Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Girijana University: గిరిజన యూనివర్సిటీ వల్ల ఆదివాసి పరిశోధనలకు పెద్దపీట

Girijana University: గిరిజన యూనివర్సిటీ వల్ల ఆదివాసి పరిశోధనలకు పెద్దపీట

సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క సారలమ్మ పేరు

విభజన హామీల భాగంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి కేటాయించిన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేయడం మంచి పరిణామం. ఎందుకంటే దాదాపు 9 సంవత్సరాల నుండి గిరిజన విశ్వవిద్యాలయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రధానమంత్రి ప్రకటించిన ప్రకటనతో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుపై కొత్త ఆశలు చిగురించాయి. గిరిజన విశ్వవిద్యాలయంపై గతంలో కూడా పలురకాల చర్చలు నడిచాయి. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయానికి కావలసినటువంటి భూమి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ను పర్యవేక్షణ యూనివర్సిటీగా ప్రతిపాదించి దానికి కావలసినటువంటి అంశాలపై సర్వేలు మరియు క్షేత్ర పర్యటనలు కూడా చేశారు.
గతంలోనే ములుగు సమీపంలోని గట్టమ్మ గుడి ముందు జాతీయ రహదారికి దక్షిణం వైపు ఉన్న 335.16 ఎకరాల స్థలాన్ని ఖరారు చేయగా పలుమార్లు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రతినిధులు వచ్చి స్థలాన్ని పరిశీలించి యూనివర్సిటీకి అనువుగానే ఉందని నిర్ధారించి సంతృప్తి చెందారు, దానికి సంబంధించినటు వంటి నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపారు అదేవిధంగా భూసేకరణకు గిరిజన సంక్షేమ శాఖ 10 కోట్ల రూపాయలను కేటాయించి ప్రక్రియను కూడా నిర్వహించారు. తాత్కాలికంగా తరగతులు నిర్వహించాలనుకుంటే ములుగు మండలం సహకారంలోని గిరిజన యువజన శిక్షణ కేంద్రం అనువుగా ఉందని కూడా నిర్ణయించడం జరిగింది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వల్ల గిరిజన ఆదివాసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంస్కృతిక సంప్రదాయాలు, జీవన స్థితిగతులపై విస్తృతమైనటువంటి పరిశోధనలు చేసేందుకు ఎంతగానో అవకాశం ఉంటుంది. పరిశోధన ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉన్నాయి. అధ్యయనాలు పరిశోధనలు ఆధారంగా ప్రభుత్వ విధానాలలో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. గిరిజనులు ఉన్నత విద్యలో రాణించడానికి రకరకాల కోర్సులు కూడా ఉపయోగపడతాయి. రవాణాపరంగా కూడా ఈ గిరిజన యూనివర్సిటీకి ఎంతో అనువుగా ఉంటుంది. వరంగల్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా గిరిజన యూనివర్సిటీకి చేరుకునే అవకాశం. గిరిజన విద్యార్థులకు అనుకూలమైనటువంటి కోర్సులతో పాటు గిరిజనల భాషా సంస్కృతి సాంప్రదాయాలు, సాహిత్యం ప్రతిబింబించేలా ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం త్వరలోనే ఏర్పాటు అవడం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు మరియు ఆదివాసీ విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించే ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ములుగు లాంటి గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలో ఈ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతం కూడా ఉన్నత విద్యలో అభివృద్ధిచెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గిరిజనులకు సెంట్రల్‌ యూనివర్సిటీలో చదివే అవకాశం కూడా లభిస్తుంది, వచ్చే ఏడాది నుంచి కొత్త కోర్సులను ప్రారంభించి గిరిజన విశ్వవిద్యాలయం మొదలుపెట్టే అవకాశాలున్నాయి, కాబట్టి ఆదిశగా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి సాయ సహకారాలు నుంచి దానికి కావలసినటువంటి భూమిని మరియు ఇతర వనరులను కూడా ఏర్పాటు చేస్తే వచ్చే ఏడాది గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అయి ఉన్నత విద్యలో మంచి ఫలితాలను ఇచ్చే దిశగా కృషి చేస్తుంది. గిరిజన విశ్వవిద్యాలయానికి ఆదివాసీల దైవమైన సమ్మక్క సారలమ్మల పేరు పెట్టడం కూడా చరిత్రలో మరియు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సాంస్కృతిక అంశాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా దేశంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్‌ గిరిజన విశ్వవిద్యాలయాలు సేవలందిస్తున్నాయి, ఆ తర్వాత మన తెలంగాణలో ఏర్పాటు కాబోయే గిరిజన విశ్వవిద్యాలయం కూడా జాతీయస్థాయిలో ఉన్నత విద్యలో సేవలందిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. కేవలం కొన్ని కోర్సులే కాకుండా ఎక్కువ సంఖ్యలో కోర్సులు ఏర్పాటు చేస్తే అన్ని రకాల డిసిప్లెన్స్‌ కి ఉన్నత విద్యలో అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
కాలానికి అనుకూలంగా నేటి పోటీ ప్రపంచంలో ఉపయోగపడే కోర్సులతోపాటు ట్రైబల్‌ స్టడీస్‌, సోషి యాలజీ, ఆంత్రోపాలజీ, కల్చరల్‌ స్టడీస్‌, ఎకనామిక్స్‌ పొలిటికల్‌ సైన్స్‌ లాంటి కోర్సులను కూడా తప్పకుండా గిరిజన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తే అక్కడి స్థానిక సామాజిక సంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాలను కూడా అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. 900 కోట్లను గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రకటించడం కూడా మంచి పరిణామం, ఎందుకంటే ముఖ్యంగా యూనివర్సిటీ అభివృద్ధికి కావలసినటువంటి భవనాలు, వనరులను సమకూర్చుకోవడానికి ఎక్కువ నిధులు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 900 వందల కోట్లతో యూనివర్సిటీ అభివృద్ధికి కేటాయించి భవిష్యత్తులో మరిన్ని కోర్సులను ఏర్పాటు చేసి గిరిజన విశ్వవిద్యాలయ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోహదం చేయాల్సిన అవసరం ఉంది.

  • డాక్టర్‌ కందగట్ల శ్రవణ్‌ కుమార్‌
    సమాజ శాస్త్ర పరిశోధకులు
    86393 74879
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News