Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Governors: విభేదాలకు అతీతంగా రాజ్యాంగ విధులు

Governors: విభేదాలకు అతీతంగా రాజ్యాంగ విధులు

రాష్ట్ర గవర్నర్లు, ముఖ్యమంత్రులకు మధ్య విభేదాలు చినికి చినికి గాలివానయి, చివరికి న్యాయస్థానాలకు వరకూ వెడుతున్నాయంటే ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేటట్టుగా గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్రాజన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్‌ అతి త్వరలో సుప్రీంకోర్టు విచారణకు రాబోతోంది. గవర్నర్‌కు సంబంధించిన వ్యవహారంలోనే సుప్రీం కోర్టు ఇటీవల పంజాబ్‌ ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్‌ నొకదానిని కొట్టి వేయడం జరిగింది. శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర గవర్నర్‌ మితిమీరిన తాత్సారం చేస్తున్నారంటూ పంజాబ్‌ ప్రభుత్వం పిటిషన్‌ వేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు తేదీని నిర్ణయిస్తే అప్పుడు సమావేశాలను ఏర్పాటు చేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని గవర్నర్‌ వివరణ ఇవ్వడంతో ఈ వివాదం అక్కడితో ముగిసింది. కొద్ది దశాబ్దాల క్రితం అయితే, గవర్నర్లకు ఆదేశాలు ఇవ్వాలని, వారికి సలహాలు ఇవ్వాలని గానీ, వారిని ప్రశ్నించాలని గానీ, వారిని వారి నిష్క్రియాపరత్వానికి నిలదీయాలనో ఏవైనా పిటిషన్లు దాఖలైతే వాటిని వెంటనే కొట్టేయడం జరిగేది. గవర్నర్ల రాజకీయ పలుకుబడి ఆ స్థాయిలో ఉండేది.
ఈ పదవులు ప్రస్తుతం పూర్తిగా రాజకీయమయం అయిపోయాయి. అయినప్పటికీ న్యాయస్థానాలు ఇటువంటి పిటిషన్లను విచారణకు స్వీకరించడం ఒక విధంగా సానుకూల పరిణామమనే చెప్పాలి. న్యాయస్థానాలు ప్రభుత్వం నుంచి గవర్నర్లకు వ్యతిరేకంగా వచ్చే పిటిషన్లను తప్పనిసరిగా విచారిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లులకు, శాసనసభ సమావేశాల నిర్వహణకు సంబంధించి చేసే అభ్యర్థనలకు వెనువెంటనే ఆమోదం తెలియజేయాల్సిన అవసరం లేదని గవర్నర్లు భావించడం జరుగుతోంది. రాజ్యాంగంలో కాలపరిమితిని లేదా గడువును నిర్ణయించకపోవడం అన్నదానిని గవర్నర్లు అవకాశంగా తీసుకుంటున్నారని ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాలలో చోటు చేసుకుంటున్న ఉదంతాలు తేల్చి చెబుతున్నాయి. ఈ అంశం అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటపెట్టడమే కాకుండా, శాసనసభ కార్యకలాపాలకు కూడా అడ్డంకిగా మారింది.
గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చాలా అరుదుగా మాత్రమే విభేదాలు ఏర్పడుతుండేవి. ఇప్పుడు ఈ పరిస్థితి చాలా రాష్ట్రాలకు విస్తరించినట్టుగా కనిపిస్తోంది. ఇక తెలంగాణలో అయితే, ఇటువంటి పరిస్థితి తరచూ ఏర్పడుతూనే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తనను పూర్తిగా బహిష్కరించారని, ఫైళ్లకు సంబంధించిన తాను వేసిన ప్రశ్నలకు, వెలిబుచ్చిన సందేహాలకు ఆయన సమాధానం ఇవ్వడం లేదని గవర్నర్‌ తమిళిసై వాదిస్తున్నారు. కాగా, మంత్రివర్గ నిర్ణయాలతో సంబంధం లేకుండా గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ వ్యవహారాలపై కోర్టుకు వెళ్లిన తర్వాత ఆమె ట్వీట్‌ చేస్తూ ‘ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గర’ అని వ్యాఖ్యానించడాన్ని బట్టి, రాష్ట్ర ప్రభుత్వం తనతో స్నేహభావంతో, సుహృద్భావంతో, గౌరవ మర్యాదలతో వ్యవహరించనందువల్లే ఆమె ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టు అర్థమవుతోంది.
అయితే, వ్యక్తిగత విభేదాలు, వివాదాలు రాజ్యాంగ విధులకు అడ్డంకి కాకూడదనే విషయాన్ని ఇక్కడ గవర్నర్‌, ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పంపించే బిల్లులను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపడానికి గవర్నర్‌కు అధికారం ఉంది. ప్రభుత్వానికి ఈ బిల్లులను పునఃపరిశీలనకు పంపించడానికి కూడా వీలుంది. ఈ బిల్లులకు ఆమోదం తెలియజేయడంలో ఎటువంటి పరిస్థితులలోనూ గవర్నర్‌ వ్యక్తిగత రాగద్వేషాలు అడ్డు రాకూడదు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా బిల్లుకు అభ్యంతరం తెలిపి, వెనక్కు పంపాల్సి ఉంటుంది. అందువల్ల గవర్నర్‌ వ్యవహారాలపై సుప్రీంకోర్టు సత్వరం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు మాత్రమే దీనిపై సరైన నిర్ణయం తీసుకోగల స్థితిలో ఉంది. ఒక బిల్లుకు చట్టబద్ధత ఉందా లేదా, ఈ బిల్లును చట్టం చేయగల అధికారం శాసనసభకు ఉందా లేదా అన్నది తేల్చవలసింది కూడా సుప్రీం కోర్టే. నిజానికి సుప్రీం కోర్టు ఇటీవల ఒక కేసులో, గవర్నర్‌, ముఖ్యమంత్రి రాజకీయాలకు, వ్యక్తిగత విభేదాలకు అతీతంగా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవడం మంచిదని సూచించిన విషయాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News