Telangana Movement: ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం వింతైనది. ఒకవైపు దేశం మౌలిక సదుపాయాల అభివృద్ధిని పక్కన పెట్టి, డిజిటలైజేషన్, గ్లోబ లైజేషన్ పేర్లతో ముందుకు పరిగెడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరొకవైపు నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ఆర్థిక అసమాన త లు, కుల-మత విభజన రేఖలు, ఆదివాసుల నివాసపు అడవుల ఆక్రమణలు, ప్రజాస్వామ్య వ్యవస్థల క్షీణత మన కళ్ల ముందే తీవ్రమవుతున్నాయి.
మాట్లాడే స్వేచ్ఛకు పరి మితులు, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ మీద భౌతిక దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రజా ఉద్యమాలపై అనుమానాలు, అణచివేతలు స్పష్టంగా రాజ్యమేలుతున్నాయి. ఇవన్నీ ఈ 21వ శతాబ్దాన్ని ఒక తీవ్రమైన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంక్షో భంగా మార్చాయి. ముఖ్యంగా తెలుగు నేలపై పల్లె నుండి పట్నం వరకు పేదరికం, కులాధిపత్యం, వలస, ఉపాధి లేని, సాంస్కృతిక వినియోగవాదం కలిసి పోయి ఒక నిశ్శబ్ద అశాంతిని సృష్టిస్తున్నాయి.
ఇలాం టి సంక్లిష్ట సమయంలో మనకు ఒక ప్రశ్న ఎదురవుతుంది. బాధిత ప్రజల గొంతు ఎక్కడా అని? వారి బాధలను పాటగా, నిరసనగా, ఆశలను, ఆశయాలను పోరాట రూపంగా మార్చే ధిక్కారస్వరం ఏ వెలివాడల నేపథ్యాల నుంచి ఈ నేల మీదకీ నడిచొస్తుందా అని? ఈ ప్రశ్నలకు సమాధానంగా మన మదిలోకి వచ్చేది గద్దర్. అంటే కళను ఆయుధంగా, పాటను రాజకీయంగా, ప్రజల శ్రమను చరి త్రగా మలిచిన సామాజిక పరివర్తన విప్లవ సాంస్కృతిక యోధుడు గద్దర్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే, మార్క్సిజాన్ని కేవలం ఒక ఘనీభవించిన వర్గ పోరాటంగా మాత్రమే కాకుండా, ఫూలే, అంబేడ్కర్ ఆలోచనలతో కలిపి కుల-వర్గ విముక్తి సి ద్ధాంతంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లిన అరుదైన ప్రజా మేధావిగా గద్దర్ నిలిచాడు. ఆయన పాటలు తన కాలపు చరిత్రను వివరించిన పాఠాలు.
ఆయన కళా ప్రదర్శన ప్రజాస్వామ్య పోరాటం. గద్దర్ జీవితాన్ని, ఆలోచనలను, వాటిలోని మార్పులను, పరిమితులను విమర్శనాత్మకంగా అర్థం చేసుకోవడం అంటే ఈ కా లపు భారతీయ ప్రజాస్వామ్య స్థితిని అర్థం చేసుకోవడం. మనిషిని మానవీయంగా మలిచే కొన్ని గొంతు కలు చరిత్రలో ఉన్నాయి. అవి కేవలం పాటలు మాత్ర మే పాడలేదు. కాలాన్ని ప్రశ్నించాయి. అవి వినోదా న్ని మాత్రమే ఇవ్వలేదు. చైతన్యాన్ని రగిలించాయి. అలాంటి గొం తుకల వరసలో ప్రపంచం విక్టర్ జారాను చూసింది.
పాల్ రాబ్సన్ ను విన్నది. నాజీమ్ హిక్మత్‌ను చదివింది. తెలుగు సమాజం ఆ వరు సలో గర్వంగా నిలబెట్టుకున్న పేరే గద్దర్. గద్దర్‌ను కేవలం ఒక జాన పద గాయకుడిగా, ఒక ఉద్యమ కళాకారుడిగా పరిమితం చేయడం అతడి చరిత్రకు అన్యాయం చేసినట్లే. అతడు ఒక ప్రపంచ సామా జిక పరివర్తన విప్లవ సాంస్కృతిక సాంప్రదాయానికి చెందిన ప్రతిని ధి. తన ఆహార్యం, తన భాష, తన ప్రజల ఆవేదనల నుంచి పుట్టినప్ప టికీ, అతని సాహిత్య కళలు, పాటలు, పోరాటాలు ప్రపంచ వ్యాప్తంగా అణచివేతకు వ్యతిరేకంగా నిలబడ్డ గొంతుకులతో సంభాషిస్తాయి.
అందుకే అతడిని ఈ కాలపు బహుళ జా తుల ప్రజాస్వామ్య ఉద్య మాల విస్తృత దృక్కోణంలో చూడడం అవసరం. చిలీ దేశానికి చెందిన విక్టర్ జారా గిటార్ పట్టుకుని కార్మికుల ఆవేదన పాటలు పాడాడు. నియంతృత్వ పాలనకు ఎదు రొడ్డి పోరాడినాడు. అమెరికాలో పాల్ రాబ్సన్ తన ధిక్కార గొంతుకతో నల్లజా తీయుల గౌరవాన్ని ప్రకటించాడు. టర్కీ ప్రజా వ్యతిరేక పాలనకు నాజిమ్ హిక్మత్ జైళ్లలో ధిక్కార కవిత్వాన్ని రాశాడు. పాకిస్తాన్‌లో ఫైజ్ అహ్మద్ ఫైజ్ సైనిక పాలనను తన కవితలతో ఎదుర్కొన్నాడు. వీళ్ళందరిలో ఒక సారూప్యత ఉంది.
వాళ్ల కళ వ్యక్తిగత కీర్తి కోసం కాదని, ప్రజల విముక్తి కోసమని నిరూపించారు. ఈ ప్రగతిశీల పరివర్తన ఉద్యమకారుల కోవలోనే గద్దర్‌ని చూడాలి. గద్దర్ 1949 జనవరి 31న మెదక్ జిల్లా తూప్రాన్‌లో మాల కులంలో గుమ్మడి లచ్చుమమ్మ, శేషయ్యలకు జన్మించారు. అతని అసలు పేరు గుమ్మ డి విఠల్ రావు. అతని సామాజిక నేపథ్యమే తన రాజకీయ భవిష్య త్తును నిర్ణయించింది. పేదరికం, కుల వివక్షత, శ్రమజీవుల కష్టాలు, కన్నీళ్లను తన జీవిత అనుభవం ద్వారా తెలుసుకున్నాడు.
గద్దర్ కేవలం పుస్తకాలలో ఉన్న మార్క్సిస్ట్ భావజాలాన్ని మాత్రమే ఆలంబ న చేసుకోలేదు. మార్క్సిజాన్ని భారత గ్రామీ ణ వ్యవస్థకు అన్వయించుకున్న ఆర్గానిక్ ఇంటలెక్చువల్ గద్దర్. అతని మార్క్సిజం భూస్వామ్య తెలంగాణ పొలాలలో, బొగ్గు గనులలో, కూలీల చెమటలో పుట్టింది. విస్త రించింది. గద్దర్ చేసిన అత్యంత విప్లవాత్మక మైన పని జానపద కళను ఈ దేశ బాధిత ప్రజల విముక్తికి రాజ కీయ ఆయుధంగా మార్చడం. విక్టర్ జారా పాటలు చీలి కార్మికుల్ని కదిలించాయి.
గద్దర్ పాటలు యావత్ దేశంలోని శ్రామిక కూలీ లను ఆలోచింపజేశాయి. ఐక్య ఉద్యమాలకు పురికొల్పినాయి. “బానిసలారా లెండిరా” అనే పాటలో భారత రాజ్యాంగాన్ని ఏడు తరాల బానిసల జ్ఞాన సంపదల వారసత్వం అన్నాడు. విక్టర్ జారా చిలీకి తిరుగుబాటు గీతమైనాడు. గద్దర్ సామాజిక తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక గళం అయినాడు. సాంస్కృతిక పోరాట రూపా నికి యుద్ధ నౌకైనాడు. “అమ్మ తెలంగాణమా- ఆకలి కేకల గానమా”, “పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా – పోరు తెలంగాణమా” అన్న రెండు పాటలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, పోరాట తత్వాన్ని ఆదివా సీ, దళిత, బహుజన కోణాలలో ఆవిష్కరించాయి.
తెలంగాణను తన పాటలలో ఒక తల్లిగా చూపించడం ద్వారా ఉద్యమాన్ని ప్రజల అంతరంగంలోకి సూక్ష్మంగా తీసుకెళ్లాడు. ఒక రకంగా పండితులు, మేధావులు, బుద్ధి జీవులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అవసరా న్ని పల్లె ప్రజలకు వివరించడంలో ఒక అడుగు వెనుకబడినప్పుడు గద్దరే ఆ వెలితిని పూర్చినాడు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాకారం కోసం మణుగూరు నుండి మందమర్రి వరకు సాహసోపేతమైన ప్రజా చైతన్య సాంస్కృతిక శాంతియాత్ర చేశాడు. ఇది ప్రపంచ విప్లవ కళ పోరాట రూపాలలో ఒక అరుదైన పద్ధతి. ఒక ప్రాంతీయ బాధను విశ్వవ్యాప్తంగా సామాజిక న్యాయంతో కలుపడం కూడా.
గద్దర్ బుద్ధుడు బోధించిన శాంతి, అంబేద్కర్ అందించిన రాజ్యాంగం, రాజ్యాంగ కేంద్రంగా నిర్మాణం కావలసిన ప్రజాస్వా మ్యం గురించి మాట్లాడినాడు. తెలంగాణ సాధన తర్వాత గద్దర్ కన్న కలలు నెరవేరాయా? నెరవేరనప్పుడు నేడు గద్దర్ వారసుల మని ప్రకటించుకుంటున్న బుద్ధిజీవులందరూ అసంపూర్ణంగా మిగిలి ఉన్న ‘సామాజిక తెలంగాణ సాధన’ వంటి ప్రజా ఆకాం క్షలన్నింటిని పరిపూర్ణం చేయడానికి ప్రజాక్షేత్రంలో ఆయన అనుస రించిన ఫూలే, అంబేడ్కర్ల సిద్ధాంత పునాదుల మీద నిలబడి మాట్లా డాలి. రాజ్యాంగ మౌలిక సూత్రాల కేంద్రంగా మెజార్టీ ప్రజల ఆకాంక్షల సాధనకై కొట్లాడడానికి నిర్ణయించుకోవలసిన చారిత్రక సందర్భం ఇది.

