేశంలో శాశ్వత పరిశోధన సంప్రదాయాన్ని సృష్టించారు. ప్రముఖ రసాయన శాస్త్రవేత్తలు జె.సి. ఘోష్, ఎన్.ఆర్. ధార్, జె.ఎన్. ముఖర్జీలు సహా భౌతిక శాస్త్ర మార్గదర్శకులు సత్యేంద్రనాథ్ బోస్ మరియు మేఘ్ నాద్ సాహా కూడా ఆయన విద్యార్థులే.
ఆయుర్వేదం మరియు ప్రాచీన రసాయన శాస్త్రానికి తోడ్పాటు: రే చరక సంహిత మరియు సుశ్రుత సంహిత వంటి సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేశాడు. ఆయన ద్వారా రచించబడిన “ఎ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ” అనే బృహత్ గ్రంథం 1902 మరియు 1908లో రెండు సంపుటాలలో విడుదలై భారతదేశ శాస్త్రీయ వారసత్వాన్ని నమోదు చేసింది. ఇది ప్రాచీన గ్రంథాల నుండి రసాయన శాస్త్రం, లోహశాస్త్రం మరియు వైద్య రంగాలకు ప్రాచీన భారతదేశం యొక్క గొప్ప జ్ఞానాన్ని, మరియు చారిత్రక కృషిని క్రమబద్ధంగా ఆవిష్కరించింది. సాంప్రదాయ పండితులతో కలిసి రసార్ణవ యొక్క అరుదైన సంస్కృత తాళపత్రాన్ని అధ్యయనం చేసి పండిట్ హరిశ్చంద్ర కావ్యరత్నతో సంయుక్తంగా కృషి చేసి దానిని సవరించి ప్రచురించడం ద్వారా ఆధునిక చరిత్రకారులకు మరియు శాస్త్రవేత్తలకు అందుబాటులోకి తెచ్చారు.
స్వదేశీ సంస్థలకు మద్దతు: భారతదేశ పురోగతికి పారిశ్రామికీకరణ ఒక కీలకమని అని ఆయన నమ్మాడు. బెంగాల్ కెమికల్స్ స్థాపన యువతలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడంతో పాటు ఉపాధి కోసం విదేశీ పాలకులపై ఆధారపడకుండా స్వావలంబన కోసం కృషిచేసేందుకు సహాయపడింది. రే వ్యాపార చతురత నేషనల్ టానరీ వర్క్స్, బెంగాల్ ఎనామెల్ వర్క్స్ మరియు కలకత్తా పాటరీ వర్క్స్ లాంటి అనేక ఇతర వెంచర్లకు మద్దతునిచ్చింది.
దాతృత్వం: బ్రహ్మ సమాజం మరియు బ్రహ్మ బాలికల పాఠశాలకు ఆయన విరాళాలు అందించారు. 1922లో ఆయన స్థాపించిన నాగార్జున బహుమతి, రసాయన శాస్త్రంలో అత్యుత్తమ కృషిని గుర్తించింది. జంతుశాస్త్రం లేదా వృక్షశాస్త్రంలో అసాధారణ కృషికి గాను 1937లో అశుతోష్ ముఖర్జీ పేరు మీద మరో అవార్డును స్థాపించారు. 1923 బెంగాల్ వరదల సమయంలో బెంగాల్ రిలీఫ్ ఫండ్‌కు అందించిన సహకారం ఆయనలోని దాతృత్వానికి నిదర్శనం.
పురస్కారాలు: ఆయన 1912లో కంపానియన్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (సిఐఇ) బిరుదును అందుకున్నారు మరియు 1919లో నైట్‌హుడ్‌ను, ఫెలో ఆఫ్ కెమికల్ సొసైటీ (లండన్), ఫౌండేషన్ ఫెలో ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా పొందారు. డర్హామ్ విశ్వవిద్యాలయం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఢాకా విశ్వవిద్యాలయం, అలహాబాద్ విశ్వవిద్యాలయం మరియు కలకత్తా విశ్వవిద్యాలయంతో సహా ఐదు ప్రతిష్టాత్మక సంస్థలు ఆయనకు గౌరవ డాక్టరేట్ డిగ్రీలను ప్రదానం చేశాయి. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ (యునైటెడ్ కింగ్డం) ఆయన 150వ జయంతి సందర్భంగా యూరప్ వెలుపల తమ మొదటి కెమికల్ ల్యాండ్‌మార్క్ ఫలకాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆయన చేసిన కృషిని గుర్తించింది. 1932-1935 మధ్య ప్రచురించబడిన ఆయన ఆత్మకథ “లైఫ్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ ఎ బెంగాలీ కెమిస్ట్” భారతీయ విజ్ఞాన శాస్త్ర పురోగతిని వివరించింది. భారతీయ ఔషధ మొక్కలపై పరిశోధనకు మార్గదర్శకత్వం వహించిన ప్రొఫెసర్ అసిమా ఛటర్జీతో సహా పలువురు విశిష్ట శాస్త్రవేత్తలకు రే మార్గదర్శకత్వం వహించారు. 1920లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆయన 1938లో ఇండియన్ కెమికల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్‌ను స్థాపించారు. రే 16 జూన్ 1944న కలకత్తా విశ్వవిద్యాలయంలోని ప్రయోగశాలలో మరణించారు. అక్కడ ఇప్పుడు పిసి రే మ్యూజియం ఉంది.
యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822

