Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Library movement: స్వాతంత్య్రం కోసం కలం యుద్ధం

Library movement: స్వాతంత్య్రం కోసం కలం యుద్ధం

గ్రంథాలయోద్యమం స్వాతంత్రోద్యమంలో భాగం

ఒకపక్క స్వాతంత్య్రం కోసం పోరాటం సాగిస్తూ, ఇంకొకపక్క సాహితీ సేవను కొనసాగిస్తూ, మరొక పక్క గ్రంథాలయోద్యమ సారథిగా వ్యవహరిస్తూ, ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి గాడిచర్ల హరి సర్వోత్తమ రావు. 1883 సెప్టెంబర్‌ 14న కర్నూలులో జన్మించి 1960లో కన్నుమూసిన గాడిచర్ల హరిసర్వోత్తమ రావుదేశభక్తులైన బాలగంగాధర తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌ లను ఆదర్శంగా తీసుకుని, ఆద్యంతం ప్రజాసేవలో మునిగి తేలారు. నిజాం రాయలసీమ ప్రాంతాన్ని సీడెడ్‌ గా పరిగణిస్తున్న రోజుల్లో ఆయన ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు పెట్టడం జరిగింది. చివరికి అదే పేరు శాశ్వతంగా నిలబడిపోయింది. కర్నూలు, నంద్యాల, గుత్తి పట్టణాల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన గాడిచర్ల ఆ తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎ పట్టా పొందారు. ఆ తర్వాత రాజమండ్రిలో టీచర్స్‌ ట్రైనింగ్‌ కాలేజీలో శిక్షణ పొందుతూనే, స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు.
రాజమండ్రిలో శిక్షణ కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ కాలేజీకి బిపిన్‌ చంద్ర పాల్‌ వచ్చి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఆ ప్రసంగం నుంచి స్ఫూర్తి పొందిన విద్యార్థులు గాడిచర్ల నాయకత్వంలో ఆ మరునాడు నల్ల బ్యాడ్జీలు ధరించి రావడం, వందే మాతరం అంటూ నినాదాలు చేయడంపై ప్రిన్సిపాల్‌ మార్క్‌ హంటర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాడ్జీలు తీసేసి తరగతులకు రావాలని, వందే మాతరం అనే మాట ఇక వినిపించకూడదని ఆయన ఆదేశించారు. ఇందుకు విద్యార్థులు తిరస్కరించడంతో ఆయన గాడిచర్లను సస్పెండ్‌ చేయడమే కాకుండా, ఆయనకు ఏ కాలేజీలోనూ ఉద్యోగం ఇవ్వకూడదని ఉత్తర్వులు జారీచేయడం జరిగింది. ఇది గాడిచర్ల జీవితాన్ని మలుపుతిప్పింది. రాజమండ్రి విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలియజేసినప్పటి నుంచి దేశంలో స్వాతంత్య్ర ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మొదలైంది.
ఆయన బోడి నారాయణ రావు అనే స్వాతంత్య్ర వీరుడి సహాయంతో 1908లో స్వరాజ్య అనే సంచికను ప్రారంభించి, బ్రిటిష్‌ విధానాలను నిరసించడం ప్రారంభించారు. ఇందులో ఆయన అనేక వ్యాసాలు, విశ్లేషణలు రాశారు. ఎందరో రచయితలను ప్రోత్సహించి బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాయించేవారు. బ్రిటిష్‌ వారిపై ఆయన స్వరాజ్యల రాసిన ’విపరీత బుద్ధి‘ అనే వ్యాసాన్ని చూసి బ్రిటిష్‌ పోలీసులు ఆయనను అరెస్టు చూసి, దేశ ద్రోహం నేరం కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించడం జరిగింది. 1914లో అనీ బిసెంట్‌, తిలక్‌ కలిసి ప్రారంభించిన హోమ్‌ రూల్‌ లీగ్‌ ఆంధ్ర విభాగానికి ఆయన కార్యదర్శిగా పనిచేశారు. మోతీలాల్‌ నెహ్రూ, చిత్తరంజన్‌దాస్‌ కలిసి ప్రారంభించిన స్వరాజ్‌ పార్టీలో చేరిన హరి సర్వోత్తమ రావు ఆతర్వాత ఆ పార్టీ తరఫున మద్రాసు ప్రెసిడెన్సీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయోద్యమాన్ని ప్రారంభించిన అయ్యంకి వెంకట రమణయ్య, పాతూరి నాగభూషణం, గాడిచర్ల హరిసర్వోత్తమ రావులను గ్రంథాలయ త్రిమూర్తులుగా అభివర్ణించేవారు.
అప్పట్లో ఆంధ్రకేసరి, ఆంధ్రవార్త, ఆంధ్ర పత్రిక, మాతృసేవ, పంచాయతీరాజ్యం వంటి పత్రికల్లో పని చేస్తూ, వందలాది వ్యాసాలు, రచనలు సాగించిన హరి సర్వోత్తమ రావు, అబ్రహాం లింకన్‌ చరిత్ర, విస్మృత రాజకవి, శ్రీరామ చరిత్ర వంటి ప్రామాణిక గ్రంథాలను కూడా రచించి, సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో ఎక్కువగా సాహిత్య సేవ ద్వారా గుర్తింపు పొందడం జరిగింది. ఆయన ఏ వ్యాసం రాసినా, ఏ రచన చేసినా, ఏ విశ్లేషణను ప్రచురించినా బ్రిటిష్‌ పాలకుల వెన్నుల్లో చలిపుట్టేది. ఆయన గ్రంథాలు కూడా తెలుగునాట ఒక అపూర్వమైన చరిత్రను సృష్టించాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి, పుస్తక పఠనాన్ని, విజ్ఞానాన్ని పెంచడంలో ఆయన పోషించిన పాత్ర ఎంతో కీలకమైనది, చిరస్మరణీయమైనది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News