Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్World Thinking Day: వల్డ్ థింకింగ్ డే ఈరోజే

World Thinking Day: వల్డ్ థింకింగ్ డే ఈరోజే

మన ప్రపంచం: అభివృద్ధి చెందుతున్న మన భవిష్యత్తు

ఈ సువిశాల విశ్వంలోని కోటానుకోట్ల జీవరాసులలో మానవులకు మాత్రమే ఆలోచనా శక్తితో పాటు తమ ఆలోచనలు మరియు భావాలను ఇతరులతో భాష ద్వారా పంచుకునే గొప్ప వరం ప్రసాదించాడు భగవంతుడు. మంచి ఆలోచనల ద్వారా మాత్రమే ఇంతటి మహత్తర వరానికి సార్ధకత ఏర్పడుతుంది. మంచి ఆలోచనలు మాత్రమే ఉజ్వలమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మన పూర్వీకులెందరో తమ సదాలోచనల ద్వారా సమాజాభివృద్ధికి బాటలు వేసి మనకు ఆదర్శంగా నిలిచారు. బాల్యం నుండే విద్యతో పాటు ఆడుతూ పాడుతూ విద్యార్థుల ఆలోచనా సరళిని సక్రమమైన మార్గంలో పెట్టి వారిలో సేవాతత్పరత, క్రమశిక్షణ, దేశ భక్తి పెంపొందించి వారికి ప్రాథమిక చికిత్స, వ్యక్తిగత పరిశుభ్రత, పశుపక్ష్యాదుల పట్ల కారుణ్యం, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాలలో శిక్షణనిచ్చి విపత్కర సమయాలలో సైతం పరిస్థితులకు ఎదురొడ్డి ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉండేలా మలచాలన్న ఉద్దేశంతో యునైటెడ్ కింగ్ డమ్ లోని బ్రౌన్ సీ ద్వీపంలో 1907 లో “స్కౌట్స్ అండ్ గైడ్స్” ఉద్యమానికి బీజం నాటారు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు “లార్డ్ రాబర్ట్ స్టీఫెన్సన్ స్మిత్ బెడెన్ పావెల్”. వర్ణ, వర్గ విభేదాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా బాలల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా “బాల భటులు” లేదా “స్కౌట్స్ మరియు గైడ్స్” ఉద్యమానికి శ్రీకారం చుట్టిన లార్డ్ రాబర్ట్ స్టీఫెన్సన్ స్మిత్ బెడెన్ పావెల్ మరియు ఆయన సతీమణి లేడీ ఓలేవ్ బెడెన్ పావెల్ ల జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న “ప్రపంచ ఆలోచనా దినోత్సవం” లేదా “వరల్డ్ థింకింగ్ డే” జరుపుకుంటున్నారు.

- Advertisement -

ఆలోచనా దినోత్సవ అంకురార్పణ:

1926లో న్యూయార్క్‌లోని క్యాంప్ ఎడిత్ మాసీలో గర్ల్ గైడ్స్ మరియు గర్ల్ స్కౌట్స్ యొక్క 4వ ప్రపంచ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గర్ల్ గైడ్స్ మరియు గర్ల్ స్కౌట్‌ల మధ్య పరస్పర అవగాహన ఏర్పడడంతో పాటు వారి మధ్య వసుదైక సోదరీమణుల బాంధవ్యం ఏర్పడడానికి ఒక ప్రత్యేక రోజును రూపొందించాలని ప్రతినిధులు సంకల్పించడంతో “ఆలోచనా దినోత్సవం” నిర్వహణకు అంకురార్పణ జరిగింది. అయితే 1999 వరకు “ఆలోచన దినోత్సవం” పేర అమెరికా వరకు మాత్రమే పరిమితమైన ఈ వేడుకలను ఆ తరువాత ఐర్లాండ్ లోని డబ్లిన్ లో జరిగిన 30వ గర్ల్ స్కౌట్స్ సదస్సులో, వసుదైక భావనను ప్రతిబింబించేలా “ఆలోచనా దినోత్సవం” నుండి “ప్రపంచ ఆలోచనా దినోత్సవం”గా మార్చారు.

2024 ప్రపంచ ఆలోచనా దినోత్సవ నేపథ్యం (Theme):

ప్రపంచవ్యాప్తంగా ఉన్న గర్ల్ స్కౌట్స్ మరియు గర్ల్ గైడ్స్ ప్రతి సంవత్సరం “ప్రపంచ ఆలోచనా దినోత్సవం” సందర్భంగా ఒక నేపథ్యం ఎంచుకుని దానిపై దృష్టి సారిస్తుంది. “మన ప్రపంచం, అభివృద్ధి చెందుతున్న మన భవిష్యత్తు: పర్యావరణం మరియు ప్రపంచ పేదరికం” అనే అంశాన్ని 2024 సంవత్సరపు నేపథ్యంగా ఎంచుకోవడం జరిగింది. ప్రాంతాలకు అతీతంగా స్కౌట్ మరియు గైడ్స్ ఉద్యమ సభ్యులు తాము ఎదుర్కొంటున్న ఉమ్మడి సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను సమిష్టిగా, పరస్పర సమన్వయ, సహాయ సహకారాలతో కనుగొనడానికి కృషి చేస్తారు. 1932లో ప్రపంచ ఆలోచనా దినోత్సవం 7వ ప్రపంచ సదస్సు పోలాండ్‌లోని బుజ్‌లో జరుగుతున్న సందర్భంలో ఒక బెల్జియన్ అతిథి “పుట్టినరోజున బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడమనేది సర్వసాధారణం కాబట్టి గర్ల్ స్కౌట్స్ మరియు గర్ల్ గైడ్స్ “థింకింగ్ డే” రోజున బహుమతులు అందజేయడం లేదా విరాళాలను సేకరించందం ద్వారా ఈ అంతర్జాతీయ ఉద్యమానికి తమ కృతజ్ఞతను వ్యక్తపరచవచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చడంతో “వరల్డ్ థింకింగ్ డే ఫండ్” ఆవిర్భవించింది. “వరల్డ్ థింకింగ్ డే ఫండ్” ద్వారా సేకరించిన విరాళాలను ప్రాంతాలకు అతీతంగా మహిళాభ్యున్నతితో పాటు సభ్య సంస్థల సభ్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వెచ్చిస్తారు.

మాతృ సంస్థలు:

1928లో మొట్టమొదటగా ఇతర ప్రదేశంలో స్థాపించబడిన “వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ గర్ల్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్” (WAGGGS) యొక్క ప్రధాన కార్యాలయం, 1984లో ఉత్తర లండన్ లోని ఒలేవ్ సెంటర్‌కి మార్చబడింది. ప్రపంచవ్యాప్తంగా “వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ గర్ల్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్” నిబంధనలకు అనుగుణంగా వివిధ దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు లండన్ లోని ప్రధాన కార్యాలయం యొక్క అనుబంధ సంస్థలుగా కొనసాగుతాయి. స్కౌట్ కార్యకలాపాలకు సంబంధించి, 1922 లో స్థాపించబడిన “వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ స్కౌట్ మూవ్మెంట్” (WOSM) యొక్క ప్రధాన కార్యాలయం కౌలాలంపూర్, మలేషియాలో ఉన్నప్పటికీ దాని చట్టబద్ధమైన ఉనికి మాత్రం స్విట్జర్ల్యాండ్ లోని జేనీవాతో ముడిపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 174 గుర్తింపు పొందిన జాతీయ స్కౌట్ సంస్థలు సభ్యులుగా గల ఈ సంస్థలో దాదాపు నాలుగు కోట్ల ముప్ఫై లక్షల మంది ఉన్నారు. ఢిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగిన “ది భారత్ స్కౌట్స్ & గైడ్స్” మన దేశంలో “వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ గర్ల్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్” మరియు “వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ స్కౌట్ మూవ్మెంట్” ల ద్వారా మన దేశంలో జాతీయ సంస్థగా గుర్తింపు పొందింది. ఈ జాతీయ కార్యాలయానికి అనుబంధంగా రాష్ట్ర శాఖలు పనిచేస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా “వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ గర్ల్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్” యొక్క చొరవతో నిర్వహించబడిన కొన్ని ముఖ్య కార్యక్రమాల గురించి క్లుప్తంగా:

ఫ్రీ బీయింగ్ మీ అండ్ యాక్షన్ ఆన్ బాడీ కాన్ఫిడెన్స్ (Free Being me & Action on Body Confidence)
తమ శరీర ఆకృతి, సామాజిక లేదా ఆర్ధిక పరిస్థితి లేదా తమ బాహ్య రూపం కారణంగా గైడ్స్ ఆత్మన్యూనతా భావానికి గురికాకుండా తమని తాము ప్రేమించుకుని తమ అంతర్గత నైపుణ్యాలను నిర్భయంగా వ్యక్తపరిచేలా వారిలో ఆత్మస్థైర్యాన్ని పాదుకొల్పేందుకు నిపుణులచే ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ కార్యక్రమం. 2014 నుండి 101 దేశాల లోని 6 మిలియన్లకు పైగా బాలికలు మరియు బాలురు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ది పొందారు.

గర్ల్ పవర్డ్ న్యూట్రిషన్ (Girl powered Nutrition)
సాధారణంగా మన దేశంలో పోషకాహార విషయంలో బాలికల కంటే బాలురకు ప్రాధాన్యత కాస్త ఎక్కువ అన్న విషయం మనందరికీ తెలుసు. ఈ అంశం యొక్క ప్రతికూల ప్రభావం లింగ అసమానతకు దారి తీస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా బాలికలకు పోషకాహారం పట్ల అవగాహన కల్పించడంతో పోషకాహార లోపానికి గల మూల కారణాలను పరిష్కరించడానికి వారిని సన్నద్ధం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం.

గర్ల్ లెడ్ యాక్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ (Girl led Action of Climate Change)
ఈ కార్యక్రమం ద్వారా బాలికలకు వాతావరణ మార్పులను ఎలా స్వీకరించాలి మరియు వాటి దుష్ప్రభావాల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై సంబంధిత నిపుణుల ద్వారా అవగతం చేయిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా వారు నేర్చుకున్న అంశాలను తమ కుటుంబ సభ్యులతో పాటు సమాజం లోని ఇతరులకు కూడా లబ్ది చేకూరేలా కృషి చేస్తారు.

హర్ వరల్డ్ హర్ వాయిస్ (Her World; Her Voice)
ఈ కార్యక్రమం ప్రతి బాలికకి లేదా స్త్రీకి అందుబాటులో ఉండే అవకాశాలను గుర్తించి వాటిని అందిపుచ్చుకునేందుకు అవలంబించాల్సిన కార్యాచరణ గురించి అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుంది.

రోసీస్ వరల్డ్: మెన్స్ట్రువల్ హైజీన్ (Rosie’s World: Menstrual Hygiene)
స్త్రీల ఆరోగ్యం విషయంలో రుతుక్రమం అనేది ఒక ప్రాధాన్యతా అంశం. ముఖ్యమైన ఈ అంశం గురించి బాలికలకు అపోహలను తొలగించి, అవగాహన ఏర్పరచడంతో పాటు ఆ సమయంలో ఆచరించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి వివరించడం జరుగుతుంది.

స్టాప్ ది వయోలెన్స్ క్యాంపెయిన్ (Stop the Violence Campaign)
వయసుతో నిమిత్తం లేకుండా బాలికలు మరియు మహిళల పై అకృత్యాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది. ఈ విషయంలో బాలికలకు అవగాహన కల్పించి స్వీయ రక్షణకు ఆచరించాల్సిన మెలకువలను వారికి తెలియచేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

సర్ఫ్ స్మార్ట్ (Surf Smart):
అంతర్జాలం (Internet) ఈ రోజుల్లో మన జీవితాలలో అంతర్భాగం అయ్యింది. భారత దేశంలో దాదాపు ఎనభై ఎనిమిది కోట్లకు పై చిలుకు మంది తమ దైనందిన జీవితాలలో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. ఈ అద్భుతమైన సాంకేతికతను వినియోగించుకునే వారు పెరగడంతో పాటు సైబర్ నేరాలు, ఫోతోమార్ఫింగ్ లాంటి దుశ్చర్యల ద్వారా బ్లాక్ మెయిలింగ్ లకు పాల్పడడం లాంటి నేరాలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి బలికాకుండా ఉండడానికి యువతకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ప్రభుత్వ చేయూత:

విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే విభిన్న అంశాల మేలుకలయికగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమ పితామహుడు లార్డ్ బెడెన్ పావెల్ మహోన్నతాశయంతో స్థాపించిన ఈ ఉద్యమం ఉమ్మడి రాష్ట్ర పాలనలో అన్ని రంగాలతో పాటు వివక్షకు గురైనప్పటికీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బలపడుతుందనుకున్న ఆశ అడియాసగానే మిగిలిపోయింది. గతేడాది చివరలో పగ్గాలు చేపట్టిన నూతన ప్రభుత్వమైనా రాజకీయాలకు అతీతంగా ఈ అద్భుతమైన ఉద్యమానికి చేయూతనిచ్చి, ఉద్యమ వ్యాప్తికి తోడ్పడి, భావిభారత పౌరుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తుందని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమ నేపథ్యం గల ఔత్సాహికులు.

యేచన్ చంద్ర శేఖర్, మాజీ రాష్ట్ర కార్యదర్శి

ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ

హైదరాబాద్

✆ : 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News