Saturday, November 15, 2025
Homeఓపన్ పేజ్Nation First: దేశం కోసం నినాదం... కుటుంబం కోసం విధానం..!

Nation First: దేశం కోసం నినాదం… కుటుంబం కోసం విధానం..!

Beneath The Slogan Of Nation First: “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను!” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఆ అగ్ని సామాజిక పరివర్తన కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం రగిలిన అగ్ని. కానీ నేటి నవభారత యాగశాలలో, ఒక కొత్త మంత్రం వినిపిస్తోంది: “మేము సైతం ప్రజాధన యజ్ఞానికి మా కుటుంబాలను ఆహుతిచ్చాం!”. ఇక్కడ యజ్ఞం జరుగుతోంది దేశ ప్రగతి కోసం కాదు, కేవలం కొందరి కుటుంబాల ఐశ్వర్యం కోసం. ఈ యజ్ఞంలో హవిస్సు సామాన్యుడి చెమట, నెత్తురు. పురోహితులు పాలకులైతే, యజమానులు వారికి ఆంతరంగికమైన కార్పొరేట్ మిత్రులు. ధర్మం ముసుగులో జరుగుతున్న ఈ ధన యాగం, ప్రజాస్వామ్య మూలాలను ఎలా పెకలిస్తోంది..? దేశ సంపద కొందరి చేతుల్లో ఎలా కేంద్రీకృతమవుతోంది..? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ అధర్మ పర్వంలో దాగి ఉన్నాయి…

- Advertisement -

విధానాల పక్కదారి: గడ్కరీ కుమారుడి ఇథనాల్ సామ్రాజ్యం:

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు గొప్ప ఆశయాలతో దేశంలో E20 ఇంధనాన్ని ప్రోత్సహించారు. పర్యావరణ పరిరక్షణ, చమురు దిగుమతుల భారం తగ్గింపు, రైతులకు మేలు… వినడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ లక్ష్యాలు! యావత్ దేశం ఆయన దార్శనికతకు జేజేలు పలికింది. కానీ, సరిగ్గా అదే సమయంలో, తెర వెనుక మరో ‘అద్భుతం’ జరిగింది. ఆయన కుమారుడు నిఖిల్ గడ్కరీకి చెందిన ఇథనాల్ కంపెనీ ఆదాయం, కేవలం ఒక్క సంవత్సరంలోనే రూ. 17 కోట్ల నుంచి కళ్లు చెదిరేలా రూ. 510 కోట్లకు పెరిగింది. ఇది కేవలం యాదృచ్ఛికమా..? అదృష్టమా..? లేక తండ్రి మంత్రిగా వేసిన విధానపరమైన బాటలో, కుమారుడి వ్యాపారం పరుగులు పెట్టిన స్పష్టమైన ప్రయోజన సంఘర్షణా (Conflict of Interest)? “కాకతాళీయం” అని కొట్టిపారేయడానికి, ఇది లాటరీ టికెట్ కాదు, ఏకంగా 30 రెట్లు పెరిగిన వ్యాపార సామ్రాజ్యం!

“When money is involved, there is no such thing as an innocent coincidence.” – David 

అదృష్టవంతుల పరంపర:

జై షా వ్యాపార దక్షత నుండి రామ మందిరం వరకు ఈ ‘యాదృచ్ఛికాల’ పరంపర ఒక్క గడ్కరీ గారి కుటుంబానికే పరిమితమైతే బహుశా మనం నమ్మేవాళ్లమేమో. కానీ, ఈ ‘ధర్మ’ పాలనలో ఇలాంటి అదృష్టవంతులైన పుత్రరత్నాలు, కుటుంబ సభ్యులు ఎందరో..! దేశ హోంమంత్రి అమిత్ షా గారి కుమారుడు జై షా గారి వ్యాపార దక్షత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2014 తర్వాత ఆయన కంపెనీ ఆదాయం కొన్ని వేల రెట్లు పెరిగిన ‘అద్భుతం’ దేశ ప్రజానీకం ఇంకా మర్చిపోలేదు. ఆ వ్యాపార దక్షతే ఆయనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఇప్పుడు అయోధ్య రామ మందిర ట్రస్టులో కూడా ఆయన కీలక సభ్యులు. క్రికెట్ సేవ… ఆలయ సేవ… అంతా దేశ సేవకే! ధర్మం అంటే ఇదేనేమో!

Power tends to corrupt, and absolute power corrupts absolutely.” – Lord Acton

దశాబ్దపు ‘ధర్మ’ పాలనలో చెరగని మరకలు: ప్రజాస్వామ్యానికి సవాళ్లు:

గడిచిన దశాబ్దం నాటి ‘ధర్మ’ పాలనలో ప్రజల స్మృతిపథం నుంచి చెరిగిపోని కొన్ని మరకలను గుర్తుచేసుకుందాం, ఇవి ప్రజాస్వామ్యానికే పెను సవాళ్లు విసిరాయి.

ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణం:

“రాజకీయాల్లో నల్లధనాన్ని నిర్మూలిస్తాం” అని చెప్పి, అనామధేయ కార్పొరేట్ విరాళాలకు చట్టబద్ధత కల్పించిన ఈ పథకం, “దోచుకో, దాచుకో” అనే సూత్రానికి అధికారిక రూపమని సుప్రీంకోర్టే ఛీత్కరించింది.

రఫేల్ ఒప్పందం:

దేశ భద్రత పేరుతో, పాత ఒప్పందాన్ని రద్దు చేసి, అధిక ధరకు యుద్ధ విమానాలు కొనడం, అనుభవం లేని మిత్రుల కంపెనీకి కాంట్రాక్టులు కట్టబెట్టడంపై ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ గాలిలోనే ఉంది.

పీఎం కేర్స్ ఫండ్: ప్రజల కష్టకాలంలో ఆదుకోవడానికి అని చెప్పి, సమాచార హక్కు చట్టానికి, కాగ్ ఆడిట్‌కు దూరంగా వేల కోట్లు సమీకరించిన ఈ నిధి ఎవరి జేబుల్లోకి వెళ్ళిందో ఆ భగవంతుడికే ఎరుక.

డీమానిటైజేషన్ (నోట్ల రద్దు):

నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి, సామాన్యుడిని గంటల తరబడి క్యూలలో నిలబెట్టి, వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ తుగ్లక్ చర్యతో ఎవరికి మేలు జరిగిందో, ఎవరి నల్లధనం తెల్లధనంగా మారిందో చరిత్రే చెప్పాలి.

40% కమీషన్ సర్కార్:

కర్ణాటకలో కాంట్రాక్టర్లు లేఖలు రాసి, ఆత్మహత్యలు చేసుకున్నా, “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” నినాదం మార్మోగుతూనే ఉంది.

రామరాజ్యమా లేక ‘మిత్ర’ రాజ్యమా:

ఒకవైపు ‘దేశం కోసం, ధర్మం కోసం’ అని గొంతెత్తి నినదిస్తూనే, మరోవైపు కుటుంబ వ్యాపారాల ఖజానాలు నింపడం ఏ ధర్మంలో భాగం? ప్రజలు అధిక ధరలతో, నిరుద్యోగంతో అల్లాడుతుంటే, ‘మిత్రుల’ ఆస్తులు మాత్రం ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి దూసుకెళ్లడం ఏ నీతికి నిదర్శనం..? ఇది రామరాజ్యమా లేక ‘మిత్ర’ రాజ్యమా..?

“The ultimate weakness of violence is that it is a descending spiral, begetting the very thing it seeks to destroy. Instead of good, it produces evil. Instead of friendship, it produces hatred.” – Martin Luther King Jr.

ప్రశ్నించడమే అసలైన దేశభక్తి: 

ఈ అధర్మ పర్వంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ‘ధర్మం’  మత విశ్వాసాలు. కార్ల్ మార్క్స్ చెప్పినట్లు, “Religion is the opium of the masses.” అంటే, మతం అనేది ప్రజల కష్టాలను, అసమానతలను తాత్కాలికంగా మరిపించే ఒక మత్తుమందు లాంటిది. ప్రజల మత విశ్వాసాలను, జాతీయవాద భావోద్వేగాలను ఒక మత్తుమందులా ఉపయోగించి, వారి తార్కిక ఆలోచనా శక్తిని నిర్వీర్యం చేస్తున్నారు.సామాన్య ప్రజలు ఆర్థిక కష్టాలతో, నిరుద్యోగంతో, ధరల పెరుగుదలతో సతమతమవుతున్నప్పుడు, వారి అసంతృప్తిని, కోపాన్ని మతపరమైన నినాదాలు, భావోద్వేగాలకు మళ్లించడం జరుగుతుంది. ‘దేశం కోసం, ధర్మం కోసం’ అనే నినాదం, ప్రభుత్వ వైఫల్యాలను, వ్యవస్థీకృత దోపిడీని ప్రశ్నించకుండా ప్రజలను నిలువరించే ఒక కవచంగా మారింది. ఈ దోపిడీని ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా, హిందూ వ్యతిరేకులుగా చిత్రించడం, ఫాసిజం ప్రాథమిక లక్షణం.

కానీ, గుర్తుంచుకోవాల్సిన సత్యం ఒకటుంది:

ధర్మం పేరుతో జరిగే అధర్మాన్ని, దేశభక్తి ముసుగులో జరిగే దేశద్రోహాన్ని ప్రశ్నించడమే అసలైన దేశభక్తి. అదే అసలైన ధర్మం. భక్తి పారవశ్యంలో మునిగి, మన మెడకే ఉరితాళ్లు బిగుసుకుంటున్నాయని గ్రహించలేకపోతే, చరిత్ర మనల్ని క్షమించదు. పాలకుల భజన బృందాలుగా మారడమా, లేక రాజ్యాంగం మనకిచ్చిన ‘ప్రశ్నించే హక్కు’ అనే వజ్రాయుధాన్ని చేతబట్టడమా..? ఈ చారిత్రక సంధియుగంలో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే. ఎందుకంటే, మౌనంగా ఉన్న ప్రతి పౌరుడూ ఈ అధర్మ యాగంలో ఒక సమిధే.

“The price of freedom is eternal vigilance.” – Thomas Jefferson

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad