Sunday, July 7, 2024
Homeనేషనల్Gujarat Elections: నంబర్ 2 కోసం కేజ్రీవాల్ పోరాటం, మీకు మిషన్ జీరోనే దిక్కంటున్న మోడీ

Gujarat Elections: నంబర్ 2 కోసం కేజ్రీవాల్ పోరాటం, మీకు మిషన్ జీరోనే దిక్కంటున్న మోడీ

కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్ షేర్ గల్లంతు కావడం ఖాయమని గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ పై జరిగిన సర్వేలన్నీ ఇప్పటి వరకు తేల్చిన విషయం. లోక్ నీతి -సి.ఎస్.డి.ఎస్. సర్వే కూడా ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించింది. ట్రెడిషనల్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ను ఆమ్ ఆద్మీ పార్టీ తన ఖాతాలోకి వేసుకుంటుందని తేల్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాల పరిస్థితి ఏమీ అంత ప్రత్యేకంగా లేకపోవటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అసలు పాయింట్. గుజరాతీలను ఆకట్టుకునేలా ఏమాత్రమూ ప్రత్యేక కసరత్తులు కాంగ్రెస్ పార్టీ చేయకపోవటం రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులను నిరాశలో ముంచుతోంది. ఆఖరు క్షణంలో రాహుల్ ప్రచారానికి వస్తున్నట్టు చెప్పినా ఆ షార్ట్ ట్రిప్ తో కాంగ్రెస్ కు ఒరిగేదేమీ లేదని వీరంతా బాహాటంగా కామెంట్స్ చేసేస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 41.4 శాతం ఓట్ షేర్ దక్కింది. సంఖ్యాపరంగా చూసినా 77 సీట్లు ఏమంత తక్కువ కాకపోగా సెకెండ్ లార్జెస్ట్ పార్టీగా గౌరవప్రదమైన స్థానం దక్కింది కాంగ్రెస్ పార్టీకి. దీంతో కనీసం బలమైన ప్రతిపక్ష పార్టీగా గుజరాత్ లో మిగిలింది. కానీ ఈసారి కాంగ్రెస్ ఓట్ షేర్ 21 శాతానికి పడిపోవటం ఖాయమన్నది గుజరాతీ ఓటరు తీర్పంటూ లోక్ నీతి సర్వే చెబుతోంది. లోక్ నీతి సర్వే ప్రకారం కేజ్రీవాల్ పార్టీ ప్రభావం పెరిగి, కనీసం 22 శాతం ఓట్ షేర్ సంపాదిస్తుందని అంచనా వేస్తోంది. అంటే కాంగ్రెస్ ఓట్ షేర్ లో సగ భాగం ఆప్ అకౌంట్లో పడ్డట్టే. ఇంకా బాగా కలిసివస్తే బహుశా 2 శాతం బీజేపీ ఓట్ షేర్ కూడా ఆప్ ఖాతాలో పడచ్చు కానీ ఏతావాతా తేలేదేమంటే విపక్షం ఓట్లు చీలిపోతాయి కాబట్టి అధికార పక్షం సేఫ్ అని. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్థానం పెద్దగా లేదు కానీ ప్రస్తుతానికైతే పట్టణ ప్రాంతాల్లో కాస్త ప్రభావం చూపేలాగే ఉంది. గ్రామీణ ఓటర్లు అత్యధికంగా ఉన్న గుజరాత్ లో పల్లెల్లో ఆప్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని పోల్ పండిట్స్ అంచనా. అందుకే ఒకవేళ 22శాతం ఓట్ షేర్ సాధించినా ఏఏపీకి దక్కేది చాలా తక్కువ స్థానాలన్నది మరో విశ్లేషణ. ఓట్ షేర్ విషయంలో అసలు ఆసక్తికరమైన పాత-కొత్త కోణం కూడా ఒకటుంది. ఉత్తర్ ప్రదేశ్ లో 2014 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీకి ఏకంగా 20శాతం ఓట్లు వచ్చాయి. కానీ ఒక్క సీటు రాకపోవటాన్ని ఆప్ గుర్తుచేసుకోవాల్సిన తరుణం ఇదే. ఢిల్లీ మోడల్ పాలనపై ఆసక్తి ఉండటం, పంజాబ్ లో ఎన్నికలు గెలిచామనే మోరల్ బూస్టింగ్ తో, గుజరాత్ ఆప్ లో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు ఉండటం ఇవన్నీ కేజ్రీవాల్ పార్టీలో పాజిటివ్ థింగ్స్ గా మారాయి. ఇక సోషల్ మీడియాలో ఆప్ దూకుడు నభూతో న భవిష్యసి అనే రేంజ్ లో సాగుతోంది. సాఫ్ట్ హిందుత్వ అజెండాతోపాటు పాటీదార్ సామాజిక వర్గాన్ని ఆకర్షించటంలో ఆప్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. కానీ గుజరాతీల్లో 'లార్జర్ ద్యాన్ లైఫ్ ఇమేజ్' ఉన్న మోడీ ధాటికి ఇవన్నీ నిలబడే ఛాన్సే లేదని సగటు గుజరాతీ తేల్చేస్తున్నాడు. యాక్చువల్లీ, కేజ్రీవల్ అసలు వ్యూహం కూడా ఇదే. బీజేపీకి ఎక్కువ మెజార్టీ వచ్చినా ఫర్లేదు కానీ ముందు గుజరాత్ లో నంబర్ 2 స్థానానికైనా ఎదగాలి. ఇందుకు కాంగ్రెస్ స్థానాన్ని తమ పార్టీ ఆక్రమిస్తే సరి అన్నది ఆయన మాట. పైగా రాష్ట్రంలో ప్రతిపక్షంగా తన పార్టీని ఉంచి గేమ్ ఆడాలని ఆయన స్కెచ్ వేశారు. చూస్తుంటే అది వర్కౌట్ అయ్యేలాంటి పరిస్థితే కనిపిస్తోంది. బీజేపీకి పెట్టని కోట గుజరాత్ . ఎందుకంటే ఇదో హిందుత్వ లాబరేటరీ, రాష్ట్ర మొత్తం జనాభాలో మైనారిటీల ఓట్ల శాతం జస్ట్ 9శాతం మాత్రమే. ఎస్సీ, ఎస్టీలు మొత్తం 22శాతం కాగా, ఓబీసీలు ఏకంగా 40శాతం ఉన్నారు. వీరందరి దృష్టిలో పడేందుకు ఈ వర్గాలకు భారీఎత్తున ఉచితాలను కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు కూడా. అందుకే వచ్చే ఎన్నికల నాటికి కేజ్రీవాల్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా, బలమైన ప్రతిపక్షంగా ఇక్కడ ఎదిగేందుకు అన్ని వనరులు ఉన్నట్టు, పార్టీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ బలమైన ఫౌండేషన్ పడేందుకు సానుకూల వాతారవణం ఉంది. ఇలా భవిష్యత్ లో గుజరాత్ పై పట్టు బిగించేందుకు కేజ్రీవాల్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పదేపదే రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. ఢిల్లీ-గుజరాత్ షటిల్ కొట్టి తనకు గుజరాత్ అత్యంత ప్రాధాన్యత కలిగిన రాష్ట్రమనే భావనను కలిగించటంలో సఫలమయ్యారు. 27 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడి, తన పార్టీకి 'ఒక ఛాన్స్' ఇస్తే మార్పు చూపిస్తామంటూ ఆయన నినదిస్తున్నారు. అహ్మదాబాద్, బరోడా, సూరత్, రాజ్ కోట్ సిటీల విషయానికి వస్తే ఈ పట్టణాల్లో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. దీంతో ఇక్కడ పుంజుకోవటంలో ఆప్ కొంతవరకు సఫలమైంది. యువత, చదువుకున్నవారు ఎక్కువ ఉండటంతో ఈ నాలుగు సిటీల్లోనూ మూలమూలలకూ తన జెండాను, అజెండాను ఆప్ తీసుకెళ్లగలుగుతోంది. ప్రచార ఉధృతి బాగున్నప్పటికీ ఇవన్నీ ఎంతవరకు ఓట్లుగా మారుతాయన్న టెన్షన్ ఆప్ నేతలకు ఉంది. మరో విషయం ఏమిటంటే అధికార వ్యతిరేకత ఎప్పుడూ కనిపించేది రూరల్ ఏరియాస్ లో, అందుకే గ్రామాలపై కేజ్రీవాల్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. రూరల్, సెమీ-రూరల్ పై పెద్ద కసరత్తే చేశారు ఆయన. సి.ఎస్.డి.ఎస్ తాజా సర్వే ప్రకారం రాష్ట్రంలో కనీసం 62 శాతం మంది ఓటర్లు తమకు ప్రత్యామ్నాయం కావాలని కోరారు. మరి వీరి ఆశలను ఆప్ అందుకోగలదా? తన ఎలక్షనీరింగ్ కు స్టార్ అట్రాక్షన్ జోడించేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 182 అసెంబ్లీ స్థానాలకు 'క్యాంపెయిన్ అబ్జర్వర్స్' ను అపాయింట్ చేసింది ఆప్. యువరాజ్ భగిరథ్ సింఘ్ వాఘేలా, లతా బెన్ భాటియా, హిమాన్షు థక్కర్ వంటి ప్రముఖులను ఆప్ లో చేర్చుకుని గుజరాతీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిశోడియా, భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, క్రికెటర్ హర్భజన్ సింగ్, గోపాల్ ఇటాలియా వంటివారు స్టార్ క్యాంపెయినర్స్ గా గుజరాత్ గల్లీగల్లీల్లో కలియ తిరుగుతున్నారు. గుజరాత్ పొలిటికల్ హిస్టరీ చూస్తే ఇప్పటివరకూ ఇక్కడ 'టూ పార్టీ కంటెస్ట్' మాత్రమే సాగింది. ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇక్కడ ఈ స్థాయికి ఎదగలేకపోయింది. మరి ఈ దశాబ్దాల సెంటిమెంట్ ను ఇప్పుడు ఆప్ బ్రేక్ చేస్తుందా? ఆప్ ఎత్తులను ముందే పసిగట్టిన బీజేపీ ముందుగానే కేజ్రీవాల్ దూకుడుకు ఎక్కడికక్కడ కళ్లెం వేసే ప్రయత్నంలో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా అమిత్ షానే వెల్లడిస్తూ.. ఆప్ అకౌంట్ గుజరాత్ లో ఓపన్ కాకుండా చూస్తామన్నారు. దీన్నే'మిషన్ జీరో'గా బీజేపీ అభివర్ణిస్తోంది. కేజ్రీవాల్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కకుండాఉండేందుకు వ్యూహం పన్నిన కమలనాథులు 150కి పైగా స్థానాల్లో విజయబావుటా ఎగరేయాలనే టార్గెట్ పెట్టుకోవటం ఇందులో భాగం. గుజరాత్ ఎన్నికల క్షేత్రంలోకి స్వయంగా దిగి వ్యవహారాలన్నీ చక్కబెడుతున్న షా, గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్స్ ఇచ్చి.. రెబెల్స్ ను బుజ్జగిస్తున్నారు. ఇదంతా ఆలస్యంగా అర్థం చేసుకున్న కేజ్రీ 'బిగ్ ఛేంజ్' కోసం తమకే ఓటు వేయాలని, 150కి పైగా స్థానాల్లో ఆప్ ను గెలిపించాలని రాష్ట్రమంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీలు మళ్లీ బీజేపీ వశమవ్వటం ఖాయమని సర్వేలన్నీ కుండబద్ధలు కొడుతుండగా కాంగ్రెస్ భవితవ్యం ఏం కానుందో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అజెండా ఏమిటన్నది ఈ ఎన్నికలు దిశా నిర్దేశం చేస్తాయి. అందుకే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు నిత్యం ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలపై చాలా ఆసక్తిగా చర్చిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో ప్రతిపక్షాల మధ్య ఐక్యత కొరవడితే వరుసగా 3వసారి ప్రధాని పీఠంపై కూర్చుని మోడీ హ్యాట్రిక్ సాధిస్తారని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. కానీ దేశంలో ప్రాంతీయ పార్టీల అధినేతలంతా తమను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తేనే జట్టు కడతామని కూటములకు దూరంగా ఉంటున్నాయి. మరి ఈనేపథ్యంలో విపక్షాల మధ్య యూనిటీ ఎలా వస్తుంది ఎవరు తెస్తారన్నది ప్రస్తుతానికి బేతాళ ప్రశ్ననే. బీజేపీయేతర కూటమి, కాంగ్రెస్సేతర కూటమి అంటే పిల్లి మెడలో గంట కట్టడంలా తయారైంది. ఈ రెండు కూటములు కాకుండా మూడవ కూటమి నిజంగానే ఏర్పాటైతే పెద్ద ఎత్తున ఓట్లు పోలరైజ్ అయ్యేందుకు అన్ని అవకాశాలున్నాయి. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సౌరాష్ట్ర, కచ్, సౌత్ గుజరాత్ ప్రాంతాల్లో డిసెంబర్ 1వ తేదీన మొదటి దశలో ఎన్నికలు జరుగనుండగా మిగతా ప్రాంతాల్లో రెండవ విడతలో డిసెంబర్ 5వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News