Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Great Scholar and historian: పరిశోధనాత్మక సాహితీవేత్త ‘కోట’

Great Scholar and historian: పరిశోధనాత్మక సాహితీవేత్త ‘కోట’

చరిత్రకారులకు ఆయన చెప్పిందే వేద వాక్కు

కోట వెంకటాచలం పేరు విన్నవారికి వెంటనే గుర్తుకు వచ్చేది పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలు. గత శతాబ్దంలో పలువురు చరిత్ర పరిశోధకులకు, చరిత్ర గ్రంథాల రచయితలకు ఆయనే మార్గదర్శి అంటే అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. ఆయన ఓ ప్రామాణిక చరిత్‌ పరిశోధకుడు. సంస్కృతాంధ్ర పండితుడు. ఖగోళ, భౌతిక, గణిత శాస్త్రాలలో సాటి లేని మేటి వ్యక్తి. చరిత్ర అంటే బ్రిటిష్‌ వారు చెప్పిందే, రాసిందే చరిత్ర అని నమ్మేవారికి “అది చరిత్ర కాదు. పూర్తిగా కల్పన” అని ఆయన సహేతుకంగా రుజువు చేయడం కాకుండా, వారు తప్పుడు ప్రచారం చేసిన ప్రతి అంశం మీదా విస్తృతంగా పరిశోధన చేసి, విడి విడిగా గ్రంథాలు రాసిన వ్యక్తి కోట వెంకటాచలం. చరిత్ర రచనలో ఆయన ఒక విప్లవం సృష్టించారు.
కృష్ణాజిల్లాలో మచిలీపట్నం దగ్గర పుట్టి పెరిగిన కోట వెంకటాచలం ఆ తర్వాత అక్కడ నోబుల్‌ కాలేజీలో చదివి, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మచిలీపట్నంలో జాతీయ కళాశాలను స్థాపించడానికి, దాని అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 1924 ప్రాంతంలో విజయవాడలో స్థిర నివాసం ఏర్పరచుకుని, జీవితమంతా యథార్థ, ఆంధ్రదేశ చరిత్ర రచనకు అంకిత భావంతో కృషి చేశారు. ప్రాచీన హిందూ వైజ్ఞానిక, సామాజిక శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేశారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు చరిత్ర పరిశోధనలో నిమగ్నమై, అసలు సిసలు దేశీయ చరిత్ర, ఆంధ్రుల చరిత్ర రాసి కళ్లు తిరిగే యథార్థాలను బయటపెట్టి చరిత్ర పరిశోధకులను దిగ్భ్రాంతికి గురి చేశారు. ఆయన సంస్కృతాంధ్ర భాషలను అధ్యయనం చేస్తూనే, ఖగోళ శాస్త్రంలో కూడా విశేష కృషి చేశారు. వాటి ఆధారంగా భారతీయ చరిత్రను పునర్నిర్మించారు.
సృష్టి ఆరంభం వంటి విషయాల్లో పాశ్చాత్య పరిశోధకులు, చరిత్రకారుల కాల గణనం, వారు రచించిన భారతదేశ చరిత్ర సరైనవి కావని ఆయన సాక్ష్యాధారాలతో విమర్శించారు. అంతేకాక, పురాణాలలోనే భారతదేశ వాస్తవ చరిత్ర దాగి ఉందని ఆయన నిశ్చితాభిప్రాయం. ‘ఆర్య విజ్ఞానం’ అనే పేరుతో ఎనిమిది సంపుటాల బృహత్‌ గ్రంథాన్ని ఆయన వెలువరించారు. దానిలో మొదటి రెండు భాగాలుగా బ్రహ్మాండ సృష్టి విజ్ఞానం, మానవ సృష్టి విజ్ఞానం అనే గ్రంథాలను ప్రచురించారు. ఆయన కేవలం గ్రంథ రచనకే పరిమితం కాకుండా, గ్రంథ ప్రచురణకు కూడా నడుంబిగించారు. 1947 ప్రాంతంలో ‘ఆర్ష విజ్ఞాన గ్రంథమాల’ అనే ప్రచురణ సంస్థను స్థాపించి, పదేళ్ల కాలంలో 12 అద్భుత గ్రంథాలు ప్రచురించారు. అందులో ముఖ్యమైనవి మానవ సృష్టి విజ్ఞానం, బ్రహ్మాండ సృష్టి విజ్ఞానం, ఆంధ్రులెవరు?, జంబూ ద్వీపం, కలిశక విజ్ఞానం వంటి గ్రంథాలను రచించారు.
దేశమంతా తిరిగి, చరిత్రకు సంబంధించిన అంశాల మీద ఉపన్యాసాలిచ్చి, చారిత్రక సత్యాలకు పట్టాభిషేకం చేశారు. 1951లో రాజస్థాన్‌ లోని జైపూర్‌ నగరంలో జరిగిన హిస్టరీ కాంగ్రెస్‌ లో కోట వెంకటాచలం సాధికార పరిశోధన పత్రాలు సమర్పించి ప్రశంసలు పొందారు. 1956లో ఏర్పడిన మొదటి సంస్కృత కమిషన్‌కు రెస్పాండర్‌గా వ్యవహరించారు. ఆయన ఆంగ్లంలో కూడా నేపాల్‌, కాశ్మీర్‌, బుద్ధ, విక్రమాదిత్య, శాలివాహన వంటి అంశాల మీద పరిశోధనాత్మక గ్రంథాలు రాశారు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో కలిపి మొత్తం 23 చరిత్ర గ్రంథాలు రాశారు. సృష్టి క్రమాన్ని ఆదినుంచి రాసిన చరిత్ర పరిశోధకుడు కోట వెంకటాచలం ఏ రచననైనా పరిశోధించనిదే, పరిశీలించనిదే ఆయన గ్రంథస్థం చేసేవారే కాదు. చరిత్రకారులకు ఆయన చెప్పిందే వేద వాక్కుగా చెలామణీ అయింది. ఆయనకు వివిధ సందర్భాలలో ‘భారత చరిత్ర భాస్కర’, ‘విమర్శకాగ్రేసర’, ‘పాకయాజి’ వంటి సార్థక బిరుదులు ఆయన సొంతమైనాయి. ఆయన గ్రంథాలలో చాలావాటికి కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ముందు మాటలు రాయడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News