Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Governments: నపుంసక ప్రభుత్వాలు

Governments: నపుంసక ప్రభుత్వాలు

దేశంలో ప్రభుత్వాలు రాను రానూ నపుంసక ప్రభుత్వాలుగా తయారవుతున్నాయని సాక్షాత్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా వ్యాఖ్యానించడం నిజంగా అసాధారణ విషయం. ద్వేషపూరిత ప్రసంగాలు చేసినవారిపై ప్రభుత్వాలు సకాలంలో చర్యలు తీసుకోకపోవడంపై దాఖలైన ఒక కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరుపుతూ న్యాయస్థానం ఈ కటువైన వ్యాఖ్య చేయడం జరిగింది. ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వం నిస్సహాయంగా, నిర్లిప్తంగా ఉండిపోవడంతో కోర్టు ధిక్కార  కేసు పిటిషన్‌ సుప్రీం కోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చింది. ఇటువంటి విషయాలలో ప్రభుత్వాలు తమకేమీ అధికారాలు లేనట్టు వ్యవహరిస్తున్నాయి. అంతే కాదు, ఇందులో తమకేమైనా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయేమోనని కూడా పాలక పక్షాలు ఆలోచిస్తున్నాయి. ఈ ద్వేషపూరిత ప్రసంగాలనేవి రాజకీయ సంబంధమైనవి లేదా పాలన సంబంధమైనవి లేదా సంస్కృతికి సంబంధించినవి కావచ్చు. అయితే, ఎక్కువగా సంస్కృతీ సంబంధమైనవే అవుతున్నాయి.

- Advertisement -

   రాజకీయాలను మతాలకు జోడిస్తున్నంత  కాలం ఈ ద్వేషపూరిత ప్రసంగాలు  ఈ విధంగా కొనసాగుతూనే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. వీటిపై చర్యలు తీసుకోవడానికి చట్ట ప్రకారం అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్టు ఊర్కొంటున్నాయని. నపుంసకత్వంతో వ్యవహరిస్తున్నాయని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహంతో వ్యాఖ్యానించింది. రాజకీయ నాయకులు, పార్టీలు దూరదృష్టితో వ్యవహరించి ఈ రెండింటినీ విడదీసి, ప్రసంగాలు చేయగలిగితే, ఈ ద్వేషపూరిత వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలకు ఆస్కారం ఉండదని న్యాయస్థానం సూచించింది. దేశంలో కొన్ని పార్టీలు పని గట్టుకుని ద్వేష పూరిత ప్రసంగాలు చేయడాన్ని సుప్రీంకోర్టు చాలా కాలం నుంచి గమనిస్తున్నట్టు కనిపిస్తోంది. మతంతో ముడిపడిన తమ రాజకీయ పార్టీ ప్రయోజనాలను పెంపొందించుకోవడానికి, పరిరక్షించడానికి పాలక పక్షాలు ఇటువంటి విషయాల్లో నిస్సహాయతను  నటిస్తున్నాయని, ఇటువంటి ప్రసంగాల వల్ల సమాజం ఏమైపోతుందనే ఆలోచన కూడా వాటికి ఉండడం లేదని సుప్రీంకోర్టు మండిపడింది.

   ఇతర వర్గాలను, ఇతర పార్టీలను మతం ఆధారంగా విమర్శించే, ద్వేషించే పార్టీలు పాకిస్థాన్‌లాంటి దేశానికి వెళ్లిపోవడం ఉత్తమమని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. భారతదేశం వంటి బహుళ సంస్కృతుల దేశంలో ఉండదలచుకున్న పక్షంలో ఇటువంటి ద్వేషపూరిత వ్యాఖ్యలకు వెంటనే స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది కాషాయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమ  మతం మెజారిటీ మతంఅయినందువల్ల  ఎటువంటి ద్వేషపూరిత ప్రసంగాలు చేసినామౌనంగా ఉండిపోవాలన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆ న్యాయవాది వాదించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతర మతాలకు చెందిన మతాలు అనేక రాష్ట్రాలలో ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడుతున్నాయని కూడా న్యాయవాది ఆరోపించారు. మెజారిటీ పార్టీ విమర్శలు, వ్యాఖ్యలను మాత్రం పెద్దవిగా చేసి, భూతద్దంలో చూపించి అడ్డుకోవడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోందని కూడా ఆయన ఉదాహరణగా చెప్పారు. ఇదే కారణంపై పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాఅనే సంస్థను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

   ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా, కఠినంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీలకు చెందిన పార్టీలు ఎంతగా ద్వేషం వెళ్లగక్కుతున్నా మైనారిటీ ఓట్ల కోసం ఆ వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని, దీనివల్ల ఇతర మతాలకు చెందిన పార్టీలు మరీ విజృంభించి విమర్ళలు, వ్యాఖ్యలు చేస్తున్నాయని ఆ న్యాయవాది అనేక ఉదాహరణలతో వివరించారు. ఎవరు, ఎప్పుడు, ఎలాంటి విద్వేష ప్రసంగాలుచేసినా ప్రభుత్వాలు చట్ట ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని, ఇటువంటి ప్రసంగాలను కొనసాగనివ్వకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News