Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్Government welfare hostels: సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల గోస పట్టేదెవరికి?

Government welfare hostels: సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల గోస పట్టేదెవరికి?

అనారోగ్యాల బారిన పడుతున్న స్టూడెంట్స్

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మండలాల్లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ లో , గురుకులాల్లో ఉన్నత స్థాయిలో ఎదగాలనే లక్ష్యంతో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో, గురుకులాల్లో విద్యార్థులు గోస పడుతుంటే పట్టించుకునే వారు ఎవరిని విద్యార్థులు అడుగుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు యాబై రోజులు అవుతున్నా పట్టించుకునే వారు లేరని చెప్పవచ్చు. రాష్ట్రంలోని గడిచిన కాలంలో వివిధ ప్రాంతాలల్లో జరిగిన ఘటనలో కొన్ని మరణాల వల్ల విద్యార్థులు భయపడుతూ ఉంటున్నారు. పౌష్టికాహార లోపం, రక్తహీనత, ఇతరత్రా అనారోగ్య సమస్యలు క్షేత్రస్థాయిలో కొరవడిన ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేనట్టే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లలో , ఆశ్రమ పాఠశాలలో, కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాల్లో , మోడల్ స్కూల్లో , వసతిగృహాల్లో ఇది జరుగుతున్న పరిస్థితి. లక్షలాది మంది పేద, మధ్య, తరగతి విద్యార్థిని, విద్యార్థులు చదువుకునే ఈ గురుకులాల్లో, వసతిగృహాల్లో విద్యార్థులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతుంటే పట్టించుకునే వారు ఎవరిని విద్యార్థులు అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థిని సూసైడ్ చేసుకున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడం దారుణంమన్నారు . ఆ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సంబంధిత బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంలో జిల్లా స్థాయి యంత్రాంగం వెనుక అడుగు వేశారని అంటున్నారు. రాత్రి సమయంలో మరో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలు అదృశ్యం కావడం చర్చనీయాంశమైంది. కానీ బాలికల విద్యాలయం సిబ్బంది స్పందించడంతో విద్యార్థినీలు ప్రత్యక్షం కావడంతో పాఠశాల సిబ్బంది, ఆధికారులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎస్సీ వసతి గృహాలలో పరిస్థితి మరి అధ్వానంగా మారుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వార్డెన్లు స్థానికంగా ఉండాలి. కానీ కొన్నిచోట్ల మాత్రం అసలుకే ఉండరు. ఇంకొన్ని చోట్ల పట్టణాల నుండి జిల్లా కేంద్రాలు నుండి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. రాత్రి సమయంలో మాత్రం అసలుకే ఉండరు. కనీసం వాచ్ మెన్ కూడా కనబడరు. ఒకవేళ వాచ్ మెన్ ఉంటే వారి బదులు మరొకరు నైట్ డ్యూటీ చూస్తున్న పట్టించుకునే వారు ఉండరు. అక్కడక్కడ వార్డెన్లు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండరు. పట్టణాలకే పరిమితం కావడంతో విద్యార్థుల సమస్యలు ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలలో బాలికల, బాలుర వసతి గృహాలలో ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో, మండల స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో, వార్డెన్లు స్థానికంగా ఉండకపోవడంతో ఇదే అదునుగా భావించిన వర్కర్లు కుడా మేమే రాజులం అంటూ వండిందే తినాలని విద్యార్థులు భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. గత సంవత్సరం గురుకులాల్లో, వసతిగృహాల్లో కలుషితం ఆహారం తినడం వలన ఎంతో మంది విద్యార్థులు ఆనారోగ్యంతో భారిన పడ్డారు. వసతి గృహాలకు వెళ్లాలంటే విద్యార్థిని , విద్యార్థులు భయపడే పరిస్థితి ఏర్పడుతున్నాయి. అంతేకాదు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వసతి గృహాలకు పంపేందుకు వెనుక, ముందు ఆలోచిస్తున్నారు. అదే విధంగా అపరిశుభ్రమైన పరిసరాలతో సీజనల్ వ్యాధులు అంటూ విష జ్వరాలు చుట్టుముట్టి తరచుగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఏ చిన్న జ్వరం, జలుబుతో ఇబ్బందులు పడ్డా తల్లిదండ్రులే ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారన్న మాటలు నిజమన్నట్టు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల వసతి గృహాలు , గురుకులాల భవనాలు శిథిలావ్యవస్థకు చేరుకున్న అటువంటిని పట్టించుకునేవారు లేరని గట్టిగానే చెప్పవచ్చు. అలాగే కొన్నిచోట్ల విద్యార్థులకు అనుగుణంగా సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు బయటికి వెళ్ళవలసి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ మరుగుదొడ్లు ఉన్న అవి పని చేయకపోవడం, వాటిని మరమ్మతులు చేయించుకోవడం దారుణమన్నారు. కొన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు త్రాగునీరు కూడా బయట నుండి విద్యార్థులే మొసుకోచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.

- Advertisement -
            పలు వసతి గృహాలకు, గురుకులాలకు ప్రహరీలు, కంచె లేకపోవడంతో పందులు, కుక్కలు పరిసరాల్లో స్వైర విహారం చేస్తూ కనిపిస్తున్నాయి. ఏదైనా చిన్నపాటి జ్వరం వచ్చినా.. విద్యార్థులకు మందు గోలిని ఇచ్చే నాథుడే కరువవుతున్నాడు. ఇప్పటికీ వసతి గృహాలలో వైద్య సిబ్బందిని నియమించ లేదనీ తెలుస్తోంది. దీంతో వసతిగృహాల వార్డెన్లు తెలిసీ తెలియని వైద్యాన్ని చేస్తున్నారు. వార్డెన్‌ ఇచ్చిందే మందు గోలిగా మారింది. సకాలంలో సరైన వైద్యం అందక పరిస్థితి విషమించడంతో విద్యార్థులు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ఆసుపత్రికి తరలించినా పెద్దగా ప్రయోజనం కనిపించకపోవడంతో ప్రాణాలు గాలిలో  కలుస్తున్నాయి. దీనికి బాధ్యులు ఎవరు అనేది ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని  ఎస్సీ , బీసీ బాలుర, బాలికలు , పోస్ట్‌మెట్రిక్‌ కళాశాల వసతిగృహాల్లో  ప్రభుత్వం నిర్ణయించిన కోటా ప్రకారం సీట్లు పూర్తి అయిందని హాస్టల్లో గిరిజన విద్యార్థులకు సీట్లు దొరకడం లేదు. స్థానిక ఎమ్మెల్యే,,  వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి సీట్లు పెంచి ఎస్టీ విద్యార్థులకు అవకాశం కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు.  మరో విచిత్రమైన విషయం ఏమిటంటే అసలు ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ లేకపోవడంతో ఎస్టీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో ఇదే ఆసరా చేసుకొని ప్రైవేట్ హాస్టల్ పుట్టుకొచ్చాయి. విద్యార్థులకు ప్రభుత్వ హాస్టల్ వెసులుబాటు లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్‌ హాస్టళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే వాటికి నెలకు రూ.4 వేల రూపాయలు చెల్లించడం తప్పటం లేదని చెప్పవచ్చు. కానీ పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఆర్థికంగా లేకపోవడంతో మధ్యలోనే చదువు మానేసే పరిస్థితి నెలకొంది. మరోవైపు విద్యార్థినులు బయట అద్దె గదుల్లో ఉండేందుకు ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు రక్షణ కోసం ఆలోచించాల్సి వస్తోంది. జనగాం జిల్లా శివారులోని పసరమండ్ల లో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల విద్యార్థులకు అనుగుణంగా భవనం లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నటువంటి కొన్ని తరగతి గదులలోనే చదవాలి, అందులోనే భోజనం చేయాలి, రాత్రి సమయంలో అ గదిలోనే పడుకోవాల్సి ఉంటుంది. ఇక వర్షం పడితే సెలవు ఇవ్వాల్సిందే అని చెప్పవచ్చు. ఆశ్రమ పాఠశాల పక్కనే వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ ఎ ప్రభుత్వ పాలకులు, సంబంధిత అధికారులు స్పందించకపోవడం దారుణంమన్నారు. తరగతి గదులు సరిపోక వానలో తడుస్తూ , ఎండలో ఎండుతూ రోజులు రోజులు గడపాల్సి వస్తుంది. సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చి తిరిగి వెళ్లిపోవాల్సిందే.

అధికారుల పర్యవేక్షణ కరువు

        ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో, గురుకులాల్లో చదివే విద్యార్థులను గాలికొదిలేసిన పాలకులు, ఆధికారులు అని స్పష్టంగా కనిపిస్తుంది. పేద కుటుంబాల పిల్లలు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న మాట నిజమే అని చెప్పవచ్చు.  కానీ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటూ, వసతి గృహాల్లో వుంటున్న వారి ‘సంక్షేమ’ గురించి పట్టించుకోవడం లేదు. శిథిలావస్థలో భవనాలు, పెచ్చులుడిపోతున్నాయి. వర్షం పడితే కారిపోతున్న శ్లాబ్‌లు, చాలీచాలని వసతి, అరకొర మరుగుదొడ్లు, వగైనా సమస్యలతో విద్యార్థినీ విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతునే ఉన్నారు. కొన్ని వసతి గృహాలకు కిటికీలు ,తలుపులు లేవు. దోమతెరలు చిరిగిపోవడంతో రాత్రిపూట దోమలు లోపలికి వస్తున్నాయి.

ప్రభుత్వ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో, ఆశ్రమ పాఠశాలలో, మాడల్ స్కూల్లో, వసతిగృహాల్లో గోడలపై ప్రభుత్వం నిర్ణయించిన మెనూ కనిపిస్తున్నా.. అది ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం కాకుండా పెట్టిందే తినాలంటూ విద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు అక్కడక్కడ వ్యవహరిస్తున్నారు. ఉడికీ ఉడకని అన్నం, పప్పు నీళ్ల చారును తినేందుకు విద్యార్థులు ఇష్టపడడం లేదు. ఒకవేళ భోజనం ఉదయం మిగిలితే మధ్యాహ్నం, మధ్యాహ్నం మిగిలితే సాయంత్రం విద్యార్థులకు సరిపెడతారు. ఒకవేళ ఆకలిని తట్టుకోలేక ఎంతో కొంత తిన్నా.. తీవ్రమైన కడుపునొప్పి, జ్వరంతో అస్వస్థతకు గురవుతున్నారు. కొంతమంది విద్యార్థుల్లో నిద్రలేమి సమస్యతో చదువులపై దృష్టి సారించడం లేదు. నాణ్యమైన భోజనాన్ని అందించక పోవడంతోనే విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. అసలే గిరిజన విద్యార్థులను రక్తహీనత సమస్య వెంటాడుతోంది. దీనికి తోడు నాణ్యమైన భోజనాన్ని అందించకపోవడంతో భయంకర వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కొందరు వసతి గృహాల వార్డన్లు ప్రభుత్వం సరఫరా చేసే రూపాయి కిలో బియ్యం తో పాటు నిత్యావసర సరుకుల సరఫరా చేసే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొందరు అయితే సమయాన్ని చూసి వార్డెన్లే మార్కెట్లో అమ్ముతున్నారని భహిరంగ ప్రచారం. ఇంకొందరు ఇలా అమ్ముతుంటే దోరికిపోతున్నారని చెప్పవచ్చు. ఒకవేల విద్యార్థులు ఇదేమిటని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. వసతి గృహాల్లో జరుగుతున్న అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యంపై నిరంతరంగా నిఘా సారించకపోవడంతోనే విద్యార్థులకు సరైన వసతులు అందడం లేదని తెలుస్తుంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యావకాశాలు అందే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లకావత్ చిరంజీవి,
కేయూ, వరంగల్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News