Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Gender discrimination: లైంగిక వివక్షలో కొత్త పుంతలు

Gender discrimination: లైంగిక వివక్షలో కొత్త పుంతలు

అత్యధికంగా అవయవ దానాలు స్వీకరించేది పురుషులే

వితరణలు, దానధర్మాల్లోనూ వివక్షేనా? నేషనల్‌ ఆర్గాన్‌ అండ్ టిష్యూ ట్రాన్స్‌ ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ విషయాల్లోనూ వివక్ష ఉన్నట్టే కనిపిస్తోంది. 1995, 2021 సంవత్సరాల మధ్య అవయవ దానాలు స్వీకరించిన ప్రతి అయిదుగురిలో నలుగురు పురుషులేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఈ విభాగం ఇటీవల వెల్లడించింది. మరోవిధంగా చెప్పాలంటే అవయవ దానం చేసిన ప్రతి నలుగురిలో ముగ్గురు మహిళలేనని ఆ విభాగం తెలియ జేసింది. వీరు సాధారణంగా అవయవ దానం స్వీకరించిన వ్యక్తికి తల్లో, భార్యో అయి ఉంటారు. అవయవ దానం స్వీకరించిన మహిళల సంఖ్యను పరిశీలనలోకి తీసుకున్నప్పుడు పది మంది మహిళలలో ఒక్కరే పురుషుడు (భర్త) ఉంటున్నారు. పురుషాధిక్య సమాజం ఈ ధోరణిని తల్లి ప్రేమగానో, భార్య ‘పతి భక్తి’గానో పరిగణించవచ్చు కానీ, దీని అంతరార్థం మాత్రం లైంగిక వివక్షేనని అర్థమవుతూనే ఉంది. వైద్య నిపుణులు మరో రకమైన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మహిళలతో పోలిస్తే పురుషులలోనే మూత్రపిండాలు, జీర్ణాశయాల సమస్యలు చాలా ఎక్కువని, అందువల్ల పురుషులు వాటిని దానం చేయడమన్నది చాలా తక్కువగా ఉంటోందని వారు చెబుతున్నారు. విచిత్రమేమిటంటే, కుమారుడు గానీ, భర్త గానీ ప్రాణాంతకమైన వ్యాధికి గురై, అవయవ దానం అవసరమైనప్పుడు అందరి దృష్టీ భార్య మీద గానీ, తల్లి మీద గానీ పడుతోంది. వారి నుంచి అవయవాలను తీసుకోవడం అన్నది పురుషుల హక్కుగా భావించడం జరుగుతోంది. భార్య లేదా తల్లి ఏ ఉద్యోగమూ చేయకుండా కేవలం గృహిణిగా ఉన్నప్పుడు, కుటుంబంలోని పురుషుల మీద ఆధారపడి ఉంటున్నప్పుడు ఈ రకమైన ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఇందుకు వైద్య కారణాల కంటే సామాజిక కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పురుషులు తమ సంపాదన సంగతి చూసుకుంటుండగా, కుటుంబంలోని స్త్రీలు వారి బాగోగుల గురించి, వారి ఆరోగ్యం గురించి చూసుకోవాల్సిన అవసరం ఉందనే పాతకాలపు భావనలు ఈ రూపంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇటువంటి ధోరణి ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలలో ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ అవయవ దానం చేస్తున్న వారిలో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారన్నది వాస్తవం. ఫిలిప్పీన్స్‌, హాంకాంగ్‌ దేశాలలో మాత్రం పరిస్థితి కాస్తంత భిన్నంగా ఉంటోంది. ఈ రకమైన లైంగిక వివక్షను అరికట్టడానికి, పురుషులు, మహిళల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడానికి ప్రభుత్వమే నడుం బిగించాల్సి ఉంటుంది. ముందుగా పెద్ద ఎత్తున కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. పురుషుల్లో అవగాహనను పెంచాల్సి ఉంటుంది. నిజానికి, ప్రభుత్వ అధికారులు కానీ, వైద్యాధికారులు గానీ జోక్యం చేసుకుని సరైన కౌన్సెలింగ్‌ ఇచ్చినప్పుడల్లా ఈ లైంగిక వివక్ష బాగా తగ్గిపోతోందని అనేక దేశాల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. మహిళలైనా, పురుషులైనా అవయవ దానం అవసరమైనప్పుడు వెంటనే అవయవాలు లభించే పరిస్థితి ఉండాలి. అవయవాల దానానికి సంబంధించి ప్రభుత్వం ఏ వ్యక్తి మీదా అనవసరంగా ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదు. అవయవ దాతల నుంచి ఎటువంటి ఒత్తిడీ లేకుండా అనుమతి తీసుకోవడం చాలా ముఖ్యమనే విషయం గమనించాలి. అనుమతి కన్నా ముందు అవగాహనను, చైతన్యాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News