కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతితోనూ, రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ల తోనూ వివాదాలు, విభేదాలు తలెత్తడమనేది స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వింటున్న విషయమే. ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్‌తో తప్పనిసరిగా పేచీ తలెత్తుతూనే ఉంటుంది. కాంగ్రెస్ హయాంలోనూ ఇటువంటివి అనేకం జరిగాయి. ఇప్పుడు బీజేపీ హయాంలోనూ ఇటువంటివి అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇటువంటి వ్యవహారం తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళ నాడులో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య జరిగిన సంఘటన మామూలు వివాదం కాదు. ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అరుదైన సంఘటన. తమిళనాడు శాసనసభ కొత్త సంవత్సరంలో మొదటిసారిగా సమావేశమైనప్పుడు చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు గవర్నర్, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఉన్న వివాదాలను మరింత రాజేశాయి. శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ఆర్.ఎన్. రవి తాను చేయాల్సిన ప్రసంగంలో చివరి నిమిషంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయడం, దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దీని మీద గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేయడం అతి వేగంగా జరిగిపోయాయి.
శాసనసభ ఆమోదించిన సుమారు పన్నెండు బిల్లుల మీద సంతకం చేయకుండా గవర్నర్ తొక్కి పెట్టి ఉంచారు. ఇది చాలదన్నట్టు తాజాగా శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని పరాకాష్టకు తీసుకు వెళ్లింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ తరచూ సన్నాయి నొక్కులు నొక్కే గవర్నర్ శాసన సభనే వేదికగా చేసుకుని మరింత తీవ్రమైన వ్యవహారానికి పాల్పడ్డారు. శాసనసభలో తాను ప్రసంగించడానికి ప్రభుత్వం తయారు చేసి ఇచ్చిన ప్రసంగంలో రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో స్వర్గంలాగా ఉందనే వాక్యాన్ని తీసేశారు. అంతేకాదు, తమిళ నాడులో తమ ప్రభుత్వం సామాజిక న్యాయం, అభివృద్ధిలో భాగస్వామ్యం, సమా నత్వం, లౌకికవాదాలే పునాదులుగా ఏర్పడిన ప్రభుత్వమనే వాక్యాన్ని ఆయన చదవకుండా దాటేశారు. ఇ.వి. రామస్వామి, బి.ఆర్. అంబేద్కర్, కామరాజ్ నాడార్, అణ్ణాదురై, కరుణానిధి వంటి మహామహుల ఆశయాలకు అంకితమై, ప్రజలకు ద్రవిడ్ నమూనా పాలనను అందిస్తోందనే వాక్యాన్ని కూడా గవర్నర్ తన ‘విచక్షణాధికారం’ కింద తొలగించారు.
ఈ వ్యవహారమంతా చినికి చినికి గాలివానగా మారి, గవర్నర్ల పాత్రపై వాడి వేడి చర్చకు దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానానికి సంబంధించిన ప్రసంగంలో మార్పులు, చేర్పులు చేయడానికి, తనకు తోచిన విధంగా కొన్ని భాగాలను తొలగించడానికి గవర్నర్‌కు హక్కుందా అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తింది. 2018లో కేరళలో కూడా ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్ పి. సదాశి వంతన బడ్జెట్ ప్రసంగంలో కొన్ని భాగాలను తొలగించి చదివారు. కేంద్ర ప్రభుత్వాన్ని, పాలక పక్షాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన భాగాలు అవి. గవర్నర్ చదవకుండా దాటేసిన భాగాలను చదివినట్టుగానే పరిగణిస్తామని ఆ తర్వాత స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. గవర్నర్ తీరుపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. చివరికి దానంతటదే చల్లారింది. ఇక 2020లో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కూడా ఇదే విధంగా వ్యవహరించారు. సదాశివం, ఆరిఫ్ మొహ మ్మద్ ఖాన్లు గవర్నర్లుగా ఉన్నంత వరకూ రాష్ట్ర ప్రభుత్వంతో విభేదిస్తూనే వచ్చారు.
ఆ కొందరు సంప్రదాయాలను, పద్ధతులను పాటించడానికి ఇష్టపడడం లేదు. విచిత్రమేమిటంటే, గవర్నర్ విచక్షణాధికారాలన్నిటినీ రాజ్యాంగంలో ఒకే చోట క్రోడీకరించలేదు. అవన్నీ వేర్వేరు ప్రదేశాలల్లో విడి విడిగా పొందుపరచి ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 కింద గవర్నర్లకు ప్రత్యేక అధికారాలు సంక్రమిస్తాయి. అయితే, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు గవర్నర్ల రాజ్యాంగపరమైన అధికారాలను వివరించింది. తాము గవర్నర్లుగా ఉన్న రాష్ట్రానికి తాము కార్య నిర్వాహక అధిపతులే కానీ, వాస్తవంలో మంత్రివర్గమే రాష్ట్రానికి కార్య నిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగంలోనూ, పదవీ ప్రమాణ స్వీకారం లోనూ గవర్నర్ అధికారాలను విపులంగా వివరించడం జరిగింది.
– జి. రాజశుక