Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Haryana Assembly elections 2024: హర్యానా ఎన్నికల్లో కొత్త సమీకరణలు

Haryana Assembly elections 2024: హర్యానా ఎన్నికల్లో కొత్త సమీకరణలు

ఓబీసీల లెక్కేంటో?

శాసనసభకు ఎన్నికలు జరగబోతున్న హర్యానా రాష్ట్రంలో పాలక బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్‌ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అక్టోబర్‌ 5న జరగబోయే ఈ ఎన్నికలకు ప్రచారం ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇదివరకటి ఎన్నికల్లో మాదిరిగానే వీలైనంతగా ఇతర పార్టీలను కూడగట్టుకోవడానికి, ఇతర వర్గాలను తమతో కలుపుకునిపోవడానికి కూడా గట్టిగా ప్రయత్నించింది. ఇక్కడి మొత్తం 90 స్థానాలకు ఒకే రోజున ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ద్విముఖ పోటీ ఉందన్న భావన కలుగుతున్నప్పటికీ, ఇతర అనేక పార్టీలు కూడా రంగలోకి దిగి ఎన్నికల పరిస్థితిని కొద్దిగా అయోమయ స్థితిలోకి నెట్టి వేయడం జరిగింది. అంతేకాక, కనీ వినీ ఎరుగని సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేయడం జరుగుతోంది. స్థానిక జననాయక్‌ జనతా పార్టీ (జె.జె.పి) ఇదివరకు బీజేపీతో పొత్తు పెట్టుకుంది కానీ, ఈసారి మాత్రం ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరామ్‌)తో చేతులు కలిపింది. ఇక ఇక్కడ పోటీ చేస్తున్న ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌ కూడా బహుజన్‌ సమాజ్‌ పార్టీతో పొత్తు కుదర్చుకుంది. మార్క్సిస్టు పార్టీ, హర్యానా లోక్‌ హిత్‌ పార్టీలు కూడా రంగంలో ఉన్నాయి.
కాంగ్రెస్‌ తీరుతెన్నులు నచ్చకపోవడం, సీట్ల సర్దుబాటు సాధ్యం కాకపోవడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇక్కడ ఒంటరిగానే అన్ని స్థానాలకు పోటీ చేస్తోంది. పదేళ్లుగా తాము అధికారంలో ఉన్నప్పుడు వాగ్దానాలను నెరవేర్చిన తీరును, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరంగా చెబుతూ ప్రచారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర జనాభాలో మూడవ వంతు ఉన్న ఓబీసీలను ఆకట్టుకోవడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగించింది. ఓబీసీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సాధికారికతను సమకూర్చిపెట్టడానికి తాము ఒక్క హర్యానాలోనే కాక, దేశవ్యాప్తంగా కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే హర్యానాలో ఓబీసీ వర్గానికి చెందిన నాయబ్‌ సింగ్‌ సైనీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశామని బీజేపీ వివరించింది. బీజేపీ దళిత వర్గాలను ఆకట్టుకోవడానికి కూడా అనేక వాగ్దానాలు, వరాలను ప్రకటించింది.
రాష్ట్ర జనాభాలో 20 శాతం వరకూ ఉన్న దళితులు మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు నివ్వడం జరుగుతోంది. జననాయక్‌ జనతా పార్టీ-ఆజాద్‌ సమాజ్‌ పార్టీ, లోక్‌ దళ్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీల పొత్తుల వల్ల జాట్లు, దళితుల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచి కొద్దిగా ఐక్యత ప్రదర్శించడానికి ప్రయత్నించింది. ఎన్నికల ప్రచారంలో ఈ కుమ్ములాటలు, కలహాలు తరచూ బయటపడుతూనే ఉన్నప్పటికీ, వాటిని కప్పిపుచ్చుకోవదానికి అది మరింత ఎక్కువగా బీజేపీపై విమర్శలు సాగించింది. బీజేపీ అధికారంలోకి వచ్చే పక్షంలో ఈసారి రాజ్యాంగాన్ని మార్చేయడం జరుగుతుందని, రిజర్వేషన్లను ఆపేస్తుందని, అగ్నివీర్‌ పథకాన్ని అమలు చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ యథాప్రకారం ప్రచారం చేసింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య వగైరాలను కూడా అది ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించింది. బీజేపీ నాయకులు, అభ్యర్థులు తాము రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన పథకాలను, కార్యక్రమాలను వివరించారు. ధరలను అదుపు చేయడానికి, నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి తాము తీసుకున్న చర్యలను కూడా ప్రస్తావించడం జరిగింది.
ఇతర పార్టీలకు చెందిన నాయకులను ఎక్కువ సంఖ్యలో చేర్చుకున్నందువల్ల బీజేపీ కూడా అంతర్గతంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, అవి అభ్యర్థుల ఎంపికలో గానీ, ఎన్నికల ప్రచారంలో గానీ అడ్డు రాలేదు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధించి అధికారంలోకి రావడానికి కారణం, రాష్ట్రం శాంతిభద్రతల విషయంలో ప్రశాంతంగా ఉండడం, సంక్షేమ పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాథమిక సదుపాయాల కల్పన సవ్యంగా జరగడంతో పాటు, జాట్లను కూడగట్టుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ చాకచక్యంగా వ్యవహరించడం. మొత్తం మీద ఈ రెండు పార్టీలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష కాబోతున్నాయనడంలో సందేహం లేదు. నిజానికి పదేళ్లుగా అధికారంలో లేనందువల్ల కాంగ్రెస్‌ పార్టీ ఈ రాష్ట్రంలో బాగా బలహీనపడింది. ప్రతిపక్ష నాయకుడుగా లోక్‌ సభలో రాహుల్‌ గాంధీ వ్యవహరించిన తీరుకు ఈ ఎన్నికలు ప్రధానమైన పరీక్ష కాబోతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ కంటే బీజేపీ కాస్తంత అనుకూల పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎన్నికల ఫలితాలను అంత తేలికగా అంచనా వేయడం కష్టం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News