డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వచ్చిందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీలిరంగు రెపరెపలాడుతుంది. మైకుల మోత, పూలమాలల అలంకరణలతో విగ్రహాల వద్ద కోలాహలం కనిపిస్తుంది. కానీ, ఈ బాహ్య ప్రదర్శనలన్నీ బాబాసాహెబ్ ఆశించిన భారతాన్ని నిర్మిస్తున్నాయా? లేక ఆయనను ఒక దేవుడిగా మార్చి, ఆయన విప్లవాత్మక భావజాలాన్ని అటకెక్కి స్తున్నాయా? అనేది ఇవాళ ప్రతి అంబేద్కరిస్టు, ప్రతి సామాజిక కార్యకర్త వేసుకోవాల్సిన ఆత్మవిమర్శనాత్మక ప్రశ్న. అంబేద్కర్ పేరుతో ఇవాళ వేల సంఖ్యలో సంఘాలు పుట్టుకొచ్చాయి. ప్రతి వీధిలో ఒక కమిటీ ఉంది. అయితే, ఈ సంఘాలు చేస్తున్నదే మిటి? కేవలం జయంతి, వర్ధంతులకు పరిమితం కావడం, విగ్రహాల ఎత్తుపై పోటీ పడటం, లేదా రాజకీయ పార్టీల వద్ద సీట్ల కోసం, పదవుల కోసం బేరసారాలు చేయడం వీరి దగ్గరే ప్రస్థానం ఆగిపోతోంది. అంబేద్కర్ అంటే కేవలం ఒక కులానికి చెందిన నాయకుడో, లేదా రాజ్యాంగం రాసి ఇచ్చిన ఒక చట్ట బద్ధ అధికారి మాత్రమే కాదు. ఆయన ఒక నిరంతర చైతన్యం. ఆయనను ఒక వర్గానికి పరిమితం చేయడం అంటే ఆయనను మరోసారి అంటరానివాడిని చేయడమే. సమాజాన్ని ఉద్ధరి స్తున్నామని చెప్పుకునే నేతలు, తమ కోసం అంబేద్కర్ పేరును ఒక కవచంలా వాడుకుంటున్నారే తప్ప, ఆయన కలగన్న సామాజిక ప్రజాస్వామ్యాన్ని (Social Democracy) కింది స్థాయికి తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. విగ్రహం చుట్టూ తిరగడం కాదు, విగ్రహం చూపిన దిశ వైపు నడవడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక తెలుగు నేలపై అంబేద్కరిజం, మార్క్సిజం మధ్య దశాబ్దాల కాలంగా ఒక అనవసర సైద్ధాంతిక గోడ ఉంది. మార్క్సిస్టులు వర్గాన్ని మాత్రమే చూస్తే, అంబేద్కరిస్టులు కులాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకున్నారు. కానీ, భారతీయ సామాజిక స్థితిగతుల్లో కులం అనేది కేవలం సామాజిక అంత రం మాత్రమే కాదు, అది ఒక పక్కా ఆర్థిక వ్యవస్థ. అంబేద్కర్ ప్రతిపాదించిన రాజ్య సోషలిజానికి, మార్క్స్ చెప్పిన శ్రామిక వర్గ విముక్తికి మధ్య ఉన్న సామీప్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది. కుల నిర్మూలన జరగకుండా ఇక్కడ వర్గ పోరాటం విజయం సాధించదు, అలాగే ఆర్థిక సమానత్వం లేకుండా సామాజిక గౌరవం నిలబడదు. శ్రమ విభజన కాదు, శ్రామికుల విభజన జరుగుతున్న ఈ దేశంలో.. ఈ రెండు సిద్ధాంతాలూ పర స్పర సహకారం లేకుండా ముందుకు సాగలేవు. ఈ సత్యాన్ని అంబేద్కరిస్టులు, మార్క్సిస్టు శిబిరాలు ఇగోలను పక్కనపెట్టి గుర్తించాలి. అంబేద్కరిజం – మార్క్సిజానికి తోడుగా మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని జోడించాల్సిన అవసరం ఉంది.
ఈ రెండు సిద్ధాంతాల మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చడానికి దివంగత మానవ హక్కుల నేత కె. బాలగోపాల్ ఆలోచనా విధా నం ఇవాళ అత్యంత కీలకం, అవసరమని కూడా గుర్తించాలి. పరిగణలోకి తీసుకోవాలి. మార్క్సిజంతో ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత దళిత, బహుజన ఉద్యమాల ప్రాధాన్యతను గుర్తించిన బాలగోపాల్ ఒక గొప్ప సమన్వయకర్త. ‘కులం ఒక వాస్తవం, వర్గం ఒక సత్యం’ అని ఆయన గుర్తించారు. కేవలం ఆర్థిక మార్పు వస్తే కులం పోతుందని భావించడం మార్క్సిస్టుల పొర పాటని, అలాగే కేవలం కుల అస్తిత్వంతోనే పూర్తి విముక్తి వస్తుం దని అనుకోవడం అంబేద్కరిస్టుల పరిమితి అని ఆయన ఎత్తి చూపారు. హక్కుల పోరాటంలో మానవీయ కోణాన్ని జోడించి, రాజ్యాంగ పరిధిలో ఉంటూనే విప్లవాత్మక మార్పు ఎలా సాధ్యమో బాలగోపాల్ ఆలోచన, ఆచరణ తెలుపుతుంది. నేటి తరానికి ఆ సమన్వయ దృక్పథం అవసరం. అంబేద్కర్ సంఘా లు, మేధావులు కేవలం భావోద్వేగపూరిత ఉపన్యాసాలకే పరిమితం కాకూడదు. విగ్రహాల అలంకరణ కంటే ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘాల్లో వ్యక్తుల ఆరాధన మానేసి, సామాజిక సమస్యలపై మేధోమథనం చేయాలి. బాలగోపాల్ ఆశించినట్లుగా.. కులం, వర్గం, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పనిచేసే అన్ని ప్రజాస్వామ్య శక్తులను ఒకే తాటిపైకి తీసుకు రావాలి.
రాజేందర్ దామెర
జర్నలిస్ట్

