Saturday, September 21, 2024
Homeఓపన్ పేజ్Hampi: శిథిలమైపోతున్న హంపీ శిథిలాలు

Hampi: శిథిలమైపోతున్న హంపీ శిథిలాలు

ఏటా టికెట్లతో వచ్చే ఆదాయంం 4.21 కోట్లు..

కొన్ని వేల సంవత్సరాల నాటి విజయనగర సామ్రాజ్య వైభవానికి హంపీ శిథిలాలు ప్రతీకగా నిలిచాయి. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన ఈ హంపీ శిథిలాలు దేశ చరిత్రలో ప్రధాన భాగంగా నిలిచిపోయాయి. వీటి బాగోగులను అజమాయిషీ చేయాల్సిన బాధ్యత ఉన్న ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎ.ఎస్‌.ఐ) నిధుల కొరత కారణంగా ఈ చరిత్రాత్మక ప్రదేశాన్ని పట్టించుకోకపోవడంతో ఈ శిథిలాలు మరింత శిథిలమైపోయే ప్రమాదం ఏర్పడింది. యుద్ధాలు, దాడులకంటే ఎక్కువగా కేవలం నిర్లక్ష్యం వల్ల, ఉదాసీన వైఖరి వల్ల ఈ శిథిలాలు దెబ్బతింటున్నాయి. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న హంపి విజయనగర రాజుల కంటే ముందు నుంచి ఉంది. పురాణాలు, ఇతిహాసాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. ఆలయాలు, కోటలు, రాజ ప్రాసాదాలు, బురుజులు, స్తంభాలు, రాణీవాసాలు, గుర్రపుశాలలు, జలాశయాలు, దర్వాజాలు, మందిరాలు, తనిఖీ కేంద్రాలన్నిటితో కలిపి సుమారు 1600 చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఈ ప్రదేశంలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

- Advertisement -


ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ హంపీ ప్రాంతాన్ని 1565 ప్రాంతంలో ముస్లిం రాజులు ఆరు నెలల పాటు నిర్విరామంగా ధ్వంసం చేయడం, కొల్లగొట్టడం జరిగింది. చివరికి దాన్ని వదిలేసి వారు వెళ్లిపోవలసి వచ్చింది. ఈ ప్రదేశంలో ముఖ్యంగా 57 కట్టడాలను అత్యవసరంగా మరమ్మతులు చేసి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఎంత లేదన్నా 25 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. నిధుల కొరత ఒకపక్క, అరకొర నిధులు విడుదల చేయడం మరొకపక్క, అధికారుల నిర్లక్ష్యం ఇంకొకపక్క ఈ శిథిలాలను, కట్టడాలను క్రమంగా భూస్థాపితం చేస్తున్నాయి. కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన నిధులు ఇవ్వనందువల్ల ఈ కట్టడాల సంరక్షణ దాదాపు ఆగిపోయింది. పదేళ్ల క్రితం ప్రారంభించిన మరమ్మతు, పునరుద్ధరణ పనులు కూడా ఇంత వరకూ పూర్తి కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హంపి కట్టడాల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా 1.63 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేస్తోంది. కర్ణాటక ప్రభుత్వం వీటిని పూర్తిగా విస్మరించింది.
ఇక్కడి విరూపాక్ష ఆలయానికి దగ్గరలోనే ఉన్న సాలు మంటపంలో కొంత భాగం కూలిపోవడానికి ఎ.ఎస్‌.ఐ అధికారులే కారణమని స్థానికులు నిందిస్తున్నారు. ఇక్కడ 2019 ప్రారంభించిన నిర్మాణ కార్యకలాపాలు ఇంత వరకూ పూర్తి కాలేదు. అంతేకాదు, 2014లో ఇక్కడి శ్రీకృష్ణుడి దేవాలయాన్ని పునరుద్ధరించడానికి చేపట్టిన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉన్నాయి. నిధులు వస్తాయో, రావో తెలియక ఇక్కడి విజయ విఠ్ఠల ఆలయ సముదాయం, అచ్యుతరాయ దేవాలయం, బజార్‌ ప్రాంతం పునరుద్ధరణకు సంబంధించి ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. కర్ణాటకలో మైసూరు తర్వాత పర్యాటకులు అత్యధిక సంఖ్యలో సందర్శించే ప్రాంతం హంపీ. కేవలం టికెట్ల అమ్మకం ద్వారా హంపీకి ఏటా సగటున 4.21 కోట్ల రూపాయలు లభిస్తుంటాయి. ఇలా టికెట్ల ద్వారా వసూలైన సొమ్మును కూడా హంపీ పునరుద్ధరణకు, మరమ్మతులకు ఉపయోగించడం లేదు. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధీనంలో ఉన్న 57 ప్రసిద్ధ కట్టడాలు కాకుండా, వెయ్యికి పైగా అప్రకటిత కట్టడాలు రాష్ట్ర ఆర్కియాలజీ, పురావస్తు ప్రదర్శనశాలలు, వారసత్వ సంపదల విభాగం అధీనంలో ఉన్నాయి.
ఇవన్నీ నిర్లక్ష్యానికి గురవుతూ రాను రానూ మరింతగా దెబ్బతింటున్నాయి. తమకు ఏడాదిగా చెల్లించని ఏడు కోట్ల రూపాయలను తక్షణమే చెల్లిస్తే తప్ప తాము కొత్త కార్యక్రమాలను, కార్యకలాపాలను చేపట్టేది లేదని కాంట్రాక్టర్లు ఇప్పటికే ప్రభుత్వానికి ఖరాఖండీగా చెప్పేశారు. చరిత్రాత్మక స్థలాలు, కట్టడాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిలువటద్దం హంపీ క్షేత్రం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని, వీటిని పునరుద్ధరించేందుకు అవసరమైన నిధులను విడుదల చేయని పక్షంలో దేశ చరిత్రలో ప్రధాన భాగం భావితరాలకు అందకుండా మరుగునపడిపోతుంది. అవసరమైతే ప్రైవేట్‌ భాగస్వామ్యం, అంతర్జాతీయ సహాయ సహకారాలతో వీటిని పునరుద్ధరించడం చాలా అవసరం. స్థానికుల సహాయ సహకారాలను కూడా తీసుకోవడం మంచిది. ఇక్కడి శిథిలాలు శిథిలా లుగా ఉండాలన్నా ప్రభుత్వాలు సకాలంలో సరైన విధంగా తగినన్ని నిధులు చేయడం చాలా ముఖ్యం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News