దేశంలో ఉచితాల సంస్కృతి అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోతోందంటూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద ప్రధాని నరేంద్ర మోదీ సంధించిన వ్యంగ్యాస్త్రం సానుకూల ఫలితాలను ఇచ్చినట్టు కనిపించడం లేదు. సంక్షేమ పథకాల మీదా, ఉచిత పథకాల మీదా రాష్ట్రాలు ఖర్చు చేయడం ఎక్కువైంది. దేశంలోని 11 రాష్ట్రాలలో గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఖర్చు 4 లక్షల కోట్ల రూపాయలు దాటిందని ఇటీవలి ‘క్రైసిల్’ నివేదిక వెల్లడించింది. ప్రత్యక్ష నగదు బదిలీలు, నగదు ప్రోత్సాహకాలు, వ్యక్తిగత, గృహావసర వస్తువుల పంపిణీ తదితర సాంఘిక సంక్షేమ పథకాలను గురించి ఈ క్రెడిట్ రేటింగ్ సంస్థ తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఈ క్రమంలో విద్య, వైద్యం, ఉపాధి కల్పన, వ్యవసాయం వంటి కీలక అంశాలను పూర్తిగా విస్మరించడం జరుగుతోందని పేర్కొంది. ముఖ్యంగా విద్య, ప్రజారోగ్యం, వ్యవసాయ రంగాల మీద వ్యయం గణనీయంగా తగ్గిపోతోంది.
విచిత్రమేమిటంటే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోవి్‌డ మహమ్మారి తర్వాత సంక్షేమ పథకాలు, ప్రజారోగ్య కార్యక్రమాల మీద నిధులు ఖర్చు చేయడం ఎక్కువైంది. కోవి్‌డ కాలంలో ఉపాధి లేక పోవడం, ఆరోగ్యాలు క్షీణించడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉండవచ్చు. తమిళ నాడులో సాంఘిక సంక్షేమ పథకాలకు ఆద్యులుగా ఉన్నడి.ఎం.కె ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో మహిళల బ్యాంకు ఖాతాలకు నెలకు వెయ్యి రూపాయల వంతున బదిలీ చేయడం జరిగింది. ఈ పథకానికి ‘మగళీర్ ఉరిమై తొగై’ అనే పేరు పెట్టారు. సుమారు కోటి మంది మహిళలకు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అంతేకాక, పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థీ కాలే కడుపుతో వెళ్లకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా విస్తరించింది.
ఇటువంటి పథకాల వల్ల అట్టడుగు ప్రజానీకం లబ్ధి పొందుతున్న మాట నిజమే కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అప్పుల ఊబుల్లో కూరుకుపోతున్నాయి. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే తమిళనాడు రాష్ట్రమే అప్పుల విషయంలో అగ్రస్థానంలో ఉంది. 2022-23 బడ్జెట్ అంచనాల ప్రకారం, తమిళనాడు ప్రభుత్వం రూ. 7.54 లక్షల కోట్ల మేరకు అప్పులు చేసింది. ఆ తర్వాతి స్థానంలో రూ. 7.10 లక్షల కోట్లతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిలబడి ఉంది. స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ విషయంలో కొన్ని ప్రభుత్వాల తీరుతెన్నులు ఆందోళన కలిగించేవిగా కూడా ఉన్నాయి. గత ఏడాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలిపి చేసిన రుణం రికార్డు స్థాయికి చేరుకుంది. తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లు ప్రస్తుతం భారీ ఎత్తున నిధుల సేకరణలో నిమగ్నమై ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా, 2021-22ఆర్థిక సంవత్సరంలో 6,56, 626 కోట్ల రూపాయలున్న తమిళనాడు ప్రభుత్వ రుణం 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 7,53,860 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ రుణం 7,10,210 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ రెండు రాష్ట్రాలతో సహా కొన్ని రాష్ట్రాలు ఈ అప్పుల ఊబిలోంచి బయటపడడానికి నానా అవస్థలూ పడుతున్నాయి. అంతేకాదు, బడ్జెట్‌లోని రెవెన్యూ వ్యయంలో 45 నుంచి 47 శాతం వరకు ఉంటున్న జీతాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు కూడా శరవేగంతో పెరిగిపోతున్నాయి. నిజానికి వివిధ రాష్ట్రాలు ఈ అప్పుల ఊబి నుంచి బయటపడాలన్న పక్షంలో తప్పనిసరిగా అదనపు ఆదాయాలను సృష్టించాల్సి ఉంటుంది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. మూలధన వ్యయాన్ని పెంచాల్సి ఉంటుంది. ఇవి జరగనంత అవి కాలం అప్పుల ఊబిలో కూరుకుపోతూనే ఉంటాయి.
Freebies: ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ
అప్పుల ఊబి నుంచి రాష్ట్రాలు బయటపడేందుకు అదనపు ఆదాయాలే మార్గం