అతి త్వరలో అంటే ఎంత కాలం? శాసనసభలు ఆమోదించిన బిల్లులపై సంతకాలు చేయడానికి గవర్నర్లు నెలల తరబడి, ఏళ్ల తరబడి తాత్సారం చేయడంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్న ప్రశ్న ఇది. నిజానికి వీటికి ఆ ప్రశ్నకు కూడా గవర్నర్ల దగ్గర నుంచి సమాధానం లభించడం లేదు. రాజ్యాంగంలోని సెక్షన్ 200 ప్రకారం రాష్ట్ర గవర్నర్లు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వ బిల్లులపై ఆమోద ముద్ర వేయాలని గత ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టుకు పెట్టుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించడం జరిగింది. తన వద్ద
బిల్లులేవీ లేవనీ, వాటినన్నిటినీ క్లియర్ చేయడం జరిగిపోయిందని గవర్నర్ చెప్పడంతో, సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు తమ వద్దకు మళ్లీ రావాలని సూచించింది.
ఇప్పుడిక తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల వంతు వచ్చింది. తమ గవర్నర్లు శాసనసభ ఆమోదించిన బిల్లులను కూడా క్లియర్ చేయడం లేదంటూ ఆ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్ర యించాయి. చాలా కాలంగా అనేక బిల్లులు తమ గవర్నర్ వద్ద పెండింగులో ఉండిపోయాయంటూ అవి సుప్రీంకోర్టుకు ఇటీవల ఫిర్యాదు చేయడం జరిగింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను అనిశ్చిత కాలం తమ వద్ద ఆమోదం
తెలియజేయకుండా అట్టిపెట్టుకోవడం ద్వారా గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. నిర్ణీత సమయంలో గవర్నర్ తమ బిల్లులపై సంతకం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. గవర్నర్లు రాజ్యాంగం నిర్దేశించిన విధంగా వ్యవహరించకపోవడం, నిర్లక్ష్యం చేయడం, తాత్సారం చేయడం, తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం జరుగుతోందని, దీనిపై సుప్రీంకోర్టు ఇప్పటికైనా తగిన ఆదేశాలు జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం కూడా తన పిటిషన్లో సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
కీలక బిల్లుల మీద సంతకాలు చేయకపోవడం ద్వారా గవర్నర్ అటు రాజ్యాంగాన్ని, చట్టాలను ధిక్కరించడమే కాకుండా, పాలనా వ్యవహారాలను స్తంభింపజేస్తున్నారని కూడా తమిళనాడు ఆరోపించింది. గవర్నర్ తన రాజ్యాంగ బాధ్యతలను సరిగ్గా, సక్రమంగా నిర్వర్తించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ప్రజలు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వానికి గవర్నర్ ఓ శత్రువుగా, పోటీదారుగా వ్యవహరిస్తున్నారని కూడా తమిళనాడు ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. నిజానికి, ఇవన్నీ తీవ్రస్థాయి ఫిర్యాదులే. గవర్నర్ల తీరుతెన్నులపై తెలంగాణ, పంజాబ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా చాలా వరకు తమ సమస్యలను పరిష్కరించు కున్నాయి. సుప్రీంకోర్టు నుంచి
రూలింగ్ వెలువడిన మరుక్షణం ఈ రాష్ట్రాల గవర్నర్లు పెండింగ్ బిల్లులపై సంతకాలు చేసి, ప్రభుత్వాలకు పంపేయడం జరిగింది.
గవర్నర్లకు రాజ్యాంగం నాలుగు అవకాశాలను సూచించింది. అవి- బిల్లుకు ఆమోదం తెలియజేయడం, బిల్లుపై సంతకం చేయకుండా ఆపడం, రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, రాష్ట్ర ప్రభుత్వానికి పునఃపరిశీలనకు తిప్పి పంపడం. రాష్ట్ర ప్రభుత్వానికి పునఃపరిశీలనకు పంపిన బిల్లు మళ్లీ గవర్నర్ వద్దకు వచ్చే పక్షంలో దానికి ఆమోద ముద్ర వేయడం తప్ప గవర్నర్ కు గత్యంతరం లేదు. బిల్లులను ఆమోదించాలా, వద్దా అన్న విషయంలో గవర్నర్ కు విచక్షణాధికారం ఏమైనా ఉంటుందా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 200లో గవర్నర్లకు కాలపరిమితిని గానీ, గడువు కాలాన్ని గానీ నిర్దేశించలేదన్న విషయం నిజమే. అయితే, ఈ ఆర్టికల్ ఒక చిన్నమాటను విస్మరించడానికి అడ్డం పెట్టుకుని గవర్నర్ ఈ
విధంగా బిల్లులను అనిశ్చిత కాలం పెండింగులో పెట్టడంలో ఏమాత్రం న్యాయం కనిపించడం లేదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికీ గవర్నర్ తో సరిపడడం లేదు. రాజ్యాంగ నిబద్ధత పేరుతో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని తరచూ స్తంభింపజేయడం జరుగుతోంది. గవర్నర్ అనే వ్యక్తి రాజ్యాంగ అధినేతగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించాలే తప్ప రాజకీయాలకు కట్టుబడి ఉండకూడదు. రాజకీయాలకు, వ్యక్తిగత సిద్ధాంత రాద్ధాంతాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.