దేశరాజధాని ఢిల్లీలోని పిల్లల ఆస్పత్రిలో చెలరేగిన మంటలు.. ఏడుగురి పసిప్రాణాలను బలిగొన్నాయి. ఒక అంతస్తులో ఆక్సిజన్ సిలిండర్లు ఉంచడం, అక్కడకు కూడా మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అలాగే.. గుజరాత్ రాజ్‌కోట్ జిల్లాలో గేమింగ్ జోన్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలతో సహా 27 మంది మరణించారు. అసలే ఒకవైపు ఢిల్లీలో 53 డిగ్రీల స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటికితోడు ఇలా మంటలు కూడా చెలరేగుతుండటంతో అసలు ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఆస్పత్రులలో అగ్నిప్రమాదాలు సంభవించడం మన దేశంలో ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఇలా చాలాసార్లు జరిగగింది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడల్లా ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, మృతుల కుటుంబాలకు పదో పరకో పరిహారంగా పారేయడంతో సరిపెడుతున్నారు. అంతకుముందు గానీ, ఆ తర్వాత గానీ అసలు ఏ రాష్ట్రాల్లోని ఆస్పత్రులలో అగ్నిమాపక వ్యవస్థ ఎలా ఉందో, అసలు ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంటున్నాయో లేదో పరిశీలిస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఫలితంగా మన దేశంలో ప్రతియేటా ఎక్కడో ఒకచోట ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఎంతోకొంతమంది ప్రాణాలను బలిగొంటూనే ఉన్నాయి. హైదరాబాద్ విషయమే చూసుకుంటే, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నీలోఫర్ ఆస్పత్రిలోను, అంతకుముందు 2023 డిసెంబర్ నెలలో అంకుర ఆస్పత్రిలోను సంభవించిన ప్రమాదాల విషయం అందరికీ తెలిసినదే.
ఆస్పత్రులు అంటేనే.. అక్కడ దాదాపు కదల్లేని పరిస్థితుల్లో ఉండే రోగులే చికిత్స పొందుతుంటారు. ఇక ఐసీయూలలో పరిస్థితి గురించి చెప్పనే అక్కర్లేదు. అప్పటికే ఆపరేషన్లు అయ్యినవాళ్లు, లేదా ఆరోగ్యం బాగా విషమించి, నిరంతర పర్యవేక్షణ అవసరమైన పరిస్థితుల్లో చేరినవాళ్లు ఉంటారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ సివిల్ ఆస్పత్రిలోని కొవిడ్ ఐసీయూలో జరిగిన ప్రమాదం అత్యంత ఘోరమైనది. మహారాష్ట్ర ప్రమాదంలో పొగ వస్తోందని రోగుల బంధువులు చెబుతున్నా వార్డుబోయ్‌లు అసలు పట్టించుకోలేదు. ఆరోజు కొవిడ్ ఐసీయూలో 17 మంది రోగులుండగా, వారిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదం సంభవించిన మూడు రోజుల తర్వాత ఆస్పత్రిలో అగ్నినిరోధక వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.2.60 కోట్లు మంజూరుచేసింది. ఆ ప్రతిపాదనలు అప్పటికి ఎనిమిది నెలలకు పైగా పెండింగులో ఉండి, ఒక శాఖ నుంచి మరో శాఖకు వెళ్తూనే ఉన్నాయి. అంతకుముందు 2021 జనవరిలో భాంద్రా సివిల్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది పిల్లలు మరనించారు. వెంటనే రాష్ట్రంలోని 484 ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్లు చేయించాలని మహారాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఆదేశిస్తే, 90 శాతం ఆస్పత్రులలో అసలు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీలు లేనే లేవని తేలింది.
2020 ఆగస్టులో విజయవాడలో ఒక హోటల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసీయూలో కూడా దారుణమైన ప్రమాదం సంభవించింది. అక్కడ చికిత్స పొందుతున్న పదిమంది ప్రాణాలు కోల్పోయారు. అసలు కొవిడ్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరేవాళ్లు అప్పటికే ఊపిరి అందక ఇబ్బంది పడుతుంటారు. అలాంటిచోట పొగ వ్యాపిస్తే వారి పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. ఇతర రోగుల విషయంలో అయితే వాళ్లు దాదాపు కదల్లేని పరిస్థితుల్లో ఉండటంతో.. మంటలు, పొగ గమనించినా ఎవరో ఒకరు తీసుకెళ్తే తప్ప తమంతట తాముగా ఒక్క అడుగుకూడా వేయలేరు. 2020 ఆగస్టు నుంచి 20 నెలల్లోనే దేశంలోని ఆస్పత్రులలో 29 అగ్నిప్రమాదాలు సంభవించి, 122 మంది మరణించారు. ఆ తర్వాత జరిగిన వాటి లెక్కలు ఇంకా బయటకు రాలేదు. 2020లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో ఒక సర్వే జరిగింది. అందులో 2010 నుంచి 2019 వరకు అంటే పదేళ్లలో ప్రభుత్వాస్పత్రులలో 25, ప్రైవేటులో 8 పెద్దస్థాయి అగ్నిప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఈ మొత్తం 33 ఆస్పత్రులకు గాను.. 19 చోట్ల మాత్రమే ఎంతోకొంత పనిచేసే స్థితిలో అగ్నిమాపక వ్యవస్థలు ఉన్నాయి.
అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండా హైదరాబాద్‌లో 1500 ఆస్పత్రులు నడుస్తుండగా, విజయవాడలో పాతిక పడకల లోపు ఉన్న 930 ప్రైవేటు చికిత్సాలయాల్లో నిరభ్యంతర పత్రాలున్నది 10 శాతానికే. నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలను ఆస్పత్రులలో పాటిస్తున్న దాఖలాలు ఏమీ లేవు. నిజానికి ఈ కోడ్ పక్కాగా పాటిస్తే అసలు అగ్నిప్రమాదాలే కావు.. ఏ రకమైన ప్రమాదాలూ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇవి అమెరికరా, జర్మనీ, బ్రిటన్ లాంటి అగ్రరాజ్యాల ప్రమాణాలకు దీటుగా ఉన్నాయి. కానీ, వాటి అమలే అసలు సమస్య. 2015నుంచి ఐదేళ్లలోనే దేశంలో అగ్నిప్రమాదాల మృతుల సంఖ్య 71వేలు దాటిందని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వివరాలే వెల్లడిస్తున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధ్యయనం ప్రకారం భవంతుల నిర్మాణంలో సరైన ప్రణాళిక లేకపోవడం, నిబంధనలను సరిగా అమలు చేయకపోవడమే అగ్నిప్రమాదాలకు, వాటి కారణంగా మరణాలకు కారణం.
ఫైర్ సర్వీసెస్ విభాగానికి ఆధునిక పరికరాల సరఫరా లేకపోవడం కూడా అగ్నిప్రమాదాల సమయంలో రెస్క్యూ ఆపరేషన్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి. కేవలం నీటిని వెదజల్లడం మినహా వేగంగా మంటలను ఆర్పే ఇతర ఆధునిక పద్ధతులపై అవగాహన, శిక్షణ కూడా దేశంలోని చాలా ఫైర్ సర్వీసెస్ విభాగాల్లో లేవు. వీటన్నింటికీ తోడు.. భవన నిర్మాణాలకు ఇచ్చే అనుమతుల విషయంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం మరో పెద్ద కారణం. నిజానికి ఫైర్ సర్వీసెస్ విభాగం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉంటే తప్ప భవన నిర్మాణానికి తదుపరి అనుమతులు ఇవ్వకూడదు. కానీ ఎన్ఓసీ ఉన్నా.. లేకపోయినా లంచం ఇస్తే చాలు అనుమతులు మంజూరైపోతున్నాయి.
నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆస్పత్రులలో తప్పనిసరిగా అగ్నిప్రమాదాల నుంచి రక్షణకు ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసుకోవాలి. అగ్నిమాపక సిబ్బంది రావడానికి వీలుగా ఫైర్ లిఫ్టులు ఉండాలి. వాటితోపాటు, ముందునుంచే ప్రతి అంతస్తులో ఫైర్ అలారంలు, పొగను గుర్తించే వ్యవస్థ, అగ్నిమాపక పరికరాలు ఉండాలి. విద్యుత్ వైర్లు, పరికరాలను వేరే డక్టులో ఏర్పాటుచేయాలి. మంటలు అంటుకోని పదార్థంతో దాన్ని సీల్ చేయాలి. కానీ ఆస్పత్రులు వీటిని పాటిస్తున్న పాపాన పోవట్లేదు. 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాల్లో ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టంలు (నీటిని వెదజల్లే వ్యవస్థలు), ఫైర్ అలారంలు, అగ్నిమాపక వ్యవస్థలు, అగ్నిప్రమాద భద్రత పర్యవేక్షణకు ఓ ప్రత్యేక అధికారి ఉండాలి. కానీ ఇప్పటివరకు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆస్పత్రులలో ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటుచేసుకోలేదు.
సాధారణంగా ఐసీయూలు, ఏసీ వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఎక్స్ రే, డయాలసిస్ గదుల్లో ఉండే పరికరాల వల్ల అక్కడ మంటలు త్వరగా అంటుకుంటాయి. ఇలాంటిచోట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, లెదర్, రెగ్జిన్ లాంటి పదార్థాలు వాడకూడదని నిపుణులు చెబుతారు. కనీసం రెండు గంటల పాటు మంటలను నిరోధించే పదార్థాలతోనే గోడలను నిర్మించాలి. తాము గమనించిన దశాబ్ద కాలంలో జరిగిన 33 అగ్నిప్రమాదాల్లో 78 శాతానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూటేనని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసన్ అండ్ పబ్లిక్ హెల్త్ సంస్థ తమ నివేదికలో తెలిపింది. ఐసీయూ అంటే ప్రతి పడక వద్దా వెంటిలేటర్, మానిటర్లు, ఇంకా పలు రకాల పరికరాలు అవసరమవుతాయి. వాటన్నింటికీ తగిన లోడును భరించేలా వైర్లు, ప్లగ్గులు ఉండాలి. కేవలం ఎక్కువ పాయింట్లు ఉంటే సరిపోదు.. అవన్నీ విద్యుత్తు లోడ్‌ను తట్టుకునేలా ఉండాలి. అవి తగినంతగా లేకపోవడం వల్లే సింహభాగం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారాలు ఇచ్చి చేతులు దులిపేసుకోవడం కాకుండా ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
– సమయమంత్రి చంద్రశేఖర శర్మ