Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Governor's new strategy: రూటు మార్చిన రాష్ట్ర గవర్నర్లు

Governor’s new strategy: రూటు మార్చిన రాష్ట్ర గవర్నర్లు

రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను కొందరు గవర్నర్లు తొక్కిపెట్టి ఉంచడమనేది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. పంజాబ్‌ కేసు విషయంలో సుప్రీంకోర్టు కల్పించుకుని, పంజాబ్‌, తెలంగాణ రాష్ట్రాల కేసులను కూడా ప్రస్తావిస్తూ, గవర్నర్ల తీరుతెన్నులను ప్రశ్నించడం జరిగినప్పుడు గవర్నర్లు తప్పకుండా తమ వ్యవహార శైలిని మార్చుకుంటారని, శాసన సభలు ఆమోదించిన బిల్లులపై ఆమోద ముద్ర వేస్తారని అంతా భావించారు. బిల్లుల ఆమోదంపై రాష్ట్ర గవర్నర్లు నిష్క్రియాపరత్వంతో వ్యవహరించడం మానేస్తారని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భావించాయి. అయితే, బిల్లులను తొక్కిపెట్టి ఉంచడం, బిల్లులకు ఆమోదం తెలియజేయకపోవడం, అసలు వాటి మీద ఎటువంటి చర్యా తీసుకోకపోవడం వగైరాలకు సుప్రీంకోర్టు కత్తెర వేసిందనే సంగతి అర్థమైన తర్వాత గవర్నర్లు తమకు నచ్చని బిల్లులను నేరుగా రాష్ట్రపతి ఆమోదానికి పంపడం ప్రారంభం అయింది. రాష్ట్రపతి అటువంటి బిల్లులను కేంద్ర మంత్రివర్గ ఆమోదానికి పంపించడం జరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి, నిర్ణయం తీసుకుని, రాష్ట్రపతికి పంపడం, ఆ తర్వాతే రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో జాప్యంతో కూడిన వ్యవహారమని తేలికగా అర్థం చేసుకోవచ్చు.
ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గం తిరస్కరించే పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బిల్లును రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని బిల్లులను రాష్ట్రపతికి పంపించడమనే నిబంధనను ఈ విధంగా దుర్వినియోగం చేయడం జరుగుతోంది. ఇది కేంద్ర, రాష్ట్రాల సంబంధాలను దెబ్బతీయడం ఖాయం. పైగా ఇది రాష్ట్ర సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని వేరే చెప్పనక్కర లేదు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే చట్టాల మీద కేంద్ర ప్రభుత్వం పట్టు సాధిస్తోంది. నిజానికి, రాజ్యాంగంలో ఇందుకు ఏమాత్రం అవకాశం లేదు. రాష్ట్రం ప్రభుత్వం గవర్నర్ల ఆమోదం కోసం పంపించే బిల్లులను గవర్నర్‌ ప్రతిసారీ రాష్ట్రపతికి పంపించడానికి కేరళ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఒక రిట్‌ పిటిషన్‌ ద్వారా సవాలు చేసింది. విచిత్రమేమిటంటే, రాష్ట్రపతి కూడా ఎక్కువ పర్యాయాలు ఈ బిల్లులను తిరస్కరిం చడమే జరుగుతోంది. ఈ విచిత్ర సమస్య మీద కూడా సుప్రీంకోర్టు దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. గవర్నర్లు ప్రభుత్వాల బిల్లులను రాష్ట్రపతికి పంపించడంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వడం చాలా మంచిదనిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే బిల్లులను తిరస్కరించే అధికారం రాష్ట్ర గవర్నర్లకు లేదని, వారు ఆ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వాలకు తిప్పిపంపడానికి మాత్రమే అవకాశం ఉంటుందని పంజాబ్‌ ప్రభుత్వ పిటిషన్‌ విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పునివ్వడం జరిగింది. గవర్నర్లు తిప్పిపంపిన బిల్లులను శాసనసభ సవరించినా, సవరించకపోయినా ఆ తర్వాత తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇక బిల్లుల విషయంలో గవర్నర్లు సాధ్యమైనంత త్వరగా చర్య తీసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ కేసు విషయంలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. సాధ్యమైనంత తొం దరగా అనే మాటను రాజ్యాంగమే ఉపయోగించిందని, ఈ మాటకు అర్థం తెలుసుకుని గవర్నర్లు అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, రూలింగులను, చేస్తున్న వ్యాఖ్యలను, ఇస్తున్న వివరణలను కేరళ, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్లు ఏమాత్రం పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాష్ట్రపతి ఆమోదం ఏమాత్రం అవసరం లేని ఏడు బిల్లులను కేరళ గవర్నర్‌ రాష్ట్రపతికి పంపించడం జరిగింది. రాష్ట్రపతి కూడా ఎటువంటి కారణమూ చెప్పకుండానే అందులో నాలుగు బిల్లులను తిరస్కరించారు. ఈ బిల్లులను గవర్నర్‌ ఆమోదానికి పంపించి పది నెలలైనా ఎటువంటి సమాధానమూ లభించలేదు. తాము పంపించిన బిల్లులపై గవర్నర్‌ ఎంత కాలానికీ చర్య తీసుకోకపోవడానికి పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే బిల్లులపై గవర్నర్లు చర్య తీసుకున్నా, తీసుకోకపోయినా దాని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉంటున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రాల శాసన వ్యవస్థల పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ప్రవేశించడాన్ని రాజ్యాంగం అనుమతిస్తుందా అన్నది సుప్రీంకోర్టు తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News