ప్రపంచ ప్రఖ్యాత కథలు రాసిన కొద్దిమంది రచయితలలో పాలగుమ్మి పద్మరాజు ఒకరు. ఆయన రాసిన ‘గాలివాన’ అనే కథను ప్రపంచంలోని చాలా భాషల్లోకి అనువదించారంటే, ఆ కథ తాలూకు ప్రాధాన్యం, ప్రాభవం అర్థమవుతుంది. ఈ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కథతో తెలుగు కథను ప్రపంచ సాహితీ చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన ఘనత పాలగుమ్మి పద్మరాజుకే చెందుతుంది. ఈ ప్రముఖ కథకుడు, సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత 1915 జూన్ 24న పశ్చిమ గోదావరి జిల్లా తిరుపతిపురంలో జన్మించారు.పద్మరాజు1939 నుంచి 1952 వరకు కాకినాడలోని పి.ఆర్. కళాశాలలో సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశారు. ఆయన తన 23వ ఏటనే రచనా వ్యాసంగాన్ని చేపట్టారు.ఆయన మొదటగా ‘సుబ్బి’ అనే కథను రాశారు. ఆయన తన జీవిత కాలంలో ఎన్నో కథలు రాసినప్పటికీ, వాటిలో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన కథ మాత్రం ‘గాలివాన’ కథే. ఈ కథ 1952వ సంవత్సరంలో న్యూయార్క్‌కు చెందిన ‘హెరాల్డ్ ట్రిబ్యూన్’ పత్రిక నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీలో రెండవ బహుమతిని గెలుచుకుంది.
ఒక అమాయకపు అనాథ ఆడపిల్లకు జరిగిన అన్యాయాన్ని చూసి తల్లిలా ఆదరించిన యజమానురాలు, తీరా ఆమెకు జరిగిన అన్యాయం ఎవరి వల్ల జరిగిందో తెలిసిన తర్వాత ఆమెలో మార్పు రావడాన్ని సుబ్బి కథలో అందంగా , అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ కథలో ఆడవారి మనోభావాలను, ఆలోచనలను చక్కగా చిత్రీకరించడం జరిగింది. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు కనిపించే సందడి, కొన్ని సంఘటనలు వారి మనసులపై ఎలాంటి ముద్ర వేస్తాయో తెలిపే బాల్యం గురించి, చిన్నతనంలో వారి మనసులో మెదిలే భావాల గురించి, తిరునాళ్లు, తీర్థాలలో కనిపించే సందడి గురించి, ఒక స్త్రీలో చెల్లిగా, భార్యగా, తల్లిగా ఉన్నప్పుడు కలిగే భావోద్వేగాల గురించి ఈ కథలో మనసుకు హత్తుకుపోయేలా, కళ్లకు కట్టేలా తెలియజేశారు. తన సాహితీ ప్రస్థానంలో 60 కథలు, ఎనిమిది నవలలు, 30 కవితలు, లెక్కలేనన్ని నాటికలు, నాటకాలను రచించిన పాలగుమ్మి సాహిత్య చరిత్రలో సుస్థిర, చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారు.ఆయన రాసిన 60 కథలతో పాటు, గాలివాన, పడవ ప్రయాణం, ఎదురు చూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలు వెలువడ్డాయి.
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు సినిమాలకు చాలావాటికి పాలగుమ్మి ఒక ఘోస్ట్ రైటర్‌గా పనిచేసేవారని అప్పట్లో చెప్పుకునేవారు. తెలుగు కథను ప్రపంచ సాహితీ పటంలో నిలిపిన పాలగుమ్మి జాతీయ చలన చిత్ర అవార్డుల సంఘం జ్యూరీ సభ్యుడిగా ఢిల్లీ వెళ్లారు. అయితే, ఆయనకు ఢిల్లీ వాతావరణం సరిపడలేదు. ఆయనకు అప్పటికే ఉబ్బస లక్షణాలు ఉండడంతో , అక్కడి భరించలేని చలి కారణంగా 1983 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. మద్రాసులోని మైలాపూర్ స్మశాన వాటికలో జరిగిన ఆయన అంత్యక్రియలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేయడం ఒక అరుదైన విశేషం.