Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Foxconn India: చైనాకు శాపం, ఇండియాకు వరం

Foxconn India: చైనాకు శాపం, ఇండియాకు వరం

విదేశీ సంస్థలకు వెసులుబాటుగా..

విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు మరో విజయం చేకూరింది. భారత్‌ లో అనేక ప్రాజెక్టులు చేపట్టడానికి ఫాక్స్‌ కాన్‌ సంస్థ 1600 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టబోతోంది. పూర్తి వివరాలైతే వెల్లడి కాలేదు కానీ, కర్ణాటకలో ఐఫోన్లు ఉత్పత్తి చేయడానికి, పరికరాలను కూర్చడానికి రెండు ఫ్యాక్టరీలను పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. హాన్‌ హాయ్‌ అనే రోఓ పేరు కూడా ఉన్న ఫాక్ప్‌ కాన్‌, తదితర తైవాన్‌ కంపెనీలు ఇక చైనా దేశానికి స్వస్తి చెప్పే ఉద్దేశంతో భారత్‌, వియత్నాం, కొరియా, మలేషియా, ఇండొనీషియా వంటి దేశాలకు తరలి రావడం ప్రారంభం అయింది.
అంతేకాదు, కొన్ని అతి పెద్ద అమెరికా బహుళ జాతి సంస్థలు కూడా తాము చైనాకు గుడ్‌ బై చెప్పి ఇతర దేశాలకు రావాలనుకుంటున్నట్టు, ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను చైనా నుంచి అమెరికా, మరికొన్ని దేశాలకు తరలించాలని భావిస్తున్నాయి. నైకి, డెల్‌ కంపెనీలు కూడా తాము వియత్నాం, మెక్సికో దేశాలకు తరలి వెడుతున్నట్టు కొద్దికాలం క్రితం ప్రకటించడం జరిగింది. చైనా తీరుతెన్నులు, వ్యవహార శైలి, విధానాలు తమకు ఇబ్బందికరంగా మారుతున్నాయని ఆ సంస్థలు వివరణ ఇచ్చాయి.
చైనా పట్ల అనేక విదేశీ కంపెనీలకు విరక్తి కలిగినట్టు అర్థమవుతూనే ఉంది. క్సి జిన్‌ పింగ్‌ నాయకత్వంలోని చైనాలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ మారిపోతోందని, స్వదేశాభిమానం వెర్రితలలు వేస్తోందని, ఏ విధానమూ స్థిరంగా ఉండడం లేదని అనేక కంపెనీలు బాహాటంగానే ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత చైనా పరిస్థితి అన్ని విధాలుగానూ దిగజారిపోయిందని, ప్రభుత్వ రుణ భారం పెరిగిపోవడంతో పాటు, రియల్‌ ఎస్టేట్‌ దారుణంగా పడిపోయిందని అవి పేర్కొన్నాయి. దేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నందువల్ల ప్రజలు పొదుపు చేయడానికే మొగ్గు చూపిస్తున్నారు తప్ప ఖర్చు చేసే ఉద్దేశంలో లేరు. దీనివల్ల కొనుగోలు శక్తి తగ్గిపోయే, డిమాండ్ పడిపోయింది. గత ఆగస్టులో విదేశీ సంస్థలు 1200 కోట్ల డాలర్లను చైనా ఈక్విటీల నుంచి ఉపసంహరించుకోవడం జరిగింది. కాగా, అదే నెలలో భారతదేశంలోకి 150 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు ప్రవహించాయి. ఇక వృద్ధి రేటు విషయంలో కూడా చైనా కంటే భారత్‌ ముందుడుగు వేసింది. 2023-24 సంవత్సరాల్లో భారతదేశ వృద్ధి రేటు 6.3 శాతం దాటుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్‌) ప్రకటించింది. అదే సమయంలో చైనా వృద్ధి రేటు 5 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గిపోతుందని కూడా అది వెల్లడించింది.
కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఎగుమతులు, దిగుమతులలో హెచ్చు తగ్గులు రావడ మనేది దాదాపు ప్రతి దేశంలోనూ చోటు చేసుకుంది. భారతదేశంలో కూడా ఇటువంటివి అనివార్యంగా జరిగాయి. ఈ కారణంగానే భారత్‌ లో మొత్తం 789 విమానాల్లో 200 విమానాలు మార్చి నెలాఖరులోగా ఆగిపోబోతున్నాయి. ప్రపంచంలో ఒక ప్రధాన ఉత్పత్తిదారుగా ఉన్న చైనా ఆర్థికంగా బలహీనపడుతుండడంతో అక్కడి విదేశీ కంపెనీలకు డిమాండ్‌ సరఫరాల మధ్య భారీగా అంతరాలు చోటు చేసుకుంటున్నాయి. చైనా అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఎదగడానికి నాలుగు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. కార్మిక వ్యయాలు బాగా తక్కువగా ఉండడం, యువ కార్మికులు అందుబాటులో ఉండడం, పన్ను రాయితీలు, సబ్సిడీల ద్వారా చైనా విదేశీ కంపెనీలను ప్రోత్సహించడం, టెక్నాలజీ, ప్రాథమిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెంది ఉండడం వంటివి చైనాలో విదేశీ పెట్టుబడులను బాగా పెంచాయి. అయితే, చైనా విధానాలు, ఆర్థిక పరిస్థితి కారణంగా ఈ కారణాలన్నీ వెనుకపట్టుపట్టాయి. విదేశీ సంస్థలకు ఇప్పుడు ఇవే కారణాలు భారత్‌ లో కనిపిస్తున్నాయి. ఏ ఉత్పత్తి చేపట్టినా భారత్‌ లోనే చేపట్టాలన్న ప్రభుత్వ ఆంక్షలు విదేశీ సంస్థలకు వెసులుబాటుగా ఉన్నాయి. అధికారిక ఆలస్యాలను తగ్గించుకోవడం మీదా, ప్రాథమిక సదుపాయాలను సత్వరం కల్పించడం మీదా భారత్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇవి ఎంత త్వరగా చోటుచేసుకుంటే విదేశీ పెట్టుబడులను, విదేశీ సంస్థలను అంత ఎక్కువగా ఆకట్టుకోగలుగుతాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News