Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Hamsalekha Pendem Jagadeeswar: పిల్లగాళ్ళ సాహితీ సోపతి గాడు పెండెం జగదీశ్వర్

Hamsalekha Pendem Jagadeeswar: పిల్లగాళ్ళ సాహితీ సోపతి గాడు పెండెం జగదీశ్వర్

రూపానికి తను ఎంత ముచ్చటగా ముద్దుగా ఉంటాడో అతని చేతిరాత అందులోని విషయం అంతే ముద్దుగా ముచ్చటగా ఉంటాయి, తను మొదట గీతలోడు అటు తర్వాత కథలోడైయుండు మా ఇద్దరిదీ పాతికేళ్ల సాహితీ సోపతి, అంతే కాదు నా ప్రేరణతో పెరిగి పెద్ద అయిన నేను గర్వపడే నా సాహితీ శిష్యుడు కూడా…!!
ప్రస్తుతం అందరికీ ప్రముఖ బాలసాహితీవేత్తగా సుపరిచితుడైన ‘పెండెం జగదీశ్వర్” మొదట “హంసలేఖ” పేరుతో కార్టూన్లు గీసేవాడు,1990 -95 సంవత్సరాల మధ్య కాలంలో జన విజ్ఞాన వేదిక ప్రచురించే చెకుముకి సైన్స్ మాసపత్రికకు తన కార్టూన్లు నేను బాలల కథలు తరచు గీస్తూ రాస్తూ ఉండేవాళ్ళం, రచనల వెంట ఉండే మా చిరునామాల సాయంతో మేము మొదట కలం స్నేహితులు అయ్యాం. “ఆరు నెలల స్నేహంతో వారు వీరు వీరు వారు అవుతారు” అనే సామెతలా నేను కార్టూన్ లాంటి బొమ్మలు గీసి చెకుముకికి పంపించేవాడిని ప్రచురించేవారు కానీ అవి నాకే నచ్చేవి కావు.
ఇక జగదీష్ కు అసలు పేరుతో నాకు లాగే కథలు రాయాలని కోరిక మొదలైంది,
“నువ్వు భలే రాస్తావబ్బా! అన్నన్నికమ్మలు ఎత్తరాస్తవ్?” అంటూ ఉత్తరాలతో నా వెంటపడేవాడు నాకు తెలిసిన మర్మాలు తనకు రాసి పంపేవాడిని, అలా అలా అతను కథలు రాసేయడం మొదలు పెట్టాడు, చెకుముకి తో పాటు, ఆంధ్రప్రభ ప్రచురించే చిన్నారిలో మా శక్తి మేర కథలు రాసుకునేవాళ్ళం.
తను కుటుంబ పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు సరైన మార్గ నిర్దేశకం లేక బీకాం డిగ్రీ పూర్తిచేసుకుని తనకు ఇష్టమైన విద్యాబోధన వృత్తిగా ఎంచుకొని వాళ్ళ రామన్నపేట దగ్గర గల వెల్లంకి గ్రామంలో మైత్రి విద్యాలయంలో ఉపాధ్యాయునిగా కొన్నాళ్లు, ఆ పాఠశాల నిర్వాహకుడిగా కొంతకాలం పనిచేసి కుటుంబ పోషణలో భాగమయ్యాడు.
కలం స్నేహితులమైన మేము సరిగ్గా 16 ఏళ్ల తర్వాత 2006లో ప్రత్యక్షంగా వాళ్ళ రామన్నపేట ఇంటి వద్ద కలుసుకున్నం ఆ రాత్రి అంతా ఆత్మీయంగా ముచ్చట్లు చెప్పుకున్నాం, అందులో తన ఆర్థిక పరిస్థితి ఉపాధి వ్యవహారం తను నడుపుతున్న తెలుగు మీడియం పాఠశాల దుర్భర పరిస్థితితో పాటు తనకు గల తెలుగు భాష ఇష్టం గురించి చెప్పాడు, తాను ఎం.ఏ తెలుగు చేయాలనుకుంటున్నట్టు కానీ తను డిగ్రీ కామర్స్ . తెలుగు అంటే పద్యాలు,చందస్సు, అలంకారాలు, సంధులు, సమాసాలు ,ఉంటాయి కదా!
అవి అంటేనే భయం అవుతుంది మిత్రమా అన్నాడు.
దానికి ” సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన నేను ఎమ్మె తెలుగు చేసి ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకునిగా ఎలా పనిచేస్తున్నానో చెప్పి యం. ఏ, తెలుగులో ఉండే పాఠ్యాంశాలు వివరంగా కథలా చెప్పాను, అప్పటికప్పుడు తన నిర్ణయం మార్చుకున్నాడు అదే విద్యా సంవత్సరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సార్వత్రిక విద్యా విధానంలో ఎమ్మె తెలుగు అప్లై చేయడం రెండేళ్లలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం, వెంటనే తెలుగు పండిత శిక్షణ ఎంపిక పోటీ పరీక్షల్లో ఎంపిక కావడం, అది విజయవంతంగా పూర్తి చేయడం, అదృష్టంగా వెంటనే జిల్లా ఉపాధ్యాయ నియామకాల ప్రకటన రావడం, మొదటి ప్రయత్నంలోనే గ్రేడ్ వన్ తెలుగు పండితునిగా ఎంపికై వాళ్ళ మండల సమీప మండలంలో ప్రభుత్వ ఉద్యోగం పొందటం అంతా జగదీశ్ కు ఒక కలలా…. సినిమా కథలా జరిగి పోయింది.
నాలుగు సంవత్సరాల కాలం తన సాహితీ క్షేత్రానికి పూర్తిగా దూరంగా ఉండి చదువుల తపస్సులో విజయం సాధించాడు, అతని చదువుల ప్రతి విజయంలో నన్ను తలుచుకుని మురిసిపోయేవాడు ఎప్పుడైతే స్థిరమైన ఉపాధి ఉద్యోగం దొరికిందో ఇక అప్పటినుండి తన బాలసాహితీ కృషిలో విజృంభించాడు, రాశిలో నా కన్నా ముందు వరుసలో నిలిచి.. నన్ను ” అమ్మిన నువ్వు ప్రౌఢ సాహిత్యం వైపు పోతూ మన బాలసాహిత్యంలో రచనలు చేయడంలో వెనుకబడుతున్నావ్” అని హెచ్చరించేవాడు,
తన 25 ఏడాదుల సాహితీ కృషిలో ఒక్క నాలుగు సంవత్సరాల విరామం తప్ప మిగతాకాలం మొత్తం తన కృషిని బాలసాహిత్యం కోసం, పిల్లల కోసం, కేటాయించాడు. అటు పిల్లలను ఇటు దోస్తులతోనూ అలాగే పెద్దలతోనూ ఎంతో సహృదయంగా ఉంటూ అందరి మనసులు తన చిరునవ్వుతో దోచుకునేవాడు, పెద్దలకు తనంటే జాలి, దోస్తులకు అతను అంటే ప్రేమ, విద్యార్థులకు అతని పట్ల అంతులేని అనురాగం,
ఈ మూడు దారుల సాక్షిగా పెండెం చేసిన బాల సాహితీ కృషి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం పొందే వరకు ఎదిగింది, ఎంత ఎదిగిన ఒదిగి ఉండే బహుదొడ్డ గుణం పెండెం సొంతం.
తను ప్రైవేట్ విద్యాలయంలో పనిచేస్తున్నప్పుడే మైత్రి విద్యాలయంలోని 4,5,6, తరగతులు చదివే పిల్లలతో జానపద కథలు సేకరించి తన సంపాదకత్వంలో ప్రచురించాడు, 2000 సం: లో, తాను రాసిన కథలతో “బాలల కథలు” అనే బుల్లి పుస్తకం ప్రచురించుకున్నాడు 2002లో తనకు ఇష్టమైన తనకు సాహితీ క్షేత్రం వైపు అడుగులు నేర్పిన కార్టూన్ కళను వదలకుండా 116 కార్టూన్లతో “116 నవ్వులు” పేరుతో పుస్తకం ప్రచురించుకున్నాడు.
మొదటినుంచి జగదీశ్ లో వాస్తవికత ధోరణి అలవడటంతో తను వ్రాసిన కథల్లో వైజ్ఞానిక దృష్టి, పర్యావరణ పరిరక్షణ, తదితరాలు స్పష్టంగా ఆగుపిస్తాయి. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో జగదీశ్వర్ రాసిన “చెట్టు కోసం” కథను మహారాష్ట్ర ప్రభుత్వం ఆరవ తరగతి పాఠ్యాంశంగా 2010 – 2016 విద్యా సంవత్సరంలో ఎంపిక చేసింది, అదే ఏడాది. నేను రాసిన “అడవిలో అందాల పోటీ “కథను అదే రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా స్వీకరించటం మా స్నేహ బంధానికి మరో నజరానా.
అనంతరం చెట్టు కోసం, అమ్మ భాష, మార్పు, అనే మూడు కథలను కలిపి “పేడ్ కెలియే’ పేరుతో ప్రముఖ హిందీ రచయిత షేక్ అబ్దుల్ ఘని హిందీలోకి అనువాదం చేశారు, 2015లో తను రాసిన “ఆనందవృక్షం” బాలల కథా సంపుటి కూడా పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో వ్రాసిన కధలే,
ఈపుస్తకాన్ని పాఠశాల విద్యార్థులే అతిథులు, వక్తలు,గా ఆరుబయట చెట్టు కింద ఆవిష్కరణ చేసి నేటితరం బాలసాహిత్యానికి కొత్త వరవ తోడి కలిగించాడు పెండెం,
తను శాస్త్రీయ దృక్పథంతో వ్రాసిన కథల సంపుటి “గజ్జెల దయ్యం” కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బాలసాహితీ పురస్కారం లభించి తన కృషికి వన్నె చేకూర్చింది.
జగదీశ్వర్ మొదటి నుంచి తను చేస్తున్న కృషిలో ఏదో ఒక ప్రత్యేకత సాధించాలని తపనపడేవాడు, అందులో భాగంగానే తన సొంత జిల్లా నల్గొండ జిల్లా జానపద కథలు సేకరించడంలో సఫలీకృతం అయ్యాడు, తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉండటంతో పాఠ్యపుస్తకాల రచన కార్యశాలల్లో కూడా తరచూ పాల్గొని వాటి రచనల్లో భాగస్వామ్యం అయ్యేవాడు, అలాగే వివిధ ప్రాంతాల్లో జరిగే బాల సాహిత్య కార్యశాలల్లో పాల్గొంటూ ఆయా ప్రాంతాల్లోని పిల్లలకు కథలు రాయడంలోని మెళకువలు నేర్పడం, కొత్త కథలు రాయించడంలో సహాయ సహకారాలు అందిస్తూ బాల సాహితీ వికాసానికి కృషి చేసేవాడు.
ఇక బాలసాహితీ రచనల్లో భాగంగా తెలంగాణలోనే తొలిసారిగా తెలంగాణ మాండలికంలో కథలు రాయడం మొదలుపెట్టి “తొలి తెలంగాణ మాండలిక బాల సాహితీవేత్త”గా చరిత్రలో నిలిచిపోయాడు, జగదీశ్ వ్రాసిన తెలంగాణ మాండలిక బాలల కథా సంపుటాలు ముచ్చటగా మూడు అవి బడి పిల్లగాల్ల కతలు, గమ్మతి గమ్మతి కతలు, దోస్తులు చెప్పిన కతలు, సుమారు 200 కథలు 50 వరకు వ్యాసాలు వ్రాసిన పెండెం ఇప్పుడు పిల్లలతో మమేకమైపోయేవాడు తాను విన్నా చూసినా విషయాల్ని కథా వస్తువులుగా చేసుకుని వాస్తవ దృక్పథంతో కథలు రాసేవాడు, వ్రాయించేవాడు, జానపద కథల్లో తప్ప జగదీశ్ కథల్లో ఎక్కడ ఊహలకు కల్పితాలకు తావుండేది కాదు.
సరళమైన భాషలో పిల్లలకు విషయం వెంటనే అర్థమయ్యే తీరులో కథలు రాసేవాడు, అతని కథల్లో ఎక్కడ ఆర్భాటాలు కనిపించవు అనవసరపు వర్ణనలు అసలే ఉండవు, తాను రూపానికి అందగాడైన నడవడికలో చాలా నిరాడంబరుడు, మృదుభాషి మితభాషి , ఒక్క మాటలో చెప్పాలంటే రచయితకు ఉండాల్సిన లక్షణాలన్నీ అతనికి సొంతం.
తెలంగాణ బాల సాహిత్యానికి చిరునామాగా నిలిచిన పెండెం పూర్వ నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో 28జూన్ 1976న
పెండెం నరసింహ, సత్తెమ్మ దంపతులకు ఏకైక సంతానంగా జన్మించాడు.
అటు కుటుంబంలోనూ ఇటు బాలసాహితీ కృషిలోనూ తన దారిని తానే నిర్మించుకుని గాసట బీసట తోవను సిమెంటుతోవుగా తీర్చిదిద్దుకుని ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్షిగ, దోస్తులకు అజాతశత్రువుగా, అందరి తలలో నాలుకగా వ్యవహరించిన వ్యక్తి తన జీవిత కథ ముగింపుమాత్రం ఎవరూ ఊహించని తీరుగ ఇచ్చాడు. కారణాలు ఏవైనా క్షణికావేశంతో 17 జూలై 2018 న బలవన్మరణానికి పాల్పడి ఈ లోకం వీడి వెళ్ళాడు. జగదీష్ భౌతికంగా కనుమరుగైన తను చేసిన కృషి తాను తీర్చిదిద్దన విద్యార్థులు కలకాలం చిరంజీవులుగా మనతోనే ఉంటారు, నేటి తరం తెలంగాణ బాలసాహితీ శిల్పిగా పెండెం సదా చిరస్మరణీయుడు.

- Advertisement -

డా: అమ్మిన శ్రీనివాసరాజు
సెల్: 772988 3223
[జూలై 17 పెండెం జగదీశ్వర్ వర్ధంతి]

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News