ఎలాన్ మస్క్.. ఆయన కాలు, వేలు పెట్టని రంగం అంటూ కనిపించడం లేదు. కార్ల తయారీ, అంతరిక్ష యానం, క్రిప్టోకరెన్సీ.. ఇవన్నీ చాలవన్నట్లు ట్విటర్‌ను కొనేసి దాని పేరు ఎక్స్ అని మార్చారు. దాంట్లో ఇప్పుడు ఆయన ఇంటిగ్రేట్ చేసిన గ్రోక్ అనే ఏఐ టూల్ భారతదేశంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి ఏఐ టూల్స్ అంటే.. ప్రపంచవ్యాప్తంగా తమకు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం మొత్తాన్ని సెకన్ల వ్యవధిలో వెతికి, విశ్లేషించి మనకు ఇస్తాయి. ఇప్పటికే చాట్ జీపీటీ, చైనాకు చెందిన డీప్ సీక్ లాంటివి కొన్ని ఉన్నాయి. కానీ, చాట్ జీపీటీలో కొన్ని పరిమితులు ఉన్నాయి. సెర్చ్ హిస్టరీ కేవలం 2023 వరకు మాత్రమే పరిమితం కావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి అది తెలియజేయకపోవడం లాంటివి ఇబ్బందిగా ఉన్నాయి. ఇక డీప్ సీక్ అనేది చైనా యాజమాన్యంలో ఉండడంతో సహజంగానే అనేక సెన్సార్షిప్లు ఉంటాయి. వీటన్నింటినీ తలదన్నేలా వచ్చి, అచ్చం ఎలాన్ మస్క్లాగే సంచలనాలు సృష్టిస్తోంది.. గ్రోక్!
మస్క్ వ్యవహారశైలి కొంత దూకుడుగా ఉంటుంది. ఇప్పుడు గ్రోక్ కూడా అలాగే వ్యవహరిస్తోంది. సమాధానాలకు కొంత మసాలా కలిపి మరీ ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అధికారంలో ఉన్న పార్టీలకు ఇది తలనొప్పిగా మారితే.. ప్రతిపక్షాల్లో ఉన్నవారికి కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అవుతోంది. టోకా అనే ఎక్స్ ఖాతా నుంచి కొన్ని రోజుల క్రితం వచ్చిన ఒక ప్రశ్నతో దేశంలో గ్రోక్ సంచలనాలు మొదలయ్యాయి. తన ఖాతాను ఫాలో అయ్యే వారిలో తనలాంటి భావజాలం ఉన్న పదిమందిని ఎంపిక చేయాలని టోకా కోరారు. గ్రోక్ ఆలస్యంగా సమాధానం ఇవ్వడంతో టోకా అసహనం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అది కూడా ఎదురుదాడి ప్రారంభించింది. టోకాకు హిందీలో సమాధానం ఇచ్చే క్రమంలో కొన్ని బూతులు వాడింది. దీంతో గ్రోక్ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత అనేక అంశాలపై వరుసగా ప్రశ్నలు గుప్పిస్తూ దానిని రెచ్చగొట్టారు. వాటన్నింటికీ ఈ ఏఐ చాట్ బాట్ నిర్మొహమాటంగా, ఘాటు వ్యాఖ్యలతో సమాధానాలు ఇస్తుండడంతో ప్రశ్నల వరద పెరిగింది. ఈ క్రమంలో కొందరు ప్రధాని మోదీ, బీజేపీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై అడిగిన ప్రశ్నలకు గ్రోక్ ఇచ్చిన సమాధానాలు సంచలనంగా మారాయి. అప్పటి నుంచి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. వాస్తవానికి గ్రోక్ మొదటి నుంచి ఇలాంటి సమాధానాలు చెబుతోందని నిపుణులు అంటున్నారు. మస్క్ ఎవరని ఒకరు ప్రశ్నించగా.. ఎక్స్‌లో అత్యధిక నకిలీ వార్తలు సృష్టించే వ్యక్తిగా అభివర్ణించింది. తన సృష్టికర్తపైనే ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. భారతదేశంలోని రాజకీయాల గురించి గ్రోక్ ఇస్తున్న సమాధానాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ, బీజేపీ నేతల మీద అడుగుతున్న ప్రశ్నలకు గ్రోక్ ఇస్తున్న సమాధానాలు కమలనాథులకు మింగుడు పడటం లేదు. మోదీ ప్రధాని అయ్యాక నిర్వహించిన ప్రెస్ మీట్ల గురించి విశ్లేషించాలని కోరగా.. మోదీ మీడియా ముందుకు రావడం లేదని, మాట్లాడే పనిని అమిత్ షాకు అప్పగించారని అది చెప్పింది. అంతేకాదు, మోదీ ఇచ్చే ఇంటర్వ్యూలన్నీ స్క్రిప్టెడ్ (ముందే సిద్ధం చేసుకున్న ప్రశ్న, జవాబులు) గా అనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. దీంతో గ్రోక్ చుట్టూ రాజకీయాలు సామాజిక మొదలయ్యాయి. దేశంలో అత్యధికంగా నకిలీ వార్తలు ఎవరు ప్రచారం చేస్తున్నారని ఒకరు ప్రశ్నించగా.. దేశంలోని అనేక ప్రముఖ మీడియా సంస్థల పేర్లను, వాటిల్లోని ముఖ్య అధికారుల పేర్లను చెప్పింది. ప్రధాన మీడియా సంస్థలపై బీజేపీ ప్రభావం గురించి అడగగా.. మోదీతో సన్నిహితంగా ఉన్న అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ పెద్దలు పెద్దపెద్ద మీడియా సంస్థలకు అధిపతులుగా ఉన్నారని తెలిపింది.
తనకు అనుకూల వార్తలను ప్రచారం చేసుకోవడంతో పాటు, వ్యతిరేక కథనాలను, వార్తలను తిప్పి కొట్టడానికి బీజేపీ సంవత్సరానికి 14 కోట్ల డాలర్లను ఖర్చు చేస్తున్నట్లు గ్రోక్ చెబుతోంది. 2014 నుంచి విమర్శకుల గొంతులను నొకుతున్నట్టు తెలిపింది. మత విద్వేషాలను వ్యాప్తి చేసినందుకు ఏ రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారని ఓ నెటిజన్ అడగగా.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ వంటి వారు మతవిద్వేషాలను ఎకువగా ప్రచారం చేస్తున్నారని గ్రోక్ చెప్పడంతో… ఒక్కసారిగా ఇది సంచలనంగా మారింది. దీని సమాధానాలపై విపరీతమైన చర్చ సాగుతోంది.
నిజానికి సోషల్ మీడియాను సమర్థంగా వాడుకోవడంలో మన దేశంలో బీజేపీకి తిరుగులేని చరిత్ర ఉంది. ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో, ఎన్నికల్లో విజయం సాధించడంలో సోషల్ మీడియా బీజేపీకి ఇన్నాళ్లూ చాలా బాగానే ఉపయోగపడింది. ముఖ్యంగా సోషల్ ఇంజినీరింగ్ విషయంలో ఆ పార్టీ సామాజిక మాధ్యమాలను చాలా పటిష్ఠంగా వాడుకుంది. తన భావజాలాన్ని వ్యాప్తి చేయడంతో పాటు, రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష నాయకులను విమర్శించడానికి, వాళ్లు చేస్తున్న పనులను ఎద్దేవా చేయడానికి బీజేపీకి ట్విటర్, ఫేస్బుక్ లాంటివి ఎంతో పనికొచ్చాయి. అసలు ఫేస్బుక్లో రాజకీయ ప్రకటనలు, ముఖ్యంగా ఎన్నికల ప్రకటనలు ఇవ్వచ్చు అనే విషయం భారతదేశంలో బీజేపీతోనే మొదలైందని కూడా చెబుతారు. బీజేపీ సామాజిక మాధ్యమాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న అమిత్ మాలవీయ లాంటివాళ్లు వీటిని ఇంతకాలం విస్తృతంగా వాడుకున్నారు. దాంతో ప్రత్యర్థి పార్టీలు ఈ విషయంలో పెద్దగా చేయగలిగింది ఏమీ లేక చతికిలపడ్డాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రోక్ రాకతో ప్రతిపక్షాలకు మంచి అస్త్రం దొరికినట్లయింది. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు, తాము చేయలేకపోతున్న పనులన్నింటినీ గ్రోక్ అవలీలగా చేసేస్తుండడంతో జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నేతలు సంబరపడుతున్నారు.
ఏఐ చాట్ బాట్ ఇస్తున్న సమాధానాలు సోషల్ మీడియాలో బీజేపీ దూకుడుకు కళ్లెం వేస్తున్నాయి. గ్రోక్ సమాధానాలు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు అస్త్రాలుగా మారాయి. ఎక్కువగా ఎక్స్‌లో వచ్చిన పోస్టులపై ఆధారపడి గ్రోక్ విశ్లేషణలు జరుపుతోందని, దాంతో అది పక్షపాతం చూపించే అవకాశం ఉన్నదని కొందరు బీజేపీ సానుభూతిపరులు వాదిస్తున్నారు. దీనికి ‘ఒకవేళ అదే నిజమైతే సోషల్ మీడియాలో బీజేపీ అనుకూల పోస్టులే ఎకువగా ఉంటాయి. కాబట్టి ఆ పార్టీకి, ఆ నేతలకు అనుకూలంగా మాత్రమే సమాధానాలు వస్తాయి కదా?’ అని కొందరు నెటిజన్లు కౌంటర్ వేస్తున్నారు.
దీంతో బీజేపీ మరింత ఇరుకున పడుతోంది. దాదాపు పదిహేనేళ్ల నుంచి దేశంలో సోషల్ మీడియాను, అందులోని రాజకీయ అంశాలను శాసిస్తున్న బీజేపీ… గ్రోక్‌ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది. దీంతో ఏకంగా ‘గో బ్యాక్ గ్రోక్’ అనే ఉద్యమాన్ని సైతం ప్రారంభించింది. ఏకంగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై బహిరంగంగా ‘గ్రోక్ గో బ్యాక్’ అనే ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
సహజంగానే అధికారంలో ఉన్న పార్టీ, అందులోనూ సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న పార్టీ విషయంలో కొన్ని అసంతృప్తులు ఉంటాయి. వాటి గురించి వివిధ వెబ్సైట్లలో వచ్చే సమాచారం మొత్తాన్ని అరక్షణంలో ఔపోసన పట్టేయడంతో పాటు, దానికి సొంత వ్యాఖ్యానాలు కూడా జోడించి మరీ గ్రోక్ ఇస్తోంది. చైనాకు చెందిన డీప్‌సీక్… టిబెట్, చైనాలోని ముస్లింలకు సంబంధించిన ప్రశ్నలను అడిగితే అసత్యాలను లేదా అర్ధసత్యాలను మాత్రమే చెబుతుంది. కానీ, గ్రోక్ దగ్గరికి వచ్చేసరికి అది దానికి అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించుకొని జనాభిప్రాయానికి దగ్గరగా ఉండే అంచనాలను అందిస్తోంది. ప్రాంతం, కులం లేదా భావజాలం వంటి వాటితో ప్రభావితం కావట్లేదు. అం దుకే సోషల్ మీడియాలో పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించే బీజేపీ శ్రేణులు కూడా గ్రోక్ విషయంలో ఎదురుదాడి తప్ప ఏమీ చేయలేకపోతున్నాయి. తాము కోరుకొన్న కంటెంట్ లేదా జవాబులను గ్రోక్ నుంచి రప్పించుకోవాలన్న బీజేపీ ప్రయత్నాలు విఫలమవ్వడమే కాదు బీజేపీ, ఆ పార్టీ అగ్రనేతల వ్యవహారశైలికి సంబంధించి గ్రోక్ తనకు నచ్చని విషయాలు చెబుతూ.. తాను సోషల్ మీడియా లేదా టెక్నాలజీపై ఆధిపత్యం చేసేవారి ప్రభావానికి లొంగబోనని అంటోంది. మరోవైపు గ్రోక్ వాడుతున్న పదజాలంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఏఐ చాట్ బాట్ వాడే భాషపై కొంత నియంత్రణ ఉండేదని, గ్రోక్ ఆ హద్దులను చెరిపేసిందని అంటున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత ఘాటు వ్యాఖ్యలు చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
2023లో ప్రారంభమైన గ్రోక్, ఇప్పుడు గ్రోక్లో అద్భుతమైన సామర్థ్యాలతో ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన గ్రోక్3, రియల్‌టైమ్ డేటా యాక్సెస్, డీప్‌సెర్చ్ మోడ్, అధిక కంప్యూటింగ్ శక్తితో చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్ అన్నింటికీ గట్టి పోటీ ఇస్తోంది. ఎక్స్ ప్లాట్‌ఫామ్ నుంచి తాజా సమాచారాన్ని తీసుకునే ఈ ఏఐ చాట్ బాట్, చాట్‌జీపీటీ డేటా కటాఫ్ (2023 అక్టోబర్) కంటే ముందంజలో ఉంది. గ్రోక్ వేగం, కచ్చితత్వం, సత్యాన్వేషణపై దృష్టి దీనిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఉదాహరణకు, గణిత రీజనింగ్‌లో ఏఐఎంఈ 2025లో 93.3% స్కోర్, కోడింగ్ టాస్క్‌లలో 1.2 రెట్లు వేగం సాధించడం వంటివి దీని శక్తికి నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి.
గ్రోక్ జోరుకు ప్రధాన కారణం దాని టెక్నాలజీ. ఇది 15 రెట్లు ఎక్కువ కంప్యూటింగ్ పవర్‌తో రూపొందింది, ‘‘థింక్ మోడ్’’ ఫీచర్ ద్వారా దశలవారీ రీజనింగ్‌ను ప్రదర్శిస్తుంది. ఇది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) రంగాల్లో ప్రత్యేకంగా ఉపయోగపడుతోంది. ఎక్స్ ఇంటిగ్రేషన్ ద్వారా రియల్‌టైమ్ ట్రెండ్లు, వార్తలను వెంటనే అందించగల సామర్థ్యం గ్రోక్‌కు ఉంది. క్రియేటివ్ రైటింగ్, మల్టీమీడియా లాంటి విషయాల్లో చాట్‌జీపీటీ కొంత బలంగా ఉన్నా.. దాని డేటా పాతది కావడం, వెబ్ యాక్సెస్ కోసం అధిక ధరలు వెచ్చించాల్సి రావడం లాంటి లోపాలు దాన్ని కొంత వెనక్కి నెట్టాయి.
యూజర్ల మనసు దోచుకోవడంలో కూడా గ్రోక్ విజయం సాధిస్తోంది. సహజంగానే సోషల్ మీడియా యూజర్లు కొంత డార్క్ కామెడీని ఇష్టపడతారు. సోషల్ మీడియాలో తాము అనుకున్న మాటలను కొంత మార్చి వాడడంలో యూత్ చాలా వేగంగా ఉంటోంది. ఉదాహరణకు మింగేయడం లాంటి పదాలనే తీసుకుంటే.. చాలా సులభంగా దాన్ని సినిమాల్లో కూడా వాడేసేంతగా, అది కూడా సెన్సార్షిప్ను దాటేసి వచ్చేంతగా ఉపయోగిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రోక్ కూడా దాదాపు అలాగే ఉంది. దాని సమాధానాలు చాలా సరళంగా ఉంటూనే, అదే సమయంలో స్పైసీగా కూడా ఉంటాయని వినియోగదారులు చెబుతున్నారు. ఇది వారిని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఎలాన్ మస్క్ దీనిని ‘‘హిచ్‌హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ’’ స్ఫూర్తితో రూపొందించారు. దానివల్ల గ్రోక్ సమాధానాలు ఆసక్తికరంగా, ఉల్లాసంగా ఉంటాయి. ఉదాహరణకు, సంక్లిష్ట ప్రశ్నలకు కూడా సరళమైన, హాస్యాస్పదమైన సమాధానాలు ఇవ్వడం దీని ప్రత్యేకత. ఇది యూజర్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచుతోంది, ఎక్స్ ప్లాట్ఫామ్లో దీని ఉనికి దీనికి అదనపు బలాన్ని ఇస్తోంది.
అయితే.. వైద్యరంగం లాంటివాటిలో ఏఐ సృష్టిస్తున్న విప్లవం గురించి మనం మర్చిపోకూడదు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి సీటీ స్కాన్ తీసి, దాన్ని విశ్లేషించాలని ఏఐ టూల్‌కు అప్పగిస్తే.. అది క్షణాల్లో మొత్తం కొన్ని వేల, లక్షల అంశాలను పరిశీలించి, ఆ రోగికి ఉన్న సమస్య ఏంటో, దానికి పరిష్కార మార్గాలు ఏవేంటో కూడా చెప్పేస్తోంది. దీనివల్ల వైద్యులకు ఇంటర్‌ప్రెటేషన్ విషయంలో పట్టే సమయం బాగా తగ్గిపోతోంది. అక్కడ ఏఐ టూల్ చేసే పని ఏంటంటే.. అచ్చం అలాంటి సీటీ స్కాన్లే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు తనకు ఎన్ని అందుబాటులో ఉన్నాయో క్షణాల్లో సేకరించి, వాటన్నింటి విషయంలో వైద్యులు అప్పటివరకు చేసిన విశ్లేషణలను పోల్చిచూసుకుని, నూరుశాతం కచ్చితమైన అంచనాలను ఇస్తోంది. అందువల్ల వైద్యులకు నిర్ణయాలు తీసుకునే విషయంలో పట్టే సమయం బాగా తగ్గిపోతోంది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పలు రకాలుగా ఉపయోగించుకుంటున్నప్పుడు రాజకీయాల విషయంలో మాత్రం ఎందుకు ఉపయోగించుకోకూడదన్నది ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న.
గ్రోక్ విసురుతున్న సవాళ్లను ఏయే పార్టీలు సమర్థంగా ఎదుర్కోగలవన్న అంశం మీదే భవిష్యత్తులో దేశ రాజకీయాలు కూడా ఆధారపడి ఉంటాయంటే అతిశయోక్తి కాకపోవచ్చు. లేదా.. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా దాదాపు నాలుగేళ్ల సమయం ఉన్నందున.. ఈలోపు గ్రోక్‌ను తలదన్నే మరో ఏఐ టూల్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ప్రాంతీయ రాజకీయాల్లోకి గ్రోక్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, విభజిత తెలంగాణలో గానీ అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అని సమాధానం ఇచ్చిందంటూ వారి అనుబంధ పత్రిక చాలా పెద్ద స్థాయిలోనే ప్రచారం చేసుకుంది. అలా ప్రాంతీయస్థాయి రాజకీయాల్లోకి కూడా గ్రోక్ ప్రవేశించిందంటే, ఇక భవిష్యత్తులో రాబోయే ఎన్నికలను అది ఎంతలా ప్రభావితం చేస్తుందోనని అధికార పార్టీల్లో ఉన్న నాయకులందరూ కలవరపడుతున్నారు. సహజంగానే తమకు సొంత, అనుకూల మీడియా ఉన్నప్పుడు దాని ద్వారా ప్రజలను ప్రభావితం చేయడానికి మన రాజకీయ నాయకులు విపరీతంగా ప్రయత్నిస్తారు. పెయిడ్ న్యూస్ అన్న విషయం కూడా తెలియకుండా రాజకీయ కథనాలు రాయించినట్లు, అభివృద్ధి పనుల గురించి చెప్పించినట్లు, లేదా అవతలి పార్టీ హయాంలో ఏమాత్రం అభివృద్ధి లేదని చూపించడానికి మీడియాను మన రాజకీయ పార్టీలు చాలా గట్టిగానే వాడుకుంటాయి. పరస్పర ప్రయోజనాల కోసం మీడియా కూడా ఈ ధోరణిని దాదాపు మూడు నాలుగు దశాబ్దాల నుంచి అందిపుచ్చుకుంది. కానీ ఇప్పుడు గ్రోక్ రాకతో ఇదంతా తలకిందులయ్యే ప్రమాదం కనిపిస్తోంది. పత్రికల్లో ఏదైనా ఒక కథనం వచ్చిందంటే అందులోని నిజానిజాలేంటని తెలుసుకోవాలంటే ఇన్నాళ్లూ ప్రత్యామ్నాయం ఏమీ లేదు. ఇప్పుడు గ్రోక్ ఏఐ చాట్‌బాట్‌కు ఆ కథనం క్లిప్పింగ్‌ను ఎటాచ్ చేసి, ఇది ఎంతవరకు వాస్తవం అని ప్రశ్నిస్తే చాలు.. దాని గుణగణాలు, అందులోని అంశాల వాస్తవికత లాంటి అన్నింటినీ వడపోసి మరీ చెప్పేస్తుంది. ఇదంతా కేవలం ఒక ఏఐ టూల్ మాత్రమేనని, అది తనకు కావాల్సిన, అందుబాటులో ఉన్న సమాచారాన్ని మాత్రమే తీసుకుంటోందని వాదించేవాళ్లు లేకపోలేదు.
[email protected]
98858 09432