Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Haryana Assembly elections: హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్‌ అమీ తుమీ

Haryana Assembly elections: హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్‌ అమీ తుమీ

అక్టోబర్‌ 1వ తేదీన హర్యానాలోని 90 స్థానాల శాసనసభకు జరగబోయే ఎన్నికలు పాలక బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య ఇప్పటికే ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఏర్పడగా, జననాయక్‌ జనతా పార్టీ (జె.జె.పి) ఎప్పటి మాదిరిగానే తన మూడవ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది. ఈ సారైనా హర్యానాలో అడుగుపెట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అందుకు తగ్గట్టుగా అభ్యర్థులను వెతికి పట్టుకునే ప్రయత్నంలో ఉంది. అయితే, చివరికి రెండు ప్రధాన పార్టీల మధ్యే ఫలితాలు తేలవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రం లోనూ పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఎదురు కావచ్చని, దీన్ని తమకు అవకాశంగా మార్చుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ విశ్వప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనను ముందే పసిగట్టిన బీజేపీ గత మార్చిలో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ స్థానంలో నాయబ్‌ సింగ్‌ సైనీని ముఖ్యమంత్రిగా నియమించింది. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడం మీదా, కొత్త పథకాలను చేపట్టడం మీదా సైనీ పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు.
తమ అధికారాలను కుదించినందుకు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న సర్పంచులను శాంతింపజేయడానికి వారికి ఉన్న వ్యయ పరిమితిని సైనీ ప్రభుత్వం 5 లక్షల రూపాయల నుంచి 21 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఇక ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి సైనీ ప్రత్యేక ‘సమాధాన్‌ శిబిర్‌’లను ఏర్పాటు చేశారు. అంతేకాక, కాంట్రాక్టు ప్రాతిపదిన పనిచేస్తున్న సుమారు 1.20 లక్షల మంది ఉద్యోగులకు వారు పదవీ విరమణ చేసేవరకు ఉద్యోగ భద్రత కల్పించడం కూడా జరిగింది. ఆరు లక్షల రూపాయల ఆదాయం ఉన్న ఓబీసీలను క్రీమీలేయర్‌ గా ప్రకటిస్తూ ఖట్టర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి, ఆ ఆదాయ పరిమితిని 8 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. అగ్నివీర్‌ పథకం కింద పనిచేసిన సైనికులకు ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతామని సైనీ ప్రభుత్వం వాగ్దానం చేసింది.
ఇది ఇలా ఉండగా, హర్యానాలో జాట్లు, జాట్లేతరుల మధ్య ఉన్న విభేదాలు, వివాదాలు బీజేపీకి గత పదేళ్లుగా ఉపయోగపడుతూ వచ్చాయి. అయితే, వ్యవసాయ చట్టాలు, అగ్నివీర్‌ పథకం కార ణంగా బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో పాటు, కుల విభజన కూడా అంతగా అనుకూ లంగా పనిచేయకపోవడంతో బీజేపీ ఈసారి కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీతో సహా వివిధ పార్టీల్లో ఉన్నట్టే బీజేపీలో కూడా అంతర్గత కుమ్ములాటలు ప్రారంభం కావడంతో వీటిని చక్కదిద్దడంలోనే పార్టీ అధిష్ఠానానికి సమయమంతా సరిపోతోంది. ఇటువంటి కారణాల వల్ల తాము విజయం సాధించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. కాంగ్రెస్‌ పార్టీకి ఇక్కడ ప్రధాన ప్రచార సారథిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హూడా వ్యవసాయ రంగాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తామని, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని బహిరంగ సభల్లో వాగ్దానాలు చేస్తున్నారు. పార్టీ తన అంతర్గత కలహాలతో వీధులకెక్కకుండా చూడడానికి పార్టీ నాయకులు నానా తంటాలూ పడుతున్నారు.
ఇక మతపరమైన ఏకీకరణలు ఎక్కువగానే చోటు చేసుకున్నందువల్ల కాంగ్రెస్‌ పార్టీకి బలం తగ్గే అవకాశం ఉంది. బీజేపీ బలం రాష్ట్రంలో స్థిరంగా కొనసాగుతోంది. గత లోక్‌ సభ ఎన్నికల్లో కూడా మొత్తం 20 స్థానాల్లో బీజేపీ 10 స్థానాలను చేజిక్కించుకోగలిగింది. కాంగ్రెస్‌ పార్టీ కూడా బీజేపీతో సమానంగా పది స్థానాలు సంపాదించినప్పటికీ, ఈసారి ఆ పార్టీలో కొద్దిగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. హర్యానా శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్‌, బీజేపీలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News