Homeఎడిటోరియల్ / బహుళHansa Mehta: మహిళా సమానత్వం కోసం పోరాడిన హన్సా మెహతా

Hansa Mehta: మహిళా సమానత్వం కోసం పోరాడిన హన్సా మెహతా

Freedom fighter Hansa Mehta: భారత మహిళా స్వాతంత్య్ర సమరయోధురాళ్ళలో హన్సా జీవరాజ్ మెహతా ప్రముఖులు. ఆమె స్వాతంత్య్ర సమరయోధురాలుగానే కాక విద్యావేత్తగా మరియు సంఘ సంస్కర్తగా బహుముఖ సేవలందించారు. ఆమె భారత గణతంత్రానికి “వ్యవస్థాపక మాతృమూర్తి” (ఫౌన్డింగ్ మదర్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్)గా విస్తృతంగా గుర్తింపు పొందారు. రాజ్యాంగ పరిషత్తులో (కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ) కీలక సభ్యురాలిగా, భారత రాజ్యాంగంలో ఆమె భారతీయ మహిళల హక్కులు మరియు విధుల చార్టర్‌ను రూపొందించడం మరియు లింగ సమానత్వాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె 1919 సెప్టెంబరులో, కేవలం 22 ఏళ్ల వయసులో ఒక యువ గుజరాతీ మహిళగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకోవడానికి బ్రిటన్‌కు వెళ్ళిన ఆమె ఆ తరువాత ఒక జాతీయవాద నాయకురాలిగా, తొలితరం స్త్రీవాదిగా, మరియు సహ-విద్యా (కోఎడ్యుకేషన్) విధానం కలిగిన ఒక భారతీయ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి మహిళా ఉపకులపతిగా ప్రఖ్యాతి గాంచారు.

- Advertisement -

మహిళా సాధికారత కోసం కృషి:
మహిళల హక్కులు మరియు లింగ సమానత్వం కోసం మెహతా చేసిన కృషికి లండన్‌లో ఆమె విద్యార్థి దశలోనే బీజం పడింది. అక్కడ ఆమె సరోజినీ నాయుడును కలిశారు. ఆమె మెహతాను సఫ్రాజిస్ట్ ఉద్యమంలోకి ఆకర్షించారు. 1920 జూన్‌లో జెనీవాలో జరిగిన 39 దేశాలకు చెందిన మహిళలు పాల్గొన్న అంతర్జాతీయ మహిళా ఓటు హక్కు కూటమి యొక్క ఎనిమిదవ సమావేశానికి ఆమె నాయుడుతో కలిసి భారతీయ మహిళల ప్రతినిధి బృందం సభ్యురాలిగా హాజరయ్యారు. మెహతా దృష్టిలో మహిళల హక్కులే మానవ హక్కులు. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసిన ఆమె మహిళల సామాజిక, రాజకీయ సమానత్వం మరియు వారి విద్యా హక్కు కోసం ప్రచారం చేశారు. స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో ఆమె తన ఆదర్శాల కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆమెలోని ఈ దృఢ నిశ్చయం 1947లో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో భారతదేశ ప్రతినిథిగా స్పష్టంగా ప్రతిబింబించింది. ఆ కమిషన్‌కు ఎలియనోర్ రూజ్‌వెల్ట్‌తో పాటు కేవలం ఇద్దరు మహిళా ప్రతినిధులలో ఒకరిగా ఆమె నియమితులయ్యారు. కాగా కమిషన్‌ రూపొందించిన సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనలో “పురుషులందరూ స్వేచ్ఛగా, గౌరవంలో మరియు హక్కులలో సమానంగా జన్మిస్తారు, వారికి ప్రకృతి ప్రసాదించిన వివేకం మరియు మనస్సాక్షి ఉంటాయి. వారు ఒకరితో ఒకరు సోదరుల వలె ప్రవర్తించాలి.” అనే ఆర్టికల్ 1 యొక్క పదజాలం పురుష పక్షపాతంగా ఉందని ఆ పదబంధం కాలం చెల్లిందని మెహతా ధైర్యంగా వ్యతిరేకించారు. అయితే సమావేశపు మినిట్స్ ప్రకారం, “పురుషులు” అనే పదం వాడకం “సాధారణంగా లింగబేధం లేకుండా మానవులందరినీ చేర్చడానికి ఆమోదించబడింది” అని రూజ్‌వెల్ట్ ప్రతివాదించారు. మెహతా మాత్రం సాంప్రదాయ భారతీయ మహిళగా మృదుస్వరంతోనే అయినప్పటికీ దృఢంగానే “పురుషులు” అనే పదాన్ని “మానవులు”గా మార్చాలని పట్టుబట్టి, తన వాదనకే కట్టుబడి ఉన్నారు. ఆమె సూచననుసరించి మరుసటి సంవత్సరం ఆమోదించబడిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఒప్పందాలకు పునాదిగా ఉపయోగించబడింది. భారత రాజ్యాంగ పరిషత్తులో 389 మంది సభ్యులలో కేవలం 15 మంది మాత్రమే మహిళలు. పదిహేను మంది మహిళల్లో ఒకరిగా, ఆమె ప్రత్యేక కోటాలకు వ్యతిరేకంగా వాదించారు. దానికి బదులుగా, స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు కల్పించాలని, లింగ సమానత్వాన్ని నిర్ధారించే పౌర స్మృతి కోసం ఆమె విశేషంగా కృషి చేశారు. మహిళా హక్కుల కార్యకర్తగా ఆమె అఖిల భారత మహిళా సదస్సు కు (ఆల్ ఇండియా ఉమెన్స్ కాంగ్రెస్) అధ్యక్షురాలిగా పనిచేశారు. మహిళలకు విద్య, ఆస్తి, విడాకుల విషయంలో సమాన హక్కులను డిమాండ్ చేస్తూ, భారత మహిళా చార్టర్‌ను రూపొందించడంలో ఆమె మార్గదర్శకత్వం వహించారు. గాంధీ స్ఫూర్తితో నిరసనలకు నాయకత్వం వహించడం, విదేశీ వస్తువులను అడ్డగించడం, బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించడం ద్వారా ఆమె స్వాతంత్రోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. దీని ఫలితంగా ఆమె అనేకసార్లు జైలు పాలయ్యారు. గాంధీ ప్రోద్బలంతో వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన దేశ్ సేవికా సంఘ్ అనే సంస్థకు నాయకత్వం వహించారు. ఈ సంస్థ బొంబాయిలో మహిళలతో పికెటింగ్ నిర్వహించింది. మద్యం మరియు విదేశీ వస్త్రాలు అమ్మే దుకాణాలకు వ్యతిరేకంగా పికెటింగ్ నిర్వహించడం, పోలీసుల ఆదేశాలను ధిక్కరించడం, అరెస్టు కావడం వంటి కారణాలతో ఆమె మూడుసార్లు జైలు పాలయ్యారు. 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ సభ ఛైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు ఆమె భారత మహిళల తరపున స్వతంత్ర భారతదేశపు మొదటి జాతీయ పతాకాన్ని అందజేశారు. 1937లో బొంబాయి శాసన మండలికి ఎన్నికైన తొలి మహిళ ఆమె అంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఆమె విద్యా, ఆరోగ్య శాఖల మంత్రికి పార్లమెంటరీ కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. ఆమె చేపట్టిన అన్ని ప్రయత్నాలలోనూ ప్రజా, రాజకీయ రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లారు.

విద్యావ్యాప్తికి కృషి:
భారతదేశంలోని ఒక కోఎడ్యుకేషన్ విశ్వవిద్యాలయానికి (మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా) మొదటి మహిళా వైస్-ఛాన్సలర్‌గా పనిచేసిన ఆమె, స్వాతంత్ర్యానంతరం విద్యారంగాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. మహిళల సమాన హక్కుల పట్ల మెహతాకు ఉన్న నిబద్ధత, విద్య పట్ల, ముఖ్యంగా బాలికలు/మహిళల విద్య పట్ల ఆమెకున్న అభిరుచికి సమాంతరంగా సాగింది. పార్లమెంటరీ కార్యదర్శిగా, ఆమె వృత్తి, వాణిజ్య మరియు సాంకేతిక విద్య కోసం పాఠశాలలను స్థాపించారు. ఆమె 1931 మరియు 1946 మధ్యకాలంలో బొంబాయి విశ్వవిద్యాలయం సెనేట్‌లో సభ్యురాలిగా కూడా పనిచేశారు. 1964లో, జాతీయ మహిళా విద్యా మండలి కమిటీకి అధ్యక్షురాలిగా, బాలురు మరియు బాలికలకు వేర్వేరు పాఠ్యప్రణాళికలు ఉండాలనే ప్రబలమైన అభిప్రాయాన్ని ఆమె సవాలు చేశారు, “స్త్రీ సహజ సామర్థ్యం” అనేదేమీ లేదని వాదించారు. 1946 నుండి 48 మధ్యకాలంలో ఎస్.ఎన్.డి.టి మహిళా విశ్వవిద్యాలయం (బొంబాయి) వైస్ ఛాన్సలర్‌గా పనిచేసారు. తర్వాత, జవహర్‌లాల్ నెహ్రూ ద్వారా మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా నియమితులైన ఆమె అప్పటివరకు కేవలం కొన్ని విడివిడి కళాశాలలు, ఒక పాలిటెక్నిక్, ఒక సంగీత పాఠశాల మరియు ఒక సంస్కృత పాఠశాల సముదాయంగా ఉన్న వాటిని ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారు. ఆమె సాంఘిక కార్య మరియు గృహ విజ్ఞాన విభాగాలను, మరియు అన్నింటికన్నా ముఖ్యంగా, భారతదేశంలోని అత్యుత్తమ విభాగాలలో ఒకటిగా నిలిచిపోయిన లలిత కళల విభాగాన్ని స్థాపించారు.

వ్యక్తిగతం:
హంసా మెహతా జూలై 3, 1897న సూరత్‌లో హర్షదాగౌరి మరియు మనుభాయ్ మెహతా దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి మనుభాయ్, బరోడా కళాశాలలో (ప్రస్తుతం మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం, బరోడా) తత్వశాస్త్ర ఆచార్యులుగా ఉండేవారు. తదనంతరం ఆయన బరోడా సంస్థానానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేవలం 2 శాతం మంది భారతీయ మహిళలు అక్షరాస్యులుగా ఉన్న కాలంలో, బరోడా ప్రగతిశీల పాలకుడు స్థాపించిన బాలికల ఉన్నత పాఠశాలలో ఆమె చదువుకున్నారు. ఆమె సర్ వాల్టర్ స్కాట్ మరియు జేమ్స్ ఫెనిమోర్ కూపర్ సహా ఇతర రచయితల నవలలు విస్తృతంగా చదివారు. బరోడా కళాశాల నుండి తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందిన కొద్దిమంది యువతులలో ఆమె ఒకరు. ఇంగ్లాండ్‌లో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఆమె భారత గానకోకిల సరోజినీ నాయుడును కలిశారు. 1920లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ మహిళా ఓటు హక్కు కూటమి (International Woman Suffrage Alliance) సమావేశానికి ఆమె సరోజినీ నాయుడుతో వెళ్లారు. తాను కలలో కూడా ఊహించని బహిరంగంగా మాట్లాడటం వంటి పనులను నాయుడు తనతో చేయించారని మెహతా 1981నాటి తన వ్యాసాల సంకలనం “ఇండియన్ వుమన్”లో రాశారు. లండన్‌లో విద్యాభ్యాసం చేసిన డాక్టర్ జీవరాజ్ నారాయణ్ మెహతాను ఆమె వివాహం చేసుకున్న ఆమె అతని తక్కువ కులం కారణంగా కులబహిష్కరణకు గురయ్యారు. వయసు సంబంధిత అనారోగ్య కారణాలతో ఏప్రిల్ 4, 1995న ఆమె తన 98 సంవత్సరాల వయసులో మరణించారు.

అంతర్జాతీయ గుర్తింపు:
ఐక్యరాజ్యసమితి మొట్ట మొదటి సారి 2021లో మహిళా సాధికారత యొక్క ప్రాథమిక ప్రాముఖ్యతపై “డాక్టర్ హన్సా మెహతా డైలాగ్‌” ధారావాహిక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. లింగ సమానత్వం, మహిళల హక్కులు మరియు మానవ హక్కుల పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహనను, చర్చను పెంపొందించడమే ఈ ధారావాహిక లక్ష్యం.

యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News