Tuesday, September 10, 2024
Homeఓపన్ పేజ్Gurram Jashuva: 'కవి కుల తిలకం' గుర్రం జాషువా

Gurram Jashuva: ‘కవి కుల తిలకం’ గుర్రం జాషువా

తెలుగులో దళిత సాహిత్యానికి పితామహుడి లాంటి వ్యక్తి గుర్రం జాషువా. నిజానికి ఆయన ఓ వర్గానికి చెందిన కవిగా వేరు చేయడం తెలుగు సాహిత్యానికి తీరని అపచారం చేసినట్టే అవుతుంది. యావత్‌ తెలుగు సాహిత్యానికి ఆయన గురుతుల్యుడు. కాగా, దళితులకు సంబంధించినంత వరకు ఆయన సాటిలేని మేటి సంఘ సంస్కర్త. పోరాట యోధుడు. కత్తిపట్టని, తుపాకీ పట్టని విప్లవ వీరుడు. అచ్చ తెనుగులో సంస్కృత ఛందస్సును ఉపయోగించి పద్య కావ్యాలు రచించిన అమోఘ పండితుడు గుర్రం జాషువా. ఆయన రాసిన ‘గబ్బిలం’, ‘ఫిరదౌసి’ వంటి పద్య కావ్యాలు తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు భూమి మీద చిర స్థాయిగా నిలిచిపోతాయి.
‘గబ్బిలం’ అనే పద్య కావ్యం ద్వారా జాషువా అటు సంస్కృత సాహిత్యాన్ని, ఇటు తెలుగు సాహిత్యాన్ని ఆయన సవాలు చేశారు. అప్పట్లో అగ్రవర్ణాలను ఎదిరించి ఇటువంటి దళిత సాహిత్యాన్ని పండించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడది సాధారణ విషయమే కావచ్చు. కానీ, వందేళ్ల క్రితం అగ్ర వర్ణాలను ఎదిరించినా, వారికి సవాళ్లు విసిరినా కూడు, గుడ్డ, గూడూ దొరకవు. అతి పేదవాడైనప్పటికీ జాషువా దురాచారాల మీదా, అంటరానితనం మీదా కలంతో దండెత్తారంటే అతి ఊహించడానికి కూడా సాధ్యం కాని విషయం. దళితుల తరఫున పోరాటానికి సిద్ధం కావడం, అందుకు సాహిత్యాన్నే అస్త్రంగా తీసుకోవడం, ఆ రచనకు ‘గబ్బిలం’ అని పేరు పెట్టడం ఒక పెద్ద తిరుగుబాటు, విప్లవం కిందే లెక్క గబ్బిలాన్ని అ శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. అది జంతువూ కాదు, పక్షి కాదని భావిస్తారు. ఆయన దాన్ని తన గ్రంథానికి మకుటంగా చేసుకోవడమే కాక, దళితులను (అంటరానివారిని) గబ్బిలంగా పోల్చి చెప్పారు. సవర్ణుల మాదిరిగా ఆయన చిలుకలను, హంసలను, నెమళ్లను, మేఘాలను కాకుండా ఆలయాల్లో చెట్టకు తలకిం దులుగా వేలాడుతూ ఉండే గబ్బిలాలను తన సందేశానికి ఉపయోగించుకున్నారు.
దళిత సాహిత్యమంటూ ప్రత్యేకంగా లేని రోజుల్లో, దళితుడిని కథానాయ కుడిగా చేసుకుని ఒక పద్య కా వ్యాన్నే సృష్టించడం అపూర్వం, అద్వితీయం. ఇందులో ఆ దళిత హీరో ఒక ఉద్యమకర్త. సాంఘిక దురాచారాల మీద, అణచి వేతల మీద, అంటరానితనం మీద విరుచుకుపడిన వ్యక్తి. తెలుగు సాహిత్యంలో ఒక ఇతి హాసం స్థాయికి ఈ గ్రంథం చేరుకుందంటే అందులో అతిశయోక్తేమీ లేదు. కేవలం మొట్టమొదటి దళిత సాహిత్యం కావడమే దీని గొప్పతనం కాదు. ఒక సాధారణ వ్యక్తి సమస్యను అగ్రవర్ణ సమాజం ముందు పెట్టడం, ఈ సమాజాన్ని నిలదీయడం ఇది కూడగట్టుకున్న ప్రత్యేకత. సాధారణ వ్యక్తుల పరిభాషను ఆయన ఒక అత్యుత్తమ గ్రంథం స్థాయికి తీసుకు రావడంలో సఫలీ కృతులయ్యారు.
ఇక 1895 సెప్టెంబర్‌ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించిన జాషువా తాను స్వయంగా సవర్ఖుల అణచివేతకు గురి కావడంతో ఆయనలో తిరుగుబాటు ధోరణులు పెల్లుబికాయి. ఈ ధోరణి నుంచే ఆ యనలో విశ్వజ నీనమైన సాహిత్యం ఉదయించింది. ఆయన రచనలు ఆంగ్లంలోకి కూడా అను వాదమయ్యాయి. వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించిన జాషువా ఒక దశలో సామాజిక అణచివేతను భరించలేక పోయారు. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయనకు సాధారణ జీవితాన్ని అనుభవించడం కూడా దుస్సహం, దుస్సాధ్యం అయిపోయాయి. దళితుల్లో కూడా ఆయన తల్లిదండ్రులది కులాంతర వివాహం కావడంతో సమాజంలో సాధారణ జీవితం గడపడానికి కూడా ఆస్కారం లేకుండాపోయింది. ముఖ్యంగా అంటరానితనమనేది ఆయనకు జీవితాన్ని దుర్భరం చేసేసింది. దాంతో ఆయన తల్లితండ్రులు ఆయనను, ఆయన సోదరుడిని క్రైస్తవులుగా పెంచడం ప్రారంభించారు. ఉన్నత విద్య వరకూ వెళ్లిన జాషువా ఆ తర్వా త ఉభయ బాషా ప్రవీణలో కూడా ఉత్తీర్ణులయ్యారు.
క్రమంగా రచనా వ్యాసంగంలోకి దిగిపోయిన జాషువాకు అంటరానితనం, అణచివేత, వెలివేత, దళిత హక్కులే కావ్య రచనకు, సాహిత్యానికి ప్రధానాంశాల య్యాయి. ఆయన రాసిన గబ్బిలం, ఫిరదౌసి, కాందిశీ కుడు వంటి గ్రంథాలు ప్రపంచ ప్రసిద్ధమైనాయి. ఆయన కావ్యాలలోని పద్యాలను కొన్నింటిని ఆ తర్వాతి కాలంలో హరిశ్చంద్ర నాటకంలో కూడా చేర్చి ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా శ్మశానవాటిక సన్నివే శంలో హరిశ్చంద్రుడి నోట ఆయన పద్యాలనే ఎక్కువగా పలికించడం జరిగింది. ఆయన రాసిన ‘క్రీస్తు చరిత్ర’ అనే గ్రంథానికి 1964లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆయనకు శాసన మండలి సభ్యత్వాన్నిచ్చి గౌరవించింది. 1970లో ఆయనకు ఆంధ్ర విశ్వవిద్యా లయం ‘కళాప్రపూర్ణ’ (డాక్టరేట్‌) బిరుదునిచ్చింది. 1970లోనే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. అనేక సంస్థలు ఆయన పేరున అవార్డులను, ఆయన స్మారక అవార్డులను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ఆయన ఈ వివాక్షాపూరిత సమాజానికి ఎదురు తిరిగి, నిలబడి, గుర్తింపు పొంది, సాహితీ ప్ర పంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని, తాను ఎవరికీ తీసిపోనని నిరూపించుకున్నారు. ఆయన 1971లలో కన్నుమూశారు.
-జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News