Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Finances: ఎవరికి వారే యమునా తీరే!

Finances: ఎవరికి వారే యమునా తీరే!

ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినంత వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటోంది. ఈ రెండింటి మధ్యా ఎక్కడా సామరస్యం కనిపించడం లేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఎట్లా తోస్తే అట్లా వ్యవహరిస్తున్నాయి. ఒకపక్క అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం విజృంభిస్తోంది. దేశ పరిస్థితి కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. ఆర్థిక మాంద్యం పాలబడ కుండా కేంద్ర ప్రభుత్వం ఏదో విధంగా నెట్టుకొస్తోంది కానీ, దేశంలో అధిక సంఖ్యాక రాష్ట్రాలకు మాత్రం ప్రపంచ పరిస్థితి, దేశ పరిస్థితి మాత్రం ఏమీ పట్టినట్టు లేదు. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, కేరళ, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు తమ వ్యయ విధానాలను మార్చుకుని లోటును తగ్గించు కుంటున్నప్పటికీ, మిగిలిన రాష్ట్రాలు మాత్రం సంక్షేమాల పేరుతో ఉచితాలు, బుజ్జగింపులకు నిధులన్నీ దారాదత్తం చేస్తుండడం ఒక పక్క కేంద్ర ప్రభుత్వం మీదా, మరొక ప క్క రిజర్వ్‌ బ్యాంక్‌ మీదా తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకు వస్తున్నాయి.
వాస్తవానికి, 2020-21 ఆర్థిక సంవత్సరం వరకూ రాష్ట్రాల ఆర్థిక లోటు మరీ అధ్వానంగా ఉంది. ఆ తర్వాత కొద్దిగా తీరు మారింది. 2020-21లో జీడీపీలో గరిష్ఠంగా 4.1 శాతానికి ఆర్థిక లోటు చేరుకుంది. 2004-05 తర్వాత ఇంత భారీగా లోటు ఏర్పడడం ఇదే మొదటిసారి. కాగా, 2021 చివరి నాటికి రాష్ట్రాల ఆర్థిక లోటు జీడీపీలో 2.8 శాతానికి చేరుకుంది. అంటే, ఆర్థిక వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని జాగ్రత్తలు పాటించాయన్న మాట. కాగా, ఆ తర్వాత నుంచి కొన్ని రాష్ట్రాల విచ్చలవిడి ఖర్చులు మళ్లీ పరాకాష్ఠకు చేరుకోవడంతో లోటు కాస్తా జీడీపీలో 3.4 శాతానికి చేరుకుంది. అయితే, జీడీపీలో 4 శాతానికి మించి లోటు ఉండకూడదనే రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనకు ఈ లోటు కొద్ది దూరంలోనే ఉంది. ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ స్థాయికి చేరుకుంటుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఈ లోటు జీడీపీలో నాలుగు శాతానికి మించకూడదనే నిబంధనను రిజర్వ్‌ బ్యాంక్‌ కచ్చితంగా అమలు చేస్తున్నందువల్ల ఇది నాలుగు శాతానికి చేరుకోకపోవచ్చు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన వ్యయం ఏ స్థాయిలో జరపాలన్నదానిపై కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షలు విధించింది. 2020-21లో రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం మూలధన వ్యయం జీడీపిలో 2.7 శాతం వరకూ వెళ్లింది. కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం 2.3 శాతానికే పరిమితం అయింది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ మూలధన వ్యయాన్ని జీడీపీలో 2.9 శాతానికి మాత్రమే పరిమితం చేసేలా బడ్జెటపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. మొత్తం మీద, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మూలధన వ్యయం జీడీపీలో 70 శాతానికి మించకుడా ఉండాలని రిజర్వ్‌ బ్యాంక్‌ భావిస్తోంది. విచిత్రమేమిటంటే, సంక్షేమ పథకాలు, ఉచితా లపై చూపిస్తున్నంత శ్రద్ధను రాష్ట్రాలు పెట్టుబడులపై చూపించడం లేదనే విషయం అర్థమవుతోంది. మూలధన వ్యయాన్ని జీడీపీలో 2.9 శా తానికి పెంచే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్రాలు ఈ నిధుల వ్యయం విషయంలో మందకొడిగానూ, నిర్లక్ష్యం గానూ వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా మొదటి ఏడు నెలల కాలంలో అభివృద్ధి, పెరుగుదల వంటివి ఎక్కడా కనిపించడం లేదు.
ఆందోళనకర పరిణామాలు
మరికొన్ని ఆందోళనకర విషయాలు కూడా ఉన్నాయి. జీడీపీకి, రాష్ట్రాల రుణానికి మధ్య ఒక నిష్పత్తి ఉంటుంది. ఇప్పుడు ఆ నిష్పత్తి బాగా పెరిగిపోయింది. ’ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్మెంట్‌ రివ్యూ కమిటీ ఈ నిష్పత్తి స్థాయిని 20 శాతంగా మాత్రమే నిర్ధారించింది కానీ, అది ఇప్పటికే పెరిగి పెద్దదై 29 శాతానికి చేరుకుందని తెలుస్తోంది. ఇది జీడీపీలో 29 శాతానికి చేరుకున్న విషయాన్ని రాబోయే బడ్జెట్లో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించే హామీలు, పూచీకత్తెల స్థాయి కూడా అభిలషణీయ స్థాయిని దాటిపోయింది. ఈ పూచీకత్తుల స్థాయి 2014 నాటికి 3.79 లక్షల కోట్ల రూపాయలు. కాగా, 2021 నాటికి అది 7.4 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ఫలితంగా రాష్ట్రాలకు పూచీ ఉండే పరిస్థితి ఇక సాధ్యం కాకపోవచ్చు. రాష్ట్రాల రుణ సమస్యను ముందుగా పరిష్కరించాల్సి ఉంటుంది.
ఇది ఇలా ఉండగా, కొన్ని రాష్ట్రాలు ఇదివరకటి పెన్షన్‌ పథకానికి మళ్లీ వెళ్లి పోవాలనే అభిప్రాయంలో ఉన్నాయి. తద్వారా ఆర్థిక వనరులను పెంచుకోవాలన్న ఆలోచన మున్ముందు సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. వర్తమాన ఆర్థిక సమస్యలను భవిష్యత్తుకు వాయిదా వేయాలన్న రాష్ట్రాల ఆలోచనల వల్ల భవిష్యత్తు కూడా అంధకారమవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా భవిష్యత్తు ప్రణాళికలపై, అవసరాలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుని, పెట్టుబడులు పెంచడానికి, ఆర్థిక వనరులను సమ కూర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తమ దుబారా, వ్యర్ధ వ్యయాలను అదుపు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలను చుట్టుముట్టి, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న ఆర్థిక మాంద్యం భారతన్ను కూడా కబళించే అవకాశం లేకపోలేదు. భవిష్య త్తులో ఎదురు కాబోయే ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తమ తీరు మార్చుకుని, అభివృద్ధి పథకాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాలి.
-జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News