Homeఎడిటోరియల్ / బహుళDefecting MLAs: ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో భయం!

Defecting MLAs: ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో భయం!

ఎట్టకేలకు ఖైరతాబాద్‌ అసెంబ్లీకి ఉపఎన్నిక ఖాయమ యింది. సుప్రీంకోర్టు సైతం దానం నాగేందర్‌ పార్టీ ఫిరాయించి నట్టు నిర్ధారించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ ఎన్నికలు నివారించడానికి కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా కృషి చేసింది, కానీ విఫలమయింది. తెలంగాణ హైకోర్టు తీర్పు రాగానే దాన్ని ఆహ్వానించిన దానం నాగేందర్‌ తాను పోటీకి సిద్ధమని ప్రకటించాడు. సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన లేదని కూడా క్లియర్‌గానే చెప్పిండు, కానీ కాంగ్రెస్ పార్టీ తెల్లారే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ముకుల్‌ రోహ్తగీ లాంటి సీనియర్‌ అడ్వకేట్‌ని నియమించుకున్నది. ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే తట్టుకునే శక్తి లేకనే ఈ పని చేసిందని ప్రజలు నమ్ముతున్నారు. ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఫిరాయించిన ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌ని నిర్ధారిం చింది. దీంతో ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. బహుశా వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలలో ఈ ఉపఎన్నిక ఉత్తరప్రదేశ్‌ ‘సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలతోపాటు జరిగే అవకాశమున్నది.

- Advertisement -

నిజానికి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికలూ జంటనగరాల్లోనే జరిగాయి. ఒకటి సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, రెండోది జూబిలీహిల్స్​‍. ఈ రెండింటిలోనూ కాంగ్రెస్ పార్టీ గెలి చింది. అయితే ఖైరతాబాద్‌లో గెలవడం అంత ఈజీకాదు. ఒకటి ఉప ఎన్నికల్లో ఎన్నడూ దానం నాగేందర్‌ గెలువలేదు. తాను తెలుగుదేశం పార్టీ తరపున 2004లో ఆసిఫ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు. అయితే అప్పుడు కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి నిలిచిండు. కానీ ఈ ఉపఎన్నికల్లో మజ్లిస్ పార్టీ చేతిలో పరాజయం పాలయిండు. రెండోది 22ఎ భూ వివాదాల మూలంగా హైదరాబాద్‌ నగరం లోనూ కాంగ్రెస్ పార్టీ పరువు పూర్తిగా దిగజారింది. మరోవైపు తాగునీటి సమస్య, కరెంట్‌ కటకటలు ప్రారంభమయ్యాయి. వీటికి తోడు హైడ్రా కూల్చివేతలూ నష్టం చేస్తున్నాయి. ఈ స్థితిలో ఎన్ని కలు గెలవడం అంత ఈజీ కాదు. వీటితో పాటు మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు సైబరాబాద్‌, హైదరాబాద్‌, మల్కాజిగిరిలకు ఎన్నికలు బాకీ ఉన్నది. వీటి నిర్వహణలో కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తున్నది.

ఇప్పటికైతే ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం ఇంకా తేలలేదు. అట్లాగే తమ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. రేవంత్‌ రెడ్డి ఆశించినట్టు ఆమె ‘తెలంగాణ ఓటు బ్యాంక్‌’ని ఏ మేరకు చీలుస్తుందో అనే దాన్నిబట్టి గెలుపోటములు కొంత నిర్ణయ మవుతాయి. ఈ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. ఆ తర్వాత అక్కడ బీఆర్‌ఎస్ వరుసగా గెలుపొందింది. మధ్యలో ఒకసారి భారతీయ జనతాపార్టీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి కూడా విజేతగా నిలిచాడు.

వచ్చే ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులను నిలబెట్టేందుకే ఎక్కువ అవకాశ మున్నది. చింతల రామచంద్రారెడ్డి, మన్నె గోవర్ధన్‌ రెడ్డిలు ఇక్కడ పోటీ చేసే అవకాశమున్నది. అయితే యాదవ సామాజిక వర్గానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తనయుడు సాయికిరణ్‌ కూడా పోటీకి దిగే అవకాశమున్నది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకున్నట్లయితే అంతో ఇంతో సొంత పలుకుబడి కూడా గల దానం నాగేందర్‌కు సానుకూలత ఏర్పడే అవకాశమున్నది. కొండా సురేఖ బర్తరఫ్‌తో రేవంత్‌ కేబినెట్‌లో 25 లక్షల జనాభా ఉన్న మున్నూరుకాపు, పద్మశాలీలకు చోటు లేకుండా పోయింది. దానం నాగేందర్‌ని గెలిపించినట్లయితే కేబినెట్‌లో అటు హైదరా బాద్‌ జిల్లాకు ఇటు మున్నూరుకాపు సామాజిక వర్గానికి స్థానం దక్కుతుందనే ప్రచారాన్ని ఇప్పటికే ఆయన అనుచరులు ప్రచా రంలో పెట్టిండ్రు. అంతేగాదు రేవంత్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి ఎన్నికలకు ముందే నాగేందర్‌కు కేబినెట్‌లో చోటు కల్పించి నట్లయితే అది మాస్టర్‌స్ట్రోక్‌ అయ్యే అవకాశమున్నది. జూబ్లీహిల్స్​‍ ఉప ఎన్నికల సందర్భంగా ఏ సభలో సభ్యుడుగా లేని మొహ్మద్‌ అజరుద్దీన్‌కి కేబినెట్‌లో చోటు కల్పించి ముస్లింల ఆగ్రహాన్ని కొంత చల్లబరచగలిగిండు. అది జూబ్లీహిల్స్​‍ గెలుపుకు తోడ్పడింది. ఇప్పుడు అదే పద్ధతిలో దానం నాగేందర్‌కు కేబినెట్‌లో చోటు కల్పిం చినట్లయితే ఆ ప్రభావం ఉపఎన్నికలపై సానుకూలంగా ఉండే అవకాశమున్నది. అంతేగాదు పాత తెలుగుదేశం పార్టీ ఓట్లు, మజ్లిస్ ఓట్లు కూడా తమ ఖాతాలోనే అని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నది. అందుకు తగ్గట్టుగానే ఎత్తుగడలు వేస్తున్నది. ఈ అంశాలు సైతం కొంత ప్రభావశీలంగా ఉంటాయి.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఫిరాయిం పుదారులను ఓటర్లు ఎంతమేరకు ఆదరిస్తారనే విషయం. రెండోది ప్రత్యేక ఓటర్‌ పరిశీలన అనంతరం దాదాపు ఎనభైవేల ఓట్లు రద్ద య్యాయి. ఇందులో ఎక్కువగా ఆంధ్రా సెటిలర్లు, ముస్లిములవే ఉన్నాయి. ఈ విషయం నాగేందర్‌కు ప్రతికూలంగా మారే అవకాశ మున్నది. అంతేకాదు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఏకపక్ష నిర్ణయాలతో ఇవ్వాళ బోనులో నిలబడ్డాడు. ఈ పాపం భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడనున్నది. అదే సమయంలో అడ్డగోలు హామీలిచ్చి అమలుపరచలేని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి మీద కూడా ప్రజలకు అనుమానాలున్నాయి.

ఒకవైపు రాహుల్‌ గాంధీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఫిరా యింపుచట్టాన్ని బలోపేతం చేస్తాము, ఒకసారి గెలిచినవారు పార్టీ మారకుండా కట్టడి చేస్తామని ‘రాజ్యాంగాన్ని’ చేతబూని దేశ మంతటా పర్యటిస్తూ హామీ ఇచ్చిండు. అదే రాజ్యాంగ స్ఫూర్తిని రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించిండు. రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ అన్యాయపు చర్యను రాహుల్‌గాంధీ ఎక్కడా ఖండించలేదు. దీంతో ఆయన చెప్పే మాటలకు, ఇక్కడ ఆచరించే విలువలకు ఎక్కడా పొంతన లేదు అనే విషయం అందరికీ తెలిసిపోయింది. తెలంగాణ ఫిరాయింపులు పార్టీ పరువును జాతీయ స్థాయిలో తీస్తున్నాయనే విషయం గుర్తించాలి.

ఏది ఎట్లున్నా దానం నాగేందర్‌ కేసు తీర్పుతో ఇప్పటికే ఫిరాయింపుదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీపై మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ నుంచి పోటీ చేసిన కడియం కావ్య నామినేషన్‌ పత్రాలపై తండ్రి కడియం శ్రీహరి సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇదే నిజమైతే శ్రీహరిపై వేటు కచ్చితంగా పడుతుంది. ఆయన తన కూతురు నామినేషన్‌పై సంతకం చేయడమే గాకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం కూడా చేసిండు. అంతెందుకు తాను ఏ పార్టీలో ఉన్నారో బయటికి చెప్పు కోలేకపోతున్నారు. ఇట్లా మింగలేకా కక్కలేక తల్లడమల్లడమవు తున్న కడియం శ్రీహరికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు రావడం ఖాయం అని న్యాయనిపుణులు అంటున్నారు. అట్లాగే మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు కత్తి వేలాడుతున్నది. ఇందులో ఘర్‌ వాపసీ అయిన పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి లేడు. అంతెందుకు బాన్స్​‍వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రేవంత్‌ సర్కార్‌పై ఇటీవల ధ్వజమెత్తారు. నియోజక వర్గ అభివృద్ధి కోసం రేవంతుతో జతకట్టినా కనీసం తన ఫోన్‌ కూడా ఎత్తడం లేదని మీడియాతో వాపోయిండు.

రాజకీయ హరాకిరి చేసుకున్న ఈ తొమ్మిది మంది ఫిరా యింపు ఎమ్మెల్యేలపై త్వరలో హైకోర్టులో వాదనలు జరుగను న్నాయి. ఇప్పటికే స్పీకర్‌ నిర్ణయం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. దానం నాగేందర్‌ పిటిషన్‌పై హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ నిరసన ఛీత్కారంగా కూడా మారింది. గతంలో నిర్ణయం తీసుకోకుండా సాగదీసి ఎన్నికల ముందు డిస్క్వాలిఫై చేసేవారు. ఇప్పుడు అందుకు వీలు లేకుండా నిర్ణీత వ్యవధి విధించి ఆ లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ని ఆదేశించింది. అనివార్యంగా నిర్ణయం తీసుకున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ‘దొరికిపోయిన ఫిరాయింపు దారుడు’ దానం నాగేందర్‌కు క్లీన్‌ చిట్‌ ఇవ్వడం పక్షపాత నిర్ణయ మేనని తేలిపోయింది. దీనితో స్పీకర్‌ తన హోదాకు తగ్గట్టుగా వ్యవహరించలేదని విశదమయింది.

దానం నాగేందర్‌ అనర్హత వేటుతో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ వేడి ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికీ కీడు చేస్తుందనేది భవిష్యత్‌ కాలమే నిర్ణయిస్తుంది.

డా.సంగిశెట్టి శ్రీనివాస్
సామాజిక, రాజకీయ విశ్లేషకులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News