Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Global gender gap index: లైంగిక సమానతలకు భారత్‌ బహుదూరం

Global gender gap index: లైంగిక సమానతలకు భారత్‌ బహుదూరం

దేశంలో లైంగిక సమానతలకు సంబంధించిన అంశాల్లో భారత్‌ అధ్వాన స్థితిలో ఉన్నట్టు తాజా గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ నివేదిక వెల్లడించింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఈ 2024 సంవత్సర నివేదికను విడుదల చేస్తూ, మొత్తం 146దేశాల్లో జరిపిన సర్వేల్లో భారతదేశం 129వ స్థానంలో ఉన్నట్టు తెలియజేసింది. ఈ విషయంలో భారతదేశం గత ఏడాది కంటే రెండు పాయింట్లు తగ్గడం మరీ ఆశ్చర్యం కలిగిస్తోంది. లైంగిక సమానతల్లో భారత్‌ 64.1 శాతానికి కూడా చేరుకోలేదని అది తెలిపింది. ఇది ప్రపంచ సగటు కంటే కూడా బాగా తక్కువ. ఇందులో కూడా ఆర్థిక సమానతల్లో భారతదేశం 142 వ స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లో ఇదే దాదాపు చివరి స్థానం. ఇక వేతనాల విషయానికి వస్తే భారతదేశం 120వ స్థానంలో ఉంది. పురుషులు వంద రూపాయలు సంపాదిస్తుండగా మహిళలు 38 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు.
కాగా, పాఠశాలల్లో చేరడంలోనూ, రాజకీయాల్లో పాల్గొనడంలోనూ మహిళల సంఖ్య పెరుగుతున్న ప్పటికీ, వీటివల్ల మహిళలకు అందాల్సిన ప్రతిఫలాలేవీ పూర్తి స్థాయిలో అందడం లేదు. ఉన్నత స్థాయి విద్యల్లో మహిళలు చేరడమన్నది ఇప్పటికీ తక్కువగానే ఉంటోంది. ఇటువంటి విషయాల్లో దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, వియత్నాం, చైనా దేశాలు అగ్రస్థానాల్లో ఉండడం జరుగుతోంది. విచిత్రమేమిటంటే, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌ వంటి దేశాలు కూడా భారత్‌ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాసియాకు సంబంధించినంత వరకూ ఒక్క పాకిస్థాన్‌ మాత్రమే భారతదేశం కంటే తక్కువగా 145వ స్థానంలో ఉంది. లైంగిక అసమానతల కారణంగానే భారతదేశం సామాజికంగా, రాజ కీయంగా, ఆర్థికంగా ఎదగలేకపోతోందని ఈ సర్వేకు చెందిన నిపుణులు అభిప్రాయ పడు తున్నారు. భారతదేశంలో జరిగిన సర్వేలు, అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని నిర్ధారి స్తున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న మహిళల సంఖ్య పురుషుల సంఖ్యలో మూడవ వంతు కూడా ఉండడం లేదని పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే తెలియజేసింది. మధ్య మధ్య కొద్దిగా పెరిగినట్టు కనిపించినా అది తాత్కాలికమే అవుతోంది. కుటుంబంలో ఇక తప్పనిసరిగా ఉద్యోగం చేసే అగత్యం ఏర్పడిన ప్పుడే మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేయడం జరుగుతోంది.
మొత్తానికి ఉద్యోగాల్లో వారి వాటా ఒక పద్ధతిగా ఉండడం లేదన్నది వాస్తవం. పైగా, పురుషుల కంటే మహిళల జీతభత్యాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. పురుషుల ఉద్యోగాలు బయ టికి కనిపిస్తాయి కానీ, మహిళల ఉద్యోగాలు బయటికి కనిపించవని కూడా ఈ సర్వేలో వెల్లడైంది. కాగా, ఈ అంతర్జాతీయ సర్వేలు భారతదేశం పట్ల దురభిప్రాయంతో చేసినవి కావు. అన్ని దేశాలకు ఒకే కొలబద్దను వర్తింపజేయడం జరుగుతుంది. అంతర్గత సర్వేలు, దేశీయ సర్వేలు కూడా ఇదే విషయాన్ని మరింత స్పష్టంగా తెలియజేయడాన్ని బట్టి, పరిశీలనలు, అనుభవాలను బట్టి ఈ ఫలితాలను ఆమోదించాల్సి వస్తుంది. దేశంలో యాభై శాతం జనాభా ఆర్థికంగా పురోగతి చెందకపోయినా, సాధికారికత సాధించలేకపోయినా దేశం సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉండదు. భారతదేశ జి.డి.పిలో మహిళల వాటా 18 శాతం మాత్రమే. ఉద్యోగాల్లో ఉన్న లైంగిక వ్యత్యాసాలను భర్తీ చేయ గలిగితే, జి.డి.పిలో మహిళల వాటా తప్పకుండా పెరుగుతుంది. విద్య, ఆరోగ్యం, సామాజిక దృక్పథాలు, ఆర్థిక వ్యూహాల్లో మార్పులు జరిగితే తప్ప ఇవి సాధ్యమయ్యే అవకాశం లేదు.

- Advertisement -

వచ్చే అయిదేళ్లలో మహిళల ఆదాయం వాటా మరో యాభై శాతం పెరిగితే తప్ప, దేశం నిర్దేశించుకున్న ఆర్థిక, సామాజిక లక్ష్యాలను సాధించడం కష్టం. అయితే, ఇంతవరకూ మహిళాభ్యుదయం మీద పెట్టుబడులు పెట్టడమనేది ప్రారంభానికి కూడా నోచుకోలేదు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు విషయంలోనే తాత్సారాలు చేయడం, దురభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో మహిళలకు సంబంధించి ఇతర సామాజిక, ఆర్థిక అభ్యున్నతుల విషయంలో పార్టీలు ఏ విధంగా వ్యవహరి స్తాయో అర్థం చేసుకోవచ్చు. దాదాపు రాజకీయ పార్టీలేవీ ఈ విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. రాజకీయాలు కూడా పురుషా ధిక్యంలో ఉన్న పరిస్థితుల్లో లైంగిక సమానత్వాలు, మహిళా సాధికారికతలు అందని మావి పళ్లే అవుతాయనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News