Saturday, October 12, 2024
Homeఓపన్ పేజ్Future city Mucherla: నాలుగో న‌గ‌రం @ ఫ్యూచ‌ర్ సిటీగా ముచ్చ‌ర్ల‌

Future city Mucherla: నాలుగో న‌గ‌రం @ ఫ్యూచ‌ర్ సిటీగా ముచ్చ‌ర్ల‌

న్యూయార్క్ కంటే ఆధునికంగా ఫోర్త్ సిటీ..

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని మూసీన‌ది ఒడ్డున‌ నిజాం రాజైన మ‌హ‌మ్మ‌ద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. న‌గ‌రానికి 434 ఏళ్ల చ‌రిత్ర ఉంది. నాడు న‌వాబులు నిర్మించిన న‌గ‌రం దిన‌దినాభివృద్ధి చెందుతూ దేశంలోనే 5వ అతిపెద్ద మ‌హాన‌గ‌రంగా గుర్తింపు సాధించింది. హ‌స్త‌క‌ళ‌లు, ఉద్యాన‌వ‌నాలు, నాట్యానికి ప్ర‌సిద్ధి చెందిన హైద‌రాబాద్ నేడు ఐటీ న‌గ‌రంగా ప్ర‌ఖ్యాతి పొందింది. హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌, ఆ త‌ర్వాత సైబ‌రాబాద్ న‌గ‌రాలుగా అభివృద్ధి చెందింది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని కులీ కుతుబ్ షా నిర్మించింది చ‌రిత్ర‌. కానీ నాలుగో న‌గ‌రాన్ని రంగారెడ్డి జిల్లా ముచ్చ‌ర్ల‌లో సీఎం రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్మించ‌పోయేది మాత్రం మ‌న క‌ళ్ల ముందు జ‌రుగుతుంది. నాడు కులీ కుతుబ్ షా భాగ్య‌న‌గ‌రాన్ని నిర్మించ‌డం ఎంత నిజ‌మో.. నేడు సీఎం రేవంత్‌రెడ్డి నాలుగో న‌గ‌రాన్ని నిర్మించ‌డం చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం విశ్వ‌న‌గ‌రంగా పేరు, ప్ర‌ఖ్యాత‌లు సాధించ‌నుంది. ఇదే కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల‌ను క‌లిపితే ప్ర‌పంచంలోని మ‌హాన‌గ‌రాల‌లో 41వ స్థానంలో నిలువ‌నుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగో న‌గ‌రంగా ముచ్చ‌ర్ల అనేది కీలక నిర్ణయంగా భావించాలి. నాడు న‌వాబులు న‌గ‌రాన్ని తొలుత చించ‌లం(నేటి శాలిబండ‌) అనే చిన్న గ్రామంలో నిర్మిస్తే.. నేడు రేవంత్‌రెడ్డి ముచ్చ‌ర్ల కేంద్రంగా ప్ర‌స్తుతం 13,972 ఎక‌రాల‌లో ఫ్యూచ‌ర్ సిటీని నిర్మించ‌డం విశేషం.

- Advertisement -

అభివృద్ధి చెందిన దేశం అమెరికా. అమెరికాలోనే న్యూయార్క్ సిటీ ఉంది. న్యూయార్క్ న‌గ‌రం కంటే కూడా అద్భుతంగా ముచ్చ‌ర్ల‌లో నిర్మాణం అవుతున్న ఫ్యూచ‌ర్ సిటీ (నాలుగో న‌గ‌రాన్ని) తీర్చిదిద్ద‌నున్న‌ట్టుగా ఇప్ప‌టికే సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించడం త‌న ముందున్న విజ‌న్‌కు అంద‌రం హ‌ర్షించాల్సిందే. మ‌న‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 2047 నాటికి వందేళ్లు నిండ‌నున్నాయి. దీంతోనే కేంద్ర ప్ర‌భుత్వం 2047 నాటికి విక‌సిత భార‌త్‌(అభివృద్ధి చెందిన దేశం)గా అంటుంది. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అమెరికాలో అత్యంత పేరు, ప్ర‌ఖ్యాత‌లున్న న్యూయార్క్ న‌గ‌రంతోనే ఫ్యూచ‌ర్ సిటీ పోటీ ప‌డుతుంద‌ని ప్ర‌క‌టించ‌డం మ‌రో గొప్ప విష‌యంగా భావించాలి. అంత‌ర్జాతీయంగా హైద‌రాబాద్‌కు అన్ని రంగాల‌లో పేరుంది. ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణంతో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం విశ్వ‌న‌గ‌రంగా వృద్ధి చెంద‌నుంది.

మ‌న‌ దేశానికి ఆర్ధిక న‌గ‌ర‌మైన ముంబ‌యి న‌గ‌రం అభివృద్ధిలో భాగంగా దీనిపై పై ఒత్తిడి త‌గ్గించ‌డం కోసం న‌వీ ముంబయిని తీర్చిదిద్దింది. నేడు ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మైన‌, అతిపెద్ద ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మైన షాట్‌లైట్ టౌన్‌షిప్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. దేశంలో ప‌ట్ట‌ణీక‌ర‌ణ ప్ర‌క్రియ‌లో 39,420 ఎక‌రాల విస్తీర్ణంతో అద్భుత‌మైన న‌గ‌రంగా పేరొందింది. సిటీ అండ్ ఇండ‌స్ట్రీయ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌(సిడ్కో) ఆధ్వ‌ర్యంలోనే అన్ని రంగాల‌లో ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా అభివృద్ధిని సాధించింది. వాణిజ్య‌, వ్యాపార‌, విద్యా సంస్థ‌ల‌కు కేంద్రంగా నిలిచింది. వివిధ బ‌హుళ‌జాతి సంస్థ‌ల కార్యాల‌యాలు సైతం న‌గ‌రం అంతా విస్త‌రించి ఉన్నాయి. దేశ రాజ‌ధాని దిల్లీపై జ‌నాభా భారాన్ని త‌గ్గించేందుకు రాజ‌ధాని చుట్టూ నివాస‌, పారిశ్రామిక ప్రాంతాల‌ను ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం అభివృద్ధి చేయ‌డం జ‌రిగింది. అందులో భాగంగానే హర్యానా స‌రిహ‌ద్దులోని గుర్గావ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాల‌ను అభివృద్ధి చేశారు. గ్రేట‌ర్ నోయిడా 38,000 హెక్టార్ల‌ల్లో ఒక ప్ర‌ణాళిక‌బ‌ద్ధ‌మైన న‌గ‌రంగా నిర్మించ‌బ‌డింది. నేడు గ్రేట‌ర్ నోయిడా ఐటీ, కార్పొరేట్‌, పారిశ్రామిక‌, ఇత‌ర బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు కేంద్రంగా మారింది.

న‌వీ ముంబయి, గ్రేట‌ర్ నోయిడాల‌ను త‌ల‌త‌న్నేలా నాలుగో న‌గ‌రంగా ముచ్చ‌ర్ల‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా ముందుకు సాగుతుంది. అంత‌ర్జాతీయ పెట్టుబ‌డుల‌తో మ‌హాద్భుత‌మైన న‌గ‌రంగా నిర్మాణం చేయ‌నుంది. ఇటీవ‌ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీ‌ధ‌ర్‌బాబు బృందం అమెరికా, ద‌క్షిణ కొరియాల‌కు వెళ్లి ఫ్యూచ‌ర్ సిటీలో విదేశీ పెట్టుబ‌డులను ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ‌, దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధుల‌తో భేటీ అయి నాలుగో న‌గ‌రం గురించి వివ‌రించి ఇక్క‌డ పెట్టుబ‌డు పెట్టాల్సిందిగా కోరారు. మొత్తంగా 7 రోజుల అమెరికా, రెండు రోజుల ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న‌ల‌లో అమెరికా నుంచి రూ.31,502 కోట్లు, ద‌క్షిణ కొరియా నుంచి రూ.4,500 కోట్ల విలువైన పెట్టుబ‌డుల‌కు ఒప్పందాలు కుదిరాయి. దీంతో సుమారు 30,750 మందికిపైగా ఉద్యోగాలు రానున్నాయి. మెట్రో రైలుతో పాటు ఇత‌ర ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను అనుసంధానం చేయ‌నున్నారు. న‌వీ ముంబయి త‌ర‌హాలోనే నాలుగో న‌గ‌రం అభివృద్ధికి కార్పొరేష‌న్ లేదా ఒక అథారిటీని ఏర్పాటు చేసి దాని కింద‌నే అభివృద్ధి, నిర్వ‌హ‌ణ‌ను చేప‌డితే సీఎం రేవంత్‌రెడ్డి క‌ల‌లుకంటున్న న్యూయార్క్ త‌ర‌హాలో తీర్చిదిద్ద‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీనికి అనేక కార‌ణాలున్నాయి. దేశంలో స‌ముద్రాలు లేకుండా విస్త‌రించేదుకు, ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌కు అవ‌కాశం ఉన్న‌వి క‌ర్ణాట‌క‌లో బెంగ‌ళూరు, తెలంగాణ‌లో హైద‌రాబాద్ మాత్ర‌మే. నాలుగో న‌గ‌రంగా నిర్మాణం చేసే ప్రాంతంలో ఐటీ, పారిశ్రామిక‌, నివాసం, ఇత‌ర అన్ని రంగాల‌కు అనువైన‌ వేలాది ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఫోర్త్‌ సిటీ లో హైదరాబాద్ సిటిలో ఉన్నట్లుగానే రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మౌలిక సదుపాయాలు, ప్రధానంగా విశాలమైన రోడ్లు, త్రాగునీటి సౌకర్యాలు, విద్యా, వైద్య సౌకర్యాలను పక్కా ప్రణాళికబ‌ద్ధంగా ఏర్పాటు చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

ఒక న‌గ‌రం అత్యుత్త‌మ న‌గ‌రంగా గుర్తింపును సాధించాలంటే ప్ర‌ధానంగా కావాల్సిన‌వి విశాల‌మైన ర‌హ‌దారులు, త‌గినంత తాగునీరు, మంచి ట్రాఫిక్ నిర్వ‌హ‌ణ‌, క‌ట్టుదిట్ట‌మైన శాంతి భ‌ద్ర‌త‌లు, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, భూగ‌ర్భ డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌, నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా, మంచి క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌, స్వ‌చ్ఛ‌మైన వాతావ‌ర‌ణం వంటివి ఉండాలి. ఇవ్వ‌న్నీ కూడా నాలుగో న‌గ‌రానికి ఉన్నాయి. శ్రీశైలం హైవేతో ఈ ప్రాంతానికి ప్రస్తుతం చక్కని రోడ్‌ కనెక్టివిటీ ఉంది. అందుబాటులోనే అంత‌ర్జాతీయ‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇక్క‌డ నుంచి మెట్రోను ముచ్చర్ల వరకు పొడిగించుకునే అవ‌కాశం ఉంది. ఒక ప‌క్క‌న‌ ఓఆర్‌ఆర్‌, మ‌రో ప‌క్క‌న‌ ఆర్ఆర్ఆర్ సైతం అందుబాటులో ఉండ‌టం మ‌రో గొప్ప విష‌యం.
ముచ్చర్ల ప్రాంతంలో ప్రభుత్వం సేకరించిన 20 వేల ఎకరాల భూములున్నాయి. ఇక్క‌డి భూముల‌ను ప‌లు జోన్లుగా విభజించి ఎలక్ట్రానిక్‌, జనరల్‌ ఇండస్ట్రీస్‌, లైఫ్‌ సైన్స్‌ హబ్‌, నివాస-వాణిజ్య అవసరాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు, క్రీడా మైదానాలు, ఆతిథ్య, వినోదం, పర్యాటకం, తదితర విభాగాల‌కు కేటాయించి దీరి కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసి ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా అభివృద్ధి చేస్తే మ‌రో అద్భుత‌మైన న‌గ‌రంగా నాలుగో న‌గ‌రం రూపుదిద్దుకోనుంది. ఇదే ప్ర‌ణాళిక‌తో సీఎం రేవంత్‌రెడ్డి నాలుగో న‌గ‌రం అభివృద్ధి, విస్త‌ర‌ణ‌కు అడుగులు వేస్తున్నారు. ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 1000 ఎక‌రాల‌లో జూ పార్క్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టుగా సీఎం ప్ర‌క‌టించారు. బీసీసీఐతో చ‌ర్చించి 100 ఎక‌రాల‌లో క్రికెట్ స్టేడ‌యాన్ని సైతం ఏర్పాటు చేయ‌నున్న‌ట్టుగా ఇప్ప‌టికే ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం ఉప్ప‌ల్‌లోని రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం 30 ఎక‌రాల లోపే ఉంటుంది. కానీ నాలుగో న‌గ‌రంలో ఏకంగా 100 ఎక‌రాల‌లో ఏర్పాటు చేసే స్టేడియానికి అంత‌ర్జాతీయంగా గుర్తించు తెచ్చుకోనుంది.

నాలుగో న‌గ‌రం కృత్రిమ మేధ న‌గ‌రిగా గుర్తింపును తెచ్చుకోనుంది. అర్టిఫిషియ‌ల్ ఇంటలిజెన్సీ(ఏఐ) అభివృద్ధి, విస్త‌రణ‌కు ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తోంది. రానున్న కాలంలో ఏఐకీ కేరాఫ్‌గా నాలుగో న‌గ‌రం మారే అవ‌కాశం ఉంది. నాలుగో న‌గ‌రంలో కృత్రిమ మేథ న‌గ‌రానికి 297 ఎక‌రాల‌ను ప్ర‌భుత్వం కేటాయించింది. నాలుగో న‌గ‌రం ఏర్పాటుకు బెగ‌రికంచ‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఇత‌ర మంత్రుల చేతుల మీదుగా యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీకి శంకుస్థాప‌న జ‌రిగిన రోజే బీజం ప‌డింద‌ని చెప్పుకోవ‌చ్చు. ఈ వ‌ర్సిటీ ఏర్పాటును కూడా ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. రాష్ట్రంలోని యువ‌త‌ను ప్ర‌పంచ స్థాయిలో ఉద్యోగులుగా తీర్చిదిద్ధే సాంకేతిక నైపుణ్యాన్ని ఈ వ‌ర్సిటీ అందించ‌నుంది. ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో ముందుగా కోర్సుల‌ను అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు క్రీడా, ఇత‌ర విశ్వ‌విద్యాల‌యాల కోసం ప్ర‌త్యేక‌మైన‌ జోన్‌గా ఏర్పాటు చేయ‌నున్నారు. ఇందుకు 454 ఎక‌రాల‌ను కేటాయించారు. ఎల‌క్ట్రానిక్స్‌, సాధార‌ణ ప‌రిశ్ర‌మ‌ల‌ను కూడా ఏర్పాటుకు ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది. 4,774 ఎక‌రాల‌లో అతిపెద్ద పారిశ్రామిక జోన్‌ను ఏర్పాటు చేయ‌నుంది. వీటిని స్థాపించేందుకు విదేశీ సంస్థ‌లు సైతం ఆస‌క్తి చూపుతున్నాయి. కొంగ‌ర్‌క‌లాన్‌లో ఆపిల్ ఫోన్ విడి భాగాల‌ను త‌యారు చేస్తున్న ఫాక్స్‌కాన్ సంస్థ ఎల‌క్ట్రానిక్స్ జోన్‌లో త‌న శాఖ‌ల‌ను ప్రారంభించేందుకు ఇప్ప‌టికే స‌న్నాహాలు చేస్తోంది. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా నాలుగో న‌గ‌రం ఉండాలి. అందుకు ప్ర‌త్యేకంగా 470 ఎక‌రాలలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ జోన్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇండ‌స్ట్రీయ‌ల్ పార్కులే కాదు.. స‌రికొత్త‌గా ఫ‌ర్నిచ‌ర్ పార్క్‌ను 309 ఎక‌రాల‌లో అందుబాటులోకి తేనున్నారు. ఆహారం ఎంత ముఖ్య‌మో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అందుకే ఫ్యూచ‌ర్ సిటీలో 370 ఎక‌రాల‌లో హెల్త్‌సిటీని కూడా నిర్మించ‌నున్నారు. ఇప్ప‌టికే దేశంలోనే వైద్య రాజ‌ధానిగా హైద‌రాబాద్ పేరు తెచ్చుకుంది. హెల్త్‌సిటీ రాక‌తో ప్ర‌పంచ దేశాల చూపంతా కూడా దీనిపైనే ప‌డ‌నుంది. నాలుగో న‌గ‌రం విద్యాన‌గ‌రంగా కూడా తీర్చిదిద్ద‌నున్నారు. అందులో ప్ర‌త్యేకంగా లైఫ్‌సైన్స్‌కు జీవం పోసే విధంగా 4,207 ఎక‌రాల‌లో లైఫ్‌సైన్స్ హ‌బ్‌నే ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ జోన్‌లో ప్రాణాధార మందుల తయారీ, ప‌రిశోధ‌న సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇవ్వ‌నుంది. ఇది అందుబాటులోకి అంత‌ర్జాతీయంగా కూడా గుర్తింపును సాధించుకోవ‌చ్చు.

బంజార‌హిల్స్‌, జూబ్లీహిల్స్‌ల‌ను త‌ల‌ద‌న్నేలా.. వాణిజ్యం, వ్యాపార ప‌రంగా కూడా రాణించేందుకు కూడా ప్ర‌త్యేక ప్రాంతాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇందుకు 1,317 ఎక‌రాల భూమిని కేటాయించారు. క్రీడ‌ల‌కు ప్రాధాన్య‌త‌, క్రీడాకారులు ఈ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్రోత్సాహాన్ని అందిస్తోంది. అంత‌ర్జాతీయ స్థాయిలో క్రీడా రంగంలో రాణించేందుకు ఏకంగా స్పోర్ట్స్ హ‌బ్‌ను సైతం ఏర్పాటు చేసేందుకు 761 ఎక‌రాల‌ను కేటాయించారు. అందుకే కావొచ్చు.. ఇటీవ‌ల సీఎం రేవంత్‌రెడ్డి అవ‌కాశం ఇస్తే ఒలంఫిక్స్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తామ‌న్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయంతో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నిర్మించనున్నట్లుగా ఇప్ప‌టికే సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించి ఉన్నారు, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి ఈ స్కిల్‌ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యం కల్పించి.. వారిని కంపెనీలకు అనుకూలంగా మార్చనున్నట్లుగా ఇటీవ‌ల సీఎం రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. అంత‌ర్జాతీయంగా గుర్తింపుతో పాటు పేరు, ప్ర‌ఖ్యాత‌ల‌ను మ‌న రాష్ట్రానికి తెచ్చి పెట్టే విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం గొప్ప సంక‌ల్పంతో నాలుగో న‌గ‌ర నిర్మాణికి భీజం వేసింది. ఈ నాలుగో న‌గ‌రం మ‌హాద్భుత‌మైన న‌గ‌రంగా నిర్మాణం కావాలని ఆశిద్ధాం.

ఎన్‌.యాద‌గిరిరావు,
అద‌న‌పు క‌మిష‌న్‌, జీహెచ్ఎంసీ, హైద‌రాబాద్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News