Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Guest lecturers: అతిథి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి

Guest lecturers: అతిథి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి

ఆర్థికంగా చితుకుతున్న ఉన్నత చదువులు చదివిన యువత

తెలంగాణ  రాష్ట్రంలోని  నేడు అనేక  ప్రభుత్వ  జూనియర్ కళాశాలల్లోని అతిథి అధ్యాపకులు నిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్  రెడ్డి 2012  లో అతిథి అధ్యాపకుల ( గెస్ట్ లెక్చరర్స్ ) ఉద్యోగ వ్యవస్థని ప్రారంభించారు. ప్రారంభంలో పీరియడ్ కి కేవలం 150 రూపాయలు చొప్పున నెలకు 72 పీరియడ్స్ మాత్రమే బోధించే వెసులుబాటు ఆ అతిథి అధ్యాపకులకు లభించేది. ఆ రకంగా వారు నెలకు కేవలం  10,800 రూపాయలు ఆర్జిస్తూ ఆ ఉద్యోగాల్లో బ్రతుకులు భారంగా కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చొరవతో పీరియడ్ కి 300 రూపాయలు పెరగడంతో నెలకి 21,600 రూపాయలు  క్రమంగా పెరిగాయి. కాలక్రమేణా ఈ మొత్తం 28,000 లకు  పెరిగిననూ ధరలు చుక్కలంటుకుంటున్న ప్రస్తుత రోజుల్లో ఆ  చాలీచాలని జీతాలు  ఏమాత్రం సరిపోక వారు మరింతగా అప్పులపాలు కావాల్సిన  దుస్థితులు నెలకొంటున్నాయి. 2018 నుండి ప్రభుత్వమే నిర్దిష్ట త్రీమెన్ కమిటీతో  ఇంటర్వ్యూలు మరియు డెమోలు నిర్వహించి  వివాదాలకు తావులేకుండా అతిధి అధ్యాపకుల  ఎంపిక ప్రక్రియని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. 

        నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1654 మంది అతిథి అధ్యాపకులు ఈ 2023 - 2024 విద్యా సంవత్సరంలో గత 6 నెలలుగా నయా పైసా జీతాలు పొందలేక అనేక అవస్థలకు గురవుతున్నారు. గత అసెంబ్లీలో సాక్ష్యాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ  'అతిథి అధ్యాపకుల పొట్ట కొట్టకూడదు అని, వారికి ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలి' అని ఆదేశించిననూ ఇప్పటి వరకు ఏ విధమైన పురోగతి కనిపించకపోవడం విచారకరం. ఫలితంగా అతిథి అధ్యాపకులు జీతాలు పొందలేక బతుకులు భారమై  పండుగ రోజులలో కూడా పస్తులు ఉండాల్సిన విషమ పరిస్థితులు నెలకొన్నాయి. గెస్ట్ లెక్చరర్లకు సంవత్సరంలో మొత్తంగా  వచ్చే 7 నెలల జీతాలలో 6 నెలల జీతాలను అధికారులు పెండింగ్ లో ఉంచడం ఏమాత్రం సమంజసం కాదు.  ముఖ్యంగా అతిథి అధ్యాపకులు పడుతున్న బాధలు మరియు కష్టాలు  వర్ణణాతీతం. 

        నేడు అతిథి అధ్యాపకులు ఉద్యోగ భద్రతకు నోచుకోకపోగా కనీసం  పనికితగ్గ వేతనాలను కూడా  పొందలేక ప్రతినిత్యం అనేక సంఘర్షణలకు గురవుతున్నారు. అతిథి అధ్యాపకులు నీతి-నిజాయితీతో మరియు నిబద్ధతతో సమర్థవంతంగా  ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ విద్యావ్యాప్తికి ఎంతగానో దోహదపడుతున్నారు.  సెలవు రోజుల్లోనూ  సైతం  వారు జీతాలకు ఏమాత్రం నోచుకోవడం లేదు. పైగా వారు బోధించిన  పీరియడ్ల చొప్పున లెక్కించి  జీతాలని నిర్ణయించడం అసహేతుకమే అవుతుంది. అందువలన వారికి పీరియడ్ల వారిగా  కాకుండా సర్వసాధారణంగా చెల్లింపులు చేసే నెలవారీగాను జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే వారు బదిలీ అయిన చోట తక్షణమే  రీ-ప్లేస్మెంట్ కల్పించాలి.

    అతిథి అధ్యాపకులు గతంలో ఆర్థిక భారాలతో ఆత్మహత్యలు చేసుకున్న    హృదయ విదారక ఘటనలు ఉండడం గమనార్హం. అతిథి అధ్యాపకులు కరోనా సమయంలో  ఆన్లైన్ క్లాసులు కూడా సమర్థవంతంగా తీసుకుని రెగ్యులర్ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా బాధ్యతలు నిర్వహించారు. వారు అడ్మిషన్ ప్రక్రియలోనూ కూడా సమర్థవంతంగా పాలుపంచుకుని విద్యావ్యాప్తికి కృషి చేసి తమవంతు  బాధ్యతగా నిరంతరం  ఎంతగానో  సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు.  అంతిమంగా వారు కళాశాల విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న ఆ అతిథి అధ్యాపకులకు చెల్లించాల్సిన జీతాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని  విడనాడి జీతాల చెల్లింపు దిశగా  చొరవ చూపాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నివేదించిన ఆర్డర్ ప్రకారం నేటికిని విధుల్లోకి  తీసుకొనబడని 200 మంది అతిధి అధ్యాపకులు తక్షణమే విధులలోకి తీసుకోవాలి. నేడు రాజ్యమేలుతున్న కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఊరు-వాడలు తిరిగి ఆయా విద్యార్ధులను  ప్రభుత్వ  కళాశాలల వైపు మళ్లించి ర్యాంకులు  సాధింపజేయడంలో విశేష కృషి సాగించి ప్రభుత్వ విద్యని పరిపృష్టం  చేసిన అతిథి అధ్యాపకుల  అన్ని రకాల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తక్షణమే తగిన  చర్యలు తీసుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా  ఉంది. 
                                                            
 - జె.జె.సి.పి. బాబూరావు

రీసెర్చ్ స్కాలర్,
సెల్: 94933 19690.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News