ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు సాధారణ సూచనలు మాత్రమే కావు. అవి దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిడికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజలకు ఇలాంటి పొదుపు ఉపన్యా సాలు సాధారణంగా ఆర్థిక సంక్షోభాల సమయంలోనే వినిపిస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే, ప్రజల వినియోగ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. కానీ ఇప్పుడు ప్రజలే ఖర్చు తగ్గించుకోవాలని కోరడం వెనుక కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి.
గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో జరిగిన మార్పులను పరిశీలిస్తే ఈ విమర్శలకు బలం చేకూరుతుంది. 2014లో భారతీయ జనతా పార్టీ, అధికారంలోకి వచ్చినప్పుడు డాల ర్‌తో పోలిస్తే రూపాయి విలువ సుమారు రూ.60 వద్ద ఉం డేది. ఇప్పుడు అది రూ.94 దాటిన స్థాయికి చేరడం రూపాయి బలహీనతకు నిదర్శనం. అంతేకాదు, దేశ అభివృద్ధి రేటు కూడా ఆశించిన స్థాయిలో పెరగలేదు. భారీ ప్రచారం చేసిన ప్పటికీ ఉపాధి అవకాశాలు పెరగలేదు. యువతలో నిరు ద్యోగం పెరిగింది. వ్యవసాయ రంగం సంక్షోభంలోనే ఉంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు కోలుకోలేని దెబ్బలు తిన్నాయి.
ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటిగా పెద్దనోట్ల రద్దు నిర్ణ యాన్ని ఆర్థిక నిపుణులు ఇప్పటికీ ప్రస్తావిస్తుంటారు. 2016లో ఒక్క రాత్రిలో దేశంలో చలామణిలో ఉన్న 86 శాతం కరె న్సీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక చరిత్రలో అత్యంత వివాదాస్పద చర్యగా మిగిలిపోయింది. నల్లధనం అంతమవుతుందని, ఉగ్రవాదానికి నిధులు ఆగిపోతాయని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. కానీ తర్వాత Reserve Bank of India విడుదల చేసిన గణాంకాల ప్రకారం రద్దయిన నోట్లలో 99 శాతం కంటే ఎక్కువ తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయి. అంటే నల్లధనం అంతరించలేదని స్పష్టమైంది. పైగా ఈ నిర్ణయం వల్ల చిన్న వ్యాపారాలు, అసంఘటిత రంగం తీవ్రం గా దెబ్బతిన్నాయి. కోట్లాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. నగదు ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.
దేశ ఆర్థిక వ్యవస్థపై మరో పెద్ద భారం ప్రభుత్వ అప్పులు. 2014 లో కేంద్ర ప్రభుత్వ అప్పు సుమారు రూ.56 లక్షల కోట్లు ఉండగా, ఇప్పుడు అది రూ.170 లక్షల కోట్లకు పైగా చేరిందని అంచనాలు చెబుతున్నాయి. అంటే ప్రతి భారతీయుడి మీద భారీ అప్పు భారం పడింది. ఈ అప్పులపై వడ్డీలు చెల్లించడానికే బడ్జెట్‌లో పెద్ద భాగం ఖర్చవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు సరిపడా నిధులు సమకూర్చడం కష్టమవుతున్నది.
ఇక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతూనే ఉన్నది. కానీ చమురు ధరలు తగ్గినప్పుడు ఆ లాభం వినియోగదా రులకు పూర్తిగా అందలేదు. భారీ ఎక్సైజ్ సుంకాల రూపంలో కేంద్రం ఆదాయం పెం చుకుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రవాణా ఖర్చులు పెరగడంతో అన్ని వస్తువుల ధరలు పెరి గాయి. వంటగ్యాస్ ధరలు కూడా సామాన్య కుటుం బాలకు భారంగా మారాయి. ఒక ప్పుడు రూ.400 ప్రాంతంలో ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు దాదాపు వెయ్యి రూపా యలకు చేరడం మధ్యతరగతి, పేద కుటుం బాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచింది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు “వాహ నాలు వాడకండి”, “పెట్రోల్ ఆదా చేయండి” అని చెప్పడం ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పిం చుకోవడమేనని విమర్శకులు అంటున్నారు. ప్రజారవాణా వ్యవస్థ బలహీనంగా ఉన్న అనేక ప్రాంతాల్లో వ్యక్తిగత వాహనాలే ప్రజలకు ఆధారం. గ్రామీణ ప్రాంతా ల్లో మెట్రో అనే అవకా శమే లేదు. ఆర్టీసీ సేవలు కూడా అనేక చోట్ల తగిన స్థాయిలో లేవు. ఈ వాస్తవాలను పక్కన పెట్టి ప్రజలనే బాధ్యత వహించమని చెప్పడం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోవడమే అని భావిస్తున్నారు.
వ్యవసాయ రంగంలో కూడా కేంద్ర విధానాలపై తీవ్ర అసంతృప్తి ఉంది. రైతులకు ఎరువుల వినియోగం తగ్గించమని చెప్పడం సులభం. కానీ ఇప్పటికే ఎరువుల కొరత, పెరిగిన సాగు ఖర్చులు, కనీస మద్దతు ధరల సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దిగుబడులు తగ్గితే రైతు అప్పుల్లో మునిగిపోతాడు. అలాంటి సమయంలో యూరి యా తగ్గించమని చెప్పడం రైతు వాస్తవాలను అర్థం చేసుకోని వ్యాఖ్యగా కనిపిస్తున్నది.
దేశ సంపద కొద్దిమంది కార్పొరేట్ వ్యాపారవేత్తల చేతుల్లో కేంద్రీకృతమవుతున్నదన్న విమర్శలు కూడా బలపడుతున్నాయి. ముఖ్యంగా ఆదాని, అంబానీ వంటి వ్యాపార దిగ్గజాలకు ప్రభుత్వ అనుకూలత అధికమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు కార్పొరేట్ సంస్థలకు మాఫీ అవుతుంటే, రైతుల చిన్న రుణాల మాఫీ విషయంలో మాత్రం కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. “దేశభక్తి” పేరుతో ప్రజలు కష్టాలు భరించాలనడం, పెద్ద వ్యాపారవేత్తల ప్రయోజనాల విష యంలో మాత్రం మౌనం పాటించడం ద్వంద్వ వైఖరికి ఉదాహరణగా కనిపిస్తున్నది.
మోదీ పాలనలో ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యం కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. భారీ ఈవెంట్లు, విదేశీ పర్యటనలు, మీడియా ప్రచారాలు, “డబుల్ ఇంజిన్ సర్కార్” నినాదాలు – ఇవన్నీ ప్రజలకు ఒక బలమైన ప్రభుత్వ ప్రతిభను చూపించాయి. కానీ నేల స్థాయి వాస్తవాలు మాత్రం వేరే చిత్రాన్ని చూపుతున్నాయని విమర్శ కులు అంటున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రూపాయి పతనం, చిన్న వ్యాపారాల సంక్షోభం, వ్యవసాయ సమస్యలు – ఇవన్నీ ప్రజల రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి.
పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం భారత్‌పై పడే అవకాశముం దని ఇప్పుడు కేంద్రం చెబుతున్నది. నిజమే, భారత్ చమురు దిగుమతు లపై ఆధారపడే దేశం. హోర్ముజ్ జలసంధి ద్వారా వచ్చే సరఫరాలు ఆగిపోతే లేదా అంతరాయం కలిగితే ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉంది. కానీ ఇలాంటి ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి ప్రత్యా మ్నాయ వ్యూహాలు సిద్ధం చేయడం ప్రభుత్వ బాధ్యత. సంక్షో భం వచ్చి న తర్వాత ప్రజలను పొదుపు పాటించమని అడగడం పాలనా వైఫల్యాన్ని సూచిస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఎన్నికల సమయంలో మాత్రం దేశ ఆర్థిక పరి స్థితిపై నిజాలను దాచిపెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. “అభివృద్ధి”, “అమృతకాలం”, “విశ్వగురు” వంటి నినాదాలతో ప్రజల్లో ఆశలు పెంచినా, ఇప్పుడు ఒక్కసారిగా “ఖర్చులు తగ్గించండి” అని చెప్పడం ప్రజల్లో గందరగోళానికి దారి తీస్తు న్నది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల బాధ్యత వాస్తవా లను నిజాయితీగా చెప్పడం. కానీ ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రచారాన్ని ఆయుధంగా ఉపయోగించి, తర్వాత సమస్యల భారం ప్రజలపై మోపడం సరైన విధానం కాదంటున్నారు.
దేశభక్తి భావోద్వేగాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగిం చడం కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ప్రజలు ఇబ్బందులు పడితే “దేశం కోసం త్యాగం చేయాలి” అని చెప్పడం సులభం. కానీ అదే సమయంలో అవినీతి, కార్పొరేట్ అను కూల విధానాలు, పెరుగు తున్న అసమానతలపై ప్రభుత్వం మౌనం పాటిస్తే ప్రజల్లో అసంతృప్తి పెరగడం సహజం. దేశభక్తి అంటే ప్రజలు కష్టపడటమే కాదు, పాలకులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలి. ప్రజల డబ్బును సమర్థంగా వినియోగించాలి. సంపద కొద్దిమం దికి కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చూడాలి.
ఈ నేపథ్యంలో యువత పాత్ర కూడా కీలకం. ప్రచారం, వాస్తవం మధ్య తేడాను గుర్తించగలగాలి. సోషల్ మీడియా ప్రచారాలు, భావో ద్వేగ నినాదాలకే పరిమితం కాకుండా ఆర్థిక గణాంకాలు, ఉపాధి పరి స్థితులు, ధరల పెరుగుదల వంటి అంశాలను విశ్లేషించాలి. ప్రజాస్వా మ్యంలో ప్రశ్నించడం తప్పు కాదు, అది ప్రజల హక్కు. ప్రభుత్వం ఎవరైనా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఉత్పత్తి రంగాలను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలు పెంచడం, చిన్న వ్యాపారా లకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ రంగాన్ని రక్షించడం, పారదర్శక ఆర్థిక విధానాలు అమలు చేయడం ద్వారా మాత్రమే దేశం బలపడుతుంది. విజయాలను తమ ఖాతాలో వేసుకొని, వైఫల్యాలకు అంతర్జాతీయ పరిస్థితులు లేదా ప్రజల వినియోగ అలవాట్లను కారణంగా చూపడం సరైన నాయకత్వ లక్షణం కాదు. నిజమైన నాయకత్వం సంక్షోభాలను ముందుగానే అంచనా వేసి పరిష్కార మార్గాలు చూపుతుంది. ప్రజలకు భయం కలిగించడం కాదు, భరోసా కల్పిస్తుంది.
కాలమ్ : ఉతుకు
మన్నారం నాగరాజు
సామాజిక, రాజకీయ విశ్లేషకులు

