Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Gaddar birth anniversary: ప్రజాపాటల గర్జన గద్దర్

Gaddar birth anniversary: ప్రజాపాటల గర్జన గద్దర్

ప్రజాపాటల వాగ్గేయకారుడు, చైతన్య స్వరధారుడు

ప్రజా చైతన్య ప్రక్రియల్లో “పాట”ది తరతరాలుగా అగ్రస్థానమే, కాలాలు మారిన సాహిత్య రూపాలు ఎన్ని మారినా పాట పదిలమై జనావళి మదిలో సదా నిలిచి ఉండడమే కాక చక్కని చైతన్య దీపికగా వెలుగొందుతుంది, పాటలు వ్రాసే వారిది పాడే వారిది ఒక ఆదరణ అయితే అదే పాట వ్రాసి పాడే వారిది మరో ఆదరణ, అలా తన ఇష్ట దైవం వెంకటేశ్వరునిపై పాటలు రాసి పాడిన వాగ్గేయ కారుడు అన్నమయ్య మొదలు అనేకమంది వాగ్గేయకారులకు నిలయం మన తెలుగు నేల.
కాలానుగుణంగా సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా అప్పటి అవసరాలకు తగ్గట్టు పాటలు రాసి, పాడి, ప్రజల్లో చైతన్యం తిరుగుబాటు తత్వం పెంచడంతోపాటు పాలకుల ఆలోచనల మార్పుకు శ్రీకారం చుట్టిన శక్తి ఆయా పాటలకు రచయితలకు గాయకులకు వాగ్గేయకార్లకే ఉంది, అన్న సత్యం మన సాహితీ చరిత్ర నిరూపించింది.
ఆ కోవకు చెందిన తెలుగు ప్రజాపాటల వాగ్గేయకారుడు, చైతన్య స్వరధారుడు, “గద్దర్” గా తెలుగు నాట సుపరిచితుడైన గుమ్మడి విఠల్ రావు, మెదక్ జిల్లా తూప్రాన్ లో గుమ్మడి శేషయ్య – లచ్చుమమ్మ దళిత దంపతులకు జాతిపిత మహాత్మా గాంధీ చనిపోయిన మరుసటి రోజు జన్మించారు.
బడిలో పంతుళ్లు 31 అక్టోబర్ 1949 అని వ్రాసిన మా అవ్వ చెప్పినట్టు గాంధీ పోయిన మర్నాడే నా నిజమైన పుట్టినరోజు అని గద్దర్ అనేకసార్లు చెప్పారు. విఠల్ రావు తండ్రి శేషయ్య నిజాం ప్రభుత్వంలో చిన్న కాంట్రాక్టర్ గా కాలం వెళ్లదీశాడు, తనకు చదువు రాకపోయినా ఉర్ధు, హింది, మరాఠి, భాషలు ధారాళంగా మాట్లాడేవాడు, కులం రీత్యాను, చదువు లేకపోవడంతోను, శేషయ్య తోటి వారి వివక్షకు అవమానాలకు గురయ్యాడు, తన బాధలు తన కొడుకుకు,రాకుండా ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థానంలో ఉంచాలని తపనపడేవాడు.
విఠల్ రావు కూడా చురుకైనవాడు చదువులోనే కాక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నతనం నుంచే పాల్గొనేవాడు, నాలుగో తరగతిలోనే బుర్రకథలు చెప్పేవాడు. నాటి అగ్రవర్ణాల వారి నుంచి ఎలాంటి అవమానాలు ఎదురైనా లెక్కచేయకుండా తన చదువు కొనసాగించి తూఫ్రాన్ లోనే హెచ్.ఎల్.సి పూర్తి చేసిన మొదటి వ్యక్తి అయ్యారు, అనంతరం నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాదులో విద్యాభ్యాసం చేసిన ఆయన ఉస్మానియాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి 1975లో బ్యాంక్ పోటీ పరీక్షలు రాసి విజయం సాధించి కెనరా బ్యాంకులో ఉద్యోగం పొందారు . అప్పుడే విమల ను వివాహం చేసుకున్నారు, వీరికి సూర్య కిరణ్, చంద్ర కిరణ్, అనే ఇద్దరు అబ్బాయిలు. వెన్నెల అనే ఒక అమ్మాయి సంతానం,
ఆయన విద్యార్థి దశలోనే తెలంగాణ తొలి దశ ఉద్యమం కొనసాగుతుంది తనకు ఊహ తెలిసిన నాటి నుంచి తమ కుటుంబం అగ్రవర్ణ కుటుంబాల నుంచి ఎదుర్కొంటున్న చిత్కారాలు అవమానాలు ప్రత్యక్షంగా చూసిన యువ విఠల్ రావులో ఉద్యమ బీజాలు అంకురించాయి, తన పేరు చివర “రావు”ను కూడా ఉన్నత కులాల వారు హేళన చేయడంతో ప్రపంచ విప్లవాలకు నాడు దారిదీపంగా నిలిచిన “గద్దర్ పార్టీ” పేరుని తన పేరుగా మార్చుకున్నారు.
విద్యార్థి దశలో ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం మిత్రులతో కలిసి బుర్రకథలు చెబుతూ వచ్చిన కొంత డబ్బుతో విద్యాభ్యాసం చేసాడు, 1971నుంచి పాటలు రాయడం ప్రారంభించిన గద్దర్ తన పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగించే వారు ఈ సందర్భంలో తన ఉద్యోగ జీవితంలో ఎదురైన అవమానానికి ఆగ్రహించిన ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేసి పాట సాయంగా ప్రజలలోకి వచ్చారు, గద్దర్ పాట అంటే ఓ చైతన్యం, అతను కాలికి గజ్జ కట్టి ఆడుతూ పాడాడు అంటే అదో కదలిక, సంగీత సాహిత్యల్లో పరిపూర్ణ ప్రవేశం లేకపోయినా ఆయనలోని ఆవేశం తపన కలగలిపి అలా పాటలుగా ప్రవహించి నాటి తరం యువతను ఉర్రూతలూగించాయి,
1972 లో ప్రారంభించిన “ఆర్ట్ లవర్స్ సంస్థ” ద్వారా పాటలకు ప్రాణం పోశారుగద్దర్, దీని ద్వారా తన సాంస్కృతిక ఉద్యమాన్ని దేశమంతటా విస్తరించారు. బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల్లో బుర్రకథలు పాటలు ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. కారంచేడు దళితుల ఊచ కోతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, నక్సల్బరి ఉద్యమం వైపు నడిచారు, 1977లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిలో గద్దర్ అనేక కష్టాలు పడ్డారు. దర్శకుడు బి. నరసింగ రావు గారి ఆర్ట్ లవర్స్ సంస్థ ద్వారా వారి మార్గదర్శనంలో గద్దర్ గీతాలు రాశారు. జానపద గీతాల బాణిలో అనేక విప్లవ అభ్యుదయ గీతాలు రాశారు, దశాబ్ద కాలం పాటు వీరిద్దరి నేతృత్వంలో పాటల ప్రయాణం సాగింది, అనంతర కాలంలో ఈ సంస్థ జననాట్యమండలిగా మారింది.
తెలంగాణ తొలి దశ ఉద్యమం విఫలమైన కొన్నాళ్లకు వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితుడై ఆజ్ఞాతంలోకి వెళ్లి కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో తన పాటలను నాటి పీపుల్స్ వారి ఉద్యమ తుపాకులకు బుల్లెట్లుగా అందించారు, మావోయిస్టు పార్టీ గొంతుకగా నిలిచారు.
ఎమర్జెన్సీ అనంతరం ఆజ్ఞాతంలో నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చిన గద్దర్ ప్రజల పక్షాన నిలిచి వారి ఆపదల్లో పాట పోరుఊత కర్రగా నిలిచారు. కార్మిక రైతు పోరాట ఉద్యమాలకు గద్దర్ తన కలం గళం సాయంగా ముందుండేవాడు, ఉద్యమ జీవితంలో ఆయన అనేక తూటాలకు ఎదురు నిలిచారు, కానీ తన మరణం వరకు పాతికేళ్లపాటు ఒక తూటాను తనలో దాచుకున్న విచిత్ర పరిస్థితి.
06 ఏప్రిల్ 1997న హైదరాబాదు ఆల్వాల్ లో తన సొంత నివాసంలో గుర్తుతెలియని అగంతకులు గద్దర్ పై ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు అదృష్టం కొద్ది మృత్యువు నుండి బయటపడ్డారు, నాలుగు తూటాలను వైద్యులు శరీరం నుంచి తీయగలిగారు, కానీ వెన్నుపూస దగ్గర చిక్కుకున్న తూటాను తొలగించడం సాధ్యం కాలేదు, తీయడం ద్వారా ప్రాణనష్టం ఉంటుందని అలాగే ఉంచేశారు. ‌
మహాకవి శ్రీశ్రీ ఆశించిన ప్రజాస్వామ్యక సమాజాన్ని గద్దర్ తన కలం,గళం, సాయంతో మరింత విశాలం చేశారు, సామాన్యులకు సైతం అభ్యుదయ భావాలు వివరంగా అర్థమయ్యేటట్టు తన పాటలతో వివరించి చెప్పారు.
తెలుగు సినిమా రంగంలో అభ్యుదయ గీతాలకు చిరునామాగా నిలిచిన గద్దర్, నాటి భూస్వామ్య వాదులపై తిరుగుబాటుగా నిలిచిన “మాభూమి” చిత్రం 1979లో విడుదలైంది, ఈ చిత్రంలో బండి యాదగిరి రాసిన “బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి….” అనే పాటను గద్దర్ పాడి నటించి సినీ రంగ ప్రవేశం చేశారు. “రంగులకల” సినిమాలో “గూడ అంజయ్య” వ్రాసిన “భద్రం కొడుకో……” పాట కూడా గద్దర్ పాడారు, ఈ రెండు పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఈ రెండు పాటలు గద్దర్ వ్రాసినవే అనుకుంటారు, కానీ కేవలం గళ సాయంతోనే తన బాణిలో వాటికి అంతటి ప్రాచుర్యం కలిగించారు.
ఉద్యమాల సందర్భంగా ప్రజా వేదికల కోసం సందర్భోచితంగా అనేక పాటలు రాసి పాడి ప్రేక్షకులను అలరించారు.
గద్దర్ తో పాట రాయించి పాడిస్తే అది చిరకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందని సినీ దర్శక నిర్మాతలు ఆశించేవారు, కానీ ఆయన ఎవరికి పడితే వారికి పాటలు రాసేవారు కాదు పాడేవారు కాదు, తన పాట వల్ల సినిమాతో పాటు సమాజానికి ప్రయోజనం ఉంటుంది అనుకుంటేనే తన కలం కదిలేది,గళం పలికేది.
బహుళ ప్రజాదరణ గల సినిమా మాధ్యమం నుంచి గద్దర్ కు అనేక అవకాశాలు వచ్చేవి, డబ్బుపై ఆశ లేని గద్దర్ కు అవి ఏమీ ఇష్టం ఉండేవి కావు, ఆయన స్వేచ్ఛ జీవి, భావాలకు అనుగుణంగా పాటను ట్యూన్ చేసుకోవడమే కానీ, ట్యూన్ కు అనుకూలంగా పాటలు రాయడం తనకు ఇష్టం ఉండేది కాదు. కానీ తన కళా రంగ మిత్రుడు వందేమాతరం శ్రీనివాస్ కోరిక మేరకు తొలిసారిగా ట్యూన్ చేసిన పాటకు తన సాహిత్య సహకారం అందించారు, అది “ఒరేయ్ రిక్షా” చిత్రం కోసం “నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా…” అనే ఆ పాటకు. అది ఎంతటి ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే, అంతే కాదు దానికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు కూడా ప్రకటించింది కానీ ప్రజా ఉద్యమకారుడు ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు స్వీకరించకూడదు అనే దృక్పథంతో నంది అవార్డును తిరస్కరించారు.
తెలంగాణ తొలి దశ, మలిదశ, ఉద్యమాల్లో గద్దర్ తన పాటల మాటలతో ఉద్యమకారుల పక్షాన నిలిచారు, నిరంతరం అభ్యుదయ భావాలతో బూర్జవ వాదులకు వ్యతిరేకంగా నిలిచిన విప్లవ ప్రజా వాగ్గేయ కారుడు గద్దర్ తన జీవిత చరమాంకంలో ప్రజాస్వామ్య భావాలకు ఆధ్యాత్మిక చింతనలకు మద్దతు పలికి తనదైన చర్యలను ప్రజా సంక్షేమం కోసమే అని సమాధానమిచ్చారు.
సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని నమ్మిన ఆయన ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేశారు, “గద్దర్ ప్రజాపార్టీ” స్థాపించారు. అనంతరం అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం వస్తుందని ప్రచారం చేశారు, 2018లో తొలిసారిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు గద్దర్.
హేతువాదిగా అభ్యుదయ దారిలో పయనించిన ఆయన చివరికి ఆధ్యాత్మికతలో అభ్యుదయం చూశారు, 23 సెప్టెంబర్ 2006న తొలిసారి భద్రాద్రి రామాలయం దర్శించిన గద్దర్ “రామదాసు కూడా అభ్యుదయ వాది అతనిలోనూ ప్రశ్నించే తత్వం ఉంది అది ఆయన కీర్తనలో మనం గమనించవచ్చు అంతటి విప్లకవి పూజించిన రాముడిని ఆయన కట్టించిన ఆలయాన్ని తాను ఎందుకు సందర్శించకూడదు?” అని పాత్రికేయులను ప్రశ్నించారు.
ఇదే తీరున రాష్ట్రంలోని దేవాలయాలను స్వాములను దర్శించి కీర్తించారు, ప్రజా పాటల యుద్ధనౌక ప్రయాణంలో ఇదో ఆసక్తికర పరిణామం. ఏది ఏమైనా తెలుగుదేశాన అభ్యుదయ సాహిత్యంలో ప్రజల పాటగా గద్దర్ సాహిత్యం నిత్యం పొడుస్తున్న పొద్దుగానే ఉంటుంది. ఈ ప్రజల పాటల పొద్దు 06 ఆగస్టు 2023న మధ్యాహ్నం మూడు గంటలకి వాలిపోయింది, కానీ దాని చైతన్యపు వెలుగులు ఎప్పటికీ నిలిచే ఉంటాయి.

- Advertisement -

డా:అమ్మిన శ్రీనివాసరాజు
పరిశోధకరచయిత,
విశ్లేషకులు.
సెల్: 77298 83223.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News