Thursday, November 21, 2024
Homeఓపన్ పేజ్Inflation with Gaza war: గాజా యుద్ధంతో ధరల పెరుగుదల

Inflation with Gaza war: గాజా యుద్ధంతో ధరల పెరుగుదల

సముద్ర దొంగలతో దెబ్బ తిన్న నౌకా రవాణా

గాజా యుద్ధ ప్రభావం అనేక దేశాల వాణిజ్య, వ్యాపారాల మీద పడుతోంది. అనేక దేశాలలో నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అనేక వస్తువుల ధరలు క్రమంగా ఆకాశాన్నంటుతున్నాయి. ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధమే ఇతర దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్న స్థితిలో ఈ యుద్ధం వల్ల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం మరింత ఆందోళన కలగజేస్తోంది. ఏదోవిధంగా కాల్పుల విరమణ పాటించాలంటూ అనేక దేశాలు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక హమాస్‌ మద్దతుదార్లు ఎర్ర సముద్రం, సూయజ్‌ కెనాల్‌ ప్రాంతాలకు అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఆటంకాలు సృష్టించడం ద్వారా ఇజ్రాయెల్‌ మీదా, దానికి సహకరిస్తున్న దేశాల మీదా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. సోమాలి సముద్ర దొంగల మాదిరిగా వీరు ఎకె-47లతోనూ, పిస్తోళ్లు, రివాల్వర్లతోనూ పోరాటాలు సాగించడం లేదు. హమాస్‌ మద్దతుదార్లు డ్రోన్లను, సుదూర క్షిపణులను ఉపయోగిస్తున్నారు. ఇది అనేక దేశాల్లో కంపన ప్రకంపనాలు సృష్టిస్తోంది.
గత రెండు నెలల కాలంలో హమాస్‌ మద్దతుదారులైన హౌతీలు, యెమెన్‌ తిరుగుబాటు దార్లు కలిసి, 25కు పైగా ఇజ్రాయెల్‌-అమెరికా సంబంధిత రవాణా నౌకలను నిర్బంధంలోకి తీసుకున్నారు. మెర్సెక్‌, హపాగ్‌-లాయ్‌డ ఎం.ఎస్‌.సి వంటి అతి పెద్ద అంతర్జాతీయ నౌకా రవాణా సంస్థలు ఎర్ర సముద్రం, సూయెజ్‌ కెనాల్‌ మీదుగా కాకుండా ఆఫ్రికాలోని కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ మీదుగా తమ నౌకల మార్గాన్ని మళ్లిస్తున్నాయి. ఫలితంగా, ఆసియా, ఉత్తర ఐరోపా దేశాల రేవుల మధ్య నౌకా రవాణా ధరలు రెట్టింపయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు ఇప్పటికే 3,000 కోట్ల డాలర్ల మేరకు దెబ్బతినడం జరిగింది. నౌకల ద్వారా రవాణా చేసే ఎగుమతుల ధరలను నౌకా సంస్థలు బాగా పెంచేయడంతో ఎగుమతి దార్లు చాలావరకు ఎగుమతులు ఆపేయడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు 45,100 కోట్ల డాలర్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అది 6.7 శాతం తగ్గి పోయిందని అంచనా. ముడి చమురు రవాణాకు ఇంతవరకూ ఆటంకాలు, అవరోధాలు కలగలేదు కానీ, ఇతర అత్యవసర వస్తువులు, నిత్యావసర సరుకుల రవాణాకు మాత్రం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతో అనేక వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.
ఎర్ర సముద్రం ద్వారా, సూయెజ్‌ కెనాల్‌ ద్వారా వాణిజ్యాన్ని నిర్వహించే దేశాల నౌకలన్నిటికీ రక్షణ కల్పిస్తామని, హౌతీలను, యెమెన్‌ తిరుగుబాటుదార్లను అణచివేస్తామని గత నెల అమెరికా అనేక దేశాలకు వాగ్దానం చేసింది కానీ, ఆ తర్వాత అనేక దేశాలు ఈ నౌకా మార్గాల ద్వారా తమ వస్తువులు, సరుకులను రవాణా చేయడాన్ని విరమించుకున్నాయి. అమెరికా వాగ్దానాలను పట్టించుకోవడానికి, నమ్మడానికి తాము సిద్ధంగా లేమని అవి తేల్చి చెబుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించినంతవరకు అమెరికా వాగ్దానాలను నమ్మలేమని కూడా ఇప్పటికే దాదాపు మూడవ వంతు దేశాలు చెప్పకనే చెప్పాయి. భారతదేశానికి సంబంధించినంత వరకూ ఎగుమతులు తగ్గిపోవడమే కాదు. ఇతర దేశాలకు తక్కువ ధరలకు సహాయం రూపంలో సర ఫరాలు చేయడం మీద కూడా దీని ప్రభావం పడుతోంది. వస్తు సామగ్రికి తీవ్ర కొరత ఏర్పడడంతో పాటు, వస్తువుల ధరలు పెరగడం ఈ సరఫరాలను బాగా దెబ్బతీస్తోంది. వస్తువులు తగ్గడం, ధరలు మాత్రం యథాతథంగా ఉండడం కొత్త రకం ద్రవ్యోల్బణాన్ని సృష్టిస్తోంది.
ప్రపంచంలో 15 శాతం అంతర్జాతీయ వ్యాపారం ఎర్ర సముద్రం ద్వారానే జరుగుతుంది. దాదాపు 30 శాతం వినిమయ వస్తువులు సూయెజ్‌ కెనాల్‌ ద్వారా రవాణా అవుతుంటాయి. రెండు మూడేళ్ల క్రితమే మహమ్మారి కారణంగా భారత దేశంలో ఉత్పత్తి రంగం దెబ్బతిని, అత్యవసర వస్తు సామగ్రికి కొరత ఏర్పడింది. ఇప్పుడు నౌకా రవాణా దెబ్బతిన్నందు వల్ల మళ్లీ అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఐకియా, దుస్తుల కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి ఆలస్యం కావడం, ధరలు పెరగడం వంటి ఇబ్బందులు పడుతున్నాయి. ఔషధాల దగ్గర నుంచి కంప్యూటర్లు, కార్ల వరకూ అనేక వస్తువుల ధరలు ఇంకా పెరిగే అవకాశమే ఉంది తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. చివరికి ఇవీన్న సామాన్యుడికి పెనుభారంగా మారే అవకాశం ఉంది. దేశ ప్రజల సాధక బాధకాలను దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం గాజా యుద్ధానికి ఏదో విధంగా ముగింపు పలికించాలనే ప్రయత్నంలో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News