ప్రపంచం ఒకప్పుడు జనాభా పేలుడు గురించి భయపడింది. ఇప్పుడు జనాభా క్షీణత గురించి వణుకుతోంది! గర్భాశయం గొప్పతనం ఇప్పుడు పెరిగింది.
అవసరమే అన్వేషణలకు జన్మస్థలం అనే మనుగడ నియమం తెలీని ఓ భయస్తుడు థామస్ రాబర్ట్ మాల్థస్ ఓ పిచ్చి జనాభా సిద్ధాంతంతో ప్రపంచాన్ని భయపెట్టాడు. ఆయన సిద్ధాంతం ప్రకా రం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మనదేశం ఆహారం అందక కృంగి కృశించి అల్లాడిపోవాలి. అలా జరగడం లేదు. అవసరానికి మించి పండించే సామర్ధ్యం మనకుందని ప్రతి సంవ త్సరం నిరూపిస్తున్నాం. ప్రతి ఏటా 35 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల్ని పండిస్తున్నాం. ఏటా 3 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల్ని ఎగుమతి చేస్తున్నాం. అనధికారికంగా స్మగుల్ అవుతున్న ఆహార ధాన్యాలకు లెఖ్ఖలు లేవు. ‘సీజ్ ద షిప్’ కథ గుర్తుంది కదా!
“మేమిద్దరం మాకిద్దరు” “పరిమిత కుటుంబం అపరిమిత ఆనందం” “చిన్న కుటుంబం – చింతలు లేని కుటుంబం” “ ఒక్కరే ముద్దు – ఆ తరువాత వద్దు” ఇలాంటి నినాదాలు 1960, 70 లలో హోరెత్తించాయి. కథ అక్కడి నుండి మొదలైంది. మతద్వేషాన్ని పెంచి దేశ ప్రధాని కాదలచిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లింలను జనాభా దోషులుగా చిత్రించడానికి కొత్త నినాదాన్ని రూపొందిం చారు. “హమ్ పాంచ్ హమారే పచ్చీస్” (ఒక భర్త, నలుగురు భార్యలు- వారికి పాతికమంది సంతానం) అని భయపెట్టేంత వరకు సాగింది వారి ప్రచారం.
ఇప్పుడు అదే సంఘపరివారానికి అధినాయకులైన మోహన్ భగవత్ నలుగురు పిల్లల్ని కనాలంటున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లల్ని కనేవారికి వేల రూపాయల నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి.
ఇది భారతదేశ సమస్య మాత్రమే కాదు. ప్రపంచ సమస్య. రష్యా, చైనా, యూరప్ – అందరూ ఒక్కసారిగా ‘ఫెర్టిలిటీ’ గురించి మాట్లాడుతున్నారు. ఇది కేవలం కుటుంబ సమస్యనా? లేక భవిష్యత్ ప్రపంచాధిపత్య యుద్ధమా? పెట్రోలు స్థానాన్ని జనాభా ఆక్రమిస్తున్నదా?
విద్యార్ధులు లేక ఖాళీగా పడున్న కుర్చీల్ని చూసి జపాన్ వణు కుతోంది. పాఠశాలలు మూతపడుతున్నాయి. యూరప్‌లో వృద్ధులే ఎక్కువ. దక్షిణ కొరియాలో పెళ్లిళ్లు తగ్గిపోయాయి. తైవాన్ జనాభా అంతరించిపోతోంది. ఇటలీలో గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. గ్రీస్, పోర్చుగల్ పరిస్థితి అదే. చొరబాటుదార్లను తరిమేస్తాం అంటూ మనం ఎన్నికల హామీలు ఇస్తుంటే, జర్మనీ విదేశీయుల్ని తమ దేశానికి రావాలని బతిమాలుకుంటోంది. అక్కడ యంత్రాలు న్నాయి; యంత్రాల మీద పనిచేయడానికి మనుషులు లేరు.
జనాభాకు ముంచుకొస్తున్న ముప్పును చూసి రాజకీయ నాయకులు, ధార్మిక పెద్దలు కొత్త నినాదం మొదలుపెట్టారు – “పిల్లలు కనండి!” అంటున్నారు. ఎందుకంటే, జనాభా లేకపోతే మార్కెట్ ఉండదు. సైన్యం ఉండదు. కార్మికులు ఉండరు. పన్నులు కట్టేవాళ్లు ఉండరు. కార్మికులు లేకపోతే కార్పొరేట్ సామ్రాజ్యాల శ్వాస ఆగిపోతుంది అని కార్ల్ మార్క్స్ అన్న మాటలు ఈ సంద ర్భంగా సహజంగానే గుర్తుకు వస్తాయి. ప్రపంచం ఇప్పుడు ‘డెమో గ్రాఫిక్ ఎమర్జెన్సీ’ని ఎదుర్కొంటోంది.
మోహన్ భగవత్ పెద్దకుటుంబాల గురించి మాట్లాడినప్పుడు చాలా మంది దాన్ని కేవలం సిద్ధాంత రాజకీయంగా చూశారు. కానీ అసలు భయం ఇంకోటి. ఇండియా సంతానోత్పత్తి రేటు ఇప్పటికే భర్తీస్థాయి దిగువకు వచ్చేస్తోంది. అంటే భవిష్యత్తులో వృద్ధులు ఎక్కువ; యువత తక్కువ! ఇది కేవలం కుటుంబ వ్యవహారం కాదు; ఇది ఆర్థిక యుద్ధం.
స్వామి వివేకానంద ఒక సందర్భంలో ఒక జాతి బలం దాని ప్రజలే అన్నాడు. ప్రజలు లేకుండా దేశభక్తి నినాదాలు కూడా నీరస పడిపోతాయి. తమాషా ఏమిటంటే, ఏళ్ల తరబడి ‘జనాభా నియం త్రణ’ గురించి చెప్పిన వ్యవస్థే ఇప్పుడు ‘ఎక్కువమంది పిల్లల్ని కనండి’ అంటోంది. చరిత్రలో ఇది చాలా పెద్ద మలుపు. ఒక పెద్ద కుదుపు!
ప్రభుత్వాలు ఇప్పుడు ప్రసూతిని సంక్షేమంగా కాకుండా జీవికను కాపాడుకునే మార్గంగా చూస్తున్నాయి. ఇది ఒక దేశం కథ కాదు; ప్రపంచ సంక్షోభం. తూర్పు ఆసియాలో, దక్షణ కొరి యా, జపాన్, చైనా, తూర్పు యూరప్‌లో యుక్రేయిన్, రష్యా, బల్గేరియా, దక్షణ యూరప్‌లో ఇటలీ గ్రీస్లలో ప్రసూతి సంక్షోభం చాలా తీవ్రంగా వుంది. అనేక దేశాలు పిల్లలు కనేవారికి పన్ను మినహాయింపులు, నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. వారికి ఒక విషయం అర్థమైపోయింది; జనాభాయే ముక్తి. ఈమాట వినగానే ఫ్రెంచ్ తత్త్వవేత్త ఆగస్టే కోమ్టే మాటలు ‘డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ’ గుర్తుకు వచ్చి వుంటాయి.
ఇప్పుడు ప్రపంచం ముస్లిం స్త్రీల ఫెర్టిలిటీ రేటు ఎక్కువగా వుండడం గురించి చర్చిస్తోంది. ప్రసవ రేటు అధికంగా వుండడానికి జన్యుపరమైన కారణాలతోపాటు సామాజిక కారణాలు కూడ వుంటాయి. అందులో భాగంగా ధార్మిక కారణాలూ వుంటాయి. వాటిని పరిశోధించాలి. పిల్లల్ని కనడానికి 19 నుండి 29 సంవత్స రాలలోపు సానుకూలమైన వయస్సు. యువతరం ఆ వయసులోనే పెళ్ళి చేసుకునేలా సమాజం, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. దానికి తగ్గ వాతావరణాన్ని చట్టపరంగా ఏర్పాటు చేయాలి.
2001 జనాభా లెఖ్ఖల ప్రకారం దేశంలో విడాకులు తీసుకున్న లేదా విడిపోయిన మహిళలు 23.5 లక్షల మంది. పదేళ్ళ తరువాత 2011లో వీరి సంఖ్య 33 లక్షలకు చేరుకుంది. పదేళ్ళలో 40 శాతం పెరుగుదల. 2021లో జనాభా లెఖ్ఖలు తీయ లేదుగానీ అది 46 లక్షలకు చేరివుంటుందని అంచనా. 2031 నాటికి ఈ సంఖ్య 65 లక్షలు దాటుతుంది.
సమాజాన్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి ఈ గణాంకాలు సరిపోవు. సమాజ విశ్లేషకులు ఇంకొన్ని అడుగులు ముందుకు వేయాలి. గణాంకాల్ని సామాజిక వర్గాలవారీగా వర్గీకరించాలి. అప్పుడు విడాకులు తీసుకున్న / విడిపోయిన మహిళలు ఏ కుల, ఏ మత సమూహాల్లో ఎక్కువ శాతం వున్నారో తేలిపోతుంది. కులమత విద్వేషాలను రేకెత్తించే వారికి ఇలాంటి వర్గీకరణలు నచ్చవు. “ముస్లింలలో విడాకులు ఎక్కువ” అని ప్రచారం చేసేవారికి ఈ గణాంకాలు గొంతు దిగవు. మరో విషయం ఏమంటే, వితం తువుల్ని, విడాకులు పొందిన స్త్రీలని వివాహం చేసుకునే సాంప్రదా యం ముస్లిం సమాజంలో ఏడవ శతాబ్దం ఆరంభం నుండే వుంది. దీనినొక సామాజిక విలువగా గుర్తించడానికి మిగిలిన సమూ హాలకు వెయ్యేళ్ళకు పైగా పట్టింది.
ప్రధాన స్రవంతి మీడియా, సోషల్ మీడియా రెండూ ఒక క్లిష్టమైన సామాజిక అంశాన్ని ‘భయ రాజకీయంగా’ మార్చడానికి అదనపు గంటలు శ్రమిస్తున్నాయి. సామాజిక శాస్త్రవేత్త ఎమిల్ డర్కెమ్ అవగాహన ప్రకారం సమాజం సంఘీభావంతో ఏర్పడుతుం దిగానీ భయంతో కాదు. ఎందుకంటే మాతృత్వాన్ని కూడ ఒక రాజకీయార్ధిక ఆయుధంగా మార్చేస్తే సమాజమే అంతరించి పోతుంది.
గత మార్చి నెలలో రంజాన్ పండుగ సందర్భంగా రష్యా అధినేత వ్లదిమీర్ పుతిన్ తన అధికార నివాసంలో ముస్లిం పిల్లలతో వేడుక చేసుకుని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఇవి సాధారణ ఫోటోలు కావు; ఒక సరికొత్త రాజకీయ సంకేతం. యుద్ధాలు, ఆర్థిక ఆంక్షలు, జనాభా సంక్షోభం మధ్య క్రెమ్లిన్ ఇప్పుడు ముస్లిం సమాజాన్ని వ్యూహాత్మకంగా ప్రయోజనకారిగా చూస్తోంది. ఇది కేవలం మత సహనం కాదు; జనాభా డిమాండ్.
మావో కాలంలో జనాభాను చైనా ఒక శక్తిగా భావించేది. తర్వాత దానికీ జనాభా భయం పట్టుకుంది. కుటుంబ నియంత్ర ణల్ని చాలా కఠినంగా సాగించింది. అదే చైనా ఇప్పుడు యువతను పెళ్లి చేసుకోమని వేడుకుంటోంది. ఇది చరిత్రలోని అతిపెద్ద వ్యంగ్యాల్లో ఒకటి. చైనా వాయువ్య ప్రాంతంలో వుండే వ్యూఘుర్ ముస్లింలను అప్పట్లో క్రూరంగా అణిచివేసేవారు. కొత్తతరం పుట్టక సతమతమైపోతున్న చైనాకు ఇప్పుడు ముస్లింల మీద సానుకూల వైఖరి పుట్టుకొచ్చింది.
ప్రపంచ నాయకులకు ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా అర్ధం అయిపోయింది; జనాభా లేకపోతే దేశాలు ఖాళీ అయిపో తాయి. 1970లలో అమెరికా అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్ లకు రక్షణ వ్యవహారాల సలహాదారుగా పనిచేసిన హెన్రీ కిస్సింగర్ పంటల్ని నియంత్రిస్తే మానవాళిని నియంత్రించవచ్చు అనేవాడు. ఇప్పుడు ఆ సూత్రం మారింది; ‘జనాభాను కాపాడుకుంటే భవిష్య త్తును శాసించవచ్చు.’ ఇప్పుడు ఇదే కొత్త గ్లోబల్ రాజకీయ వ్యూహం!
ఇప్పుడు ప్రపంచ యువత క్రమంగా పెళ్లి నుంచి దూరమవు తోంది. సౌకర్యవంతమైన జీవితం మీద ఆశ, ఉద్యోగ అస్థిరత, ఒంటరి జీవన విధానం, వినియోగదారీ సంస్కృతి దీనికి కార ణాలు. సోషియాలజిస్ట్ జిగ్మంట్ బౌమన్ ద్రవాధునికత అన్నది దీనినే. స్థిరమైన బంధాలు కనమరుగౌతున్న ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ స్థిరంగా వుండడం సాధ్యం కాదు. మనం స్థిర కుటుంబాన్ని నిరాకరిస్తే సంతానోత్పత్తికి అవకాశాలు తగ్గిపోతాయి. నశించిపో తున్న మానవ జాతిని పునరుత్పత్తి సామర్ధ్యంతో నిలబెట్టే శక్తి ఒక్క మహిళలకే వుంది. దానిని గౌరవించడం నేర్చుకోవాలి. మహిళల్ని గౌరవించకపోతే మానవజాతి నిలబడదు.
ఇరవయ్యొకటో శతాబ్దంలో యుద్ధాలు కేవలం ఆయుధాలతో జరగవు; జనాభాతో కూడా జరుగుతాయి. ఎవరి దగ్గర యువత ఎక్కువగా ఉంటే వాళ్ల దగ్గర మార్కెట్ ఉంటుంది. వాళ్ల దగ్గర కార్మి కులు ఉంటారు. వాళ్ల దగ్గర సైనికులు ఉంటారు. అందుకే ఇప్పుడు ప్రపంచం మహిళల గర్భాశయాన్ని కూడా భౌగోళిక రాజకీయ వేదిక (geopolitical space) గా చూస్తోంది.
ఇది వినడానికి కఠినంగా ఉన్నా – నిజం. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మహిళలకు గౌరవం, భద్రత, ఆర్థిక స్వేచ్ఛ, పిల్లల్ని కనే సానుకూల వాతావరణం కల్పించకుండా కేవలం ‘ఎక్కువమంది పిల్లల్ని కనండి’ అని చెప్పడం సరిపోతుందా?

