Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Federal spirit gone: సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న కేంద్రం

Federal spirit gone: సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న కేంద్రం

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు రాజ్యాంగంలోని స‌మాఖ్య స్ఫూర్తి ని దెబ్బతీస్తున్నాయి. తొమ్మిదేళ్లకిందట అధికారానికి వ‌చ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హ‌రించే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఫెడ‌ర‌లిజానికి తూట్లు పొడుస్తోంది. వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రించివేస్తోంది. తాజాగా అధికారుల బదిలీపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న హక్కును తొలగించింది కేంద్ర ప్రభుత్వం. ప్రజాలెన్నుకున్న ఢిల్లీ ప్రభుత్వం హక్కులను తుంగలో తొక్కుతూ ఇటీవల ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీంతో నరేంద్ర మోడీ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ దేశ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎక్కడైనా అధికారులు ఆయా ప్రభుత్వాల కనుసన్నల్లో పనిచేస్తారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన సర్వాధికారాలు అక్కడి ప్రభుత్వాలకే ఉంటాయి. అయితే ప్రజలెన్నుకున్న ఢిల్లీ ప్రభుత్వానికి ఉద్యోగుల బదిలీలపై ఎలాంటి హక్కులు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ హక్కులను కాలరాసే విధంగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం నూటికి నూరు శాతం రాజ్యాంగ విరుద్ధం. కోర్టు సెలవలకు మందు ఈ ఆర్డినెన్స్ తీసుకువస్తే సదరు ఆర్డినెన్స్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించేది ఢిల్లీ ప్రభుత్వం. అందుకే వేచి చూసి మరీ కోర్టుకు సెలవలు ప్రకటించిన తరువాత ఆర్డినెన్స్ తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడానికి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఇందులో భాగంగా కొన్ని రోజుల కిందట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్‌ మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. తాజాగా హైదరాబాద్ వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతోనూ భేటీ అయ్యారు. కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని మండిపడ్డారు కేజ్రీవాల్, కేసీఆర్.

- Advertisement -

భిన్నత్వంలో ఏక‌త్వం మనదేశ ప్రత్యేకత

మ‌న‌దేశంలో అనేక జాతుల‌కు చెందిన ప్రజలున్నారు. భిన్నత్వంలో ఏక‌త్వం భార‌త‌దేశ ప్రత్యేకత. ఈ నేప‌థ్యంలో ఫెడ‌ర‌లిజానికి రాజ్యాంగ నిర్మాత‌లు పెద్ద పీట వేశారు. మ‌న‌ది ”సమాఖ్య” రాజ్యాంగం అని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అనేకసార్లు స్పష్టం చేశారు. కేంద్రానికి, రాష్ట్రాలకు రాజ్యాంగం ఒకే ర‌క‌మైన ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్రానికి రాజ్యాంగం ఇచ్చిన నిర్వచనం, యూనియ‌న్ ఆఫ్ స్టేట్స్ త‌ప్ప మ‌రొక‌టి కాదు. రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో ఉండేది ”సమాఖ్య ప్రభుత్వ’మే. 80ల్లో రాష్ట్రాల హ‌క్కుల‌ను కాల‌రాచ‌డానికి అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు ఎన్టీ రామారావు స‌హా అనేక మంది కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు, రాజ్యాంగ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీ ఆర్ అయితే ఒక ద‌శ‌లో కేంద్రాన్ని మిథ్య అని కూడా అన‌డాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకుని తీరాలి.

రాజ్యాంగంలో స్పష్టమైన విభజన

రాజ్యాంగం ఏడ‌వ షెడ్యూల్ లో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన స్పష్టంగా ఉంది. కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు, ఉమ్మడి జాబితాలో 47 అంశాలున్నాయి.ఎవ‌రి ప‌రిధుల్లో వాళ్లు ఉండాల‌ని రాజ్యాంగం పేర్కొంది. విభ‌జ‌న గీత‌లు కూడా స్పష్టంగా గీసింది. ఈ లెక్కన వ్యవసాయం కూడా రాష్ట్ర జాబితాలో ఉంది. దీని ప్రకారం వ్యవసాయంపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉన్నది. ఒక‌వేళ కేంద్రం చ‌ట్టాలు చేయాలని భావిస్తే ముందుగా రాష్ట్రాల‌తో సంప్రదించాలి. మంచి చెడుల‌పై చర్చించాలి. అలాంటిదేమీ లేకుండా, రాష్ట్రాలతో ఎలాంటి చర్చలు, సమాలోచనలు జ‌ర‌ప‌కుండానే వివాదాస్పద మూడు వ్యవసాయ చ‌ట్టాల‌ను కొన్నేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఏక‌ప‌క్షంగా చేసింది. అంతేకాదు, పార్లమెంటులో ఎలాంటి చ‌ర్చ లేకుండానే కొత్త చ‌ట్టాల‌ను ఆమోదించింది. దీంతో ఢిల్లీ శివార్లలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు రైతులు. అన్నదాతల నుంచి ఈ రేంజ్‌లో వ్యతిరేకత రావడంతో చివరకు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పి ఈ వివాదం నుంచి బయటపడ్డారు.

ఆర్థిక రంగంలోనూ…..

జీఎస్టీ, పెద్ద నోట్ల ర‌ద్దు వంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఫెడ‌ర‌లిజాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయి. ఒకే దేశం – ఒకే ప‌న్ను నినాదం నేప‌థ్యంలో జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రాలకు అత్యధిక ఆదాయం వచ్చే ‘అమ్మకపు పన్నును కూడా జీఎస్టీ లో చేర్చారు. గత ఐదేళ్లలో జీఎస్టీ ద్వారా రాష్ట్రాలు దాదాపు రెండు లక్షల కోట్లు నష్టపోయాయన్నది సమాచారం. దీంతో రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయి.

విద్యారంగంలోనూ…..

విద్యారంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా ఫెడ‌ర‌లిజాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాతలు ‘విద్య’ను రాష్ట్ర జాబితాలో పెట్టారు. అయితే ఆ త‌రువాత 42వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ‘విద్య ను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. అంటే విద్యకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాల‌న్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో ముందుగా సంప్రదించాలి. ఏమైనా కీల‌క మార్పులు తీసుకురాద‌లిస్తే స‌మ‌గ్రంగా చ‌ర్చించాలి. రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాలి. అయితే ఇవేమీ లేకుండానే 2021 జులై నెల‌లో నూతన విద్యా విధానం-2020 ను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏక‌ప‌క్షంగా ప్రకటించింది. దీనిపై దేశ వ్యాప్తంగా విద్యావేత్తలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా విద్యారంగాన్ని కాషాయీకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. చరిత్రకు వక్ర భాష్యాలు చెబుతోంది. ఇవే కాదు…విద్యుత్‌ చట్టాలలో మార్పుల వంటి కీల‌క నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా రాష్ట్రాలను కేంద్రం సంప్రదించడం లేదు. స‌మాఖ్య విధానం పై ప‌ట్టింపు లేక‌పోవ‌డం, రాజ్యాంగం ప‌ట్ల గౌర‌వం లేక‌పోవ‌డ‌మే కేంద్ర నిర్ణయాలకు కార‌ణం. లోక్ స‌భ‌లో ఉన్న సంఖ్యాబ‌లమే బీజేపీ ఇలా ప్ర‌వ‌ర్తించ‌డానికి కార‌ణం అంటున్నారు రాజకీయ విశ్లేష‌కులు. కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు ప్రస్తుతం బీజేపీ హ‌వానే న‌డుస్తోంది. ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు, కేర‌ళ, హిమాచల్ ప్రదేశ్‌ , తాజాగా కర్ణాటక ఎన్నిక‌ల్లో ఓట‌మిని వ‌దిలేద్దాం. క‌మ‌లం పార్టీ హ‌వాకు తగ్గట్లు అనేక ప్రాంతీయ పార్టీలు వ్యవహరించడం దారుణం. రాజ్యాంగం ప్రకారం త‌మకున్న హ‌క్కుల‌ను కేంద్ర ప్రభుత్వం హ‌రిస్తున్నా వ్యతిరేకించే ధైర్యం చేయ‌లేక‌పోతున్నాయి. బీజేపీతో గొడ‌వలు పెట్టుకునే మూడ్ లో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు లేవు. దీనికి ఎవ‌రి లెక్కలు వారికున్నాయి. భారత్ రాష్ట్ర సమితి, ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ లాంటి కొన్ని ప్రాంతీయ పార్టీలే దీనికి మినహాయింపు. కేంద్రాన్ని వ్యతిరేకిస్తే ఎక్కడ తమ తమ రాష్ట్రాల్లో రాజ‌కీయ పత్యర్థి పార్టీలు, బీజేపీకి దగ్గరవుతాయోనన్న భ‌యం ప్రాంతీయ పార్టీల అధినేతలను వెంటాడుతోంది. దీంతో ఫెడ‌ర‌లిజానికి కేంద్రం తూట్లు పొడుస్తున్నా, ప్రశ్నించే సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు ప్రాంతీయ పార్టీల దళపతులు. మరో వైపు హిందీ భాషను బలవంతంగా హిందీయేతర రాష్ట్రాల్లో రుద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీని జాతీయస్థాయిలో అధికార అనుసంధాన భాషగా చేయడంలో భాగంగా కొన్ని నెలల కిందట కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకోవాలి. హిందీని మరోసారి బలవంతంగా దక్షిణాదిన ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ద్రవిడ ప్రాంతాలపై రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయిందని భావించాల్సి ఉంటుంది. ఏమైనా పుట్టి పూర్తిగా మున‌గ‌కముందే ప్రాంతీయ పార్టీలు మేలు కోవాలి. తాత్కాలిక రాజ‌కీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలి. రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా నిలబడాలి. రాజ్యాంగం హామీ ఇచ్చిన స‌మాఖ్య స్ఫూర్తిని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అవసరమైతే కొట్లాడాలి. లేదంటే ప్రాంతీయ పార్టీలు డేంజ‌ర్ జోన్‌లో ప‌డ‌డం ఖాయం.
ఎస్. అబ్దుల్ ఖాలిక్,

సీనియ‌ర్ జర్నలిస్ట్ (63001 74320)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News